Showing posts with label మనుషులు. Show all posts
Showing posts with label మనుషులు. Show all posts

Sunday, November 12, 2017

స్థలాలు - మనుషులు; అమ్మాయిలు, ఆడవారు; ఇదే మాయ; ఆత్మారామము, రామబ్రహ్మము; భారతీయ తత్త్వ చింతన

మనిషి పరిమితియే భగవంతుడు. మనిషి పరిణితియే భగవంతుడు.

స్థలాలు - మనుషులు

ఆ రోజుల్లో పనికిరాని స్థలాలు ఇప్పుడు కోట్లు 
గడిస్తున్నాయి, వెధవలని ముఖ్యులను చేస్తున్నాయి

ఎప్పటికీ పనికొచ్చే మనుషులు పనికిరాని చదువులు 
చదివి, ఎందుకూ పనికి రాకుండా పోతున్నారు , ప్చ్!

స్థలాలకున్న విలువ మనుషులకు లేదు
**********

అమ్మాయిలు, ఆడవారు


అందమైన మగవారితో మాట్లాడడానికి
అమ్మాయిలు, ఆడవారు ఇష్టపడతారు
అందవిహీనులతో మాట్లాడడానికి ఇష్టపడరు
వారిని వదిలించుకోవడానికి కష్టపడతారు
ఎంతైనా "కన్యా వరయితే రూపం"
అనాకారులకు అందవిహీనులకు పాపం
***********
ఇదే మాయ

బట్టతల ఉన్నవారికి తలపై వెంట్రుకలిష్టం
వెంట్రుకలు దట్టంగా ఉన్నవారికి బాబ్డ్ హెయిర్ ఇష్టం

లేనిది కావాలనుకోవడం, ఉన్నది ఊడగొట్టుకోవడం
మనుషులకిష్టం; ఉన్నది లెక్క చేయదు మనసు;
పోగొట్టుకున్న దానికై యుగములు కుములుతుంది
అంతా భావనలే, అన్నీ తలపులే; మన తలపులే,

మన ఆలోచనలే మనం; మనసు గారడీ మనం
వాస్తవం గణించని ఊహలే ఊపును మనల; నిజముపై 
ఆనింపులే తాడును పామును చేయును;
కల మెళకువను తప్పుదారి పట్టించును; ఇదే మాయ
***********
ఆత్మారామము, రామబ్రహ్మము,

ఆత్మారామము, రామబ్రహ్మము, పరబ్రహ్మము, మోక్షము, శాంతి, మౌనము, ఆనందము సమానార్థకములు. తత్పరములు. ఉపనిషత్ వాక్య తాత్పర్యములు. భగవదానుభవములు. భగవత్ స్ఫురణలు. భాగవతుల మనములు. భక్తుల హృదయములు.
వేదాంత వాక్య రమణ స్థితులు. మనసు విరామ స్థితులు. రామ స్థితులు. అద్వైతానంద రమ్య స్థితులు. విభక్తి భక్తి యైన స్థితులు. పశ్యంతీ, మధ్యమా, వైఖరులు పరా యందు లీనమైన స్థితులు. పరమశివ, శ్రీమన్నారాయణ వాస స్థితులు.
కైలాస, వికుంఠ (వైకుంఠ) స్థితులు. మనసు గంతులు, గతులు ఆగిన నిర్మల మానసిక స్థితులు.
దివ్య, దైవ, దేవతా స్థితులు. మనం, మనము, నిండుకున్న నిండు స్థితులు. పూర్ణ స్థితులు. పరిపూర్ణ స్థితులు. విశ్వాసము పండిన స్థితులు. సుఖదుఃఖాలు ఎండిన ప్రశాంత స్థితులు. మన వ్యక్తిత్వములు పరమాత్మలో లీనమైన స్థితులు. సద్గతి పొందిన స్థితులు. శుద్ధజ్ఞాన స్థితులు.
పరమేశ్వర సదానంద చిదానంద స్థితులు.
పరమేశ్వరి కరుణాంతరంగ స్థితులు.
*************
భారతీయ తత్త్వ చింతన

భారతీయ తత్త్వ చింతనను ఉపయోగించుకొని హిందూ మతం వెలిసింది. భారతీయ తత్త్వ చింతన, హిందూ మతం ఒకటి కాదు. భారతీయ తత్త్వ చింతన మతాతీతం. హిందూ మతము కర్మలకు సంబంధించినది. ఆచార, వ్యవహారములు, పూజలకు, పురస్కారాలకు పెద్దపీట వేస్తుంది.
భారతీయ తత్త్వ చింతన భగవత్ తత్త్వ దర్శనము. ఇందు మతం ప్రసక్తి లేదు. హిందూ మతము భారతీయ తత్త్వ చింతన పై ఆధారపడి ఉంది.
భారతీయ తత్త్వ చింతన కుల, ప్రాంత, దేశ, భాషా, మతాతీతము. సర్వతంత్ర స్వతంత్రము. జ్ఞానోద్దీపకము. మనసును వికసింపచేయును. 
మనసును నియమించును. మూఢనమ్మకములను పోగొట్టి నిజరూప దర్శనము చేయించును


********


Saturday, June 11, 2016

భాషలు-భావములు-మనుషులు; మద్యం మత్తులో; మనిషి - జీవితము; ఎన్ డి ఎ ప్రభుత్వం - అవినీతి


