Showing posts with label చదవడం. Show all posts
Showing posts with label చదవడం. Show all posts

Monday, August 1, 2016

చదవడం - రాయడం; మొక్కల లేత చిగుళ్ళు

చదవడం - రాయడం

నాకు చిన్నప్పటి నుంచీ చదవడం, రాయడాలలో సమయయాపనం ఇష్టం. ఇలా గడపడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కాని దీనిని ఒక పనిగా గుర్తించడానికి ఎవరూ ఇష్టపడడంలేదు. రిటైరైన నన్ను ఎందులోనైనా జేరచ్చుగదా అంటూ ఎంతో బాధపడిపోతూ సలహాలు ఇస్తున్నారు. కాని చదవడం, రాయడంలతో సమయం గడపడం కూడా ఒక పనేనని ఎప్పటికి గుర్తిస్తారో జనులు?

మనిషి మాత్రమే సమస్త చరాచర జీవరాశిలో చదవగలడు, రాయగలడు. ఆలోచించగలడు. విచక్షణ చూపి విమర్శగా ఎన్నో మానసిక కార్యకలాపములను నిర్వహించగలడు. మరే ఇతర జీవికి ఈ సౌకర్యము, ప్రతిభా పాటవములు, వ్యుత్పన్నతలు లేవు.

అయినా మనిషి నాగరికత నేర్చినప్పటినుంచీ చదివేవారిని, వ్రాసేవారిని కాక; ధనవంతులను, అధికారము కలవారిని, దుష్టులను, దుర్మార్గులను గౌరవించినంతగా ఈ విద్యావంతులను సంఘం గౌరవించలేదు. గౌరవించటం లేదు.

మనిషి అనుభవించే అన్ని సౌకర్యములు ఏర్పడడానికి, ఆనందించే; లలిత కళలు, విజ్ఞానములు, జ్ఞానములు, నేర్పరితనములు, విద్యలను సృష్టించి, నేర్చినవారే సంఘానికి అందించారు. తరతరాలుగా నేర్పుతున్నారు కూడా.
కాని ముఖ్యముగా నేడు విద్య నేర్చుకోవడం జరగడం లేదు. ఏమీ నేర్వకనే, ఏదో ముక్కున బట్టి పరీక్షలు పాసై పట్టాలు పొంది; చదువు రాక, లేక, యే కాకుండా, ఉద్యోగమూ పొందలేక చదువుని తిట్టిపోస్తున్నారు. తమకు, చదువుకు గౌరవము, మర్యాద లేకుండా చేసికుంటున్నారు. కానీకి కొరగావడం లేదు. చదివినోడి కన్నా, వృత్తివిద్యను నమ్ముకున్నవాడు మిన్న అనిపిస్తున్నారు.

అలా వివిధ సాంఘిక, విజ్ఞాన శాస్త్రములు, ఎంతో సాహిత్యం, తత్త్వశాస్త్రములు తమని అవగాహన చేసుకున్నవారు, చేసుకునేవారు లేక బూజుపట్టి పోతున్నాయి.

విద్య నిగూఢ గుప్తమగు విత్తము పూరుషాలికిన్
విద్య యశఃకరి, విద్య విదేశ బంధుడున్ విద్య
నృపాల పూజితము ...విద్య నెరుంగనివాడు మర్త్యుడే

అని సుభాషితకారుడు చెప్పినది ఇప్పుడెవరూ పట్టించు కోవడం లేదు. పట్టా అనే కాగితం ముక్కకై హైరాన పడ్డట్టు విద్యను నేర్చుకోవడానికి తపించడం లేదు.

వీలైనంత తక్కువ నేర్చుకొని, వీలైనంత అధికముగా జీతములు అందుకోవాలనే ఆశ అందరి ఉద్యోగార్ధులను నడిపిస్తోంది. విద్యార్ధులు విద్యాలయములలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. విద్యకోసం ఎవరూ విద్యాలయములకు రావడంలేదు. అందరూ పట్టాల కోసం మాత్రమే విద్యాలయములలో చేరుతున్నారు. అందుకే భారతదేశంలో వివిధ శాస్త్రములు అభివృద్ధి చెందే దిశలో పయనించటంలేదు. ఏ విద్యార్థి శాస్త్రములను అవగాహన చేసికొని శాస్త్రములకు వన్నె తేవడంలేదు. జ్ఞాన సముపార్జనము నకు ముఖ్యమైన భాషాధ్యయనమే శ్రద్ధగా చేయడం లేదు.

