Sunday, August 9, 2015

సంసారము, పూర్ణభక్తి-ప్రేమ-జ్ఞానము

సంసారము

సంసారమంటే మనస్సంసారమే. మనకు కలిగిన అనుభవముల వలన జనించే తలపులు, వ్యక్తీకరణలు ఈ మానసిక సంసారములో భాగము. మన చిన్నతనంనుంచీ మనసు మాధ్యమమున జ్ఞానకర్మేంద్రియముల ద్వారా, బుద్ది, అహంకారము, చిత్తముల ద్వారా గ్రహించిన విషయములు, విషయానుభవములు మనలో ప్రపంచంగా, వాసనలుగా స్థిరపడతాయి. మన అహంభావ, అహంకార, మమకారములు, వ్యక్తి, వ్యక్తిత్వ భావనల సమాహారమే అహంకారము. బుద్ధి విచక్షణను కలిగిస్తుంది. తర్కిస్తుంది.
వాసనలు మన విషయానుభవములే. మనసు విషయాన్ని, విషయసమూహాన్నీ ప్రపంచంగా మారుస్తుంది, గ్రహిస్తుంది, చిత్తము విషయానుభవములను జ్ఞప్తిగా మార్చి మరల అనుభవములుగా దృష్టికి తెస్తుంది. ఈ అనుభవములు తలపులుగా మారి అనుగుణంగా వ్యక్తమౌతాయి. ఇదంతా మన మెళకువ, కల మానసిక దశలలో జరుగుతుంది. అప్పుడు మనము అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టులను కలిగి ఉంటాము.
ఇలా మానసికంగా కలాపించడమే సంసారములో చిక్కుకోవడము. భార్యా\బిడ్డలను ఇతర ప్రాపంచిక బంధములను, ఆస్తిపాస్తులను, పేరు, ప్రతిష్టలను కలిగి ఉండడం మాత్రమే కాదు. అన్నీ వదలి పెట్టేశాను అనుకున్న సన్యాసి, స్వామి, అమ్మ, బాబా, సాధు, సంత్ లకు ఈ మానసిక హడావుడి అంతా ఉంటే వారు పైకెంత చెప్పినా సంసారంలో చిక్కుకున్నవారే.
భార్య లేక భర్త, పిల్లలు, ఇంటి బాధ్యతలు ఆధ్యాత్మికతకు ఎన్నడూ అడ్డంకులు కావు. పైపెచ్చు సహాయకారులు కూడా. అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టులలో చిక్కుకున్న మనసు కలాపములను విరమించుకొని విశ్రాంత దృష్టి యుత కావడమే సంసారమును అధిగమించుట.
నేను ఫలానా వ్యక్తిని ( సంసారిని, స్వామిని, సన్యాసిని, అమ్మను, బాబాను మొదలైన అన్వయములు) అనే స్పృహా రహితంగా వర్తించడమే, జీవన యానం చేయడమే ఋషి లక్షణం. మౌనము, ఆనందము, నిరంతర ధ్యానమై ప్రశాంతతను అనుభవముగా చేసికొనడమే. అటువంటివారే సంసారమును అధిగమించినవారు. ఇతరులందరూ, వారి వేషభాషలేవైనా, సంసారులే.

పూర్ణభక్తి-ప్రేమ-జ్ఞానము

పూర్ణభక్తియే జ్ఞానము. భక్తి అంటే ఇష్టదైవమందు పరమమైన ప్రేమను కలిగి ఉండడం. అలా పరిపూర్ణమైన ప్రేమయే జ్ఞానము. భక్తి, ప్రేమ, జ్ఞానము కలిగినప్పుడు మన వ్యక్తిత్వము వాటిలో లీనమైపోతుంది. మనము‌ అని విడిగా ఉండము. మన ఉనికి భక్తిగా, ప్రేమగా, జ్ఞానముగా మారిపోతుంది. అహంకార, మమకారములు కరిగిపోతాయి. అహంకార, మమకారములు అంతరిస్తే మిగిలి ఉండేది ప్రశాంతత. ఆనందము. మనసుని పరుని వశము చేయడం; "పర వశము" చేయడంకూడా, ఆధ్యాత్మిక సాధనయే. మన మన తత్త్వములను, స్వభావములను బట్టి మనము మన వ్యక్తిత్వాన్ని భక్తి, ప్రేమ, జ్ఞానములలో ఒకదానిలో లీనం చేస్తాము. పరమాత్మలో అంత:కరణముల విలీనమే వక్తిత్వ విస్మరణము, నిర్మూలనము. మోక్షము, ముక్తి ఇవే.

No comments:

Post a Comment