Thursday, March 10, 2016

మహిళా దినోత్సవం



మహిళా దినోత్సవం 


మహిళా దినోత్సవం సందర్భంగా పోష్ట్ చేయబడ్డ సందేశములు చదివి నాకు నవ్వు వచ్చింది. చిరాకూ వచ్చింది. మహిళల empowerment గురించి ముఖ్యముగా అన్ని సందేశములు స్పృశించాయి.
ఉద్యోగములు చేసే యువతులను మాత్రమే empowered గా ఎక్కువ సందేశాలు గుర్తించాయి. మరికొన్ని సందేశాలు అమ్మ "ఘనత" ను కీర్తించాయి.
 
కాని మనం నేడు సంఘంలో చూస్తున్న వాస్తవాలు ఈ రెంటికి లంగరు కుదరనివ్వడం లేదు. ఈ పైన ఉదహరించిన రెండు రకాల సందేశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.
 
ఉద్యోగములు చేస్తున్న యువతులు తాము కన్న తమ పిల్లలను తాము సాకే సమయము లేక ఆ సాకడాన్ని పనిమనషులకు outsource చేస్తున్నారు. వీలయితే అమ్మనో, అత్తగారినో ఆయాగా తెచ్చుకుంటున్నారు.
ఈ అమ్మలు, అత్తలు తాము కన్న పిల్లలని ఎంతో ప్రేమాభిమానాలతో సాకి, అమ్మ పదానికి వన్నె తెచ్చి తరించారు. పెద్దతనాలు వచ్చి, దాని ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా, ఓపిక అంతగా లేకపోయినా, empower అయిన కోడళ్ళకు, కూతుళ్ళకు ఆయాలుగా బ్రతుకులు వెళ్ళదీస్తున్నారు.
 
అమెరికా సంయుక్త రాష్ట్రములలో ఉన్న కూతుళ్ళు, కోడళ్ళకు సేవచేసేందుకై డయాపెర్ వీసా మీద వెళ్ళి వస్తున్నారు. అక్కడ దొరికే ప్రొఫెషనల్ బేబీ సిట్టర్ల బిల్ pay చేయడానికి మన empowered women, or men ఆదాయాలు సరిపోవు.
 
ఇంతలా సాయం చేసిన ఈ baby-sitters ని ఆ కూతుళ్ళు, కొడుకులు తమ సంతానం గడి కట్టగానే ఇండియాకి తోలేస్తున్నారు. అక్కడ ఈ ముసలాళ్ళ అనారోగ్యం, ఆస్పత్రుల ఖర్చు పెట్టడం ఇష్టంలేక, తట్టుకోలేక నిర్దాక్షిణ్యంగా భారతదేశానికి తరిమేస్తున్నారు; మీ చావు మీరు చావండని. కరుణ గల సంతానం ఈ అనారోగ్యవంతులైన ముసలాళ్ళను వృద్ధాశ్రామాల్లో చేరుస్తున్నారు.మరీ తెలివైన కొడుకులు, కూతుళ్ళు కాస్త మంచి వాళ్ళు, అమాయకులు, ప్రేమాభిమానాలు కల పాతతరం బంధువుల మీదకి తోసేస్తున్నారు. డబ్బు ఎంతైనా భరిస్తారట, పంపిస్తారట.
ఉద్యోగం చేసి, మిమ్మల్ని మీరు empower చేసికోకుండా మగవాడికి బానిసగా, వాడి వంటింటికి, పడకటింటికి మిమ్మల్ని మీరు పరిమితం చేసికున్నందుకు ఈ శిక్ష మీకు సముచితమే అన్నట్టు సంతానము ప్రవర్తిస్తున్నారు, సంఘము వ్యవహరిస్తోంది.
 
తమను తాము empower చేసికోకుండా తమ సర్వస్వాన్ని కుటుంబానికి, పిల్లలకి, వారి ఆలనా, పాలనా చూడడానికి, వారికి అన్నీ ప్రేమగా, అనురాగంతో అమర్చిపెట్టి, వారి సుఖసంతోషాలలో తన సుఖసంతోషాలు చూసుకున్నఅమ్మ, తన power నంతా, కుటుంబం, సంతానముల empowerment కి ధారపోసిన అమ్మ, భూమాత, మనుమలకు, మనుమరాళ్ళకు ఆయాగా పనిచేసిన అమ్మ వృద్ధాశ్రమాలలోనికి నెట్టబడుతోంది. ఈ మహిళలకు బాధ్యతలు తప్ప ఏమీ హక్కులు లేవా
ఇటువంటి మాతృమూర్తుల ఊసు ఏ కుహనా మేధావికి పట్టదు. ఆడది ఇన్నాళ్ళూ ఏదేదో కోల్పోయిందని ఊకదంపుడు ఉపన్యాసములను ఇస్తాడు. మొసలి కన్నీళ్ళు కారుస్తారు. మరి పసి పిల్లలనీ, ముసలి వాళ్ళని ఎవరు సాకుతారురా అంటే ఎవడు వినడు; మాట్లాడడు.
 
