Wednesday, August 3, 2016

రాజకీయ వృత్తి; భారతదేశమున ప్రజాస్వామ్యము: విద్యాలయములు; ప్రత్యేక హోదా ‌



 రాజకీయ వృత్తి

అన్ని వృత్తుల వారికి, ఉద్యోగస్తులకు నియమ నిబంధనలు
ఉన్నాయి; ఒక్క రాజకీయ నాయకుల  వృత్తికి తప్ప;
రాజకీయము వృత్తియా, ప్రజాసేవయా? ఏమైననూ
దానికి నీతి‌, సమాధానము చెప్పుకోవలసిన అవసరము
లేవు; యథేచ్ఛగా అన్ని ఉల్లంఘనలు చేస్తూ, ఏ ఎండకు ఆ
గొడుగు పడుతూ, నాయకుని పాదాలు పట్టుచు, ప్రజల
మరచి, నాయకుని వందిమాగధులై "పుణ్యము, పురుషార్ధము"
చూసుకొనుచు చల్లగ నొక్కుకొనుచు
చిరకాలము చింతలు లేక సకుటుంబ పరివార
సమేతముగ రాజకీయముల వర్ధిల్లు అదృష్టము వారిది

***************
పుష్కరములకై ప్రభుత్వములింత హైరాన పడుచున్నవేల?
గోదావరియో, కృష్ణయో, ఎందుకింత ప్రచారము? రోడ్లు
సరియైనవి లేవు, చదువును ప్రైవేట్ వ్యాపారుల పరము
చేసి పేదల, మధ్యతరగతి, ఆ పై తరగతి పౌరుల నడుము
విరుచుచున్నారు; కుక్కిన షేర్ ఆటోలలో దిన దిన గండం
ప్రయాణాలు, బస్ లపై లగేజీలతో సుఖ ప్రయాణాలు
సున్నలాయె; వర్షములొస్తే అంతా మునకయే; కనీస
సౌకర్యములు కల్పించలేని; డంబాలు పలికే పాలకులు
ప్రజల అమాయకత్వమును, దురభిమానములను‌
చక్కగా వాడుకొనుచు ఎవరికీ ఏమీ చేయక కబుర్లతో
ప్రకటనలతో ఐదేళ్ళు గడిపేసి, మళ్ళీ ఓట్లకై బిచ్చమునకు
వచ్చి మరొక ఐదేళ్ళ పాలనకై ఎన్నికల సమయంలో
ఎన్ని కలలో పౌరులచే కనిపించి, వాగ్దానములను
మాయమాటలు చెప్పి తరములను గడిపేసి, తమ ఇంటి
తరవాతి తరము వారికి పట్టము కట్టుమనుచు సన్నాయి
నొక్కులు నొక్కుచు ప్రజాస్వామ్యమును భ్రష్టు పట్టిస్తున్న
నాయకులు కునాయకులు, మోసగాళ్ళు; పార్టీ ఏదైనా
పద్ధతి ఒకటే; ప్రజలను వెఱ్ఱి వారిని చేసి పదవులందుకొని
అందు కొనసాగడమే వీరి పాలన; పాలనలో పనిలో
పనిగా నొక్కెయ్యడం, మన కష్టములకు మొసలికన్నీరు కార్చడం
చర్విత చర్వణములు భారత ప్రజల ఆక్రోశములు; ప్రగతి
లేదు, సౌకర్యములు లేవు; నీటిపై రాతల వంటి వట్టి
మాటలు తప్ప; అన్ని పార్టీల నాయకులు ప్రజల నాడి
పట్టేశారు; భేదనీతితో ప్రజాస్వామ్యమును నడపుచున్నారు

**************

ప్రజలు గొఱ్ఱెలో, రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధులు
గొఱ్ఱె కాపరులొ; భారతదేశమున ప్రజాస్వామ్యము
నాయకస్వామ్యమై వర్ధిల్లుచున్నది; బాగులేదు దేశపు
నడక, నాయకులు చోరులై సమస్తమును దోచుచున్నారు

