Wednesday, February 11, 2015

కులం - వ్యాకులం

 


కులం - వ్యాకులం

కులం దృష్టి లోకి రాగానే ఎన్నో భావాలు
కులంతో ఎందరికో బంధాలు
మరెందరికో అవసరాలు, లాభాలు,
ప్రయోజనాలు, స్వార్థ పూరిత
అనర్హ ప్రాప్తాలు
* * *
'మెడలో వేసుకొని తిరిగే వాళ్ళ గురించి
రాయరా! ఎండ గట్టరా వాళ్ళని
వాళ్ళ సృష్టిని, సంస్కృతిని'
అంటూ నిప్పులు  గ్రక్కుతూ
ఒకడు 
* * *

'వియ్యానికైనా, కయ్యానికైనా
సమ ఉజ్జీ కావాలని'
వదిరి, కులాంతర వివాహాలని
అడ్డే అమ్మా నాన్నలని
తిట్టిపొయ్యరా!
అని మరొకడు
* * *
కులం పేరు చెప్పుకుని
విద్యాసంస్థలలో సీట్లు
ఉద్యోగాలు, పదవీ ఉన్నతులు, పదవులు,
స్వంత జాగీర్దారు లాగా భావిస్తూ
నిర్లజ్జగా పట్టేసే
ప్రభుత్వపు అల్లుళ్ళని
కులనాయకులను
ఉతికి ఆరయ్యరా!
అని ఇంకొకడు
* * *
కులగజ్జి అంటని రాజకీయ
నాయకుడు లేడు; రాజకీయ పార్టీ లేదు;
కులగజ్జి మంచి చర్మ వ్యాధి అని
ఎలుగెత్తి చాటరా!
అని ఒక పౌరుడు
* * *
కులం పేరుతో పౌరుల
హృదయాల పై
గునపపు పోట్లు పొడవని
వారి గుండెలు చీల్చని
నాయకులే లేరని;
ఈ భేద నీతితో అమాత్య పదవులు
అన్ని లాభాలు ఉపయోగాలు
దండుకునే పార్టీలే అన్నీ అని
ఈసడించరా  అని
మరొకడు
* * *
మనం మనం కోడిపుంజుల్లా
గొర్రె పొట్టేళ్ళలా  కులాల గురించి
పోట్లాడుకుంటూంటే;
ఇదే సందని అన్ని కులాల నాయకులు
అందరు అమాత్యులు అందినకాడికి
గబ గబా బొక్కేసే, మెక్కేసే
దుష్ట  వినాయకులు
వాళ్ళ దున్నపోతుతనాలు
వివరంగా రాయమని
ఇంకొకడు
* * *
'ప్రపంచ కార్మికులారా ఏకం కండి"
అంటూ నినదిస్తూ
ట్రేడ్ యూనియన్లనే క్రొత్త కులాలని
ఏర్పాటు చేసిన;
కులాన్ని తిడుతూ
ఈ క్రొత్త కులాలని
మనపై రుద్దిన
పుర్రచేతి భావాలవాళ్ళ
ప్రజ్ఞాపాటవాల గురించి
మరి మరి రాయరా
అని మరొకడు
* * *
కులం పేరుతో
అర్హత లేకున్నా
అందలాలు ఎక్కే
బహు జనుల గురించి
రాయరా అని
వేరొకడు
* * *
నన్ను వేధిస్తోంటే
కులం గురించి నేనేమి రాయను?

నేను ఇలా రాస్తాను.
* * *
కులం లేని సమాజము లేదు
వృత్తియే  కులం
వృత్తిని బట్టి కులం
ఇప్పుడు వృత్తిని బట్టి ట్రేడ్ యూనియన్ ఎలానో
అప్పుడు వృత్తిని బట్టి కులం;

కులం లేని సమాజము తేవడం అంటే
వృత్తులని సమూలంగా పెకలించి వేయాలి

ట్రేడ్ యూనియన్ కావాలి
కులం వద్దు! భేష్!

ఇలా కులం గురించి
ఆలోచిస్తోంటే
వ్యాకులం నాకు

వందిమాగధులు
పదవీ వ్యామోహాలు
కుల మత భేదాలు
అవినీతి బంధుప్రీతి
చీకటి డబ్బు
రైతుల మరణాలు
ఉగ్రవాదుల దారుణాలు
 లేని దేశం
మనదైతే
మనందరికీ
ఆనందమే కదా!

కులం మతం ఉంటేనేమి?
అధిగమించలేమా ?
వృత్తుల రూపంలో కులాలు
వృత్తులు లేక సమాజపు మనుగడ లేదు;
ఇష్టాల రూపంలో మతాలూ, సిద్ధాంతాలు
వాటి రాద్ధాంతాలు ఎక్కడకీ పోవు

ఈ అవగాహనా లేమి
భావ దారిద్ర్యము
దూషణ తిరస్కార
భరిత నాగరికతను
ఈ అధునాతన సంస్కృతిని
ఉపేక్షించలేమా?

కులం వ్యాకులం
మతం మారణ హోమం

ఇంతేనా మన బ్రతుకులు?
తండ్రులు, తాతలు, ముత్తాతల
వృత్తుల ఆధారముగా
క్రొత్త వృత్తులలో అనర్హం గా చేరుదామా?

కులాన్ని తిడుతూ కులాన్ని
వాడుకుందామా?

లేక మన చెమటతో
బుద్ధి కుశలతలతో
జీవిద్దామా?

అంతా మన ఇష్టం!

No comments:

Post a Comment