Tuesday, August 29, 2017

మా ఖాట్మండూ యాత్ర 3



మా ఖాట్మండూ యాత్ర 3

15-8-2017

కలకత్తా కాళికా మాత దర్శనం

కలకత్తా కాళిక మనందరికీ ఇష్టమైన దేవత. కలకత్తాలో ఆగే సావకాశం లభించింది కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మెయిల్ లో 15 తారీఖు తెల్లవారుజామున 4-10 నిమిషాలకు చేరాము. వెయిటింగ్ హాల్ ఎక్కడుందో కనుక్కొని అక్కడకు చేరాము. అది ఏసి వెయిటింగ్ హాల్. మాకు రాక్సల్ కి ఏసి 2 టైర్ రిజర్వేషన్ ఉంది కాబట్టి అందులో ప్రవేశం లభించింది.
 
అక్కడ రిఫ్రెష్ అయి సేదదీరాము. ఏడు గంటల ప్రాంతంలో బయలుదేరి లగేజి క్లోక్ రూమ్లో పెట్టి హౌరా స్టేషన్ బయటికి వచ్చాము. హౌరా స్టేషన్ హుగ్లీనది ఇవతల ఒడ్డున ఉంటుంది. అవతలి ఒడ్డున కలకత్తా. హుగ్లీ నదిపై హౌరా బ్రిడ్జి రెండింటినీ కలుపుతుంది.

హుగ్లీనదిని గంగానది పాయ అంటారు.

నేను ఇదివరకు వచ్చాను కనుక హౌరా స్టేషన్ దగ్గరలో ఒక మెట్రో స్టేషన్ ఉన్నట్లు జ్ఞాపకం. హౌరా బ్రిడ్జి పై నడుస్తూ ఫొటోలు తీసుకుంటూ కలకత్తాలో ప్రవేశించాము. అక్కడ కనుక్కొని సిటీ బస్ లో ఆ స్టేషన్ చేరాము. అది మహాత్మా గాంధీ రోడ్ స్టేషన్. అక్కడ నుంచి కాళికాదేవి ఆలయం పక్కనే ఉన్న కాళీఘాట్ మెట్రో స్టేషన్ దాకా మెట్రోలో వెళ్ళాము.
 
నేను మొదటి సారి కలకత్తా వచ్చినప్పుడు (1995) పార్క్ స్ట్రీట్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్న మా మామగారి ఆఫీస్ గెస్ట్ హౌస్ లో ఉన్నాను. అది కలకత్తా కి మంచి సెంటర్. ఆ గెస్ట్ హౌస్ దగ్గరలో ఒక ఆంధ్రా హోటల్ కూడా ఉంది. అందులో మన భోజనం బాగానే ఉంది. అప్పుడు నేను మెట్రో, ట్రామ్ కార్లలో కొంత కలకత్తా ప్రాంతాన్ని చూశాను. అప్పుడు కలకత్తా కాళిని, హుగ్లీ నది ఒడ్డున కల రామకృష్ణ పరమహంస పూజారిగా పనిచేసిన రాణీ రాస్మణీ దేవి నిర్మించిన కాళికాదేవి ఆలయ సముదాయాన్ని చూచాను. ఈ సముదాయం ఎదురుగా హుగ్లీ నది అవతల ఒడ్డున బేలూరు మఠం ఉంటుంది.

మేము చూడడానికి వెళ్లిన కాళికాదేవి ఆలయం ఇది కాదు. కలకత్తా ఊరి మధ్యలో ఉన్న కాళికాలయం. కాళిఘాట్ మెట్రో స్టేషన్ నుంచి ఒక కిలోమీటరు లోపల ఉంటుంది. నడిచి వెళ్ళవచ్చు. మాకు మెట్రో టికెట్ పది రూపాయలు.
మేము ఆలయం దగ్గరకు వెళ్ళేసరికి పాదరక్షలు తమ షాపులో ఉచితంగా పెట్టుకోవచ్చంటూ ఒక షాపతను ఆఫర్ చేశాడు. కాదు, కాదు అనుకొని అతని దగ్గరే పెట్టి పూజాద్రవ్యాలు అతని దగ్గర 100 రూపాయలవి కొన్నాము. నాకు పుణ్యక్షేత్రాలకి, పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయించడం మీద ఆసక్తి లేదు. మనసంతా భగవంతునిపై ఉంచి నామం స్మరణం చేసికుంటూ దర్శనం పూర్తి చేయాలని నా ఉద్దేశం. కోరిక. కాని కామేశ్వరికి ఆసక్తి. నా కోసం ఎన్నో చోట్ల ఊరుకున్న

కామేశ్వరి ఇక్కడ అర్చన చేయిద్దాం అంది. బుద్ధి మంతుడైన మగనిలా ఒప్పుకున్నాను.
ఆ షాపతను మిమ్మల్ని ఒకతనికి అప్పగించాడు దర్శనం చేయించి రమ్మని. లోపలికి వెళ్ళాక చాలా పెద్ద పెద్ద క్యూలు చూపించి ఈ వరుసలో వెళ్ళాలంటే 5 గంటలు పడుతుంది అని మనిషికి 250 ఇస్తే డైరెక్ట్ గా గర్భగుడి లోకి వెళ్ళచ్చని చెప్పాడు. అతనిని నమ్మక క్యూలో వాళ్ళని కనుక్కుంటే వారు విసుక్కుంటూ అమ్మదర్శనానికి ఎంత టైమ్ పడుతుంది అని అడగడం ఏమిటి? ఎంతసేపైతే అంతసేపూ వరుసలో నుంచుని కాళీ మాత దర్శనం చేసుకోవాలిగాని అన్నారు.
 
