Wednesday, April 19, 2017

రిజర్వేషన్ల భారతం; మన పోస్ట్లు - మన వికాసము

రిజర్వేషన్ల భారతం

భారత దేశంలో రెండు రకాల పౌరులుంటారు. రిజర్వేషన్లు ఉన్నవారు, రిజర్వేషన్లు లేని వారు. రిజర్వేషన్లు ఉన్న వర్గాల శాతం 50 కి మించకూడదని‌ సుప్రీంకోర్టు తీర్పు. అయినా దీనిని ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ శాతం ఎనభైకి చేరింది. ఇంకా పెరగవచ్చు.

ఇలా కుల రిజర్వేషన్లు కల వర్గాల శాతం ఏదో ఒక రోజున 98 కి చేరవచ్చు. అలా ఒక 2 శాతం మాత్రమే రిజర్వేషన్లు లేని వర్గాలు ఉంటాయి. ఈ రెండు శాతాన్ని మైనారిటీ (తక్కువ సంఖ్య) అనరు. మైనారిటీ పదం మత ప్రాతిపదికన ఉపయోగిస్తున్నారు. ముస్లిములు, క్రైస్తవులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు కూడా ఈ ప్రాతిపదికన మైనారిటీ ముద్ర వేయబడిన వారు.

భారత దేశం మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం కాదు. రాజ్యాంగం ఏ మతాన్ని అనుసరించి కూర్చబడినది కాదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మతాన్ని, ఆ మాటకొస్తే కులాన్ని, ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడకూడదు. కాని దేశ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కుల, మత, ప్రాంత ప్రాతిపదికన కొన్ని వర్గాల పౌరులను ప్రత్యేకంగా చూస్తూ గారాబం చేసే దౌర్భాగ్యపు సంస్కృతిని రాజకీయ నాయకులు ఏర్పరచారు.

ఇలా కుల, మత, ప్రాంత ప్రాతిపదికన​ కొన్ని వర్గాల పౌరులను ప్రత్యేకంగా చూస్తూ గారాబం చేయడం రాజకీయ పార్టీల, నాయకుల, రాజ్యాంగంలో లేని, (రాజ్యాంగ విరుద్ధమైనమైన) హక్కుగా పరిణమించింది.

రాజకీయ నాయకులు పూనకం వచ్చినట్టు ప్రవర్తిస్తూ రిజర్వేషన్లని మరింతగా పెంచుతున్నారు. వీరికి, వీటికి అడ్డూ, అదుపూ లేవు. రిజర్వేషన్లు అనుభవించిన వారే తరతరాలుగా రిజర్వేషన్లు అనుభవిస్తూ అడుగున ఉన్న తమ వర్గీయులకు అందకుండా చేస్తున్నా మాట్లాడే ధైర్యం, న్యాయదృష్టి ఉన్న రాజకీయ నాయకులు, పార్టీలు లేవు.
ఎంతసేపూ భేదాలను వాడుకుంటూ, కుల, మత, ప్రాంత ఇత్యాది ప్రాతిపదికన పౌరులను విడదీసి ఓట్లు, పదవులు పట్టేస్తున్న రాజకీయ కునాయకులు దేశానికి, పౌరులకు ఎంతో ద్రోహం చేస్తున్నారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట, అంతూ లేవు. వీరు, రిజర్వేషన్లు కావాలనే వర్గాల వారు, రిజర్వేషన్లు అనుభవిస్తున్న వర్గాల వారు దేశప్రతిష్ట, అభివృద్ధి, హుందాతనం తోటి పౌరుల జీవితాలతోటి ఆడుకుంటున్నారు.

రిజర్వేషన్లు లేక మిగిలిన రెండు శాతం వర్గాల పౌరులను ఈ దుష్ట నాయకులు పట్టించుకోరు. ఈ పౌరుల జీవితాలు ఎంతో దుర్భరంగా గడుస్తున్నా ఈ దుర్మార్గపు నాయకులకి, పార్టీలకి పట్టదు.

రిజర్వేషన్లు ఉన్న వర్గాలు, లేని వర్గాలు కూడా జీవితాలను ఎంతో కష్టపడి ఈడ్చుకొస్తున్నారు. అర్హత లేని వారిని అందలాలెక్కిస్తామని ఆశ పెట్టి, భ్రమ పెట్టి, వెఱ్ఱి వెధవలను చేసి ఎవరికీ, ఏ వర్గానికి, మతానికి ఏమీ అందించక, ఏ సహాయమూ చేయక, చేయలేక, చేసే ఉద్దేశం ఎంత మాత్రమూ లేక కేవలం తీయని మాటలతో, మోసపు వాగ్దానాలతో అందరినీ, అన్ని వర్గాల పౌరులను భ్రమ భ్రాంతులకు లోను చేసి, తాము, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అయిన వాళ్ళు, అనుయాయులు కుమ్మక్కై దేశాన్ని, పౌరుల జీవితాలను భ్రష్టు పట్టిస్తున్నారు.
రిజర్వేషన్ల వల్ల ఎవరికి ఏమీ ఒరగటం లేదని, ఏ లాభం కలగటం లేదని, రాజకీయ నాయకుల ఎత్తులకు మనమంతా, వర్గ, కుల, మత, ప్రాంత భేదం లేకుండా ఇడుముల పాలవుతున్నామని గ్రహించిన మరుక్షణం ఈ భేదనీతి నశించి మనం, దేశం అభివృద్ధి పథంలో ఉత్సాహంగా అడుగులు వేస్తాము.