*************

విద్యాలయములు విశ్వవిద్యాలయములున్నది
ఉద్యోగార్ధుల ఉపయోగమునకై; విద్యార్ధులకు
జిజ్ఞాసువులకు భారతదేశమున విద్యగఱపు
విద్యాలయములే లేవు; జ్ఞానసరస్వతి అక్కర లేదు

**************
 ప్రత్యేక హోదా ‌

ప్రత్యేక హోదా ‌ఎవరికి కావాలి? నాయకులకు;
ఎందుకు? నొక్కడానికి మరింత దొరుకుతుంది వాళ్ళకు
కనుక; సామాన్యులమైన మనకు; ప్రత్యేక హోదా
ఇచ్చినా ఇవ్వకున్నా మన బతుకులలో తేడా ఉండదు
ఇంకా, ఈ గందరగోళమంతా రాజకీయంగా ఒకరినొకరు
నొక్కుకుందుకు; మనపై ఎవరికీ అభిమానంలేదు, మన
పురోగతి ఎవరికీ అక్కరలేదు; ఈ ‌రాజకీయ "చెదరంగంలో"
పావులం‌ మనం; ఇంత నిర్లజ్జగా, నిర్భీకంగా నాటకాలాడడం
రాజకీయనాయకుల నటనా‌వైదుష్యము; మనకై, మన సంక్షేమమునకై
పోరాడుచున్నామనుచు, తమ‌ తమ ఇళ్ళు చక్కబెట్టుకొను చతురులు
అంతా మిథ్య, భ్రాంతి, భ్రమ; వేదాంతమును మనకు ఉగ్గుపాలతో నేర్పు
వారు మన ప్రజాప్రతినిధులు, మంత్రి వర్యులు; ప్రజాస్వామ్య దుష్టకేళి ఇది

Monday, August 1, 2016

చదవడం - రాయడం; మొక్కల లేత చిగుళ్ళు

చదవడం - రాయడం

నాకు చిన్నప్పటి నుంచీ చదవడం, రాయడాలలో సమయయాపనం ఇష్టం. ఇలా గడపడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కాని దీనిని ఒక పనిగా గుర్తించడానికి ఎవరూ ఇష్టపడడంలేదు. రిటైరైన నన్ను ఎందులోనైనా జేరచ్చుగదా అంటూ ఎంతో బాధపడిపోతూ సలహాలు ఇస్తున్నారు. కాని చదవడం, రాయడంలతో సమయం గడపడం కూడా ఒక పనేనని ఎప్పటికి గుర్తిస్తారో జనులు?

మనిషి మాత్రమే సమస్త చరాచర జీవరాశిలో చదవగలడు, రాయగలడు. ఆలోచించగలడు. విచక్షణ చూపి విమర్శగా ఎన్నో మానసిక కార్యకలాపములను నిర్వహించగలడు. మరే ఇతర జీవికి ఈ సౌకర్యము, ప్రతిభా పాటవములు, వ్యుత్పన్నతలు లేవు.

అయినా మనిషి నాగరికత నేర్చినప్పటినుంచీ చదివేవారిని, వ్రాసేవారిని కాక; ధనవంతులను, అధికారము కలవారిని, దుష్టులను, దుర్మార్గులను గౌరవించినంతగా ఈ విద్యావంతులను సంఘం గౌరవించలేదు. గౌరవించటం లేదు.

