Tuesday, March 21, 2017

ఆత్మ స్థితి - బ్రహ్మానుభవం; కాలం



ఆత్మ స్థితి - బ్రహ్మానుభవం

ముందు ఆ స్థితి ఉందని నమ్మాలి. మీరు ఆ స్థితి కి చేరుతారని విశ్వసించాలి. ఇంక సాధన మనిషి మనిషికీ వేరు. ఆ స్థితిని మీరు తప్పక అనుభవం లోకి తెచ్చుకుంటారు. ఆ అనుభవం గా మారతారు. అందుకనే మీకు భగవంతుడు ఈ సంకల్పం కలిగించాడు. అనుకోవొలి. అది పొందడానికి సాధన చేస్తున్నాను అనే స్పృహ వద్దు. సాధన చేయండి. మిగతాదంతా భగవంతుడే చూసుకుంటాడు. ఏమి సాధన అనేది మీ చిత్తం. భగవంతుడే మీకు గురువు. ఆయనే సర్వం వహిస్తాడని నమ్మండి. శుభం భూయాత్!
***************

తాము ప్రవచించవలసిన తత్త్వాన్ని కాని, యోగాన్ని కాని, ఆధ్యాత్మికతను కాని పక్కకు పెట్టి, తమ గురించి డంబాలు చెప్పుకుంటూ, శిష్య పరమాణువులను; తమ లేక వారి జీవితాంతం చుట్టూ తిప్పుకుంటూ, ధన, చరాచర ఆస్తుల సంచయం చేస్తూ తమ గురుత్వాన్ని, ఆకర్షణను దుర్వినియోగం చేసుకునే సామాన్యులు, ఉన్నతమైన, మహిమాన్వితమైన, అసామాన్యమైన భారతీయ తత్త్వ బోధనకు, ప్రచారానికి, ప్రసారానికి, ప్రాతినిధ్యం వహించడానికి అనర్హులు.
************

కాలం కదులుతూంది అంటే మనం ఆలోచనల్లో ఉన్నామని అర్థం. ఆ తలపులు గతం గురించి కాని, భవిష్యత్ గురించి కాని అయి ఉంటాయి. స్థిమితంగా, ఆనందంగా ఉన్నపుడు ఆ ఆలోచనలు ఉండవు. అంటే మనం మానసికంగా గతంలో​కాని, భవిష్యత్ లో కాని ఉండం. వర్తమానంలో మౌన, ఆనంద, శాంత స్వరూపంగా ఉంటాము. శుద్ధ గమనిక గా ఉంటాము.

అంచేత కాలం ప్రవాహం లేదా కాలగమనం తెలియదు. కాలస్పృహ ఉండదు. మనం, మన మనం "కాలాతీత" లేక "కాలాభావ" స్థితిలో ఉంటాము. ప్రియముతో కలయిక ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది కదా. మనసుల మరణం ఆనందోదయం. రసమయం. మనసు తలపుల వరుస మాత్రమే కదా.

No comments:

Post a Comment