Showing posts with label జ్ఞానము. Show all posts
Showing posts with label జ్ఞానము. Show all posts

Saturday, May 27, 2017

సమన్వయం - సామరస్యం; ప్రజాస్వామ్యపు గుదిబండ; జ్ఞానము పెట్టే భిక్ష; Energy. Time and Consciousness

సమన్వయం - సామరస్యం

ప్రపంచంలోని అజ్ఞానమంతా మన బుఱ్ఱల్లోనే ఉందంటే అన్నవాడిని ఉతుకుతాం.
మనంత జ్ఞానవంతులు లేరని మన ఊహ, అపోహ, నమ్మకం. మంచిది. నీ జ్ఞానంతో నాలుగు ఉపయోగ కరమైన విషయాలు చెప్పండయ్యా అంటే వారిని, వీరిని నిందించడంతో ప్రారంభిస్తాం. ఇంక మన వాగుడుకి అంతుండదు. 

తెలిసిన వాణ్ణి, తెలియని వాణ్ణి వాళ్ళ మూలాలతో సహా దునుమాడుతాం. తెలిసీ, తెలియని అవాకులు, చెవాకులు పేలతాం. నిజానికి సంఘంలో సమన్వయంతో అందరినీ చూసే పెద్ద మనసు జ్ఞానవంతులము అనుకునే ఎందరో మేధావులకు లేదు.

సమన్వయం తెలియని మేధావులు సంఘంలో పెక్కురు.

తాము ఏదో వాదానికో, ఇజానికో నిలబడతారు. జీవితాంతం ఆ సిద్ధాంత రాద్ధాంత పంజరంలో నివసిస్తారు.
ఇంకేమి గమనించరు. తెలుసుకోరు. తెలుసుకోలేరు.

ఇటువంటి జ్ఞానుల వల్ల సంఘానికి ఏమీ ప్రయోజనం లేదు.

సమన్వయం తెలిసిన వారి వల్లే సంఘంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి.
***********
 Movie stars and politicians dump their off-spring on society with their clout; their inefficiency is borne by the society moaning under the dumping; This dumping inhibits the rise of genuine and capable individuals from reaching influencing levels and the society is the loser ultimately.
*********

ప్రజాస్వామ్యపు గుదిబండ

మనుషులనే దేవుళ్ళను చేసే మన రాజకీయ నాయకులు;
ఆ పై వారే దేవుళ్ళై మన నెత్తికెక్కి నాట్యం చేసే దుర్దినాలు

ఎవరు మనుషులో ఎవరు దేవుళ్ళో తెలియని దురాశలో
మనం; అందరూ మనకు వరము లిచ్చి ఆదుకుంటారనే
సోమరితనాలు; తమ వివక్షను నిందిస్తూనే ఆ విభజనను
కడుపారా తనివితీరా దురుపయోగం చేసే అతితెలివి;

మేసేటప్పుడు ఎద్దుల్లో, దున్నేటప్పడు దూడల్లో దూరే
మనం, మన ప్రగతికి, దేశాభివృద్ధికి ఏమి తోడ్పడగలం?

మన బలహీనతను, అత్యాశను, సోమరితనాన్ని పెంచే
 వారు; తమ ప్రతినిధిత్వాన్ని, ప్రభుత్వాన్ని లీలగా, హాయిగ
భయరహితంగా అమితమైన అక్రమ సంపాదనకు నిర్లజ్జగా
వాడుకుంటున్న నేడు ప్రజాస్వామ్య మనకు గుదిబండ
*************

జ్ఞానము పెట్టే భిక్ష

మనం భావాత్మకమైన మనసు యొక్క రూపులం. మనసు లేక మనము లేము. మనమున్నప్పుడే మనకు కలతలు, కార్పణ్యాలు, వెతలు, ఉత్సాహాలు, గంతులు, పొంగులు, కుంగులు, అభిమానాలు, ఈర్ష్యలు, కోపాలు, తాపాలు, అన్ని రకాల అశాంతులు, రాగాలు, ఆసక్తులు.

మనసు నిండుకుంటే హృదయమంతా శాంతి సౌఖ్యాలు, ఆనందము, మౌనానుభవము. 