మనిషి అనుభవించే అన్ని సౌకర్యములు ఏర్పడడానికి, ఆనందించే; లలిత కళలు, విజ్ఞానములు, జ్ఞానములు, నేర్పరితనములు, విద్యలను సృష్టించి, నేర్చినవారే సంఘానికి అందించారు. తరతరాలుగా నేర్పుతున్నారు కూడా.
కాని ముఖ్యముగా నేడు విద్య నేర్చుకోవడం జరగడం లేదు. ఏమీ నేర్వకనే, ఏదో ముక్కున బట్టి పరీక్షలు పాసై పట్టాలు పొంది; చదువు రాక, లేక, యే కాకుండా, ఉద్యోగమూ పొందలేక చదువుని తిట్టిపోస్తున్నారు. తమకు, చదువుకు గౌరవము, మర్యాద లేకుండా చేసికుంటున్నారు. కానీకి కొరగావడం లేదు. చదివినోడి కన్నా, వృత్తివిద్యను నమ్ముకున్నవాడు మిన్న అనిపిస్తున్నారు.

అలా వివిధ సాంఘిక, విజ్ఞాన శాస్త్రములు, ఎంతో సాహిత్యం, తత్త్వశాస్త్రములు తమని అవగాహన చేసుకున్నవారు, చేసుకునేవారు లేక బూజుపట్టి పోతున్నాయి.

విద్య నిగూఢ గుప్తమగు విత్తము పూరుషాలికిన్
విద్య యశఃకరి, విద్య విదేశ బంధుడున్ విద్య
నృపాల పూజితము ...విద్య నెరుంగనివాడు మర్త్యుడే

అని సుభాషితకారుడు చెప్పినది ఇప్పుడెవరూ పట్టించు కోవడం లేదు. పట్టా అనే కాగితం ముక్కకై హైరాన పడ్డట్టు విద్యను నేర్చుకోవడానికి తపించడం లేదు.

వీలైనంత తక్కువ నేర్చుకొని, వీలైనంత అధికముగా జీతములు అందుకోవాలనే ఆశ అందరి ఉద్యోగార్ధులను నడిపిస్తోంది. విద్యార్ధులు విద్యాలయములలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. విద్యకోసం ఎవరూ విద్యాలయములకు రావడంలేదు. అందరూ పట్టాల కోసం మాత్రమే విద్యాలయములలో చేరుతున్నారు. అందుకే భారతదేశంలో వివిధ శాస్త్రములు అభివృద్ధి చెందే దిశలో పయనించటంలేదు. ఏ విద్యార్థి శాస్త్రములను అవగాహన చేసికొని శాస్త్రములకు వన్నె తేవడంలేదు. జ్ఞాన సముపార్జనము నకు ముఖ్యమైన భాషాధ్యయనమే శ్రద్ధగా చేయడం లేదు.

దానికి తోడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి; మనిషి జ్ఞాన సముపార్జనతో సంబంధం లేకుండానే, వారి విద్వత్, విద్యావైదుష్యములతో పనిలేకుండానే ఉద్యోగవంతులను చేస్తున్నాయి. జ్ఞాపకశక్తి, తీవ్ర మేధోమథనము, విచక్షణ, శాస్త్రములో లోతైన అవగాహనా లేేకుండానే, ఉపయోగించకుండానే ఎందరో‌, ఎవరో కనిపెట్టిన Apps. ఆధారంగా ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు.

ఈ వాతావరణంలో నాలాంటి వాళ్ళం చాదస్తులుగా కనిపిస్తున్నాం. భాషతో సరియైన పరిచయం లేకుండానే, శాస్త్ర అపగాహన లేకుండానే; విద్యావంతులౌదామనే శ్రద్ధ, ఇచ్ఛ లేకుండానే; విద్యాలయాలనుంచి మంచి‌ పేకేజ్ తో వచ్చి ఉద్యోగజీవితం మొదలుపెట్టేస్తున్నారు.

సంఘంలో కూడా చదువు గురించి దృష్టి, అభిప్రాయము మారిపోయాయి. వట్టి గా పుస్తకాలు చదువుకుంటూ, తోచినది రాసుకుంటూ కాలక్షేపం చేసే మముబోంట్లు ఏ పనీ చేయక వృథాగా గడిపేస్తున్నామని అందరూ అనుకొంటున్నారు. అంటున్నారు.

