Thursday, April 28, 2016

రామబ్రహ్మమును


రామబ్రహ్మమును



పదచిత్రముల రచింతును పదకవితా
పితామహుడను కాను; అందరు దేవతలు
దేవుళ్ళపై స్తోత్రములు కూర్తును భక్తశిరోమణిని
కాను; ప్రస్థానత్రయమును వ్యాఖ్యానింతును;

శంకర భగవత్పాదులను, రామానుజులను
మధ్వాచార్యులను కాను; రాధామాధవుల
శృంగారమును వర్ణింతును గీతగోవిందకర్తను
కాను; ఆత్మజ్ఞానావగాహనపై వ్యాసములు

రచింతును, ఉపన్యాసములనిత్తును,అద్వైత
వేదాంత శ్రేష్ఠిని కాను; శబ్దబ్రహ్మ సిద్ధాంతమును,
స్ఫోట వాదమును భాషాశాస్త్ర మెళకువలను
ఔపోసన పట్టితిని పతంజలిని భర్తృహరిని కాను;

కాలము పై అన్ని శాస్త్ర దృష్టులను సమన్వయ పరుతును
భౌతిక, మానసిక, సాపేక్ష కాలములను దర్శింతును ఐన్ స్టైన్ ను
 కాను; అన్ని దర్శనములను జ్ఞానబోధ మీమాంసా దృష్టితో
చూతును, సూత్రకారుడను కాను; మనకు జ్ఞానము
కలుగు విధమును విశదపరచెదను; నూతనుడను

నా తీరు నాది; నా పరిధి నాది; నా ప్రత్యేకత నాది,
నా దారి నాది; నా వ్యాఖ్యానములు నావి; నా
సృష్టులు నావి; సమన్వయకర్తను నేను; సౌమ్యత
నా ప్రాణము; జ్ఞానార్జనము, మానవ ‌వికాసములు,

మానవత్వ ప్రబోధము మూడు కళ్ళు నాకు;
త్రినేత్రుడను కాను; శ్రీకంఠుడను, శ్రియఃపతిని
కాను నేను; వారి అంశను; వారికి అద్వైతుడను;
తల్లిదండ్రుల‌ దయను కల్గితిని; చేరెదను వారిని

Thursday, April 14, 2016

నా కవితా సంకలనం ప్రచురణ: మన బ్రతుకులు



నా కవితా సంకలనం ప్రచురణ

నేను యానాంలో ఉద్యోగం చేసేటప్పుడు నా కవితా సంకలనం తేవాలని ఉవ్విళ్ళూరుతో ఉండేవాడిని అప్పటికి నేను ఆంగ్లం, తెలుగు, సంస్కృతములలో కవితలు, కథలు, వ్యాసములు రాస్తూండేవాడిని.
 
చుట్టుపక్కల ఎందరో కవులు, విమర్శకులు ఉంటూండేవారు. యానాం ప్రక్కన ఉన్న పల్లెపాలెంలోని మధునాపంతుల వారి లోగిలిలో సాహితీ కార్యక్రమములు తరచు జరుగుతూండేవి.
అక్కడికి తూర్పుగోదావరి జిల్లాలోని "లబ్ధప్రతిష్టులైన" కవులు, విమర్శకులు వస్తూండేవారు. వారిలో కొందరితోనే నా పరిచయం. వట్టి ముఖ పరిచయం మాత్రమే. గుంపులో గోవిందంలా ఉండేవాడిని.
 
అక్కడ, చుట్టుపక్కల జరిగే కవి సమ్మేళనములలోనూ నా తెలుగు కవితలు చదువుతూండే వాడిని. మొహమాటం చప్పట్లు తప్ప మరే గుర్తింపు ఉండేది కాదు. నేనూ పెద్దగా ఆశించేవాడినీ కాదు.
 
అప్పటికే ఉపనిషత్తులలోని ఆత్మజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానశాస్త్ర అవగాహనగా మారుస్తూండే పరిశోధనలో నిమగ్నమై కూడా ఉండేవాడిని. అందువల్ల కవిగా నన్ను చుట్టుపక్కల వాళ్ళే గుర్తించక పోయినా పట్టించుకునేవాడిని కాదు.
 