కాని మనసు లేక రోజూ వారీ కార్యక్రమాలు జరగవు. మనసు చూపించే జగత్తే మనము చూసేది. ఈ విషయము
దృష్టిలో ఉంచుకుని విచక్షణతో జీవిస్తే పుణ్యము, పురుషొర్ధము పొందవచ్చు.

మనసు మనకు వరము. దానిని మన అజ్ఞానంతో, అమాయకత్వంతో శాపంగానూ మార్చుకోవచ్చు.
శాంతి, ప్రశాంతత కావాలనుకుంటే మనస్సును జ్ఞానంతో నియమించుకోవచ్చూ.

కాని మన ఉనికి మనసు కలిగించే ఒక స్పృహ మాత్రమే. ఈ స్పృహ అస్తమానూ కలిగి ఉండడం మనకు అవసరం.
మనసు విరమిస్తే మన ఉనికే మనకు తెలియదు. మానసిక దృష్టి కలిగించే ఇంద్రజాలమే మన ఉనికి, వ్యక్తిత్వము, ఊహాపోహలు, సుఖదుఃఖాలు.

ఇంత వినీ, తెలిసీ అనవధానులమై విలపించడం ప్రకృతి నియమము. పరమాత్మ ఈ ప్రకృతికి పరుడు. ఈ నిజం తెలిసి ప్రకృతికి పరమైన సత్ సంగంలో జీవిస్తూ, సంఘ జీవిగా రాణించగలగడం జ్ఞానము మనకు పెట్టే భిక్ష.
************
Energy. Time and Consciousness
Energy is time. Transformation of energy is passage of time. Energy is Consciousness. Transformation of energy is mind and its functions. Non-transformation of energy as Being is time- and mind-transcendent blissful, silent and serene state; the state in which moods, thoughts, feelings, perceptions, utterances and sensing get absorbed and ego gets merged in Pure Consciousness.

Wednesday, May 10, 2017

తిమ్మరుసు బుద్ధి సూక్ష్మత; భాషలు, జ్ఞానము; ఆస్తికత-నాస్తికత; భారతదేశంలోని వింతలు


తిమ్మరుసు బుద్ధి సూక్ష్మత



తిమ్మరుసు బుద్ధి సూక్ష్మత నేటి మత గురువులకు ఉంటే బాగుండును.
ఆయన గీతను చెఱపకుండా గీతను చిన్నది చేశాడు.; దాని పక్కన పెద్దగీత రాసి.

మన మతం గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ఇతర మతాలను చిన్నబుచ్చక్కరలేదు. ఆ గీత గురించి ఏమీ అనకుండా తమ మతం గొప్పతనం, దాని శ్రేష్టత ప్రచారం చేసుకోవచ్చు. ఇతర మతాలు హీనమైనవి అని ప్రచారం చేయడం మూర్ఖత్వం​. తమది గొప్పమతం అని టముకు వేసుకోవచ్చు.

ఏదిఏమైనా​ అన్ని మతాల వారు అవస్థలు పడుతున్నారు.

ఏ మతమూ ఏ మానవునీ సుఖసంతోషాలలో ఉంచలేక పోతోంది. ఇంక ఈ అమాయక, మూర్ఖత్వపు ప్రచారాలెందుకో? అప్పనంగా ఇస్తున్న డబ్బులకోసం అయి ఉండవచ్చు.

మరో మతం వాళ్ళని ఊచకోత కోయడం కొన్ని మతాల దుర్లక్షణం. ఇది నాగరికత వెల్లివిరుస్తోంది అనుకుంటున్న
నేడు యథేచ్ఛగా జరగడం ప్రపంచంలో మేధావుల కొఱత వలన. రాజకీయం తప్ప వేరు విషయం తెలియని ప్రపంచ నాయకులు, మూర్ఖత్వం మూర్తీభవించిన మిత్రునికి గురువులు ప్రపంచంలో అలజడి, అస్తవ్యస్త పరిస్థితి, మానవ మారణహోమాలకు కారణం అవుతున్నారు.
మతం మతి భ్రమించి ఉన్మాదస్థితి లోనికి నెట్టబడుతూంటే విశ్వమానవ సౌభ్రాతృత్వం పుస్తకాలకే పరిమితం అవడం దురదృష్టకరం.
మతం మానవ కల్యాణానికి కాక మానవ మారణహోమానికి కారణం కావడం, దానిని ఆపే సత్తా కల మేధావులు ప్రపంచంలో లేకపోవడం మరింత దురదృష్టం.