నేను భౌతికశాస్త్రాచార్యుడిగా పదవీ విరమణ చేసి నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టమైన, అలవాటైన, చదవడం, రాయడంల తో రోజు గడుపుతూంటే ఎవరికీ అర్థము కావడంలేదు నా కాలక్షేప ప్రాధాన్యము.
ఏదైనా డబ్బులు సంపాదించే దానిని మాత్రమే ఒక పనిగా గుర్తించడానికి సంఘం సిద్ధంగా ఉంది. చదవడం, రాయడాలను మించిన పని మనిషికి ఇంకే వేరే ఏముంది?

చదువు, చదువుకొనడం లో తప్ప, చదువు కోవడంలో లేదు అనే ఇప్పటి నిర్వచనము మాలాంటి వారికి కొద్ది ఇబ్బందిగానే ఉంది.

డబ్బు సంపాదనకల పనే పని, మిగిలిన డబ్బు సంపాదించని సత్ కాలక్షేపములు పనికాదు వృథా కాలయాపనము అనుకోవడం ఆధునిక ఆలోచనా ధోరణి. చదువు గొప్పదనం గ్రహించి లోకం ఎప్పటికి అసలు చదువును, మనుషులకు దాని ఉపయోగాన్ని అవగాహన చేసికుంటుందో కదా!

చదువు స్వరూపము, విలువ, చదువు పరమార్థము తెలియని జాతిగా భారతజాతి మారడం ముదావహమైన విషయం కాదు.‌

************


మొక్కల లేత చిగుళ్ళు పసిపాపల బోసినవ్వులు;
అరటి లేతాకులు, మారాకులు కన్నియకమరు
రామణీయకతలు; తీగలు తరువులకల్లుకొనుటలు
ప్రణయినీ ప్రియ పరిష్వంగ ఆస్వాదనలు, ఆనందములు
విరుల తీవ యువతుల సొగసుల సొంపుల వంపుల
భాసా సమము; ప్రకృతి అంతయు ప్రకృతీ స్వరూపిణి
స్త్రీ అందచందముల ప్రతిబింబము; సౌందర్యాభాస
కనులకు విందు ప్రకృతి;యువతీయువకుల సంగతి అందు

 

వర్జనీయము, అనాగరికము; శాంత రసము - నా అవగాహనా క్రమము; కన్ను మూయని వారెవరు?;పెద్దలు చెప్పిన మాటలు

 వర్జనీయము, అనాగరికము


బంగారములు కొని లాకర్లలో పెట్టి
సింగారములకై పార్లర్ల చుట్టూ తిరుగు
సంస్కృతి; కుటుంబముతో రంగారు
బంగారు జీవనము వద్దని ఒంటరిగ
జీవించు ఇచ్ఛ; తమ వారికై జీవించుట
అవుట్ ఆఫ్ ఫేషన్; బాధ్యతలు స్వీకరించుటకు

మనసు రాదు; మేధావులును ఎన్ జీ వో లును
ఇతర సమాజ కార్యకర్తలును, కుటుంబములకు
వ్యతిరేకముగ ప్రతిపాదించి; నాగరికత, సంస్కృతి
సమన్వయ జీవనమునకు మంగళము పలుకుచున్నారు
ఉద్యోగము చేసి ధన సంపాదనము చేయుచు
స్వతంత్రముగ జీవించవలెనని నవీనుల నిర్దేశనలు;
ఒకరికొకరు ఏమి గాక తరువాతి తరమైన పిల్లల సాకక,
ముందరి తరమైన ముదుసలుల గాలికి వదలు
దాక్షిణ్య రహిత అప్రాచ్య ధోరణులు
మనకు ఖేదము మిగుల్చును; మనసులు
రగిలి ఆ జ్వాలల సుఖ సంతోషములు ఆవిరగును
తమవారికేమిగాని సంస్కృతి వర్జనీయము, అనాగరికము
 *****************