కాని నా చుట్టుపక్కల కవులు వాళ్ళ కవితా సంకలనాలనీ తెస్తూ, వాటి ఆవిష్కరణకు సభలు పెడుతూ పెద్దలను ఆహ్వానించి హడావిడి చేస్తూంటే, నాకు అంత హడావుడులు చేసే ఆసక్తీ, ఆర్ధిక సత్తువ, పరిచయాలు లేకపోయినా, నా తెలుగు కవితాసంకలనం తేవాలనే లాలస మాత్రం ఉండేది. ఈ ప్రయత్నమంతా చేతి చమురు భాగవతంగా మిగిలిపోతుందనే శంకా ఉండేది.
 
మీమాంసలో ఊగుతూ, నా కవితలు కొన్ని ప్రముఖ సినీకవులు, అవార్డు గ్రహీతలు అయిన ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయ కులపతులకు పంపాను. ఆయన వాటిపై స్పందించే తీరిక, ఉత్సాహము లేక కాబోలు స్థానిక కవులకు చూపించండని సలహా ఇచ్చే లేఖను వారి పి.ఏ. చే పంపించారు. ఆయన అప్పుడు తెలుగు విశ్వవిద్యాసయం ఉపకులపతులు. (నా వంటి చిన్న కవులు రోజుకి ఎందరో పెద్దలకు అభిప్రాయం కోసమై కవితలు పంపుతారనీ, వారికి మన కవితలు చదవడంపై ఆసక్తీ, తీరిక ఉండవనీ; పెద్దలను ఆకట్టుకోవడం జరిగేపని కాదని అర్థమైంది. అసలు ఆయనకి నేను నా కవితలు ఎందుకు పంపించానంటే; అప్పటికి వారం క్రితం సోదర కవి కవితా సంకలనం ఆవిష్కరించి, దానిని ఘనంగా పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశారు; అందుకని పంపాను. ).
 
అప్పుడు నా కవితలను అభిప్రాయం కోరుతూ రాజమండ్రీలో ఉన్న ఒక తెలుగుశాఖ ఆచార్యులకు పంపాను. ఆయన పద్యరచనలో దిట్ట. ఆయన మరింత ఘాటుగా సమాధానం రాస్తూ అసలు కవిత్వం రాయడం లోకువ అయిపోయిందని, అందరూ కవిత్వం బరికే వారేననీ, అయినా భౌతిక శాస్త్రము చదివిన నాకు కవితా రచన ఏమిటని, నేను నా కవితలు ప్రచురిస్తే ఆ తెల్లకాగితము వేస్ట్ అనీ ఆయన అభిప్రాయం పంపారు. దిమ్మతిరిగింది నాకు. కవితా సంకలనం తేవడం కాదు కవితలల్లడం పైనే ఆసక్తి చచ్చిపోయింది కొన్నాళ్ళు. తరువాత చిగురించింది అనుకోండి.
 
నేను ఆ ఆచార్యులకు కొంటెగా, నేను నా కవితా సంకలనం ప్రచురిస్తున్నాననీ, నా కవితలపై ఆయన అభిప్రాయాన్ని యథా తథంగా అచ్చువేస్తాననీ, అనుమతి ఇమ్మనీ రాసాను. ఆయన బెదిరిపోయి, ఆ అబిప్రాయం ప్రచురణకు ఉద్దేశించినది కాదనీ, కావసిస్తే మళ్ళీ పంపుతాననీ, దానిని ప్రచురించుకోవచ్చనీ కాళ్ళ బేరానికి వచ్చాడు.
దానితో నాకు తెలుగునాట అప్పటి కొందరు కవుల, విమర్శకుల ధోరణులు తెలిసాయి. నా కవితా సంకలనం తెచ్చుకోవాలనే ఇచ్ఛా కరిగిపోయింది.

ఈ అనుభవాలతో ఆనాడే నిశ్చయించుకున్నాను. నా కవితాసంకలనం ఎప్పుడైనా ప్రచురిస్తే పెద్జలను మాత్రం ముందు మాట రాయాలని కోరకూడదని. అలాగే నా కవితలపై అభిప్రాయం అడుగుతూ మరే పెద్దలకూ నా కవితలు పంపకూడదనీ.
 
నా కవితా సంకలనం తేవడంపై నా మరిన్ని అనుభవాలు మరొక సారి పంచుకుంటాను.