ఇప్పటి యువతులు, సంతానము వృద్ధులవరా? వారి ఆలనా, పాలనా ఎవరు చూస్తారు? అన్ని తరముల వారు ఒకనీడనుండి తగ్గట్టుగా జీవించడం మనం మళ్ళీ మొదలుపెట్టవద్దా?
అందరూ పల్లకీ ఎక్కితే మోసేవాళ్ళుండరు. అందరికీ ఆయాలను పెట్టుకొని పిల్లలనూ, నర్సులను పెట్టుకొని ముసలాళ్ళను సాకే ఆర్ధిక స్తోమతలు లేవు.
 
అదే విధంగా ఆడాళ్ళు ఎందరో ఉద్యోగాలైతే చేస్తున్నారు కాని ఎవరికీ గౌరవప్రదమైన జీతాలు చెల్లించబడడం లేదు. బానిసలుగా ఉద్యోగాలు చేస్తున్నారు ఆడ, మగ కూడా. ట్రాఫిక్ జామ్ లలో, సాధించడంలో, ఏడిపించడంలో, అత్తగార్లను తలదన్నే బాస్ ల నిరంకుశత్వాలలో అల్లలాడుతున్న అబలలెందరో!! ఏ మేధావికైనా ఇది తెలుసా?
తోటి మానవుల సేవ చేసినందుకు మదర్ థెరీసాను ఆకాశానికి ఎత్తే మేధావులు, సాంఘికశాస్త్రవేత్తలు, ఎన్ జీ వో లు, అదే మాదిరిగా తన వారైన తోటిమానవులకు సేవ చేస్తున్న గృహిణిని ఎందుకు మగవాని బానిస అంటున్నారు? భర్త, పిల్లలు, అత్తమామలు తోటిమానవులకింద రారా? రోడ్డు మీది అనాథలకు సేవ చేస్తేనే అది మానవ సేవా? ఇంట్లో వాళ్ళకు మదర్ థెరీసాలా గృహిణి సేవచేయకూడదా? ఇంట్లో వాళ్ళను ముందు అనాథలను చేసి ఆపై వారు రోడ్డున పడితే అప్పుడు మదర్ థెరీసాలై “సేవ” చెయ్యాలా? 
ఎవరు నిర్దేశిస్తున్నారు, ఎవరు నిర్ణయిస్తున్నారు ఈ తప్పొప్పులు, యుక్తాయుక్తములు? ఇలా బయటి వాళ్ళకు చేసేదే మానవ సేవ ఇంట్లో వాళ్ళకి చేసేది మానవ సేవ కాదు అనేవారికి కుటుంబాలున్నాయా? అందరూ రోడ్డున పడి సేవ చేస్తూంటే వాళ్ళ ఇళ్ళల్లోని పసికందులని, ముసలి వగ్గులని ఎవరు చూస్తున్నారు? వాళ్ళ ఇళ్ళల్లో పసికందులు, ముసలివారూ లేరా
ఇటువంటి వాస్తవ స్థితిలో ఉద్యోగం చేయడం మాత్రమే స్త్రీలకు empowerment అనడం బాధ్యతారాహిత్యము. వాద బానిసత్వము. సంఘాన్ని వక్ర మార్గం పట్టించే, కష్టనష్టముల పాలుచేసే పిచ్చితనము. మరొక విషయము. స్త్రీలకు 33% రిజర్వేషన్ విషయంలో ములాయమ్ సింగ్ తదితరులు కులప్రాతిపదికన నిర్ణయించాలి అంటున్నారు.
 
ఇంత అస్తవ్యస్తంగా ఉన్న సంఘంలో బాధ్యతారహితంగా స్త్రీల empowerment గురించి మాట్లాడడం సంఘానికి చేటు.

No comments:

Post a Comment