రామబ్రహ్మము
తామరాకుపై నీటి బొట్టును నేను;
వికసించిన పూవుపై తొలి చినికును నేను
అరవిరిసిన మొగ్గపై జారు మంచు బిందువును నేను
కృంగిన ఎగసిన డెందపు బాష్పములు నేను
నదీతీరమున వీచు పిల్లగాలిని నేను
ఎదిగిన పైరుల పరామర్శించు పైర గాలిని నేను
వర్షము పడనున్నప్పటి హర్షము కల్గించు చల్లని గాలిని నేను
కురియు వాన జల్లుల వయ్యారపు సొగసును నేను
ఆకలి గొన్న కడుపు ఆకటి మంటను నేను
పదార్థముల పక్వము చేయు పొయ్యి జ్వాలను నేను
సమస్తమును దహించు అనలమును నేను
అజ్ఞాన తిమిరముల పోగొట్టు జ్ఞాన శిఖను నేను
సర్వమును ధరించు ధరిత్రిని నేను
అన్ని జీవుల స్థావర జంగమముల ఉనికి వహింతును నేను
నేను లేక లేవు మొక్కలు, నదులు, సాగరములు,
ఆకాశమును చుంబించు కొండలు;
అన్ని జీవులకు అన్నమును అమర్చు అమ్మను నేను
పరమాత్మ ప్రాణ సఖిని నేను భూమాతను
అయినను ప్రకృతిని ధ్వంసము చేయు మనుషుల
మూర్ఖత్వమును పోగొట్ట లేని నిస్సహాయను పుడమి తల్లిని నేను
అన్ని తారల గ్రహముల సూర్య చంద్రుల
నభోంతరాళముల; వాటి మధ్య శూన్యమును నేను
అన్ని తెలివిల తెలియుటల,తలపుల, ప్రకటించుటల
వాసనల ఏర్పరచుటుల, ప్రేరేపించుటల మూలమును
కారణమును నేను వాటిని వీక్షించు సాక్షిని నేను
పంచభూతముల కారణమునై వాటిలో లీనమై
నిర్వహింపబడు మానసిక కార్యకలాపముల
హృదయ మేళనము సమ్మేళనము నేను
మనసును నేను బుద్ధిని నేను అహంకార మమకారముల కలిగించెద నేను
వాటిని మూలమునకు త్రుంచెదను
వుల శరీర మానసిక స్పృహల
పోగొట్టి శాంతానంద స్థితి వారికి సహజము చేయు
స్ఫూర్తిని నేను; "అసలు నేను" గ్రహింపు నిచ్చెదను
ప్రపంచమును నేను ప్రపంచ కారకుడ నేను, స్థితి నిచ్చెదను
లయ ఏర్పరచెదను ; లయము కలిగించెదను;
సర్వ వ్యాపకుడను నేను; సమస్తమును నేను
నేను శబ్దమునకు, స్థితికి, నిర్వచనమును
రూపమును స్వరూపమును అర్థమును తాత్పర్యమును
అసలు నేనును నేను ,
బ్రహ్మమును, రామబ్రహ్మమును నేను
No comments:
Post a Comment