అది లేనంత వరకు ఇలాంటి రిజర్వేషన్లను 150 లేదా 200 శాతానికి పెంచి రాజకీయ నాయకులు, తమ వంశ పారంపర్యంగా మనలను ఇలా "పాలిస్తూనే" ఉంటారు. తమ పబ్బం, తమ కుటుంబ సభ్యుల పబ్బం; ధనం, ఆస్తులు, అధికారం సంపాదించుకుంటూ; గడుపుకుంటూనే ఉంటారు. కల కాలం "ఐశ్వర్యం" తో తులతూగుతూ, తూలుతూనే, అధికార మద్యం తాగుతూ, చిత్తం వచ్చినట్లు ఏలుతూ ఎదుగుతూ ఉంటారు. మనం ఇలాగే ఒదుగుతూ, దారిద్య్రంలో బతుకులను ఈడుద్దాం.

**********

మన పోస్ట్లు - మన వికాసము

రామాయణ,, మహాభారతాల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు, గజిబిజి రాతలు, ఇతరులకు సలహాలివ్వడం, ఇవన్నీ మనం రామాయణ మహాభారతాలు సూచించినట్లు జీవించకపోతే; ఈ పనులన్నీ చేతలుగా మార్చుకోలేకపోతే కంఠశోష, వృథా ప్రయాస. ఇవన్నీ ప్రహసనాలై నిరుపయోగం అవుతాయి.
జనాలని ఇబ్బంది పెడతాయి. పిలవని పేరంటంలా తయారై చిరాకు కలిగిస్తాయి.

ఇతిహాసాలు, ఉపనిషత్తులు, సూత్రసాహిత్యము ఇతరులకు సలహాలివ్వడానికి కూర్చబడలేదు. మనం ఆచరించడానికి ఉద్దేశింపబడ్డాయి. అవి ఆచరించేవారికే ప్రవచనాధికారం ఉంటుంది. అవి కేవలం చదువుకొని, వాగాడంబరంతో ఉపన్యాసాలిచ్చేవారికి, వ్యాసాలు రాసేవారికి, పోస్టింగులు పట్టేవారికి ఉద్దేశించబడలేదు.
మనం ఆచరిస్తే మన మాటలకు విలువ ఉంటుంది.

లేకపోతే తనకు మాలిన ధర్మంలా నిరుపయోగంగా పడి ఉంటాయి. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చే వారు మాతృ, పితృ భక్తుల గురించి మాట్లాడటం, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కోపం తెప్పించిందూ?! ఇతరులను బాగు చేయాలనే తపనలో సహస్రాంశం మనని మనం సరిదిద్దు కోవడంలో ఉంటే ఈ మాటల, రాతల, ఉపన్యాసాల, పోస్ట్ల బెడద నుంచి ఇతరులను రక్షించినవారవుతారు కదా!

సత్యం చెప్పక, అన్నమాటకు నిలబడకుండా, సత్య హరిశ్చంద్రుని గురించి చెప్పరాదు. తనపై తనకు నమ్మకం లేక, జ్ఞానము, ధర్మ, బుద్ధి సూక్ష్మతలు తెలియక కృష్ణ పరమాత్మ విషయం పలుక రాదు. భీష్ముని లా తండ్రి కోసం త్యాగం చేయలేకపోతే ఎందుకు ఆయన్ని ఆదర్శంగా తీసుకోమని ఇతరులను సతాయిచడం!? అలాగే రామాయణ మహాభారతాలలో కల మంచి, వీరోచిత పాత్రల నైజాలను, ఇతర పాత్రల గురించి వ్యాస, వాల్మీకుల సృష్టి, దృష్టి లను మించి వాచాలతతో మాట్లాడరాదు.

ఇతరులను బాగుచేసెయ్యాలనే యావ మన ఎదుగుదలకు ఉపయోగించదు. అన్ని గ్రంథములను, వాటి పఠనమును మన మానసిక, బుద్ధి వికాసములకై, సద్వర్తనమునకై వినియోగించు కోవాలి. ఇతరులను ఉద్ధరించడానికి మాత్రం కాదు.

No comments:

Post a Comment