దానికి తోడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి; మనిషి జ్ఞాన సముపార్జనతో సంబంధం లేకుండానే, వారి విద్వత్, విద్యావైదుష్యములతో పనిలేకుండానే ఉద్యోగవంతులను చేస్తున్నాయి. జ్ఞాపకశక్తి, తీవ్ర మేధోమథనము, విచక్షణ, శాస్త్రములో లోతైన అవగాహనా లేేకుండానే, ఉపయోగించకుండానే ఎందరో‌, ఎవరో కనిపెట్టిన Apps. ఆధారంగా ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు.

ఈ వాతావరణంలో నాలాంటి వాళ్ళం చాదస్తులుగా కనిపిస్తున్నాం. భాషతో సరియైన పరిచయం లేకుండానే, శాస్త్ర అపగాహన లేకుండానే; విద్యావంతులౌదామనే శ్రద్ధ, ఇచ్ఛ లేకుండానే; విద్యాలయాలనుంచి మంచి‌ పేకేజ్ తో వచ్చి ఉద్యోగజీవితం మొదలుపెట్టేస్తున్నారు.

సంఘంలో కూడా చదువు గురించి దృష్టి, అభిప్రాయము మారిపోయాయి. వట్టి గా పుస్తకాలు చదువుకుంటూ, తోచినది రాసుకుంటూ కాలక్షేపం చేసే మముబోంట్లు ఏ పనీ చేయక వృథాగా గడిపేస్తున్నామని అందరూ అనుకొంటున్నారు. అంటున్నారు.

నేను భౌతికశాస్త్రాచార్యుడిగా పదవీ విరమణ చేసి నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టమైన, అలవాటైన, చదవడం, రాయడంల తో రోజు గడుపుతూంటే ఎవరికీ అర్థము కావడంలేదు నా కాలక్షేప ప్రాధాన్యము.
ఏదైనా డబ్బులు సంపాదించే దానిని మాత్రమే ఒక పనిగా గుర్తించడానికి సంఘం సిద్ధంగా ఉంది. చదవడం, రాయడాలను మించిన పని మనిషికి ఇంకే వేరే ఏముంది?

చదువు, చదువుకొనడం లో తప్ప, చదువు కోవడంలో లేదు అనే ఇప్పటి నిర్వచనము మాలాంటి వారికి కొద్ది ఇబ్బందిగానే ఉంది.

డబ్బు సంపాదనకల పనే పని, మిగిలిన డబ్బు సంపాదించని సత్ కాలక్షేపములు పనికాదు వృథా కాలయాపనము అనుకోవడం ఆధునిక ఆలోచనా ధోరణి. చదువు గొప్పదనం గ్రహించి లోకం ఎప్పటికి అసలు చదువును, మనుషులకు దాని ఉపయోగాన్ని అవగాహన చేసికుంటుందో కదా!

చదువు స్వరూపము, విలువ, చదువు పరమార్థము తెలియని జాతిగా భారతజాతి మారడం ముదావహమైన విషయం కాదు.‌

************


మొక్కల లేత చిగుళ్ళు పసిపాపల బోసినవ్వులు;
అరటి లేతాకులు, మారాకులు కన్నియకమరు
రామణీయకతలు; తీగలు తరువులకల్లుకొనుటలు
ప్రణయినీ ప్రియ పరిష్వంగ ఆస్వాదనలు, ఆనందములు
విరుల తీవ యువతుల సొగసుల సొంపుల వంపుల
భాసా సమము; ప్రకృతి అంతయు ప్రకృతీ స్వరూపిణి
స్త్రీ అందచందముల ప్రతిబింబము; సౌందర్యాభాస
కనులకు విందు ప్రకృతి;యువతీయువకుల సంగతి అందు