Friday, October 16, 2015

పరమ సుఖము; సకల జ్ఞాన కళా మూర్తి; సంస్కారహీనుల నమ్మకాలు

పరమ సుఖము

ప్రసంగము సుఖము కొందరికి మౌనముగ ఉండుట సుఖము ఇంకొందరికి
సత్సంగము సుఖము కొందరికి తరుణ రమణీ సంగము సుఖము కొందరికి

మనసును మాధవునిలో లీనము చేయుట సుఖము భక్తులకు
సరసపద విన్యాసముతో కవితలల్లుట సుఖము కవివరేణ్యులకు

గంధర్వగానమున గంగాధరునికి గళార్చన చేయుట సుఖము గాయకులకు
ఇంద్రభవనముల జీవించుచు మద్యమాంసమానినీ సాంగత్యము సుఖము,
సంపన్నులకు, పన్నులెగవేయువారికి, వారిని కాచు నాయకులకు, అధికారులకు;
భారత దేశపు పురాతనత్వమును ఆ ఉన్నతిని నాగరికతను సంస్కారహీనముగ
గేలిచేయుట సుఖము కొందరు "మేధావులకు", హేతువాదులకు, నాస్తికులకు;
సుఖము వేరు వేరు మనిషి మనిషికి; అతనికి ఆమెకు; ఒక్కటి కాదు సుఖ నిర్వచనము

మనుషులెందరో అభిరుచులెన్నియో సుఖములన్ని;
పరమపురుషుని నిరంతర ధ్యానము పరమ సుఖము


సకల జ్ఞాన కళా మూర్తి

మనిషి ఊహలో అందముంది మనిషి చూపులో అందముంది
మనిషి గమనికలో అందముంది మనిషి మనసులో అందముంది

నీరు సమతలంలో ప్రవహిస్తూంటే నదియని
కొండల గుట్టల పరుగెడుతుంటే సెలయేరని
ఎత్తులనుంచి చెంగున దూకుతుంటే జలపాతమని
మురిసి తన్మయత్వం చెందుతాడు; ఆ కదలికలలో
సంగీతం వింటాడు హోరులలో శ్రావ్యత "కంటాడు"
వట్టి నీటి కదలికలకే ఇన్ని పేర్లు పెడతాడు ఆనందిస్తాడు

చప్పని పెదవుల కలయికని అధరసుధారసమంటాడు
వయసొచ్చిన కన్నియని విరబూసిన గున్నమావియంటాడు
ఎదకొచ్చిన చిన్నిగోవు అంటాడు; రమణీ సాంగత్యమున
ఏవేవో మధురిమలు స్వర్గములంటాడు; గొప్ప భావుకుడు

తనలోనే పరమాత్మని కంటాడు తనే పరమపురుషుడనంటాడు
జ్ఞానమున ఇంగితమున పరమేశ్వరునికి సరిజోదు అనిపిస్తాడు

జ్ఞానముల సాంకేతిక జ్ఞానముల లలితకళల నేర్పరితనముల
సృష్టించి పెంచి రమిస్తాడు; రాగముల విరాగముల సమముగ
వర్ధిల్లుతాడు; రక్తి విరక్తులకు లోనై కూడా శాంతస్వరూపునిగ
వెలుగొందగలడు; కారుణ్యమున భగవంతుడే అతడు, ఆమె తోడు

దేముళ్ళ దేవతల గుళ్ళలో నిలబెట్టగలడు మనసులో నింపుకొనగలడు మనిషి
అతడు మనీషి అపర బ్రహ్మ లయకారకుడు సమస్తము నింపుకున్న నిండిన విష్ణువు
తత్త్వవేత్త, విజ్ఞానఖని, ధన్వంతరి, విశ్వకర్మ, ఐంద్రజాలికుడు, ఆటగాడు, పాటగాడు
మనిషి సృష్టిలో ఆణిముత్యము ప్రకృతిలో విశేష ప్రతిభావంతుడు త్యాగశీలి సుగుణాలరాసి



సంస్కారహీనుల నమ్మకాలు

గుడిలో భగవంతుని రాయి మాత్రమే కదా అన్న మేధావి హేతువాది
నాస్తికుడు నాలుగు రోడ్ల కూడలిలో సిద్దాంత కర్త శిల్పానికి ప్రణమిల్లుతాడు

దేవుడిని మనిషే సృష్టించాడని మతాన్ని తీసిపారేసే‌ నాస్తికుడు
మనిషే సృష్టించిన సిద్దాంతానికి ఊడిగం చేస్తాడు బానిసవుతాడు

భగవంతునికి‌ పూజల పునస్కారముల వల్ల ఏమీ ఒరగదనే మేధావి
ప్రతి ఏటా తమ హేతువాద నాయకునికి జయంతోత్సవం చేస్తాడు

భగవంతుడు ఉన్నాడనడం లేడనడం రెండూ నమ్మకానికి
సంబంధించినవే అని ఎప్పటికీ నాస్తికుడు గ్రహించలేడు,
దెబ్బలాడగలడు అంతే; తోటి వారి హృదయముల గాయము చేయు
దుర్భాషలు మాత్రము ఆడగలడు; సంస్కారహీనులకు బుద్ధి బుర్ర ఉండవు

No comments:

Post a Comment