 భాషలు-భావములు-మనుషులు

భాషలు ఎన్నైనా భావములు ఇన్నే
మనుషులు ఎందరైనా అనుభవములు ఇన్నే

భాషలు మారిన మాటలు మారును
భావములు, అనుభవములు అవియే

మతము మారిన దేవుని పేరు మారును
పూజా విధానము, ప్రార్ధించు విధము మారును
దేవుడు మారడు; దైవకృప, కారుణ్యము మారవు

పార్టీ మారిన దుస్తుల, కండువాల రంగులు మారును
పదవులవే, దోచుకొనుటలవే, మనోళ్ళను పైకి తెచ్చు
విధమదే; వివిధ పార్టీలు పేరుకే, అందులోనుండు
నాయకులు ఒక సరుకే; సరుకు లేని దుర్మార్గపు జడులే

దేశములెన్నైనా మనుషుల స్వార్ధములవే;
స్త్రీలైనా, పురుషులైనా ఆ పాప పంకిలములు
అంటువారే, అంటిన వారే; దేశము మారిన చర్మపు
రంగు మారును; మనుషుల దుష్టబుద్ధులు, దుర్మార్గములు
మారవు; ఏ వాతావరణములోనూ, పరిస్థితిలోనూ
మారనిదానిని అవ్యయము అందురు; మనుషుల

ప్రవర్తనలు దేశ కాల అబాధితములు మత, సంస్కృతీ,
నాగరికతలకు అతీతములు; భగవంతునికి భారములే

మద్యం మత్తులో 


మద్యం మత్తులో కార్లు, ఇతర నాలుగు చక్రముల వాహనములు, ద్విచక్ర, త్రిచక్ర వాహనములు నడపడం, ఎందరో పౌరుల జీవితాలు హరించడం డబ్బు, అధికారం మత్తులోనున్న ఎందరో ధనికులకు, బొడ్డూడని వారి పిల్లకాయలకు ఒక లైసెన్స్ గా మారింది. వాళ్ళ, వాళ్ళ పరపతితో ఏ విచారణా జరగకుండా, శిక్ష పడకుండా తప్పించుకోవడం పరిపాటి అయింది.

నీకు ఎంత డబ్బుంటే అంత ఎక్కువ తాగి, రాత్రి అంత ఎక్కువగా మేలుకొని తాగిన మత్తులో బండి నడిపి రోడ్డు మీద ఉన్న ఇతరుల పాలిటి యమధర్మరాజులై వారి ప్రాణములు హరించడం ఒక సంస్కృతిగా మారింది. ఫేషన్ అయింది. ఈ దుస్థితిలో దేశం అల్లల్లాడడం పౌరులకు ఒక దౌర్భాగ్యంగా మారింది. దీనిని అరికట్టడం ప్రభుత్వాల వల్ల కాదు అనీ అనిపిస్తోంది. ఒకరి తాగుడు, దానితో కలిగిన మత్తు, ఇతరుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం, ఈ విషయమై ఎవరూ ఏమీ చేయలేకపోడం హాస్యాస్పదంగానూ, ప్రాణాంతకంగానూ తయారైంది.

" సంపన్నుల" డబ్బు వారిని అన్ని నేరముల నుంచీ రక్షిస్తుంది.

నేడు ధనము చేయలేనిది లేదు కదా!

మనిషి - జీవితము


మాటలు కొన్ని మౌనములు కొన్ని
చేతలు కొన్ని దుడుకు చేష్టలు కొన్ని
శబ్దములు కొన్ని నిశ్శబ్దములు కొన్ని
అనుభవములు కొన్ని ఆనందములు కొన్ని
వేదనలు కొన్ని దుఃఖ భాజకములు కొన్ని
దృశ్యములు కొన్ని అదృశ్యములు కొన్ని
తెలివి కొంత తెలియమి కొంత తెలియుట కొంత
రాగము కొంత విరాగము కొంత రక్తి కొంత
విరక్తి కొంత ఆసక్తి కొంత అనాసక్తి కొంత
వెరసి మనిషి జీవితము అంతయు దైవాధీనము

 ఎన్ డి ఎ ప్రభుత్వం - అవినీతి

ఎన్ డి ఎ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరములు అయిన సందర్భంగా మోడీ గారు అవినీతిని అరికట్టాం అనడం బహుశా ఆయన, కొందరు మంత్రి వర్యులు అవినీతిని దరికి రానీయ లేదనేమో. కాని ప్రభుత్వంతో మన రోజూ వారీ వ్యవహారములలో లంచం ఇవ్వకుండా పనికావటం లేదు. ఇంక ఏ అవినీతి అరికట్ట బడింది?
టాక్సు వారు, రెవిన్యూ వారు, రిజిస్ట్రేషన్ వారు, ట్రాన్సుపోర్టు వారు, చెక్ పోష్టుల వారు, ఇలా నొక్కగలిగిన ఎన్నో విభాగముల వారు శుభ్రంగా నొక్కుతూనే ఉన్నారు.

అవినీతి మనసుకు సంబంధించినది కూడా. సరియైన విద్యాభ్యాసము, ఆధ్యాత్మిక జీవనము లేని మనుషులందరూ ఈ అవినీతిని ఆశ్రయిస్తూనే ఉంటారు. అవినీతి పరుల దురాశ, డబ్బుపై వారి కాంక్ష మనలని ఇబ్బందుల పాలు చేస్తూనే ఉంటాయి. ఆమ్యామ్యాలు తీసుకోకుండా ఉద్యోగులు మనకు ప్రభుత్వపు పనులు చేసిపెట్టరు.
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ దుస్థితి, మన అదృష్టము మారవు. నాయకుడెవడైనా, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు వారే. అవినీతి పరులే.