Monday, August 15, 2016

చదువులబ్బని కొలువురాని విద్యాభ్యాసము; చెడ్డ అలంకారాలు; భగవంతుని చేతిలో కలము; అగమ్యగోచరములు



భగవంతుడంటే నమ్మకం. . నమ్మకమే భగవంతుడు
 *********
చదువులబ్బని  కొలువురాని విద్యాభ్యాసము

చదువుకొనుటకు చేరినను చదువులబ్బని విద్యాభ్యాసము
కొలువెక్కుటకు "చదివినను" నిరుద్యోగము ఆభరణము
చదువన్న అవగాహన లేని చదువు కొనుటలు డబ్బు
వృథా చేసికొనుటలు; ఎప్పటికి మనకు బుద్ధి కుదురును?

శ్రుతి స్మృతి శాస్త్ర పురాణావగాహన, తత్త్వ గ్రహణలు లేని
"
విద్యలు" వికసింపచేయలేవు మనసుని; గణితమున,
భౌతిక రసాయన జీవ శాస్త్రముల పరిజ్ఞానము లేక
చదువుకున్నవాడు కాదు; సాంకేతిక శాస్త్రముల వంట

పట్టించుకోక ఉత్తి డిగ్రీ కాగితములు సంపాదించినను
అవి ఉద్యోగాలు తేలేని చిత్తుకాగితములు; ఆంగ్ల భాషా
ప్రావీణ్యత లేక రావు ఉద్యోగములు; ఏ భాష నేర్వక ఏ
నేర్పరితనము లేక ఉద్యోగములెటుల వచ్చును?
********

చెడ్డ అలంకారాలు

రాచరికమైనా‌, ప్రజాస్వామ్యమైనా, నియంతృత్వమైనా పదవిలో ఉన్నవారి మనస్తత్త్వాలు, ప్రవర్తన ఒకటే. అధికారము కలిగి ఉండడం మధుపానం వంటిది. అది ఇచ్చే నిషాలో పాలకులు సర్వమూ మర్చిపోయి నిప్పు తొక్కిన కోతిలా గంతులేస్తారు. రాచరికం, నియంతృత్వా లలో వారు అధికారం క్రూరంగా, విధమైన ముసుగు లేకుండా చలాయిస్తారు. ప్రజాస్వామ్యంలోనే రెండు నాల్కల ధోరణి.
 
ప్రజా ప్రతినిధులుగా వినయం చూపించాలి అని ఒక శంక, "జంకు" వహించాలి, నటించాలి. తమ అధికార మదంతో అన్నీ, అంతా, అంతటా తానే ఉండాలి. తన మాటే చెల్లాలి. అన్నీ తనకు కలిసి వచ్చేలా జరగాలి. ఈ ముసుగు మనుషులు రాజులు కన్నా, నియంతల కన్నా ఎక్కువ ప్రమాదకారులు. గోముఖ వ్యాఘ్రములు. తేనె పూసిన కత్తులు. ప్రజాస్వామ్యం పేరుతో రాచరికము, నియంతృత్వం ఆచరించే మోసగాళ్ళు. ప్రజలను అన్ని రకాల పాలకులు పురుగుల్లా చూస్తారు.
 
ప్రజలను మన్నించడం, గౌరవంగా చూడడం ప్రజాస్వామ్యమైనా, రాచరికమైనా‌, నియంతృత్వమైనా జరగని పనులు. తమ తమ స్వార్ధాలు, అహం భావాలు, అక్రమ, క్రూర, చేష్టలు పాలకులకు చెడ్డ అలంకారాలు.
రెండు నాల్కల ధోరణి ప్రజాస్వామ్యంలో అదనం.

*********

భగవంతుని చేతిలో కలము

భగవంతుని చేతిలో కలమును నేను
పరమాత్మ పలుకు పదమును నేను

పరిపూర్ణతనుంచి వెలువడిన అసంపూర్ణుడను
అపరిమితుడనుంచి కలిగిన పరిమితుడను

నా జన్మ స్థితి లయము దేవుని ఆధీనము
నా సుఖదు:ఖములు దివ్యాత్ముని సంకల్పము

పనిముట్టునై చేసెద భగవత్కార్యము
పని ముగియగనే కలిసేద పరంధాముని

జగత్ కళ్యాణ కారకుని లీలను నేను
సకల విశ్వంభరుని ప్రజను నేను

అప్రమేయయుని ప్రమేయమును నేను
నిర్గుణ గుణ రూపమును నేను

పరమానందుని రమణీయమును నేను
పరమాత్ముని విభవ శ్రీ ని నేను

భగవంతుని చేతిలో కాలమును నేను
పరమ పురుషుడు నియమించు సమయమును నేను

భగవంతుని చేతిలో హలమును నేను
తండ్రికై దున్నుచు పంటలు పండింతు నేను

భగవంతుని చేతిలో కలమును నేను
పరమాత్మ పలుకు పదమును నేను
***********
అగమ్యగోచరములు

తమ పిల్లల్ని ముద్దాడే వయసులో కుక్క పిల్లల్ని
ముద్దాడుతూ గడిపే యవ్వనవతులు; తమ అమ్మల
ప్రేమాభిమానములను ఆకాశానికి ఎత్తుతూ
అంతర్జాలమును అదరకొట్టేసే అమ్మాయిలు, తాము

మాత్రము వివాహానికి, పిల్లల కని వారికి తమ తల్లిలా.
ప్రేమాభిమానములను పంచ ఉత్సుకత లేనివారు;
ఆధునిక ఉద్యోగినీ సముచ్చయములు తమ తమ
ఉద్యోగములు చేయుటకు తప్ప మరి దేనికీ తీరిక,

సమయము లేనివారు; మమతల పంచి పెంచు
ప్రకృతి గల ప్రకృతీ స్వరూపములు వనితలు, నేడు
ఉద్యోగము నకు తప్ప మరి దేనిపై ఆసక్తి సమయము లేనివారు;
నేటి జీవన శైలీ ప్రభావమున; వృత్తులు, ప్రవృత్తులు ఉల్టా‌పల్టా

అయిన ఈ నాగరికతలో తమ మనుషుల పై తక్కువ,
ఆధునిక ఉపకరణము లపై ఎక్కువ మమతలు కల
యువతులు, యువకులు వసించు నేడు, యాంత్రికత ఎక్కువ,
ఒకరికొకరగుట అరుదు; మనసున మనసైన
తోడొకరు లేని జీవితముల చివరకు శూన్యములు మిగిలి
మానసిక అనారోగ్యములకు ప్రేమానురాగముల కొరతకు
దారితీయు వ్యవస్థలో ఎంత డబ్బు సంపాదించిననేమి
ఎంత ఎత్తునకు ఎదిగిననేమి; స్త్రీ పురుషులు ఒకరికొకరు
ఏమి కాక ఒకరినొకరు అలరించుకొనక, ప్రేమాభిమాన
శూన్యులై అలమటించు నాగరికత, సంస్కృతి, మానవ
జాతికి మంచి చేయదు; ఏది ఏమైన కాలము మారును
ధోరణులు మారును; పరిస్థితులు అగమ్యగోచరములు

********

భగవంతుడంటే నమ్మకం. నమ్మకమే భగవంతుడు.

No comments:

Post a Comment