 మన బ్రతుకులు


పసికూనలు, ముసలివగ్గులు పువ్వువంటివారు. ఎంతో నాజూకైన వారు. వారిద్దరూ వారి పనులు వారు చేసుకోలేరు. మరొకరు వారికై చేసితీరాలి. వారిని మనం ఎంతో సున్నితంగా సాకాలి. దురదృష్ట వశాత్తు మన జీవన విధానంలో వీరికి ప్రాధాన్యం, థానం లేకుండా పోయాయి.
స్త్రీని గృహ ప్రాంగణం నుంచి విడదీసి చూడడం దగ్గరనుంచి పసికూనలకు, ముసలివగ్గులకు సంరక్షణ లేకుండాపోయింది. థెరిసా పేరు ముందు మదర్ చేర్చి అమ్మ ప్రాధాన్యాన్ని చాటి చెప్పే మనం, అవే పనులు ఇంట్లో ప్రేమగా,అనురాగం పంచుతూ చేసే గృహిణిని మగవానికి బానిస అంటాం. అంతా అస్తవ్యస్తమైన నేటి జీవన విధానంలో పసికూనలకు (వీరు ఆ స్త్రీ పిల్లలే), ముసలివగ్గులకు (ఆ స్త్రీ అత్తమామలే, తల్లిదండ్రులే), పరాయివారు కాదు, ఆధారం, అనునయం లేకుండా పోయింది. వారికి ఏ మానవ హక్కులూ లేవు. కుహనా మేధావులు, వివిధ వాదముల రక్తులు, వాదప్రియులు ఈ విషయంలో సంఘానికి చేస్తున్న అపకారం క్షమింపరానిది.
స్త్రీ, పురుషులిద్దరూ కలిసి సంపాదిస్తేనేగాని రోజు గడవని దుస్థితిలో ఉన్నాం మనం. పిల్లలకు, చదువు ఖర్చులు, మనందరికీ వైద్యం ఖర్చులు నింగినంటుతున్న ఈ వేళ ఎంత డబ్బు సంపాదించినా సరిపోని స్థితికి చేరుకున్నాం. అక్రమంగా డబ్బులు సంపాదించేవాళ్ళు తప్ప మరెవరమూ హుందాగా జీవించేస్థితిలో లేము.
దీనికి తోడు మనుషుల మధ్య అనుబంధాలూ మృగ్యమైతే, బతుకులు కష్టంగా ఈడ్వాల్సి వస్తుంది. మన జీవన విధానాలు, మన ప్రాధాన్యతలు మనం మార్చుకుని తీరాలి. ఈ విషయంలో మన పూర్వుల ఉక్తులు, అనుభవములు, సంసారము, సంస్కృతులు శిరోధార్యములు. తప్పక అనుసరించవలసినవి. వీటిని ఇప్పటికే నిర్లక్ష్యం చేస్తూ ఇక్కట్ల పాలవుతున్నాం. మేలుకోవడం మంచిది. ఆధునిక మేధావులకు, వాద ప్రియులకు బుద్ధి, బుర్ర తక్కువ. వారి హృదయములు మకిలి పట్టినవి. మనకు పనికిరావు. వీరు త్పుపట్టే, నిరసించే, నిందించే సాంప్రదాయాన్ని వదులుకోకుండా అనుసరిస్తేనే మనకు సుఖశాంతులు.
తస్మాత్ జాగ్రత! జాగ్రత!

Tuesday, April 12, 2016

ప్రవచనకారులు-మనము


ప్రవచనకారులు-మనము

మనందరిలాగానే నేనూ ప్రసిద్ధులైన ప్రవచనకారుల ప్రవచనములు వివిధ తెలుగు ఛానెల్స్లో వింటూంటాను. నేనూ వారి అభిమానినే. వారు ప్రచనములు ఇచ్చే విధానాన్ని గమనిస్తూంటాను.

వారందరూ ప్రవచన సార్వభౌములే. తెలుగు, సంస్కృత సాహిత్యములలో నిష్ణాతులే. ధారణలో దిట్టలే. జనరంజకముగా ప్రవచనము నడపడంలో చేయి తిరిగినవారే. శ్రోతల నాడి తెలిసినవారే. ఆధ్యాత్మికత నిలువెల్లా ప్రవహిస్తున్న వారే. ఆత్మజ్ఞానమున, భారతీయ సంస్కృతీ సంప్రదాయములలో లోతైన అవగాహన కలవారే.