శాంత రసము - నా అవగాహనా క్రమము


నవరసములలో శాంతము ఎందుకు ఉందో మొదటిసారి ఉన్నత పాఠశాలలో వాటి గురించి తెలుగు మాష్టారు చెప్పినపుడు నాకు తెలియలేదు. అసలు రసము అన్నా, శాంతము‌ అన్నా నా బుల్లి బుఱ్ఱకు సరిగా‌ అర్థము కాలేదు. మిగతా రసముల విషయంలో సందేహం కలగలేదు గాని శాంతరసము విషయమే తికమకగా ఉండేది. శాంతము అంటే ప్రశాంతత అని అర్థము అయ్యింది కాని రసములలో అది ఉండడం, దాని రసస్థానము, రసస్వరూపము, శాంతరసాస్వాదనము విశదము కాలేదు.

రసము అంటే మనఃస్థితి అని పెద్దవుతున్న కొద్ది కొద్దిగా తెలవడం మొదలు పెట్టింది. శాంతము తప్ప మిగిలిన రసస్థితులలో మనసు ఉద్వేగము చెందుతుంది అని గమనించాను. ఆ రస స్థితులలో చిత్త ప్రకంపనములు ఎక్కువగా ఉంటాయని తెలవనారంభించింది. ఈ రెండు విషయములు గమనించిన తరువాత శాంతరసస్థితి గురించి నెమ్మదిగా అవగాహనకానారంభించింది.

రస స్థితి మనసు అనుభవ స్థితి అనీ తోచింది. చిత్తానుభవ స్థితీ ఇదే అనీ అనిపించింది.

మనసు ఉద్వేగము చెందని రస స్థితి శాంతరసస్థితి అనిపించింది. చిత్తప్రకంపనములు తక్కువ వడితో ఉంటాయనీ అనిపించింది. మిగిలిన రసములను అనుభవిస్తోంటే మనసు ఉనికి ఉంటుందని ఆ యా విషయములను అనుభవిస్తూంటుందని గ్రహణకు వచ్చింది. శాంత రసానుభవ స్థితిలో మనసు నిర్మలమై ఉంటుందనిపించింది. మనసుండదనిపించింది.

బ్రహ్మజ్ఞానము లేక ఆత్మజ్ఞానము అవగాహన చేసికుంటూంటే శాంత రసానుభవస్థితి మరింత విశదము
కానారంభించింది. పరమాత్మ స్థితి శాంతరసస్థితి అని తెలిసింది.

అందుకనే విష్ణుని

శాంతాకారం భుజగశయనం .......
అని శాంతస్వరూపునిగా వర్ణించారు.

అదే విధముగా శివుని
శాంతం పద్మాసనస్థితం........
అని వర్ణించారు.

లలితా సహస్రనామములో దేవిని ఎన్నో నామములలో శాంతస్వరూపిణిగా అభివర్ణించారు. ఇతర దైవములను, దేవతలను, దేవుళ్ళను కూడ శాంతస్వరూపులుగా చెప్పారు. అలా శాంతరసస్థితి భగవత్ స్థితి అనీ తెలిసింది.
పరమాత్మ స్థితిలో మనసు మొదలైన అంతఃకరణములు ఆత్మ చిత్ రూపంలో లీనమై ఉపశమించి విరమింపబడి ఉంటాయని తెలిసింది. ఆ స్థితిలోనే వ్యక్తిత్వ స్పృహ కూడా ఉండదని అర్కలాపములుతరాపములుతర అంతఃకరణములు పనిచేయక ఉపసంహరింపబడి ఉన్న చిత్ స్థితి శాంతరసస్థితి అనీ అవగాహనకు వచ్చింది.
రసోsవై సః అనే ఉపనిషత్ మహావాక్యమూ ఈ విషయాన్నే చెబుతోందని తెలిసింది. మిగిలిన ఎనిమిది రస స్థితులలో మనసు ఉద్వేగము చెంది ఆ రసానుభవాన్ని ఇస్తుందని, శాంత రసస్థితి విషయంలో మనసు తనే అదృశ్యమైపోయి, స్థిమితాన్ని, నెమ్మదివి ఇస్తుందని తెలిసింది.

