Friday, March 10, 2017

మా మహాబలేశ్వర్ యాత్ర



 View of  Krishna valley from Panchaguni Resort

మా మహాబలేశ్వర్ యాత్ర

నాకు ప్రదేశాలు చూడడం ఇష్టం. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో రిసెర్చ్ చేస్తున్నప్పటి నుంచీ మహాబలేశ్వర్ చూడాలని అనుకునేవాడిని. అది మంచి వేసవి విడిది. చిన్నప్పుడు స్కూల్ లో చదువుకునేటప్పుడు కృష్ణానది పడమటి కనుమలలో మహాబలేశ్వర్ వద్ద పుట్టింది అని చదువుకున్నాను. తప్పక చూడాలని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు గాఢంగా అనిపించింది.

అప్పుడు వెంటనే వెళ్ళలేకపోయాను. శివాజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు అని నానుడి కదా. మన సంకల్పంతో భగవంతుని సంకల్పం జతైనప్పుడే పని జరుగుతుంది. దేవుడున్నాడా, శివుడు కల్పన అనుకునే వారు నా రచనలు చదవకుండా ఉండడం వారికి, నాకు మేలు.

పిహెచ్.డి పూర్తైపోయి, పెళ్ళయ్యి, ఉద్యోగం వచ్చి, ఉద్యోగం వచ్చి, పిల్లలు పుట్టి, రిటైర్ అయ్యిపేయి ఇవ్నేళ్ళ జీవితం గడిచిపోయింది. మహాబలేశ్వర్ చూడాలను కున్నాను అనే విషయం మర్చిపోలేదు కాని, వెళ్ళలేదు. పరిస్థితులూ అనుకూలించాలి కదా. మా పెద్ద అబ్బాయి బొంబాయిలో ఉద్యోగంలో చేరాక మహాబలేశ్వర్ వెళ్ళడం మీద ఆసక్తి పెంచుకున్నాను. మా అబ్బాయితో అంటే "అలాగే నాన్నా ఒక వీకెండ్ వెళదాం" అన్నాడు.

అలా 2016 ఆగష్టు మూడవవారం వీకెండ్ మహాబలేశ్వరం మా అబ్బాయి కారులో బొంబాయి నుంచి బయలుదేరాము, నేను, మా ఆవిడ, మా అబ్బాయి, మా కోడలు. పొద్దున్న 7 గంటలకు బయలుదేరి పూనా 10-30 కి చేరాము. బొంబాయి-పూనా‌ express highway గురించి చదివి అది చూడాలనుకున్నాను. ఈ ప్రయాణంలో అది వీలయింది. కాని నేను అనుకున్నంతగా బాగులేదు. లోనేవాలా వరకు ట్రాఫిక్ కొద్దిగా ఉంది. కొండల మీద ప్రయాణంలో ప్రకృతి దృశ్యములు అలరించాయి. వర్షాకాలము అయినా తెరిపిగానే ఉంది.

పూనా ఊరి ముందు ఒక మోటల్ దగ్గర ఆగాము. నేను పోహా, పూరి తిన్నాను. మొదటి సారిగా పోహా నేను నాగపూర్ ఒక కాన్ఫరెన్స్ కి వెళ్ళినపుడు తిన్నాను. నాకు నచ్చింది. సరిగ్గా చెప్పాలంటే పోహా అటుకుల పులిహార. కాని పులుపు వెయ్యరు. పోహా ఎక్కువమంది ఇష్టపడే మహారాష్ట్ర వంటకము. నాకిష్టమని, మా ఆవిడ, కోడలు ఈ పోహా బ్రేక్ ఫాస్ట్ కి చేస్తూంటారు. మా ఇంటో రెండు రకాల పోహాలు చేసుకుంటాము. ఒకటి అటుకుల పోహా, రెండవది సగ్గుబియ్యం పోహా.