మనలను వారు చిన్నపిల్లల క్రింద జమకట్టి మనకి బోధించే విధానము బడిలో మేష్టర్ల ధోరణిలో సాగుతుంది. మనందరం ప్రచనము వినడానికి అక్కడ కూర్చున్నా మన మన స్థాయిలలో, పాండిత్యములలో, , జ్ఞాన అవగాహనలో జ్ఞానబోధలో ప్రవచనకారులకు సాటి రాకపోయినా, పెద్దగా తీసిపోము. ఇచ్చే చేయి వారిది, అందుకునే చేయి మనది కాబట్టి, మన చేయి క్రిందవుతుంది. అంత మాత్రమున మనము పసివారలము కాదు కదా.

ఈ ఇంగితము కొందరు ప్రవచనకారులలో అభావము అవుతుంది. పెళ్ళి కొడుకు, పెళ్ళికూతురూ ఆ రోజునకే ప్రముఖులు. ప్రాధాన్యము కలవారు. అలాగే ఈ ప్రవచనకారులూనూ. వీరు ప్రవచనమునకై‌ ఏదైనా ఊరు వచ్చినపుడు మనం ‌చేసే హంగామా అంతా ఇంతా కాదు. పాద నమస్కారములు, వినయంతో తడిసి ముద్ద అయిపోవడం, వారికి తలకెక్కేలా
బ్రహ్మరథాలు పట్టడం వర్జనీయములు. ఇది సనాతన భారతీయ తత్త్వ సంస్కృతికి అపచారము.

ఈ ప్రవచనకారులు చెప్పే మాటలు విని‌ ఉప్పొంగిపోవడమే కాకుండా, ఆ మాటలను అవగాహన చేసికుంటే ఈ హడావుడులు ఇంతగా చేయము. ఒక సినిమా నటుడో, నటియో, ఆటగాడో మొదలైన "ప్రముఖులకూ", సెలిబ్రటీలకూ అందే మానసిక ఆరాధనకీ, మనం ఈ ప్రవచనకారులకు చూపించే అభిమానానికీ, ఆరాధనకీ తేడా లేదు.

వినోదము, వికాసము సమ్మిళితమైన ప్రవచనకారుల పాత్ర, భారతీయ ఆధ్యాత్మికతకూ, సంస్మృతికీ, ఎంతో మేలు చేస్తోంది. దాన్ని మనం మనసారా ఆహ్వానించి లబ్ధిపొందాలి గాని, పసివారిలా, వీర అభిమానులు గా మన వ్యక్తిత్వమును మరచి పణంగా పెట్టి భారతీయ‌ తత్త్వ సంస్కృతికి అపచారం చేయరాదు.


(ఆధ్యాత్మిక జ్ఞానం మనిషికి అవసరం, కూరలోకి ఉప్పు లాగ. రుచి ఇస్తుంది కదా అని ఉప్పుని మాత్రమే తినము కదా. అలాగే జీవితం నడకని సొంపుగా చేస్తుందని ఫక్తు ఆధ్యాత్మికత పాటిస్తే నీరసాన్ని కలిగిస్తుంది. లౌకికము, పారలౌకికము తగు పాళ్ళలో ఉంటే సొగసు. ఏదీ అతి పనికిరాదు. ముఖ్యంగా నేటి స్వాములు, ఆనందాలు, అమ్మలు, బాబాలు, బాపులు, మహరాజ్ లు, మువ్నగు కుహనా వ్యక్తుల బ్రాండు ఆధ్యాత్మిక సర్వదా వర్జనీయము. వీరిలో 99 శాతం ధన, స్త్రీ, కీర్తి, పేరు మొదలైన ఆకర్షణలను అధిగమించలేని అల్పులు. ఆధ్యాత్మిక పరమాన్నము లోనే ఉంటూ, దాన్ని అందరకూ పంచుతూ కూడా, దానిని వంటబట్టించుకోని, కోలేని నిరక్షరాస్యులు. ఆ మాధుర్యము తెలియని బండ నాలుక వారు. 

ఆధ్యాత్మిక ని తామే వంటబట్టించుకోని వారు మనకేమి ఒరగబెట్టగలరు?

శివ, విష్ణు, రామ, కృష్ణాది దివ్య నామముల వదలి అటునిటు తిరుగువారికి పరమార్దమెటుల తెలియు? పరమాత్మ ఎటుల దర్శనమొసగు?