అందరమూ చేతులెత్తేసి విపత్కర పరిణామాలకు సిద్ధపడ్డట్టుంది.

***********
 భాషలు, జ్ఞానము

భాషలు, జ్ఞానము ఎవరూ శ్రద్ధాసక్తులతో నేర్చుకోవడం లేదు. చదువుకోవడం పరమార్థమే మారిపోయింది. భాషలు సరిగా రాకపోయినా, శాస్త్రజ్ఞానములు ( ప్రకృతి శాస్త్రాలు, సాంకేతిక శాస్త్రాలు) లోతుగా నేర్వకున్నా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. అందుకని భాషాధ్యయనంపై నిర్లక్ష్యము. శాస్త్ర విజ్ఞాన సముపార్జనపై చిన్న చూపు. ఇది నేటి భారతదేశంలో చదువుల స్థితి (దుస్థితి).

ఎవరికీ జ్ఞాన సముపార్జనపై దృష్టి, ఆసక్తి, గౌరవము లేవు. ఎన్నో అపసవ్య మార్గములలో ఎందరో ఈజీ మనీ సంపాదించగలగడం మరొక కారణము; చదువు, సంస్కారం కాని, పాండిత్యాన్ని కాని, విజ్ఞానాన్ని కాని, జ్ఞానాన్ని కాని ఈయలేకపోవడానికి. తల్లిదండ్రుల్లో కాని, విద్యార్థులలో కాని చదువు పట్ల జిజ్ఞాస, అవగాహన, గౌరవం లేనంత కాలం , విద్యాసంస్థలు కాబూలీవాలాల చేతుల్లో ఉన్నంతకాలం చదువు‌ అబ్బదు. మనలాంటి సున్నిత మనస్కులము వాపోతూంటాము అంతే.
***********

భగవంతుని ఉనికిని నమ్మడం ఆస్తికత. భగవంతుడు లేడని నమ్మడం నాస్తికత. రెండూ నమ్మకాలే!

************

భారతదేశంలోని వింతలు

భారతదేశంలో ఉన్న అన్ని ఛిద్రాలకి భారతదేశంలోని కుహనా మేధావులు మూడింటిని బాధ్యులను చేస్తారు. వారి మేధాశక్తి అపూర్వము అనిపించేలా మాట్లాడతారు. వ్యాసాలు రాస్తారు. టిి.వి లోని చర్చల్లో పాల్గొని ఈ మూడింటిని దునుమాడేస్తారు. సంస్కార రహిత, అసభ్య భాష నిర్లజ్జగా ఉపయోగిస్తారు కూడా. వీరి వీరంగాలకు అడ్డు, అదుపు, ఆపూ ఉండవు. ఏ సైతానో వీరిలోకి పరకాయ ప్రవేశం చేసినట్టు ఊగిపోతారు.

ప్రపంచం లోని ఇతర దేశములను, సంఘములను, అక్కడి పరిస్థితులను అసలు గమనిస్తారో లేదో తెలియదు. ఈ మూడింటిని ఆడిపోసుకోవడం మాత్రం వీరికి నిత్య కృత్యం. వీరిలో ఏమీ చదువుకోని, వివిధ అంశాలపై ఏ విధమైన పరిజ్ఞానము, జ్ఞానం, అవగాహన, కనీస ఇంగితం లేని కుల నాయకుల నుంచి, పత్రికా ప్రతినిధులు, అన్ని మీడియాలలోని ప్రముఖులు, రచయితలు, కవులు, విశ్వ విద్యాలయ ఆచార్యులు, విజ్ఞాన శాస్త్రం చదువుకున్నాం అనుకున్న వాళ్ళు, వివిధ లలిత కళల్లో ప్రజ్ఞ కలవారు, నాస్తికులు, రేషనలిష్టులు, వివిధ వాదముల ప్రియులు ఉంటారు. ఇలాంటి వారు ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నారో లేరో తెలియదు. భారతదేశ ఆలోచనా, అవగాహనా ప్రపంచాన్ని మాత్రం ఏలేస్తున్నారు. ఛిద్రమూ చేస్తున్నారు. 

