Wednesday, November 4, 2015

సాహితీ, కళా, శాస్త్ర, తత్త్వ సృష్టులు


 సాహితీ, కళా, శాస్త్ర, తత్త్వ సృష్టులు


గొప్పసాహిత్యం, మంచి సాహిత్యం, మరో రకం సాహిత్యం అంటూ ఉండవు. విమర్శకులు తమ దృష్టితో, బుద్ధితో సాహిత్యంలో తర తమ భేదాలు సృష్టిస్తారు. విమర్శకులకు నచ్చితే "మంచి" సాహిత్యం. దానికి ప్రాచుర్యం లభిస్తుంది. మిగతా సాహిత్యం అలా ఉంటుందంతే.

రసజ్ఞులైన పాఠకులు తమంత తామే మంచి సాహిత్యం ఎన్నుకొని చదువుకుంటారు. మిగతావారు విమర్శకుల మాటలని బట్టి తర తమ భేదములు "నిర్ణయిస్తారు". సాహితీలోకంలో పేరు ప్రఖ్యాతులు రావడం యాదృచ్ఛికము. అవి రచన శ్రేష్ఠతని, విలువని ప్రతిబింబించాలని లేదు. పేరు ప్రఖ్యాతులను సృష్టించుకోవచ్చు.

లక్ష్మీదేవి కరుణకు ఒక్కొక్కసారి అర్హతతో సంబంధం లేనట్టే సాహితీలోకంలోనూ పేరు ప్రఖ్యాతులు రావడానికి సాహితీకారుని అర్హతతో సంబంధము లేదు. అవార్డులు రావడం, పేరు ప్రఖ్యాతులు రావడం రచనలోని పస పైననే ఆధారపడి ఉండవు. మట్టిలో మాణిక్యములు ఎన్నో ఉంటాయి. కొన్ని సృష్టులు అడవిని కాచిన వెన్నెలవుతాయి. సమాజానికి ఉపయోగించే రచనల కన్న  సమాజాన్ని‌ ప్రతిబింబించే రచనలకే నేడు పెద్దపీట. ఇది ఒక వింత. కొందరు సాహితీకారులు, విమర్శకులు కలిసి సాహితీసృష్టులకు  కట్టిన గుదిబండ.

పంజరపు చిలకలకు స్వంత మాటలుండవు. సాహితీసృష్టి కవి, రచయిత ఇష్టం. ఇతరుల ఇష్టాయిష్టములు రచనలను శాసించలేవు. విమర్శకుల కొరకై సాహితీసృష్టి చేయబడదు. వసంతమున మురిసి కోయిల పాడినట్టే కవి కవితల సృష్టిస్తాడు. మేఘములు కురిసినట్టే రచయిత రచనల వర్షిస్తాడు. విన్నవాళ్ళు వింటారు. ఆనందించేవాళ్ళు ఆనందిస్తారు. హాయిలో తడిసేవాళ్ళు తడుస్తారు. 

కవయో నిరంకుశః. పేరు ప్రఖ్యాతుల కొరకై, పునస్కారముల కొరకై సాహితీ సృష్టి చేయబడదు. ఇతర కళాసృష్టులు, పలు రంగములలోని శోధనలు, పరిశోధనలు జరిగే విధము ఇదియే. కవి, సాహితీకారుడు, కళాకారుడు, వైజ్ఞానిక శాస్త్రవేత్త, సాంఘికశాస్త్రవేత్తలు, ఫిలాసఫర్లు, తత్త్వవేత్తలు సృష్టించే విధము, ధోరణి ఇదే. వారు నిమిత్తమాత్రంగా సృష్టిస్తారు. దానిపై అభినందనలు, అభిశంసనలు వారికి పట్టవు. వారి సృష్టులను ప్రభావితం చేయలేవు.

No comments:

Post a Comment