పూనా నుంచి బయలుదేరి సంగ్లి, సతారా, కొల్హాపూర్ వెళ్ళే హై వే లో 2-30 గంటలు ప్రయాణించి, కుడివైపుకు తిరిగి మహాబలేశ్వర్ దారి పట్టాము. మహాబలేశ్వర్ పడమటి కనుమలలో ఉంది. మహాబలేశ్వర్ కి 50 కి.మీ. ముందు mapro కంపెనీ వాళ్ళ ఫార్మ్, ఫ్రూట్ ప్రోసెసింగ్ యూనిట్ ఉన్నాయి. ఈ ఫార్మ్ లో అన్ని రకాల కూరగాయలు, పళ్ళు పండిస్తారు. ఫ్రూట్ ప్రోసెసింగ్ చూడనిస్తారని మా అబ్బాయి అనడంతో ఆ ఫార్మ్ కమ్ ఫాక్టరీ‌ దగ్గర కాసేపు ఆగాము. కాని ఆ సమయంలో ప్రోసెసింగ్ జరగడం లేదు. వాళ్ళ ప్రోడక్ట్స్ చూసి మహాబలేశ్వర్ బయలు దేరాము. 3 గంటలకు పంచగని చేరాము.

మా అబ్బాయి మహాబలేశ్వర్ కి 20 కి.మీ. ముందు పంచగని లో రిసార్ట్ లో గదులు బుక్ చేశాడు. ఆ రిసార్ట్‌నుంచి ప్రకృతి దృశ్యములు ఎంతో బాగున్నాయి. అవి చూస్తూ అలా ఉండిపోవాలి అని అనిపించింది. రూమ్ నుండి చూస్తూంటే ఎదురుగా‌ఎంతో అందమైన లోయ. లోయలు. ప్రవహిస్తున్న నది. పచ్చదనం పరచుకున్న కొండలు, చల్లని గాలి ఎంతో విసురుగా వీస్తోంది. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. చెప్పానుగా అక్కడే అలా ఎన్నాళ్ళైనా ఉండిపోవాలి అని అనిపించింది మా అందరికి. సుందర ప్రకృతి దృశ్యములు మనోహరములు, ఆహ్లాదభరితములు, భగవన్మయములు. దివ్యములు. వాటి యందు పరమేశ్వరుని విలాసము, దేవి లావణ్యము కనిపిస్తాయి. పార్వతీపరమశివులు ఆనంద తాండవం చేస్తూ దర్శనమిస్తారు. ప్రకృతి వారి ఆలయము, మందిరము, నివాసము, ఆవాసము.

ఆ రిసార్ట్ లోనే బోర్డింగ్ కూడా ఉంది. మనం ముందుగా చెప్పాలి. మేము కొద్ది ఆలస్యంగా వెళ్ళడం వలన పకికనే ఉన్న కామత్ హోటల్ లో లంచ్ తీసికున్నాము. పంచగుని రిసార్ట్ కి రావడానికి ఒక కి.మీ ముందు ఎంతో అందమైన
లోయలు, దృశ్యాలు ఉన్నాయి. ఒక గంట విశ్రాంతి తీసికొని, మహాబలేశ్వర్ కి బయలుదేరాము. చిన్న తుంపర పడుతోంది. వాతావరణం చల్లగా, హాయిగా ఉంది. చెట్ల మధ్యనుంచి 20 కి.మీ. ప్రయాణంచేసి పాత మహాబలేశ్వరం చేరాము. కృష్ణానది పుట్టుక స్థానము పాత మహాబలేశ్వర్ లోనే ఉంది. చిన్న తుంపర అలా పడుతూనే ఉంది. చుట్టూ పర్వతాలు, లోయలు.

Mahabaleshwar is a hill station in India's forested Western Ghats range, south of Mumbai. It features several elevated viewing points, such as Arthur’s Seat. West of here is centuries-old Pratapgad Fort, perched atop a mountain spur. East, Lingmala Waterfall tumbles off a sheer cliff. Colorful boats dot Venna Lake, while 5 rivers meet at Panch Ganga Temple to the north.

కృష్ణనది జన్మస్థానము చూచే ముందు ఆ ఆవరణలోనే ఉన్న మహాబలేశ్వరుని ఆలయం చూశాము. శివుని దర్శనము చేసికున్నాము. శివలింగము నిటారుగా ఉన్న ఒక రాయి కాదు. కొంత ప్రదేశము ఆక్రమించిన, పరచుకున్న, ఎగుడు దిగుడుగా ఉన్న రాయి. మనసుకు నైర్మల్యము కలిగింది.