వీరికి ఆవేశం ఎక్కువ. అవగాహన తక్కువ. ఆ మూడింటిపై ద్వేష, విద్వేషాలు అపరిమితం. అనవసరమైన కక్ష. ఎవరు చెప్పినదాన్ని వీరు గణించరు.

తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటారు. అందరూ తమ మాట వినాలంటారు. వినని వాళ్ళని అసభ్యంగా తిడతారు. తమని మించిన మేధావులు లేరనే భ్రమ, భ్రాంతులలో మునిగి తేలుతూ ఉంటారు.
వీరి మాటల, చేతల విచ్చలవిడితనం,​ మొండితనం సభ్య సమాజానికి అసహ్యంగా ఉంటుంది. అయినా నేడు భారతదేశంలో వీరే సంఘ, దేశ ఆలోచనా ధోరణిని శాసిస్తున్నారు.

వీరు దునుమాడే మూడూ: మగవారు, బ్రాహ్మణులు, హిందూ మతం/ధర్మం.

 

Sunday, July 17, 2016

సృష్టికర్త - సృష్టి; ప్రయోజనము లేని ఉనికిలు: రమణీయమైన కావ్యములు; జ్ఞానమే శరణ్యము మనకు



సృష్టికర్త - సృష్టి

వాల్మీకి వ్యాసుల కన్న రామ కృష్ణులు ప్రముఖులు
వందనీయులు; అభినందనీయులు ఆనందకారకులు

జక్కన్న కన్న బేలూరు లోని ఆలయ శిల్పసంపదలు
చిర దర్శనీయములు; భరతముని కన్న నాట్యశాస్త్రము
మిన్న; ఐన్ స్టైన్ కన్న సాపేక్ష సిద్ధాంతమునకు ఎక్కువ
ప్రాచుర్యము; యల్లాప్రగడ సుబ్బారావు కన్న ఆయన

కనిపెట్టిన మందులు రోగనివారకములు; త్యాగరాజ
స్వామి కన్న "ఎందరో మహానుభావులు" బ్రహ్మానంద
దాయకము; టి. వి. రాజు కన్న "జయ కృష్ణా ముకుందా
మురారీ" కర్ణపేయము; విశ్వనాథ్ కన్న శంకర శాస్త్రి

ప్రభావము అధికము; రాముని కన్న రామ నామము
ఎక్కువ మోక్షప్రదము; శ్రీ కృష్ణుని కన్న భగవద్గీత
పఠన పాఠనముల హెచ్చు; చతుర్ముఖ బ్రహ్మ కన్న
ఆయన సృష్టించిన జీవజాలమున వైవిధ్యము, అందము
 రామణీయకత ఎక్కువ; అమ్మ కన్న ఆమె సంతానము
నలుగురికీ తెలియును; తమ తపః ఫలమున,
శ్రద్ధాసక్తులతో, అకుంఠిత దీక్షతో సృష్టించిన సాకిన సృష్టి
సృష్టి కర్తల కన్న మిన్నగా రాణించును; లోకమున
అందగించును, అలరించును, అజరామరమగును
*************
 
ప్రయోజనము లేని ఉనికిలు

చిత్తరువు లోని కాఫీ ఘుమ ఘుమలాడదు
మల్లియ పరిమళాలు వెదజల్లదు; నాతి రతి
సుఖమునీయ లేదు; పళ్ళు, ఫలహారములు
ఆకలి తీర్చలేవు; డబ్బు, బంగారము మన
అవసరము తీర్చలేవు; రాజకీయుల మాటలునూ
చిత్తరువు గీతలు; మన గీతల మార్చలేవు

అబద్ధము ఆస్వాదనకు పనికి రాదు; నిజమిచ్చు
సుఖశాంతులు, భ్రమ, భ్రాంతులు, అసత్యము ఈయలేవు;
త్రికరణశుద్ధి లేని ఊహలు, పలుకులు చేతలుగ మారవు
నీటిపై రాతల వలె ఆ క్షణమునకు మాత్రముండును

ప్రయోజనము లేని ఉనికిలు పార్టీల మేనిఫెస్టోలు
అబద్ధాలు ప్రజలను అందలాలెక్కించలేవు; ఆసరా
కాలేవు; ఆయాసము, ఆశాభంగములను మాత్రమిచ్చును
చిత్రములు ప్రజల నమ్మకములు; చిత్తరువుల గీతలు
**************

