Friday, October 9, 2015

నిజమైన వారసులమౌదాం

నిజమైన వారసులమౌదాం

మా తాతలనాడు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండనక
చేతులు ముడుచుకు కూర్చోక ఆ గొప్పదనాలకు నిజమైన వారసులమౌదాం;

సంస్కృత భాష సంగణకయంత్ర భాషయని చంకలుగుద్దుకోక
సంస్కృతభాషను నేర్చి రామాయణ మహాభారతముల చదువుదాం

మా ఋషులు మహాతపస్సంపన్నులని పరిపరి విధముల పొగిడి అలిసి అంతతో
ఆగక మనమూ ఉపనిత్ ధ్యానపద్ధతుల నేర్చి బుద్ధిని సానపెట్టుకొని స్వస్థతనొందుదాం

చరక శుశ్రుతుల మహా భిషగ్ వర్యులని ఆకాశానికెత్తి విరమింపక మనమూ
వైద్యశిఖామణులం అవుదాం, వారిచ్చిన జ్ఞానాన్ని అవగతము చేసికొని ఉపయోగిద్దాం

వ్యాసవాల్మీకులంత స్రష్టలమై విశ్వశ్రేయఃకరమైన రసభరిత కావ్యముల వెలయించుదాం
శంకరరామానుజమధ్వాచార్యుల సరసన చేరుదాం బ్రహ్మజ్ఞానసంపన్నులమై బ్రహ్మములమై

ఆర్యభట్టు గణితగ్రంథములను వల్లెవేద్దాం
ఖగోళజ్ఞానమున నిష్ణాతులమౌదాం, సున్నను
మించిన ఉపయోగకర విషయాన్ని కనిబెడదాం
జ్యామితిని అవుపోసనపట్టి క్రొత్త సిద్దాంతులమౌదాం

మీమాంసకులమై సప్తమ, అష్టమ, నవమ, దశమ దర్శనముల సృష్టిద్దాం
ఉపనిషత్తుల మరల వ్యాఖ్యానిద్దాం; బౌద్ధజైనతత్త్వముల తిరిగి పరిశీలిద్దాం

"వసుధైక కుటుంబకమ్" అన్న నానుడిని నిజం చేద్దాం
"ఆనో భద్రాః క్రతవోయంతు విశ్వతః" అని ప్రార్ధిద్దాం

మా తాతలనాడు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండనక
చేతులు ముడుచుకు కూర్చోక ఆ గొప్పదనాలకు నిజమైన వారసులమౌదాం

No comments:

Post a Comment