శ్రీ మావుళ్ళమ్మ వచనములు - 1
మావుళ్ళమ్మ తల్లి భీమవరపట్టణపు గ్రామదేవత. మహామహిమాన్విత. భక్తుల కోర్కెలను
ఈడేర్చడంలో సిద్ధహస్త. కనువిందైన భారీ విగ్రహము. కళైన ముఖము. పేద్ద పేద్ద కళ్ళతో
ప్రసన్నముగా చూస్తూంటుంది. సర్వమంగళ.
శ్రీ మావుళ్ళమ్మ తల్లి గాయత్రి.:
ఆత్మానుసంధాన కర్త్రై విద్మహే భక్తేష్టార్ధ దాత్రై ధీమహి తన్నో విశాలాక్షీ
ప్రచోదయాత్!
ఓం శ్రీ మావుళ్ళమ్మ దేవ్యై నమ:
మావుళ్ళమ్మ వచనములు
1.
ఎండిపోయిన దిగుడు బావి గతము
దిగి ఎక్కుటలు వృథా ప్రయాస
తీరదు దాహము; మిగులును శ్రమ
అంతను విస్మరించి ఎప్పుడు నిన్ను స్మరించునటుల
అమ్మా! దయ చూడుము!మావుళ్ళమ్మ తల్లీ!
మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ!
2.నీ కారుణ్య ప్రకాశములు ప్రతిఫలించిన మనసుతో
సతతము నీ శుభనామముల అర్థ సౌందర్యముల
తలంచుచు; ఆ సౌందర్యార్థముల స్మరించుచు
వర్తమానముననే వర్తించి మనసున దీనత లేక
శాంతి నిండి సుఖించునటుల అమ్మా! ఆశీర్వదించుము
దయ చూడుము దయామయీ!మావుళ్ళమ్మ తల్లీ!
మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ!
3.
కలిగి కరిగిన అనుభవ స్మృతి శకలములు కురిసి ఇంకిపోయిన జడి వానలు;
ప్రవహిచేసిన నదీ జలములు ప్రదర్శింపబడిన నాటకములు ఆడిన మాటలు;
ఏలనమ్మా! నేడు ఉనికి లేనిఈ గతములు నలిపును మనసును, పిండును
హృదయమును; ఆపై అరిషడ్వర్గములను కుంపటులను నిలుపు సెగలు గుండెలపై;
ఎద కములు; అయిన వారికి కంట తడులు; అనవసరముగ కలత నొందు మది;
ఆడించి అలపింతువు; రగుల్తువు చేదు జ్ఞాపకముల, గడచి పోయిన ఘటనల,
సంఘటనల; అమ్మా! బాపుము గత స్మరణ జనిత వ్యథలు మావుళ్ళమ్మ తల్లీ!
మాయా విలాసినీ! మందస్మిత వదనా! మాతృ స్వరూపిణీ! భీమవరపుర నివాసినీ!
4.
శాంతస్వరూపిణీ! కాలాతీతవర్తినీ!
ప్రజ్ఞానఘనమయీ! పావన పుణ్యచరితా!
వాత్సల్యముతో చూసి వరముల నిమ్ము
వ్యథిత హృదయపు ఆటుపోటులనాపుము మాతా!
అమ్మా! దయచూడుము మావుళ్ళమ్మ తల్లీ!
మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ!
5.
గమనిక నిత్తువు పరాశక్తవై
స్ఫురణల అవగాహనల అనుభవముల
అర్థ స్పృహల నిత్తువు పశ్యంతీవై
సమస్తమును తలపులుగ మార్తువు మధ్యమావై
అంతను వాగ్రూపమున పలికింతువు వైఖరివై
అమ్మా! సకల భాషా రూపిణీ! మావుళ్ళమ్మ తల్లీ! మౌనిని చేయుము
నన్ను; మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ!
6.
మనసువై కల్గింతువు గ్రహణలు జ్ఞానేంద్రియముల ద్వారా ఆ యా విషయములు;
ప్రాణ శక్తివై చేయింతువు కర్మేంద్రియములచే ఆ యా పనుల; బుద్ధివై ఇత్తువు
విచక్షణలు తర్కములు; అహంకారమువై కలిగింతువు జీవునికి శరీర వ్యక్తిత్వ స్పృహలు
చిత్తమువై ఇత్తువు అనుభవములు ప్రేరణలు; సరిచూతువు స్మరణల ధ్యానముల
తల్లీ! సకల మానసిక కార్యకలాపములూ
నీ శక్తీ పరిణామములే నీ వర ప్రసాదములె
అమ్మా! కావుము మానసోల్లాసినీ! మావుళ్ళమ్మ తల్లీ!
మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ!
7.
మనసున మమతల మల్లెలు విరబూసి
పరిమళించి, ముదము కలుగునటుల
మాటలాడు నాగరీకులతో స్నేహము;
పటాటోపము, ఆడంబరముల చూపువారిపై ఉపేక్ష
అమ్మా! దయచేయుము మావుళ్ళమ్మ తల్లీ!
మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ!
8.
మనసుకు హాయి కలిగించుచు వ్యవహరించుట సంస్కారము,
నాగరికత; పరిమితి లేని దురహంకారమున, కుహనాహంభావమున
నొప్పించు నడవడిక కుసంస్కారము, నాగరికతా రాహిత్యము;
అనాగరికులకు, సంస్కార రహితులకు మంచి నడవడిక నేర్పుము
అమ్మా! పరమేశ్వరీ! మావుళ్ళమ్మ తల్లీ! మహిమాన్వితా!
మాయావిలాసినీ! మంగళప్రదా! భీమవరపుర నివాసినీ!
9.
విద్యా వినయ వివేక సంపన్నత నా సొత్తు జేసి నా వాక్కులు
అప్రతిహతములై లోక కల్యాణ కారకములై విలసిల్లునటుల
సమస్తవిద్యాప్రదాయినీ! అనుగ్రహించుము అమ్మా! మావుళ్ళమ్మ తలలీ!
మాయా విలాసినీ! మాహేశ్వరుని పట్టపురాణీ! భీమవరపుర నివాసినీ!
10.
వీణా వేణు మృదంగ వాద్య సంగీత సహిత నర్తన వల్లీ!
రాగ సుధా రసముల సతతము తేల్చు ప్రణయ స్వరూపిణీ!
మాటలు వీణా నాదములై ఊపిరులు వేణు గానములై
హదయపు సడులు మృదంగ ధ్వనులై నినదించ
నీపై భక్తి రాగము ప్రేమ డెందమున గానము చేయ
రాగ రాగిణీ! నటరాజ రమణీ! సంగీత నాట్య రాజ్ఞీ! చేయుము
నా మనసును రాగ రంజిత రసమయిగ నారాయణీ! మంజుభాషిణీ!
అమ్మా! నాద స్వరూపిణీ! మావుళ్ళమ్మ తల్లీ! ప్రణవ రూపిణీ!
మాయా విలాసినీ! భీమవర పురనివాసినీ! మధుర స్వనీ!
11.
సర్వ వేదాంత సంసిద్ధ సుతత్త్వా! వాటిని
అవగాహన చేసికొను స్ఫూర్తినిచ్చితివి కరుణను;
అయినను చిరుగాలికి అల్లల్లాడు చిగురుటాకు
మనసు; దు:ఖ దీనత్వములు దానికి
మిత్రులు
తల్లీ! సమస్త వేదాంత వాక్యముల తత్పరయై మనసు
వాటి తాత్పర్యముల రమించుచు దు:ఖ దీనత్వములు
లేశమైనను మిగలని శాంతానంద స్థితిని ప్రజ్ఞానమున
సదా అనుభవముగ నింపుము; నిలుపుము దు:ఖభాజనీ!
ననుగన్న తల్లీ! నారాయణీ! ఆనందరూపిణీ!
కాత్యాయనీ! దివ్య రమణీ! అమ్మా!
దయచూడుము మావుళ్ళమ్మ తల్లీ !
మాయావిలాసినీ! భీమవరపుర నివాసినీ!
12.
మార్జాల కిశోర న్యాయమున పాలించి, నను ఒడి చేర్చుకొని
సకల భాషా శాస్త్ర కళా వేదాంత క్షీరములను నీ దయా స్తన్యముల
గ్రోలించి తృప్తుడను చేసితివి; అసంతృప్తిని ఇక నా దరిదాపులకు
రానీకమ్మా నగరాజకుమారీ! నాట్య విశారదా! గజరాజ జననీ!
అమ్మా! పరమేశ్వరీ! మావుళ్ళమ్మ తల్లీ! కరుణా తరంగిణీ!
మాయా విలాసిని! మాతా! భీమవరపుర నివాసినీ! కామాక్షీ!
No comments:
Post a Comment