భగవత్ ప్రీతిరస్తు!)

Sunday, April 10, 2016

జ్ఞాన, భక్తి, కర్మ మార్గముల విశ్లేషణ

జ్ఞాన, భక్తి, కర్మ మార్గముల విశ్లేషణ

అహమ్ (నేను - గమనిక) - ఇదమ్ (ప్రపంచం - మానసిక కార్యకలాపములు)

ఉపనిషత్తులు, బ్రహ్మజ్ఞానము, అద్వైత-ద్వైత వేదాంతములు ఆధ్యాత్మికతను కాచి వడపోశాయి. అవి అనుభవ పూర్వకముగా చెప్పిన విషయములు మానసికశాస్త్ర సారము. మనస్తత్వ విశ్లేషణ. నేను, నాది, పరాయిది, జీవాత్మ, పరమాత్మ, ప్రపంచము, జగత్ లను, వీటి మధ్య సంబంధమును లోతుగా అవగాహన చేసికొని మనకి అందించాయి.
ఈ ఆత్మ జ్ఞానములోని పరిభాషను సరిగా అర్థము చేసికోపోతే మరింత అజ్ఞానములో పడతాము (ఈశావాస్యోపనిషత్ ఉవాచ).

ఉపనిషత్ పరిభాషలో అహమ్, ఇదమ్ ముఖ్యమైనవి. అహమ్ అంటే నేను. ఇదమ్ అంటే బయటి చరాచర భౌతిక ప్రపంచము యొక్క ఆంతర ముద్రలు. ఈ ముద్రలు అంతఃకరణములైన మనోబుద్ధ్యహంకారచిత్తముల మాధ్యమముగా జ్ఞానేంద్రియముల సాయముతో మెళకువ (జాగ్రత్), కల (స్వప్న) మానసిక స్థితులలో సేదా దశలలో ఏర్పడిన గ్రహణము, గ్రహింపుల అంతర విషయ, విషయానుభవ సముచ్చయము, సమాహారము;

అవే అంతఃకరణముల ద్వారా ఈ విషయానుభవ, విషయ సమాహారముచే ప్రేరేపింపబడి మానసిక దృష్టికి వస్తే, దాన్ని‌ "జగత్" అంటారు; అప్పుడు మనకు మానసిక స్థితులు, మానసిక భావములు ఏర్పడతాయి. అలా ఏర్పడిన మానసిక స్థితుల, తలపుల కనుగుణముగా కర్మేంద్రియముల సాయముతో ప్రతిచర్యలు చేస్తాము మనము.
(కన్నులు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము జ్ఞానేంద్రియములు; దృశ్యములు, మాట‌ (ధ్వని), పరిమళములు (వాసనలు), రుచులు, స్పర్శలు ఈ జ్ఞానేంద్రయముల ద్వారా అంతఃకరణముల మాధ్యమముగా మనకు తెలుస్తాయి.)

(మానసిక స్థితుల, భావముల కనుగుణముగా కంఠనాళము కదలికలు - మాట్లాడడం, ధ్వనులు చేయడం; కాళ్శు, చేతులు కదపడం; జననేంద్రియ కదలికలు జరగడం; ప్రేవుల కదలికలు జరగడం కర్మేంద్రియములద్వారా ప్రతిచర్యలు చేయడం జరుగుతుంది. వీటినే సంస్కృత భాషలో వరుసగా వాక్-పాణి-పాద-పాయువు-ఉపస్థలు అంటారు.)

వీటన్నిటి సాయముతో ( ఆత్మ లేక బ్రహ్మము‌, అంతఃకరణములు, జ్ఞాన కర్మేంద్రియములు) ‌సమిష్టిగా పనిచేయడమే ఇదమ్ అవుతుంది. ఇదే మానసిక కార్యకలాపములు జరగడం. అహమ్ ఆత్మ లేక బ్రహ్మము‌ లేక ప్రజ్ఞానము లేక విశ్రాంత దృష్టిని సూచిస్తుంది. దీనిని గమనిక అనీ అనవచ్చు. ఆంగ్ల భాషలో Awareness అంటారు.
ఇలా గమనికలో మానసిక కార్యకలాపములుంటే అది ద్వైత స్థితి లేక ద్వైత దృష్టి అవుతుంది ఈ స్థితిలో అహమ్- ఇదమ్ రెండూ రెండుగా ఉండి, మానసిక కార్యకలాపములు జరుగుతూ ( జరుపుతూ ) ఉంటాయి.

