
సరస్వతీ తత్త్వము
డా. వారణాసి రామబ్రహ్మం
"జంతూనాం నరజన్మమ్ దుర్లభమ్!"
సమస్త
ప్రాణి కోటిలో మనిషి గా పుట్టడం ఎంతో దుర్లభమైన విషయము. అన్ని
జంతువులలోనికి ఉత్తమమైన మానవ జన్మను పొంది, అలా పుట్టడము లోని విశిష్టతని
గ్రహించి, మనిషి జన్మకి ప్రత్యేకతని ఇచ్చిన లక్షణములని శ్రద్ధగా
ఉపయోగించుకుని జన్మని ధన్యము చేసికోవాలని పెద్దల మాట. చద్ది మూటే కదా అది!
జంతువులకి ఎన్నటికి కలగనిది, మనిషికి
మాత్రమే కలిగేది భాషా పరిజ్ఞానము; మాటలాడగలగడము. దానితో బాటు బుద్ధి కుశలత,
అందాన్ని, మంచిని ఆనందించ గలగడము; మనిషికి మాత్రమె వీలైన సంగతులు . ఆ భాషా
పరిజ్ఞానముతో, బుద్ధి సునిశిత్వముతొ, ఎన్నో జ్ఞానము లని, భావనా పటి,మ సౌందర్య పిపాసతో ఎన్నో కావ్యములని, కళా ఖండములని సృష్టించడము, నేర్పడము, నేర్వడము మనిషికే చెల్లిన విద్య.
ఇంతటి ప్రతిభా వ్యుత్పన్నతలని మనిషికి
కలిగేలా చేసే దివ్య శక్తి మనిషిలోనే నిక్షిప్తమై ఉన్నది. భగవత్ కృప వలన
అది ప్రేరేపింపబడి ఎన్నో విజ్ఞాన, సాహితీ, కళా, నైపుణ్య, ఆధ్యాత్మిక
సృష్టులకి కారణము, స్ఫూర్తి అవుతుంది.
అలా మనకు విద్యలను గరిపే దివ్య స్ఫూర్తిని
సరస్వతి అని విజ్ఞులు అన్నారు. సరస్వతి తెల్లనిది. శరత్కాలపు మేఘమువలె
కాంతులీనేది. తెల్లదనము స్వచ్ఛతకి, నైర్మల్యానికి, శుద్ధతకి, ప్రజ్ఞకి
ప్రతీక. సరస్వతి వీణని వాయిస్తూ, పుస్తకముని ధరిం,చి పద్మములో సత్యలోకములో
చతుర్ముఖ బ్రహ్మ సహధర్మచారిణిగా వెలుగొందుతూ, మనందరి భాషా, విజ్ఞాన, కళా,
నైపుణ్యతలని, అన్ని జిజ్ఞాసలని, ప్రతిభలని, కార్యక్రమ నిర్వహరణా పటిమని
ఇస్తుంది.
మనుషులను కవులుగాను, కళాకారులుగాను మలచేది
సరస్వతీదేవి మాత్రమే. వారిని వృత్తి నిపుణులుగాను, జ్ఞానులుగాను,
విజ్ఞానశాస్త్రవేత్తలగాను చేసేది సరస్వతీ కటాక్షమే. మనలని జంతువులనుంచి
వేరుగా చేసేది, వేరుగా చూపించేది సరస్వతీ దేవి కరుణయే. ఆదరమే.
సరస్వతిదేవి వలే శివుడు కూడా తెల్లని వాడే.
అందుకే ఆయన జ్ఞాన ప్రదాత. సరస్వతీదేవి మామగారు, శ్రీ మహావిష్ణువు మోక్ష
ప్రదాత. అత్తగారు లక్ష్మీదేవి మనకి అన్ని విభవములని కలిగిస్తుంది. ఆమె మరది
మన్మథుడు మనదరికి బాగా తెలిసినవాడే, కావలసినవాడే. ఆమె భర్త బ్రహ్మ మన
సృష్టి కర్త. అంతటి దేవి మనకు పూజ్యురాలు
ఇన్ని మేళ్ళు మనకి చేసే సరస్వతి ముగ్గురమ్మల మూలపుటమ్మయొక్క భాషా, కళా, నైపుణ్య, విజ్ఞాన, జ్ఞాన రూప కారిణి; ధారిణి ; స్వరూపిణి;
అట్టి
చదువుల తల్లి మనలను బ్రోచి, ఈ దేవీ నవరాత్ర సంరంభములో మనకి అన్ని చదువుల,
కళల, నిపుణతల, విజ్ఞాన, జ్ఞానముల ప్రసాదించి మనల కాచుగాక!

No comments:
Post a Comment