Tuesday, July 5, 2016

అమ్మ; మనసు; అబద్ధం - నిజం



అమ్మ

జన్మనిచ్చిన మాత్రమున తల్లియౌ గాని
అమ్మ కాలేదు; ఆప్యాయత కురిపించి
సమస్త సేవ చేసి, పెంచి పెద్ద చేసి ప్రథమ
గురువై విద్యా బుద్ధులు గఱపిన, అమ్మ
యగును; దేవతయై నీరాజనములనందుకొనును;
******************

 మనసు

మనసు స్వర లయ సంగమం
రాగ తాళ యుక్తము; మనసు
ముందు ఆడక, పాడక ఎక్కడివి
థిమి థిమిలు సరిగమలు; మనసుననే
రూపుదిద్దుకొని ఆపై చిత్రముగ, శిల్పముగ
మారును; మనసున ముందు స్ఫురించియే
వ్యక్తమగును, తరువాత వెలిగి వెలిగించును
అన్ని శాస్త్రములు, విజ్ఞానములు, జ్ఞానములు,
సిద్ధాంతములు, వేదాంతములు, మౌనములు
రక్తులు, భక్తులు, రాగములు, సరాగములు
విరాగములు, విరమణలు, సంకల్ప వికల్పములు
యోగములు, సమాధులు, నిర్వాణములు, మోక్షములు
మనసు లేక అంతా శూన్యము
మనసు ఆత్మకు ప్రతిఫలనము
చెలి, అనుంగు సంతానము, ఆత్మీయురాలు,
ఆనంద రూపము, శాంతిమయము
 **************

 అబద్ధం - నిజం


అబధ్ధాన్ని నిజంగా చూపిస్తుంది సినిమా. మనసు కూడా ఎన్నో సార్లు అబధ్ధాన్ని నిజంగా చూపిస్తుంది.
తెరపై కనిపించే మనుషులు అబధ్ధపు బొమ్మలు. కాని వాటిని నిజమైన మనుషులుగా భావించి, తెరపై జరిగే సంఘటనలను నిజాలుగా భ్రమించి, అబధ్ధపు బొమ్మలైన నటీనటులపై అభిమానాలు పెంచుకుంటాము. వారికి " విసినకర్రలమై " మన వ్యక్తిత్వాన్ని మరుస్తాము. అబధ్ధం అంత ప్రభావవంతమైనది. నటీనటుల సినీ తెరపై కనిపించే వ్యక్తిత్వాలకి, జీవితాలకి; వారి నిజ స్వభావాలకి, జీవితాలకీ రవంతైనా సారూప్యం లేదని తెలిసినా; ఆ అబధ్ధాన్నే కొలుస్తాము. ఆ నటీనటులకై ఏమయినా చేయడానికి సిధ్ధపడతాము.
అలాగే నిజం ఏమిటో తెలుసుకోకుండా మనసు చూపించినదాన్ని వేదంగా భావించి సతమతమవుతూంటాము. సుఖదుఃఖాలకు వశమవుతాము.
మనసు కలిగించే భ్రమలలో చిక్కుకుని ఆరాటం, ఆందోళన పడతాము. ఎన్నో సార్లు మనసు చూపించినది నిజం కాదు. నిజం అవదు. అయినా మనం మనసునే నమ్ముకొని వ్యథలపాలవుతాము. ఊరికే ఉబ్బి పోతాము కూడ.
నిజం ప్రకాశించేటప్పటికి తట్టుకోలేము.
ఏది నిజం, ఏది అబధ్ధం అనేది బుధ్ధి, అంతఃస్ఫురణ చెబుతూనే ఉంటాయి. అయినా వినం.
అబధ్ధపు లోకాలలో విహరిస్తూ కలలు కొంటాము.
కల, కల్ల ఒకటే కదా!
నిజం తెలిసినా అందులో నివసించకపోవడం మానవనైజం.
అబధ్ధము, నిజముల పరిశీలన, అవగాహన శాంతి మయ జీవితానికి అవసరం. నిజములో ప్రశాంతి, ఆనందము ఉన్నాయి.
మనసు అనే తెరపై ఆడే అబధ్ధపు బొమ్మలు; ఈ చరాచరప్రపంచం, వ్యక్తిత్వ స్పృహలు, సుఖసంతోషాలు, దుఃఖాలు, అన్ని ఆరాటాలు, ఆందోళనలు, భయాలు, పేరువ్రతిష్టలు, మానావమానములు, గెలుపు -ఓటములు, మొదలైనవి.
మనసుపై ఆనింపులైన సకల భావములు, అనుభవాలు మనకు నిజము లోనికి మెళకువ వచ్చినపుడు అంతర్హితమవుతాయు. శాంతి, ఆనందము మనసునిండా నిండి మౌనాన్ని అనుభవం చేస్తాయి.
మాట, తలపు, అసుభవము మనసు దృష్టి లోంచి తప్పుకొని నిర్మల మానసిక దృష్టిని ఇస్తాయి. నిర్మల మానసిక దృష్టియే ఆత్మానుభవము. ఆత్మారామము, రామబ్రహ్మము అదియే. అద్వైతదృష్టి, అద్వైతానుభవము అదియే.
శ్రీర్భూయాత్!

No comments:

Post a Comment