Friday, June 17, 2016

భక్త శంకరము



 భక్త శంకరము


1. వశిష్ఠ వామదేవ గౌతమాది విశిష్ఠ మహర్షి సంఘములు
భక్త వేదాంతులు శంకర ప్రభృతులు; భక్త శిరోమణులు
నాయనమారులు బసవవేశ్వరాది జంగమదేవులు;
కాళిదాస నన్నెచోడ సోమనాథ శ్రీనాథ ధూర్జటీ
కవి సార్వభౌములు ఈశ్వరార్చనాకళాశీలురై

ధన్యత నొందిరి మనమున మిమ్ము  నిలిపి;
నిర్మల హృదయులైరి శివ పంచాక్షరి జపించి;
నాకును శివ మంత్రమును ఉపదేశింపుడు;
తపించి నేనును మిమ్ములను కాంతును శంకరా!

2. జనుల కష్టములకు బాధలకు కలవరములకు
హృదయ పరితాపము కలిగి వ్యథ నొంది వారికేదైన
చేయవలెనన్న ఆవేశములు  చల్లారినవి; దుర్బలుడనైతినో
చేతకాని తనమున; దుష్టులు దుర్మార్గులకు నేడు ఆటవిడుపో;
సమయమాసన్నము  కాలేదో; పరితాపము మాత్రము మిగిలినది;
ఏమియు చేయలేకపోతిని; మీ నిరంతర నామ స్మరణమున
మనో ధృతి నొంది ప్రజలకు ఉపయోగపడు సద్భాగ్యమునిండు శంకరా!


3. కైలాసమన్ననేమి? వైకుంఠమన్ననేమి?
కాశి అన్ననేమి పూర్ణ ప్రకాశమన్ననేమి?
"కాశ్యాన్తు మరణం నామ" అన్ననూ;  ఇన్నియూ
నీయందు నా వ్యక్తిత్వము లీనమగుట కాదె శంకరా?


4. లాలించి అరచేతిలో స్వర్గము చూపించి; పదే పదే
తిరిగి, కాళ్ళు పట్టుకుని బతిమాలి బామాలి,
తీసికెళ్ళి; ఓటు వేసిన పిదప మా చిరునామాలు
మరచిపోవు స్వార్ధ పరులు మా నాయకులు పాలకులు శంకరా!

5. భాష తెలియక పర దేశములందు ఎటు కదల లేని
అయోమయ స్థితిలో మాతృభాషా జ్ఞాని పరిచయమైనటుల
భవ, భావ క్లేశముల కొట్టుమిట్టాడుచు దారి తెలియకున్న నాకు
మీ పరిచయ భాగ్యమున ప్రాణము లేచి వచ్చినది శంకరా!

6. ప్రాచుర్యమునకై గాక పాఠకుల
హృదయోల్లాస మనోవికాసములకు
ధనమునకై గాక వారికుత్సాహ సుఖ శాంతులు
కలిగించుటకు నా రచనలు వెలయ వలె శంకరా!


7. మేము ఎన్నుకున్న పాలకుల
కుపారిపాలనా విధానము మేము అనుసరించుచున్న
నాగరికతా దుష్ప్రాభావములు నోరు మూసుకుని
అనుభవించుట మా జీవనమాయె శంకరా!

8. పొగ త్రాగుట, మాదక ద్రవ్యముల, మద్యముల సేవించుట మానలేము,
ఆరోగ్యము చెడకుండా చూసుకొనలేముత్రాగు నీరు, పీల్చు గాలి కలుషితము
కాకుండా నిరోధించు కొనలేము; ప్రకృతి కాలుష్యము కలిగించు పరిశ్రమలు
మా ఊపిరి; కాలుష్య నివారణ పట్టించుకొనరెవరూ; స్వార్థ పరులు
పారిశ్రామిక వేత్తలు, పాలకులు; మేమే మాకు ప్రమాదము, మృత్యువు శంకరా!