నేను అంటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఒకతను చూసి మనిషికి 50 ఇస్తే దర్శనం చేయిస్తానని ఒక పండాని తగిలించి అతను పూజకూడా చేయిస్తాడని చెప్పి పంపించాడు. డబ్బులు ముందే తీసేసుకున్నాడు. తీరా మమ్మల్ని పంపించింది ఎక్కడకంటే ఓ దొమ్మీలోకి తోసి వదిలేశాడు. కొట్టుకొని, కొట్టుకొని ముందుకు వెళితే అది అమ్మవారి ఆలయ ద్వారానికి ముందున్న ఒక మండపం లాంటి చోటు. దాని ఎదురుగా పూజారులు, భక్తులు అడ్డుగా ఉంటూనే ఉన్నారు. అమ్మవారి దర్శనం కాలేదు. నాకు సకృత్తుగా అయింది. కామేశ్వరికి దర్శనం అస్సలు కాలేదు.
 
ఆ పండా మమ్మల్ని బయటకు లాగి "పూజ" చేయించాడు. చేశాడు. అతని దక్షిణ ఇచ్చేశాను. అసంతృప్తి మా మనసుల నిండా నిండింది. నేను ఇదివరకు వరకు వచ్చినపుడు తిన్నగా వెళ్లి అమ్మవారిని పలుమార్లు అప్పుడే గర్భగుడిలో దర్శించుకున్నాను.

ఆ అనుభవం మనసులో ఉండి ఈ జన సమ్మర్దాన్ని, మాకు ఇప్పుడు జరిగిన దర్శనానుభవాన్ని సంయమనంతో తీసికోలేకపోయాము. గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారిని దర్శింకోవాలని నిశ్చయించుకున్నాం.

మళ్ళీ ఇదివరకు వెళ్ళిన షాపతని దగ్గరకు వెళ్ళాం. అతను వ్యంగ్యంగా నవ్వి ఇదివరకటి మనిషినిచ్చి పంపించాడు. వెళుతున్న దారిలో బలి ఇవ్వబోతున్న మేకపోతులను చూసి మనసు ద్రవించింది.
20 నిమిషాలలో అమ్మవారి గర్భగుడిలో ఉన్నాము. తల్లిని తనివితీరా దర్శించుకున్నాము. లోపల తూతూ మంత్రం పూజ చేశాడు లోపలి పూజారి. అమ్మవారి దగ్గర పూజారి అడిగిన డబ్బులను హుండీలో వేశాము. మనసులు ఆహ్లాదంతో నిండాయి.
 
తరువాత మమ్మల్ని ఒక పండా దగ్గరికి తీసికెళ్ళాడు మా గైడ్ లాంటి పండా. 51 రూపాయలివ్వండి అమ్మవారి ప్రసాదం ఇస్తాడు అన్నాడు. అతను నాకు తెలిసిన రెండుమూడు శ్లోకాలు చదివి ఒక అమ్మవారి రూపు లాంటిది తీసి మాకు ఇచ్చాడు. 1100 రూపాయలు ఇమ్మన్నాడు. నాకు ఎంతో కోపం వచ్చింది. ఈ వ్యవహారం ఏమీ నచ్చలేదు. ప్రసాదం అవసరం లేదని రూపు అతనికి ఇచ్చేసి మాతో ఉన్నతని మీద కోప్పడి, అతనికి ఇవ్వవలసినది ఇచ్చేసి నెమ్మదిగా ఆలయం బయటకు వచ్చాము.
 
ఈ అనుభవానికి మనసు ఎంతో కలత చెందింది. మన సెంటిమెంట్ లతో ఇతరులు ఆడుకునే అవకాశం మనం ఇవ్వకుండా జాగ్రత్తపడడం చాలా అవసరం అనిపించింది. ఇటువంటి స్థితిలో మనసు ఎంతో దృఢంగా ఉండి తీరాలి. కలత కాసేపు బాధించింది. అలా చాలాసేపు మనసు చిన్నబోయింది. నా విచక్షణ నాకు ఎంతో దృఢత్వాన్ని అందించింది.
 
ఇటువంటివి చాలా సున్నితమైన విషయాలు. భగవంతుడు, దేవతలు, దైవములు మనమీద ఎప్పుడూ కోపగించరు. ఇది జరిగిందా, అది జరిగిందా అని వారు అస్సలు చూడరు. మన నుంచి ఈ పూజ, అర్చన వారు ఆశించరు. ఇది మనం తప్పక గుర్తించు కోవలసిన విషయం.
 
వారు కరుణాంతరంగులు. మన్ని సంతానంలా సాకుతారు. మన మానసిక నైర్మల్యాన్ని మాత్రమే వారు చూస్తారు. మళ్ళీ మెట్రో, బస్సుల్లో వచ్చినదారినే వెనక్కి వచ్చి హౌరా స్టేషన్ చేరాము.

నేను ఇంతగా ఈ సంఘటన గురించి తర్కిస్తున్నానో విజ్ఞత కలవారు గ్రహిస్తారు. నేను ఇలా నా అనుభవాలను, కష్టసుఖాలను ఈ వ్యాస పరంపర ద్వారా పంచుకోపడంలోని ముఖ్యోద్దేశం వాస్తవాలను నా దృష్టితో, జ్ఞానము, విజ్ఞానము, జ్ఞాన అనుభవముల పునాది తో చర్చించడం మాత్రమే. వివిధరకాల, వివిధములైన సంఘటనలను, ఘటనలను నాదైన ముద్రతో చెప్పడం మాత్రమే.

No comments:

Post a Comment