Wednesday, February 8, 2017

తరణము; దౌర్భాగ్యము - సౌభాగ్యము; వాడిపోతున్న లతానికుంజం

తరణము

ఓం నమో నారాయణాయ యని
అష్టాక్షరిని అస్తమానూ అనుకుంటూ
విహిత కర్మములను విధిగా చేయుచు
సగుణ నిర్గుణ ప్రపంచములలో అలవోకగ


మనసుతో, విరమింపబడిన మనసుతో
తలలో నాలుక వలె చరించుచు, భక్తి
జ్ఞాన మార్గములకు సమ గౌరవము చూపుచు,
సమముగ ఆచరించుచు ప్రపత్తితో నారాయణ

పదమును చేరి ఆ వైకుంఠమున మౌన
శాంతానందముల అనుభవించుచు
తత్పరత నొంది నిర్మల మనస్కుడనై
పరమాత్మ యందు అద్వైతముననుభవించుచు

సందడి లేని సంబరమున తేలియాడుచు
సడి లేని నిర్గుణ స్థితినొంది జీవించెద తరించెద

 ************

దౌర్భాగ్యము - సౌభాగ్యము

ప్రయాణం చెయ్యడానికి కిక్కిరిసిన ప్రమాదభూయిష్ఠమైన
షేర్ ఆటోలు; గతిలేక వాటిలో పౌరుల పయనాల ఇక్కట్లు
దూర ప్రయాణాలకు ప్రయాణీకుల పీల్చే ధరలతో లైసెన్స్
లేని ప్రైవేటు వాహనములు; కొండొకచో వేగమునకు

యమపురి కంపు ముచ్చటలును;
పాలకులు ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోరు;
అంతా అమరావతి మయం; విదేశాలకు విహారం;
ధనవంతుల వద్ద భిక్షాపాత్రతో పడిగాపులు;

ఐదు పది నక్షత్రాల హోటళ్ళలో సమావేశాలు,
ఉపన్యాసాలు; వచ్చునది లేదు బొచ్చెలో రాయి తప్ప
అంతా స్మార్ట్ నెస్; స్మార్ట్ నగరాలు, వగలు; ప్రజలకు
సెగలు; పాలనన్న వట్టి కబుర్లు మాత్రమే నన్న రాజకీయ

నాయకుల బుద్ధినైశిత్యము సర్వదా వందనీయము;
ఇట్టి ప్రజాస్వామ్యము, వంశీకుల,, గర్ల్ ఫ్రెండ్ ల
జన్మహక్కు; చెప్పుటకే కాదు చూచుటకును
అసహ్యముగనున్నది; నాయకులు, వారి కుటుంబీకులు

ఆడ మగ స్నేహితులు అంతా తయారే పాలనకు
భారతదేశమున ప్రజాస్వామ్యమన్న
ప్రజల దౌర్భాగ్యము; నాయకుల సౌభాగ్యము

***********

వాడిపోతున్న లతానికుంజం

మౌర్యులపై ఆంద్ర శాతవాహనుల విజయపరంపరలలో

రాజరాజనరేంద్రుని కృష్ణరాయని
ధవళ కీర్తి చంద్రికలలో


నన్నయ మొదలు "కరుణశ్రీ" వరకు
జాలువారిన రసపద్యకవితా లహరులలో


రామదాసు అన్నమయ్య త్యాగరాజుల
సంగీత సాహిత్య మధుర సమ్మేళనములో


గురజాడ కందుకూరి జాషువా శ్రీశ్రీ దేవులపల్లులు
నక్షత్రాలై అలరారు నవ్యసాహితీ వినీలాకాశంలో


గోదావరి కృష్ణవేణీ పెన్న తుంగభద్రల
పవిత్ర నదీ జల ప్రవాహములో


అమరావతీ శిల్పసౌందర్యంలో
కూచిపూడి నాట్యంలో

నాగార్జున వేమన్న కొడవటిగంటిల
సునిశిత ఆలోచనా స్రవంతులలో


ప్రతిఫలించే తెలుగుదనం
అందమైన లతా నికుంజం

రూపు కోల్పోవుచున్నది చేతకాని వారి చేతులలో
వాడిపోవుచున్నది వివిధరీతులలో

మరింత సౌరభంతో
పరిమళిస్తూనే ఉండాలి
ఎలా???!!!

No comments:

Post a Comment