Showing posts with label రామబ్రహ్మము. Show all posts
Showing posts with label రామబ్రహ్మము. Show all posts

Thursday, April 28, 2016

రామబ్రహ్మమును


రామబ్రహ్మమును



పదచిత్రముల రచింతును పదకవితా
పితామహుడను కాను; అందరు దేవతలు
దేవుళ్ళపై స్తోత్రములు కూర్తును భక్తశిరోమణిని
కాను; ప్రస్థానత్రయమును వ్యాఖ్యానింతును;

శంకర భగవత్పాదులను, రామానుజులను
మధ్వాచార్యులను కాను; రాధామాధవుల
శృంగారమును వర్ణింతును గీతగోవిందకర్తను
కాను; ఆత్మజ్ఞానావగాహనపై వ్యాసములు

రచింతును, ఉపన్యాసములనిత్తును,అద్వైత
వేదాంత శ్రేష్ఠిని కాను; శబ్దబ్రహ్మ సిద్ధాంతమును,
స్ఫోట వాదమును భాషాశాస్త్ర మెళకువలను
ఔపోసన పట్టితిని పతంజలిని భర్తృహరిని కాను;

కాలము పై అన్ని శాస్త్ర దృష్టులను సమన్వయ పరుతును
భౌతిక, మానసిక, సాపేక్ష కాలములను దర్శింతును ఐన్ స్టైన్ ను
 కాను; అన్ని దర్శనములను జ్ఞానబోధ మీమాంసా దృష్టితో
చూతును, సూత్రకారుడను కాను; మనకు జ్ఞానము
కలుగు విధమును విశదపరచెదను; నూతనుడను

నా తీరు నాది; నా పరిధి నాది; నా ప్రత్యేకత నాది,
నా దారి నాది; నా వ్యాఖ్యానములు నావి; నా
సృష్టులు నావి; సమన్వయకర్తను నేను; సౌమ్యత
నా ప్రాణము; జ్ఞానార్జనము, మానవ ‌వికాసములు,

మానవత్వ ప్రబోధము మూడు కళ్ళు నాకు;
త్రినేత్రుడను కాను; శ్రీకంఠుడను, శ్రియఃపతిని
కాను నేను; వారి అంశను; వారికి అద్వైతుడను;
తల్లిదండ్రుల‌ దయను కల్గితిని; చేరెదను వారిని

Monday, January 4, 2016

కాలము-సమయము-కాలాతీతము-మానసాతీతము-రామబ్రహ్మము

కాలము-సమయము-కాలాతీతము-మానసాతీతము-రామబ్రహ్మము

సమయము, కాలము వేరు. కాలము పరిణామము. సమయము కాల వ్యవధి. కాలము శక్తి లేక శక్తి ప్రేరిత పదార్ధ పరిణామము. పదార్ధము ద్వారా శక్తి రూపపరిణామమూ కాలమే. కాలము కలనము. కలనము అంటే లెక్క బెట్టుట. మనము అనుకునే కాల ప్రవాహము నిజానికి శక్తి లేక పదార్ధ పరిణామము. శక్తి, పదార్ధ పరిణామములు చర్యలను, ప్రతిచర్యలను, ఆంతర చర్యలను కలిగిస్తాయి. శక్తి, పదార్ధ పరిణామములు లేక ఎటువంటి చర్యలు జరగవు. చర్యలు లేక కాలము కాని, కాల గతి, గమనము కాని లేవు. కాలపు ఉనికి చర్యలు జరగడంపై ఆధారపడి ఉంటుంది. 

కాల స్పృహ, కాలగమన దృష్టి శక్తి, పదార్ధ పరిణామ గ్రహణలు. ఈ గ్రహణలు ఆగిపోతే మనము కాలాతీత స్థితిని అనుభవిస్తాము. గ్రహణారాహిత్యమే కాలాతీతము, మానసాతీతము కూడా. మనసు ఉనికి లేక కాల స్పృహ, కాలపు ఉనికి లేవు. మన గాఢనిద్ర మానసిక దశలో మనసు పనిచేయక విరమింపబడి ఉంటుంది. అన్ని తలపులు, అనుభవములు స్పృహలోనుండవు. దృష్టి విశ్రాంతమై ఉంటుంది.