ఇది మానసిక దృష్టి. బహిర్ముఖ, అంతర్ముఖ దృష్టులు మానసిక దష్టులు. ఇవి ఏకకాల లేదా ఒకదాని తరవాత ఒకటి లేదా ఏదో ఒకటే దృష్టి లేక గమనిక కావడం మానసిక దృష్టి సమయము అవుతుంది.

ఈ మానసిక స్థితులు ద్వైత స్థితులు. వీటిని జాగ్రత్ - బహిర్ముఖ దృష్టి, స్వప్న - అంతర్ముఖ దృష్టి - స్థితి లేక దశ లేక సమయము అంటారు.

గమనికలో ఏ మానసిక కార్యకలాపములు లేకుండా, జరగకుండా ఉంటే అపుడు దృష్టి విశ్రాంతమౌతుంది. శాంతము, ఆనందము, మౌనము అనుభవమౌతాయి.

ఈ స్థితిని అద్వైత స్థితి లేక ఆత్మ దశ లేక ఆత్మ స్థితి లేక బ్రహ్మ స్థితి లేక సుషుప్తి ( ఏమీ తెలియని - మానసిక కార్యకలాపములు జరగని) లేక మానసిక కార్యకలాపములు జరుగుచున్నా అంటని - జాగ్రత్ సుషుప్తి దశ అంటారు.
గమనికలో మానసిక కార్యకలాపములను లేని లేదా గమనించని ముక్త స్థితి ఇది. ఆంగ్లభాషలో దీన్ని Consciousness అంటారు. Pure Consciousness అన్నా, Unoccupied Awareness అన్నా, Content-free Contentment అన్నా ఇదే. భగవత్ స్థితి, పరమాత్మ స్థితీ ఇదే.

ఇప్పుడు ఈ స్థితిలో ( మానసిక కార్యకలాపములు మాయమై / మాయయై) గమనింపబడని స్థితిలో) ఇదమ్ దృష్టిలో ఉండదు. అహమ్ మాత్రమే - వట్టి గమనికగా‌ - అహమ్-అహమ్ స్ఫురణగా వెలుగుతూంటుంది.
ఇలా అహమ్, ఇదమ్ ల చుట్టూ తిరిగే బ్రహ్మ జ్ఞానము రకరకములుగా చూడబడింది; వ్యాఖ్యానింపబడింది.
అవి అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, శివాద్వైత, శాక్తాద్వైత మొదలగు దృష్టులు.

వీటిలో జ్ఞాన మార్గములు, భక్తి మార్గములు, కర్మ మార్గములు ప్రతిపాదించబడినాయి.

మన తత్త్వాన్ని‌ బట్టి మనము వీటిలో ఏదో ఒక మార్గమునకు ఆకర్షింపబడతాము అంతే. ఏ మార్గము ఇంకో దాని కన్న గొప్పది కాదు. అధికమైనదీ కాదు.

మార్గము, మన ఇష్టము‌ మాత్రమే. అదే అందరికీ పథ్యము కాదు. వ్యక్తి వ్యక్తికీ ఇష్టము, ఇష్టాన్ని బట్టి మార్గము మారుతుంది. అంతే తప్ప మన ఇష్టము మార్గము శ్రేష్టతను సూచించదు. అందుకని ఈ మార్గమే గొప్పదని ఉపన్యాసాలివ్వడం అవివేకము. పసితనము. మార్గ నిర్ణయము ముముక్షువునకు వదలి వేయాలి.
అహమ్, ఇదమ్ పరంగా అహమ్ ను మార్చే లేదా దాని నిజ స్వరూపాన్ని అర్థము చేసికునే ప్రయత్నము, ఆ అర్థానికి అనుగుణంగా తత్పరులై వేదాంత వాక్య తాత్పర్య స్థితిని నిరంతర అనుభవంగా‌ మార్చుకొని, నిజ అహమ్ గా జీవించడం జ్ఞాన మార్గము.