9. లిపి తెలియక భాష చదవలేనటుల; పరిచయము లేక
నారీ హృదయము తెలియలేనటుల; ప్రాథమిక శిక్షణ లేక
విజ్ఞాన శాస్త్రములు, తత్త్వము అర్థము కానటుల; మీ పై
భక్తి, మీ కరుణ లేక మిమ్ము తెలియ లేము శంకరా!

10. భ్రమియించు భూమిపై భ్రమల సుడిగుండాల
 చిక్కుకొని సంభ్రమము పొంది విభ్రమము మిగిలి
జీవితము భ్రాంతిగా తోచు మాకు  భ్రమ విభ్రమములు
 అంటని సంభ్రమము సంబరము నిండు  శంకరా!
 
11. మనమున మీరు నిండుట అద్వైత వేదాంత సారము
పంచాక్షరీ జపోత్సాహము కల్గుట మీ కరుణ; సహజము
అత్యంత సుందరము అయిన మన అనుబంధమును
వర్ణించుటకు పదములు నిండుకొనెను శంకరా!

12. రామ నామము జపియించుచు మీరు తల్లి పార్వతి తోడు కాగ
పాలింతురు సకల జగముల; ఆపన్నుల కాచుట ఆనంద తాండవము
మీకు; భోళా శంకరులు మీరు; ఎల్ల వేళల యందు మమ్ము
కరుణ చూచు మిమ్ము హృదయమున పూజింతు శంకరా!
 
13. దేహము దేవుని మందిరమని; ఆత్మ
పరమాత్మ అని; సకల చరాచర జీవములు
స్థావర జంగమములు ఈశ్వర రూపమని
తెల్సియు; మీరు గుళ్ళ గోపురముల మాత్రము
ఉందురు అనుకొనుట మా మరపు శంకరా!

14. భాషలు నేర్చుట  నిష్ప్రయోజనము భావించుట తెలియకున్న
వేదాంత సర్వస్వమను విజ్ఞాన కషాయము త్రావుట
వృథా ప్రయాస భక్తి లేకున్న; అక్షర జ్ఞానము వేదాంత
పరిచయము లేకనే మీ కృపారసము గ్రోలిన
శ్రీ-కాళ -హస్తి-చెంచుల  తలపరు అజ్ఞానమున శంకరా!

15. రసార్ద్రత కలిగి, పెద్దల ఆలోచనల, భావముల
బాగుగ దున్నబడు సుక్షేత్రము కవి హృదయము;
మీ వాత్సల్య కరుణా ప్రకాశములు రవి కిరణములై సాయపడ
శ్రధ్ధగా విత్తిన భావములు ఏపుగ ఎదుగును కవితలుగ శంకరా!

16. మదిలో ప్రమదలు నిండిన మెదలును
ప్రణయభావములు; మారును ప్రేమ గీతములుగ;
మనసున మీరు నిండిన కలుగును భక్తి
వెలయును కీర్తనలు, పదములు, కృతులు, కావ్యములు శంకరా!

17. వచ్చిరి ప్రవచించిరి పోయిరి వేదాంతులు శాస్త్రజ్ఞులు  సిద్ధాంతులు
ఉంటిరిప్పుడును వేదాంతులు సిద్ధాంతులు శాస్త్రజ్ఞులు
లేదు లోటు బుద్ధి వికాసముఅకు; మరిటులలేల మేమందరమూ
ఇడుముల  పాలగుచున్నాము నేడు జ్ఞానశెఖరా! శంకరా!

18. వంతెనల కట్టి లెక్కసేయము నదీప్రవాహముల
విమానముల ఎగిరి అధిగమింతుము అంబుధుల
రాకెట్ల పయనించి ప్రతిదినము పలుకరింతుము
చందమామను;తోటివాని కష్టము మాత్రము తెలిసికొనము
బాధ పట్టించుకొనము ఇది ఏమి? శంకరా!