ఈ స్థితిని జాగ్రత్ సుషుప్తి అంటారు. ఇది మానసాతీత ఆత్మ దశ. శాంతమన్నా, ఆనందమన్నా, మౌనమన్నా, మోక్షమన్నా, నిర్వాణమన్నా, శుద్ధాహం స్థితియన్నా, ప్రజ్ఞాన స్థితియన్నా, నిర్మల మానసిక స్థితియన్నా, పరా స్థితియన్నా, భక్తి స్థితియన్నా, రస స్థితియన్నా, దివ్య స్థితియన్నా, భగవత్ స్థితియన్నా ఇదే. జీవబ్రహ్మైక్య స్థితియన్నా ఇదే. ఈ దశలో వ్యక్తిత్వము విస్మరింపబడి ఉంటుంది.

ఆత్మారామ స్థితియన్నా, రామబ్రహ్మ స్థితియన్నాఇదే. సమస్త వేదాంత, సకల ఉపనిషత్ సార అవగాహనము, గమ్యము, ఆధ్యాత్మిక జీవన ఫలము ఈ స్థితిని పొంది, అందు సదా నిలిచి ఉండడమే.

ఏతత్ సర్వమ్ శ్రీ పరమేశ్వరార్పణమస్తు!
సమస్త సన్మంగళాని భవంతు!
భగవత్ ప్రీతిరస్తు!

Saturday, March 21, 2015

రామబ్రహ్మము





రామబ్రహ్మము

తామరాకుపై నీటి బొట్టును నేను;
 వికసించిన పూవుపై తొలి చినికును నేను
అరవిరిసిన మొగ్గపై జారు మంచు బిందువును నేను
కృంగిన ఎగసిన డెందపు బాష్పములు నేను

నదీతీరమున వీచు పిల్లగాలిని నేను
ఎదిగిన పైరుల పరామర్శించు పైర గాలిని నేను
వర్షము పడనున్నప్పటి హర్షము కల్గించు చల్లని గాలిని నేను
కురియు వాన జల్లుల వయ్యారపు సొగసును నేను

ఆకలి గొన్న కడుపు ఆకటి మంటను నేను
పదార్థముల పక్వము చేయు పొయ్యి జ్వాలను నేను
సమస్తమును దహించు అనలమును నేను
అజ్ఞాన తిమిరముల పోగొట్టు జ్ఞాన శిఖను నేను

సర్వమును ధరించు ధరిత్రిని నేను
అన్ని జీవుల స్థావర జంగమముల ఉనికి వహింతును  నేను
నేను లేక లేవు మొక్కలు, నదులు, సాగరములు,
ఆకాశమును చుంబించు కొండలు;
అన్ని జీవులకు అన్నమును అమర్చు అమ్మను నేను
పరమాత్మ ప్రాణ సఖిని నేను భూమాతను
అయినను ప్రకృతిని ధ్వంసము చేయు మనుషుల
మూర్ఖత్వమును పోగొట్ట లేని నిస్సహాయను పుడమి తల్లిని నేను

అన్ని తారల గ్రహముల సూర్య చంద్రుల
నభోంతరాళముల; వాటి మధ్య శూన్యమును  నేను
అన్ని తెలివిల తెలియుటల,తలపుల, ప్రకటించుటల
వాసనల ఏర్పరచుటుల, ప్రేరేపించుటల మూలమును
కారణమును నేను వాటిని వీక్షించు సాక్షిని నేను

పంచభూతముల కారణమునై వాటిలో లీనమై
నిర్వహింపబడు మానసిక కార్యకలాపముల
హృదయ మేళనము సమ్మేళనము నేను
మనసును నేను బుద్ధిని నేను అహంకార మమకారముల కలిగించెద నేను

వాటిని మూలమునకు త్రుంచెదను
వుల శరీర మానసిక స్పృహల
పోగొట్టి శాంతానంద  స్థితి వారికి సహజము  చేయు
స్ఫూర్తిని నేను; "అసలు నేను" గ్రహింపు నిచ్చెదను

ప్రపంచమును నేను ప్రపంచ కారకుడ నేను, స్థితి  నిచ్చెదను
లయ ఏర్పరచెదను  ; లయము కలిగించెదను;
సర్వ వ్యాపకుడను నేను; సమస్తమును నేను
నేను శబ్దమునకు, స్థితికి, నిర్వచనమును
రూపమును స్వరూపమును అర్థమును తాత్పర్యమును
అసలు నేనును నేను ,
బ్రహ్మమును, రామబ్రహ్మమును నేను