ప్రసిద్ధి చెందిన పర్వత ప్రాంతం. ప్రసిద్ధి చెందిన పశ్చిమ కనుమలలోకల కొద్దిపాటి అందమైన ప్రదేశాలలో మహాబలేశ్వర్ ఒకటి. మహాబలేశ్వర్ పట్టణాన్ని బ్రిటీష్ పాలకులు ఒక వేసవి విడిదిగా ఉపయోగించి ఆనందించేవారు. మహాబలేశ్వర అంటే ‘గొప్ప బలంకల భగవంతుడని’ అర్ధం చెప్పవచ్చు. దీనినే ‘అయిదు నదుల ప్రదేశం ’ అనే పేరుతో కూడా పిలుస్తారు. సరిగ్గా ఈ ప్రదేశంలో, వెన్నా, గాయత్రి, సావిత్రి, కోయినా మరియు కృష్ణ నదులు పుడతాయి.

అక్కడకు పక్కనే ఉన్న కృష్ణానది పుట్టిన చోటుకి వెళ్ళాము. దీనిని పంచ గంగల పవిత్ర జన్మ స్థానము అంటారు. లోపల ఒక కట్టడంలా ఉన్నచోట ఐదు నదులు వస్తున్న ధారలు ఐదు ఉన్నాయి. ఆ నదులు కృష్ణా, కొయినా, సావిత్రి, గాయత్రి, వెన్నా.

ఈ నదుల ధారలలో నుంచి వస్తున్న నీళ్ళన్నీ కింద ఉన్న గుండంలోనికి చేరుకుని చిన్న సరస్సులా అయింది. అందులో ఎందరో స్నానాలు చేస్తున్నారు. అప్పుడు కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయి. స్నానాలు చేస్తున్నవారు అధిక శాతం తెలుగులో మాట్లాడుకుంటున్నారు. వీరందరూ పుష్కరాల సందర్భంగా కృష్ణానది పుట్టిన చోటులో పుష్కర స్నానానికి వచ్చిన తెలుగు వారు అని ఊహించాను. మరే రాష్ట్రం వాళ్ళు పుష్కర స్నానాలు చేస్తున్న వాళ్ళు లేరు.

నాకు తరువాత తెసిసింది; పుష్కరాలు అనే కాన్సెప్ట్‌ తెలుగు వారికి మాత్రమే ఉందని. కృష్ణా నదీ పరీవాహక ప్రదేశాలైన మహారాష్ట్ర, కర్నాటకలలో పుష్కర హడావుడులు లేవు. పుష్కరస్నానాలు లేవు. పుష్కరాలు పూర్తిగా తెలుగువారి సంస్కృతీ సంప్రదాయముల లోనిది
మాత్రమే.

అలా పుష్కరాలు హిందూ మతంలో భాగం కాదు. తెలుగువారికి మాత్రమే ప్రత్యేకం. ఉత్తరాదినీ‌ పుష్కరాలు లేవు. ఇలా ప్రాంతం, ప్రాంతానికీ సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతీ‌ వేరు హిందువులైన భారతీయుల లోనే. ఒక హిందూ సంస్కృతి అని భారతదేశమంతా ఒకే సంస్కృతి పాటించబడడం లేదు.

తరవాత కొత్త మహాబలేశ్వర్ వెళ్ళాము. అక్కడా గాలి ఎంతో విసురుగా వేస్తోంది. తుంపరా‌ పడుతోంది. అక్కడ పెద్ద సరస్సు ఉంది. చుట్టూ‌ జనాలు picnic కి వచ్చిన వాళ్ళలా. అందరూ‌ పర్యాటకుల లాగే ఉన్నారు. పాప్కార్న్
తిని రిసార్ట్ దారి పట్టాము. రిసార్ట్ నుంచి ప్రకృతి దృశ్యాలు బ్రహ్మాండం. రిసార్ట్ గదులూ, భోజనము కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడూ అందరూ మొదలుపెట్టారుగా, బ్రేక్‌ఫాస్ట్‌ ఫ్రీ అని.

