Monday, July 6, 2015

కావ్యాలాప వినోదినీ!

కావ్యాలాప వినోదినీ!
చక్కని కవితలు చుక్కల చందమున
చక్కని చుక్కవు చందమామవు నీవని
నీపై మోజుతో కాంతులు విరజిమ్ముచు
నిన్నలరించుచు నిను కూడి యుండ
ఆ ధగధగల వెల వెల బోయెదమని
అస్మత్ కవితా తారకలు జంకుచుండె
చూడుమా వంక ఓ నెలవంకా!
చూడు మావంక సిరీ! సఖీ!
భ్రమర సదృశ రస సరస హృదయమును కలిగి
వివిధ కవితా ప్రసూనముల జుంటు తేనియలు
గ్రోలుచు ఆ మత్తుల హాయిల ఊగి తూగు
నీకు హాయిని తూకముగ అందించలేమేమో అని
నా రస కవితా సుమములు బెరుకు వహించె
అల్లన నిలిచె నీ కటాక్షమునకై చూడుము చెలీ!
సురస కవితాఝరుల తానమాడు నీ మనమును
తమ ఆర్ద్రతతో తడుపగలమొ లేమో నని
ఇంకి పోవుచుండె నా రస కవితా ధారలు ఇంతీ!
నీ రస హృదయము వీణయై నిను శ్రుతి చేసి ఉంచ
మర్మజ్ఞులు రస కవితా సంగీతజ్ఞులు కవనముల
ఆలాపించుచు నీ డెందమును మీటుచుండ
మేమును వైణికులమని అనుటకు మాట రాక
మా కవితా సుస్వరములు మూగ బోవుచుండె ప్రియా!
పూబోడివై రస పుష్పమువై నీవు వెల్గొంద
నీ చుట్టూ రస కవితా ప్రసూనములు వెదజల్లబడి
నిను కొలుచుచు నీకు అందమును చేకూర్చ హృదయమునూపుచుండ
మా కవితా పుష్పములు నీ పై జల్లుటకు జంకాయె సఖీ!
ప్రముఖులు గాయకులై తమ కవితాగానమున
నిను పరవశింప జేయుచుండ రస లోకములనున్న
నిన్ను మా కవితా గానము చేరునో
లేదో యని సందియమాయె చెలియా!
రస రాజకుమారివి రసరాజ దేవేరివి
కమ్మని కవితలు చెలికత్తెలై
నిన్నుఅలరించు చుండ
మేమును కవితలమనుచు
నిను రంజింప జేయుటకై
నా కవితా చెలులు నీ అంతఃపురమున నున్నారు
ఇటు తిప్పు మోము చంద్రుని తోడ బుట్టినదానా!
ప్రముఖుల కవితలకు ఏవో ఎవరో ప్రేరణలు ఎందఱో పాఠకులు
మా కవితలకు మాత్రము ప్రేరణవు పాఠకురాలవు నువ్వే చెలీ!
ఇతరుల కవితలందరి హృదయానందములకు
మా కవితా మల్లెల గుబాళింపు నీ ఆస్వాదనకే సుందరీ!
వారి కవితలలో సార్వజనీనత ఆటాడుచుండును
మా కవితలలో నీపై నా మమతే నాట్యమాడుచుండును నెలతా!
ధైర్యముగ చెప్పు ఒక్క మాటను విను ప్రియా!
మేమూ కవులమే భావుకులమే
వారి సాటి వారమే ఆ పాటి వారమే
నీకు సరి జోడులమే జోదులమే
సరిపోయి సరితూగు వారమే!

No comments:

Post a Comment