నిర్మలమైన మనసే (విషయ, విషయానుభవ గ్రహణా రాహిత్య స్థితి) ఆత్మయనీ, పరమాత్మ యనీ, శాంతస్థితి
ఆ అంతఃకరణ పరిణామరహిత మౌనానంద స్థితియనీ గ్రహణకొచ్చింది.

అలా శాంతమూ ఒక రసమేననీ, శాంతరసస్థితి మనసు విరమింపబడినపుడు, మానసిక కార్యకలాపములు ఆగినపుడు అనుభవానికి వస్తుందనీ తెలిసింది. మిగతా రస స్థితులు మనసు పనిచేస్తున్నప్పుడు కలుగుతాయి. శాంతరసస్థితి మనసు పని చేయడం ఆపేసినపుడు అనుభవానికి వస్తుందనీ, ఇది పరమాత్మ రస స్థితి యనీ, సమస్త దైవ, దేవతా, దేవ స్వరూపములు శాంత భూయిష్ఠములనీ అవగతమైంది.

శాంతరసస్థితి దివ్యస్థితి యనీ జీవబ్రహ్మైక్యము జరిగినపుడు అనుభవానికి వస్తుందని, అంతఃకరణములు అప్పుడు విరమింపబడి ఉండి మానసిక కార్య కలాపములు జరగకుండా ఉపశమించి ఉంటాయనీ తెలిసంది. మిగతా రసానుభవములు మనసు అనుభవ స్థితులైతే, శాంతరసస్థితి మనసు ఆత్మలో లీనమై ఉనికి కోల్పోయిన అభావ స్థితి అనీ అనిపించింది. శాంతము రసములలో ఒకటి అనడానికి అభ్యంతర పెట్టలేదు నా మనసిప్పడు. అది ఆత్మలో లీనమై పోయింది కదా!

***********

కన్ను మూయని వారెవరు?


కన్ను మూయని వారెవరు? రాజైన పుడమికి చక్రవర్తైన
పేరుమోసిన రాజకీయనాయకుడైన పేరులేని నిరుపేదైన
అందరు పీల్చుదురు చివరి శ్వాసలు; అగును వారి
శరీరములు జడములు; ఆ పై ఆ శరీరములు శవములు;

కాని ప్రజాహితులు, కవిసత్తములు, ఉత్తములు
శాస్త్రములలో దిట్టలు, లలితకళా కోవిదులు,
సాంకేతిక రంగమున నిష్ణాతులు, ప్రముఖ క్రీడాకారులు,
సినీ వినువీధిని వెలుగు తారకలు మాత్రమగుదురు
కీర్తి కాయులు; మరణము లేదు వారికి; చిరంజీవులు
వారు; సంఘము మరువలేదు వారిని ధన్యులు వారు
********

పెద్దలు చెప్పిన మాటలు 

పెద్దలు చెప్పిన మాటలు అంతర్జాలంలో నలుగురికీ పంచడం కన్న
వాటిని మనం మన జీవితంలో ఆచరించి లాభపడుట మిన్న
గంగా నదీ స్నాన పుణ్యముపై కావ్యము వెలయించుట కన్న
గంగా నదిలో స్నానము చేసి విశ్వేశ్వరునికి మ్రొక్కుట మిన్న

 రాలిపోవును పండుటాకులు ఎండిపోవును సెలయేళ్ళు
ప్రకృతి ధర్మమున అన్నియు తారు మారగును, ఉనికి,
రాక పోకల యందు మన ఇష్టాయిష్టముల ప్రసక్తి లేదు;
అంతయు మన బుల్లి బుర్రలకు అందని శక్తి పరిణామ లీలలు