రెండవరోజు పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేసి బొంబాయికి బయలు దేరాము. వచ్చేటప్పుడు వాయ్ అనే ఊరిలో కృష్ణానది ప్రవహిస్తూ కనిపించింది. వచ్చేటప్పుడు‌ ఆగుదాం, నదిని చూద్దాం అన్నాను. అలాగే మా‌ అబ్బాయి‌ వచ్చేటప్పడు‌ వాయ్ ఊరిలో కృష్ణానది ఒక రేవు దగ్గర ఆపాడు. నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది. కృష్ణానది అక్కడ ఒక కాలువలా ఉంది. విజయవాడ దగ్గర కృష్ణను చూసి ఈ వాయ్ లో చూస్తే విజయవాడకి వచ్చేసరికి కృష్ణ ఉపనదులను, ఏరులు, సెలయేరులను కలుపుకొని పెద్ద ముత్తైదువ వలె ఉంటుంది. గోదావరి అంతే. నాసిక్ దగ్గర, రాజమండ్రి దగ్గర చూస్తే ఎంతో తేడా.

అక్కడ పాతకాలం, కొత్తకాలం గుడులు ఉన్నాయి. వినాయకుడిది కొత్త గుడి. శివుడిది, దత్తాత్రేయుడివి పాతవి. అక్కడా తెలుగు కంఠాలు వినబడ్డాయి. మన తెలుగు వాళ్ళే అక్కడ పుష్కర స్నానాలు చేస్తున్నారు.
మేమూ కృష్ణ నీళ్ళను తలపై చల్లుకొని పుష్కర స్నానం అయిందనిపించుకున్నాము.

అక్కడినుంచీ‌ దత్తాత్రేయునికి కృష్ణా పరీవాహక ప్రాంతంలో నది ఒడ్డున మహబూబ్ నగర్ జిల్లాతో సహా‌ అంతవరకు మహారాష్ట్ర, కర్ణాటకాలలో దత్తాత్రేయుడి పాదుకలను పూజించే సంప్రదాయము చాలా ఎక్కువగా ఉంది. కొల్హాపూర్ వెళ్ళినపుడు దత్తాత్రేయ భక్తులకు ఎంతో ముఖ్యమైన నరసింహవాడి పాదుకల అభిషేక సంరంభాన్ని చూసాము. మహబూబ్ నగర్ జిల్లా తరువాత అన్నీ శైవ, వైష్ణవ ఆలయాలే కృష్ణ ఒడ్డున అలరారుతూ‌ ఉంటాయి.

వాయ్ నుంచి బయలుదేరి దారిలో వచ్చే mapro farm and fruit processing unit వద్ద ఆగాము. అక్కడ‌ ఎన్నో
రకాల processed పళ్ళరసాలు, దానికి సంబంధించినవి ఎన్నో ఉన్నాయి, డిస్ప్లే లో, అమ్మకానికీ. అక్కడ వాటి షాపింగ్‌ చేశాము. అక్కడ రెస్టారెంట్ లో‌మా కోడలు పరిజ్ఞానము, సలహా, కోరికలననుసరించి, Italian thin crush pizza తిన్నాము. రుచి చాలా బాగుంది. కాని దానిమీద చీజ్‌ పరిచాడు. నాకు చీజ్, మీగడ టచ్ ఇష్టం ఉండదు. మీగడైతే డోకు సెన్సేషన్ వచ్చేస్తుంది. చీజ్ పరిచినా ఈ పీజా బాగానే ఉంది.

పూనాకు దగ్గరగా భీమశంకర్ జ్యోతిర్లింగము ఉంది. వెళదామని ఊగేను కాని, అప్పటికే మా అబ్బాయకిి కొంచెం అలసటగా ‌ఉండడం వస్ల, పూనాకి 150 కి.మీ పైన ఉండడం వల్ల, మరునాడు సోమవారం మా అబ్బాయికి, కోడలుకి ఆఫీసులుండడం వల్ల వెళ్ళలేదు. తిన్నగా‌ బొంబాయి వచ్చేశాము.

ఈ ట్రిప్ ఎంతో అందంగా, ఆనందంగా జరిగింది. రిసార్ట్ నుంచి ప్రకృతి దృశ్యముల వీక్షణ ఈ పర్యటనకు మకుటాయమానము.

తరువాత మా ‌తిరునారాయణపురం లేదా కానఫరెన్సు తిరునాళ్ యాత్ర గురించి అనుభవాలు పంచుకుంటాను.
ప్రస్తుతానికి శలవు.

Krishna River at Wai

 

No comments:

Post a Comment