19. లేవు ప్రజలకు తిండి, నీరు, నివాసము
అణు యుద్ధ భయచ్చాయలు మాత్రము
కలవు; పెట్టుబడి దారి దేశముల, ఘనుల
సంపన్నము చేయుట మా సిద్ధాంత మాయె శంకరా!

20. ఎందుకో తెలియదు కలుగును కలత; మరెందుకో తెలియదు 
విరియును మమత; ఇంకెందుకో వచ్చును కవిత; మరెందుకో కలియును జత
ఎందెందుకో కలుగును నలత; ఎప్పుడో గాని అనిపింపదు సమత
ఎల్లప్పుడూ చెందును వెత; ఎన్ని అవస్థలు మనసుకు శంకరా!

21. నిన్న వికసించిన పూవు నేడు వాడి రాలును; మొన్న
గొంతు సవరించిన కోయిల నేడు మూగ బోవును; నిన్న
మొన్న ఆవిర్భవించిన మానవజాతి రేపో ఎల్లుండో
సమసి పోవు; ఎందుకు ఈ సృష్టులు పెంపులు లయములు శంకరా!

22. చట్టబద్ధమైన హెచ్చరికలు చేసికొనుచు పొగత్రాగు సంస్కృతి మాది
ప్రకృతినంతయు కశ్మలము కాలుష్యములతో నింపి పుడమిని నివాస యోగ్యము
 కాకుండా చేసికొను నాగకరికత మాది; అణు పరమాణు ధార్మికత,
జీవ రసాయన విధ్వంసక ఆయుధములు నిర్మించుకొను ప్రగతి మాది; తోటి వాని
త్రోసిరాజని ద్వేష భావముల పక్కలో బల్లెముల వలె నిడుకొని పరుండు
పెద్దలము మేము ఇదంతయు మా ప్రజ్ఞయొ మీ లీలలో తెలియదు శంకరా!


23. చిన్ని చిన్ని  పదములు పెద్ద పెద్ద
భావముల వెలయించినటుల మా బుల్లి
హృదయాలు మీ గొప్పదనమును కీర్తించుట
మీ కరుణ మీ నామ స్మరణాఫలము శంకరా!


24. శిథిల మనస్కులకు మనో ధృతి కలిగించి
స్థిమితమిచ్చుటకు; మీ లీలల, భక్త పాలన
కళా సంరంభములను వర్ణించుటకూ, నా కవితా
వ్యాసంగమునకు సావకాశమిండు శంకరా!


25. చల్లని కొండ కైలాసము మీ నివాసము
చల్లని తల్లి హైమవతి మీ సగ భాగము
చల్లని రాజు చంద్రుడు, చల్లని నీటిని వహించు
పావని గంగా భవాని మీ శిరసున సహవాసులు
చల్లని చూపుల మమ్ము చల్లగ చూచు
చల్లని దేవులు మీరు శంకరా!


26. కసరత్తులు దండెములు బస్కీలు పరుగులు
అవసరము శరీరారోగ్యమునకు; ధ్యానము
పూజలు అభిషేకములు సతత పంచాక్షరీ జపము
అవసరము మానసిక ఆరోగ్యమునకు శంకరా!


27. పలు పుస్తకములు చదువుటలు పెక్కు వ్యాఖ్యానములు
వ్రాయుటలు ఎన్నియొ  ప్రసంగములు చేయుటలు
వీలైనన్ని సిద్ధాంతములు వేదాంతములు తెలియుటలు
సతతము మిమ్ము స్మరింపనిచో వ్యర్థములు శంకరా!


28. విధి ఇచ్చవచ్చినటుల ఆకృతి పొందు
మైనపు బొమ్మలమొ; జన్మాంతర పాప
పుణ్యముల అనుభవించుచున్నామో;
ప్రకృతి అధీనమున ఉంటిమో తెలియదు;
మిమ్ము ఎల్లప్పుడూ ధ్యానించు సాధనముగ
మనసును మలచుడు మన్మథాన్తకా శంకరా!


యాసల, భాషల, భక్తి  ప్రపత్తుల మంచి కలయిక!


No comments:

Post a Comment