ఏది? భారతీయ సంస్కృతి?
ఏది? భారతీయ సంస్కృతి?
భారత దేశపు సంస్కృతి ఏది?
వైదికమా? అవైదికమా? ఇంక ఏమైనానా?
హిందూ బౌద్ధ జైన సంస్కృతులలో ఏది భారతీయ సంస్కృతి?
చార్వాకుల అవాకులు చెవాకులు భారతీయ సంస్కృతా?
సామ్య వాదుల తర్క సంబంధమా?
వీర వైష్ణవమా? వీర శైవమా?
హరిహరి మతమా? ఆర్యమా, ద్రావిడమా?
ఏది భారతీయత?
ఎడమ చేతి భావముల వారి సిద్ధాంత పిడివాదములా?
సంఘ సంస్కర్తల అధునాతన కేకలా?
ఏది భారతీయ సంస్కృతి?
మగ వారలు ఆడు వారు కలిసి
పానశాలల యందు మద్యము సేవించుచూ,
గంజాయి దమ్ము కొట్టుచు గంతులేయుటయా?
ఏది భారతీయ సంస్కృతి?
తెగ తాగి ఒళ్ళు తెలియని స్థితిలో కారు నడుపుచు
రోడ్డు మీదవెళ్ళు , పక్క కాలి దారి మీద ఉన్న వారి పై ఎక్కించి
వారిని యమసదనమునకు పంపుటయా?
ఏది భారతీయ సంస్కృతి?
హైందవమా? క్రైస్తవమా? మహమ్మదీయమా?
సిక్కుల మనోభావములా? అంబేద్కర్ అనుచు అందరిని శాసించుటయా?
సాంప్రదాయము పేరుతొ కన్యల చంపుటయా?
గ్రామముల "పెద్దల" న్యాయ స్థానములిచ్చు తీర్పుల సమాహారమా?
ఏది భారతీయత? భారత దేశపు సంస్కృతి?
కులపిచ్చియా? మత మూఢ అనుసరణమా?
మన మతమును, దాని "విలువలను" ఇతరులపై రుద్దుటయా?
మతాతీతమనే వేలం వెర్రియా? అన్ని మతములకు సమాన గౌరవమునిచ్చు హుందాతనమా?
ప్రతి చిన్న దానికి ప్రజల మధ్య కుల చిచ్చో, ప్రాంత చిచ్చో, సిద్ధాంత చిచ్చో, మత చిచ్చో పెట్టుటయా?
కుయుక్తులు పన్ని అందరను కులములు, మతములు, ప్రాంతములు, భాషలు,
తత్ సంస్కృతులు, సిద్ధాంతములు, ఆడ-మగ వారిగా విడదీయుటలా?
ఏది భారతీయ సంస్కృతి?
అడవులలో హఠాత్తుగా మీద పడి
అమాయకులను రక్షక దళములను
ఊచకోత కోయుటయూ
భారతీయ సంస్కృతి లా ఉంది!
పంచతంత్రము, రామాయణము, మహాభారతము, మహా భాగవతము
భారతీయ సంస్కృతికి అద్దములై అలరారుటయా?
ఉపనిషత్తులు, భవద్గీత, షడ్ దర్శనములు; వాటి పై ఆచార్యుల, మునుల, మహర్షుల,
మహానుభావుల వ్యాఖ్యానములందించు శాంతానంద స్థితి నందుటయు
భారతీయ సంస్కృతి అవునా? భారతీయ సంస్కృతిలో ఇమడవా?
వీటన్నిటి కలగూర గంపయో, సమాహారమో;
లేక ఈ భేదములతో సమాంతరముగా బ్రతుకుతూ
ఇతరులను జీవించనిచ్చుటయా?
లేక నిరంతరమూ గొడవలు పడుచు
ఒకరినొకరు చంపుకొనుటయా?
ఎవరిది భారత దేశపు సంస్కృతి?
అల్ల కల్లోలముగా నున్న ఈ వేళ
ఏది భారతీయ సంస్కృతి?
ఈ నేపథ్యమున భారతీయ సంస్కృతి
సరళమా? విరళమా ?
సరసమా? విరసమా?
సౌమ్యమా? సాధారణమా?
లేక ఆనైక్యతయా?
సంక్లిష్టముగా నున్నది
భారతీయ సంస్కృతీ నిర్వచనము
నిర్ణయమునూ!
No comments:
Post a Comment