రమణీయమైన కావ్యములు

రాతిపై మలచిన కవిత శిల్పం
దివ్యతేజం నిండిన హస్త కళా స్వరూపం

ఎన్నో వన్నెలు దిద్దిన భగవత్ స్వరూపం
ప్రసన్నత కురిపించే భక్తుల పాలిటి గట్టి నమ్మకం

ఆచార్యుల ఆధ్యాత్మిక దృష్టి
ప్రతిబింబించే యోగ సమాహారం

విగ్రహారాధనను గేలి చేస్తూ ,
సిధ్ధాంతకర్తల నాస్తిక ప్రముఖుల
నాలుగు రోడ్ల కూడలుల లోని వారి
శిలా విగ్రహాల మెడలలో పూల మాలలు
వేసి తమ భక్తి ప్రపత్తులు ప్రకటించే
నాస్తిక శిఖామణుల రెండు నాలుకల
ధోరణిని అపహాస్య దృక్కులతో పరికించే దైవ శిఖామణి
 
గుడులు గోపురములు వాటిపై;
వాటిలో కన్నుల పండుగ చేసే
శిల్ప సంపద; ఆనాటి రాజుల రుచి,
శిల్పుల కళా నైపుణ్యం చాటే రాళ్ళ వైభవములు;

అప్పటి పేదల ఉపేక్షించి; వారి బాగోగులు నిర్లక్ష్యము చేసి,
సొమ్ముల ప్రభువులు రాతి గుండెతో రాళ్ల పాలు చేసినను
శిల్పములు శిలా కట్టడములు
సంస్కృతీ ప్రకటనములు; పరిరక్షణములు

దేశ చరిత్ర వహించిన కాల నాళికలు
శిల్పాలు శిలలపై చెక్కిన
రమ్య రమణీయ కావ్యములు
**********
 జ్ఞానమే శరణ్యము మనకు

కృష్ణుడు ఇస్కాన్ కల్టు వారి స్వంతమా‌ లేక వారి‌ కాపీరైటా, పేటెంటా?
వేంకటేశ్వరుడు వైష్ణవులకు‌‌ మాత్రమే దేముడా ఇతర భక్తుల కాయడా?

ప్రాంతము అక్కడి రాజకీయుల జాగీరా? తాతల ఆస్తా? మరెవరికి అక్కడ
చోటెందుకు లేదు? సంకుచిత్వము విషము చిమ్ముచువ్న నేడు, మత గురువులు,
నాస్తికులు, ప్రాంతీయ నాయకులు బరువు దేశమునకు; సామరస్యము తెలియని‌
మనుషులు శాంతి విధ్వంసకులు, సంఘ విద్రోహులు; అన్య మతముల, 


అన్య తత్త్వముల, అన్యదైవముల దూషించు‌వారు కారు మానవులు

ఇంగితము లేని వారు విద్యలు గరపగలరా? ఈ ఎల్లయ్యలు, పుల్లయ్యలు?
ద్వేషము క్రక్కు వారు సంఘమును నడుపగలరా? ఈ ఆధునిక సిద్ధాంత వాదులు?
మూర్ఖులై మూఢులై అనాగరికులు, సంస్కార హీనులు

గాక ఆ‌ ( నా )స్తిక శిఖామణులు? సమత మమత తెలియక,
నలుగుర కలుపుకుపోగల హృదయ‌ నైర్మల్యము లేక
పేచీ పెట్టు గురువులు, నాయకులు మేధావులు పుడమికి చేటు గాద!

ఆడలేనమ్మ మద్దెల ఓటన్నట్టు చేతగాక,
నూతనముగ ఏమి ఆవిష్కరించక
సాంప్రదాయమును, జ్ఞానమును నిందించువారు
సంస్కృతి, సంస్కారములు లేని అనాగరికులు, ‌
ఆటవికులు; ఇందర కుమనస్కుల భరించుట
భారతమునకు కష్టమగుచున్నది‌ నష్టమగు చున్నది‌;

ఎవరూ దేశమునకు చెందరు! అందరి సుఖ శాంతుల పోగొట్టు
దుండగీడులు వీరు; మేధావుల మనుకొను వాగుడు మూకలు!
జ్ఞానమే శరణ్యము మనకు; పెద్దల ఊసులే చద్దికూడు మనకు