Friday, January 20, 2017

ఎవడ్రా వాడు రాజకీయ నాయకుడు?; వర్తమాన భారత యువత; దాసోహం - సోహం; పసికూనలు-ముసలివగ్గులు

 ఎవడ్రా వాడు రాజకీయ నాయకుడు?

ఎవడ్రా వాడు రాజకీయ నాయకుడు? మనలనందరినీ
విభజించి ద్వేషించుకునేలా చేసి ఓట్లడుగు దుండగీడు?

తెల్లదొరల మించి దేశమును ఛిన్నాభిన్నము
చేయుచున్న దేశద్రోహి వీడు; మనకు పట్టిన
చీడపురుగు; మనల కలవనీయని స్వార్ధపరుడు
దేశమాత రొమ్ము గుద్ది పాలు తాగు దుష్టుడు;

అన్నీ అబద్ధపు మాటలు; తమకు తాము తప్ప
ప్రజలమైన మనకు ఉపయోగము లేని వాడు; ఉపకారము
చేయనివాడు; అపకారములు కోకొల్లలుగ చేయువాడు
అవినీతి బంధుప్రీతి చీకటి ధనము పుష్కలముగ

కలవాడు; మనందర దోచు బందిపోటు; మాటలు
కోటలు దాటును; క్రియ శూన్యము; దేశ దేశములు
తిరిగి వట్టి కబురులు చెప్పుచు ఐదేండ్లు గడుపువాడు

మన లోభము దురాశలే వానికి శ్రీరామ రక్ష
మన ఇంగితము అవగాహన వేయును వానికి కఠిన శిక్ష
************

వర్తమాన భారత యువత


సెల్ఫీలు తీసికొనుటకై ప్రాణముల లెక్కచేయరు,
చదువులు చంకనాకినను వదలలేరు సినిమాలు,
అంతర్జాల విన్యాసములు మహర్జాల సాలెగూళ్ళు;
సాహిత్యము సంగీతము, లలిత కళలు లేవు వారి

డిక్ష్టనరీలందు; చరిత్ర, రాజకీయశాస్త్రము, ఆర్ధిక
శాస్త్రముల పై అవగాహన లేదు; భూగోళశాస్త్రము
పేరే వినలేదు; సమాచారము, పరిజ్ఞానము గూగుల్
కిచ్చి బుర్రయందు పరస్పర ఆకర్షణ పదిలముగ

దాచుకొని, ఉద్యోగము లేక బలాదూరు‌ తిరుగుచు
ప్రణాళిక, క్రమశిక్షణ‌ లేని‌ జీవితములు తల్లిదండ్రుల
గుండెల గుచ్చబడిన బల్లెములు; యువత
జీవితములతో‌ ఆటలాడుకొను రాజకీయ

రాబందులు, ప్రజాస్వామ్యపు కామందులు;
కునాయకుల భేదనీతికి తలవంచి అలమటించు
భారతదేశ పౌరులకు లేవు సుఖశాంతులు

*************

దాసోహం - సోహం

వెంకటేశ్వరస్వామి వైష్ణవులకు మాత్రమే
దేవుడనే మూర్ఖపు స్వాములు;

సర్వవ్యాపకుడు, సమస్త స్థావరజంగమములకు నాథుడైన
శ్రీనాథుని ఒక తెగకు మాత్రమే పరిమితం చేసే అజ్ఞానులు;

నారాయణునికి ప్రీతి పాత్రులు కారు; అచ్యుతుని కరుణకు
ఎల్లలు లేవు సిద్ధాంత రాద్ధాంతములు లేవు; ఆయన
కరుణ మనందరిదీ; విశ్వశ్రేయము ఆయన దీక్ష;

సమస్త దేవతలు, దేవుళ్ళు, దైవములు మనందరకూ
దివ్యులు, పూజనీయులు, స్తవనీయులు; మనందరిని
సమముగ కాచు దైవ వతంసములు; మనకు రక్షలు

అట్టి దివ్యకరుణాంతరంగులకు దాసోహం
వారి అనుగ్రహమున జ్ఞానినైన నేను సోహం
***********

 పసికూనలు-ముసలివగ్గులు

కుటుంబములలో తల్లిదండ్రులు కరవగుచున్నారు. బాధ్యత కలిగిన భార్యాభర్తలుగా అగుటకు యువత ముందుకు రావటం లేదు. ఇంట్లో సేవ చేయుట కూడనిది, బానిసత్వము. కాని వీధిన బడి సంఘసేవికలు, సంఘసేవకులుగ అగుట నేటి ఫేషన్.
ఇంటినెవరు పట్టించుకొనక సంతానమేరీతి సాకబడును? పెంచబడును?
పసికూనల ఆలనా పాలనా ఎవరు చూతురు?
ఇల్లాలి "మరణం", తల్లిదండ్రుల నిర్లక్ష్యము, లక్ష్య రాహిత్యము, సమాజమునకు ఎంతో చేటు చేస్తుంది.
మనము కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం వల్ల ఎముకలు విరిగి ఒళ్ళు హూనం అవుతుంది. అదృష్టం లోపిస్తే శాల్తీలే గల్లంతవుతాయి.
ఇల్లు సంఘము అనే భవనానికి ఇటుకరాయి. ఇటుకలు లేక సంఘమనే భవంతి ఏది?
సంఘసేవకై అందరూ ఆశ్రమాలూ, ఎన్.జీ.ఓ. లు అంటూ పోతే ఇంటినెవరు పట్టించుకొవెదరు? నిర్మించెదరు? చక్కదిద్దెదరు? సరిదిద్దెదరు?
ఇంటిలోని వారికి, పసికూనలకు, ముసలివగ్గులకు ఎవరు దిక్కు? ఆసరా?
కుహనా మేధావులు ఈ ఆలోచన చేయరు.
ఇంగితము మనల ఉపయోగకరమైన దోవలో నడిపించాలి. హక్కులతో బాటు బాధ్యతలను స్త్రీ, పురుషులు వహించాలి.
లేకపోతే సంఘము అనాథ శరణాలయమయ్యి, మానసికరోగులకు ఆలవాలమవుతుంది.
తస్మాత్ జాగ్రత! జాగ్రతా!

No comments:

Post a Comment