ఇదమ్‌ను అంతఃకరణములు, జ్ఞాన, కర్మేంద్రియములద్వారా మార్చబూనడం భక్తి, కర్మ మార్గములు అవుతుంది.
అలా మన మనస్తత్త్వము‌నకు అనుగుణముగా ఆధ్యాత్మిక మార్గమును మనమే ఎన్నుకొని మనంతట‌ మనమే, నకిలీ గురువుల సాయము అపేక్షించకుండా, అక్కర లేకుండా ముక్తినొంద వచ్చు. భగవంతుని కనవచ్చు.
ఈ అహమ్, ఇదమ్ ల‌ అవగాహన మీ ఆధ్యాత్మిక మార్గమును సులువు చేయుగాక! అనవసర కష్టనష్టముల పాలుగాక సులభముగా ముముక్షువులు మోక్షమునందెదరుగాక.

జ్ఞాన, భక్తి, కర్మ మార్గముల సమానతను, ఏకతను గుర్తించెదరు గాక! అనవసర వాదులాటలలో చిక్కుకొనక, వాటిని ఆపి, విస్మరించి తమ మనసుకు నచ్చిన ఆధ్యాత్మిక మార్గమును ఎన్నుకొని, అభ్యసించి తరించెదరు గాక!

సమస్త సన్మంగళాని భవంతు! సర్వే జనాః సుఖినో భవంతు! భగవత్ ప్రీతిరస్తు!

Saturday, April 9, 2016

అభిమానము - దురభిమానము

అభిమానము - దురభిమానము


మనుషులకు ఎవరినో ఒకరిని అభిమానించి తీరడం పుట్టుకతో వస్తుందనుకుంటా. తల్లిదండ్రులను, గురువులను అభిమానించడం, భగవంతుణ్ణి అభిమానించడం, కుటుంబ సభ్యులను అభిమానించడం, మిత్రులను అభిమానించడం అందరం చేస్తాము.

వీరిలో ఎవరినీ అభిమానించని వారు సినిమా నటీనటులను, రాజకీయనాయకులను, ఆశ్రమ నిర్వాహకులను, ఆధ్యాత్మిక గురువులను, సిద్ధాంతములను, ప్రాంతీయతను, కులాన్ని, మతాన్ని, ఆటగాళ్ళను వీరగా అభిమానించేసి, తమలోను, సంఘంలోనూ, గందరగోళం సృష్టిస్తారు. ఇది దురభిమానంగా తయారై అభిమానించడం అనేది ఒక వ్యసనంగా మారుతుంది. దీని దుష్ట ఫలితాలు వ్యక్తులు, సంఘం అనుభవిస్తారు. 

అందుకనే బహుశా మన పెద్దలు నట, విట, ఇత్యాదులను, దూరంగా ఉంచేవారు. కళలు, ఇత్యాది మనోరంజనకారకములు మనసును హరించి మనుషులను బానిసలుగా చేస్తాయి. ఆ మోజులో వారు ఉచ్చనీచములు మరచి మద్యము, గంజాయి సేవించిన వారి వలె ఆ మనోరంజకులకు మానసిక ఊడిగము చేస్తారు.

వారి వ్యక్తిత్వము, స్థాయి మరచి యువతీయువకులు, స్త్రీలు, పురుషులు నిజజీవితావ్ని ఉపేక్షించి ఈ మనోరంజకుల వినోదమాయలో సర్వమూ నిర్లక్ష్యము చేసి, జీవిత పరమార్ధము మరచి ఈ ఆకర్షణలో కొట్టుమిట్టాడుతారు.
చదువు, సంధ్య అటకెక్కి స్వాభిమానమూ పోగొట్టుకొని అలమటిస్తారు. ఇది వ్యక్తికి, సంఘానికీ కూడా మంచిది కాదు.

అభిమాన దురభిమానముల మధ్య ఎంతో అంతరముంది.

అభిమానము మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. దురభిమానం వ్యక్తిత్వాన్ని నాశనంచేసి మానసిక సమస్యలను, సాంఘిక సమస్యలను తెచ్చిపెడుతుంది. యువతీయువకులు సినీ నటీనటుల, క్రీడాకారుల పై, అటువంటి వారిపై, వాటిపై మోజును మోతాదు మించకుండా జాగ్రత్త పడాలి.
వ్యక్తి సర్వ స్వతంత్రుడు. ఒక పరిధి మించి ఎవరికీ అడుగులకుమడుగులొత్తరాదు.