నల్లనయ్యతో నేనునడచితి నా ఉదయమున కలతచెందిన మనసుతో
బరువెక్కిన హృదయముతో
అందమైన ఆ తోట యందు
తరులు ఫలములు లతలు విరులు
వర్షించెను ఆత్మీయత వృక్ష సంతతి
పలికెను స్వాగతము పచ్చని మనసుతో
హాయి కలిగె; మదిని నిండే సంతోషము
వికసించిన పూబాలల పలుకరించితి
ప్రకృతి చందమంతయు పరికించితి
వచ్చినదప్పుడే వసంతకాలము
మామిడి చిగురులు తిని కోయిలలు
ఆలాపించుచుండె ప్రణవ నాదము
అల్లన మామిడి గుబురుల నిలిచి
కలకాలము చేసె పక్షికులములు
వీవన వీచి మంద మారుతము
పన్నీటి జల్లు హృదిపై చల్లుచుండ
ప్రభవించె తూరుపు దెస ప్రభాకరుడు
ఎద ఎగయ చూచుచుండ ఇన్ని
అందములు; ఇంతలో ఎదురుగ
చూత వృక్ష చ్ఛాయని తిన్నెపైన
అవతరించె వెన్ను ఝల్లన

కస్తూరీ తిలకమును నొసట దిద్దుకుని
పీతాంబరము అందముగా కట్టుకుని
మందారమాల కంఠమున శోభించగ
మౌళి పై నెమలి పింఛము కదలాడగ
మోవిని తాకి లేత వెదుళ్ళు మనోహరముగ
భూపాల రాగమాలాపించుచుండ
అగుపించే నల్లని స్వామి; నిను నను
అందరిని కాచేటి కరుణా సముద్రుడు
సిరి దొర కనుపించె కన్నుల నిండుగ
నవ్వు రాజిల్లు మోముతో నాకు
ఉద్వేగము ఉత్కంఠ ఆనందము నను
ముప్పిరిగొని తొందర పెట్టుచుంద
పరుగెత్తితి రివ్వున బాణము వోలె
చేరితి శ్రీహరి సన్నిధి; వాలి పోతి
కన్నయ్య పాదాబ్జముల పూవు వోలె
స్పృశించితి పద్మాక్షు పాదములు మృదువుగా
తల ఎత్తి చూచితి ముకుందుని వైపు
ఆర్ద్రములైనవి కన్నులు; జల జల రాలె
బాష్ప కణములు; కడిగితి స్వామి
పాదములను ఆనాదాశ్రుధారలతో
ఉద్వేగమడగినది; ఉత్సాహము పెల్లుబికినది
భక్తి నిండిన కంటి చూపులు పత్రములుగ; అను
రక్తిని కరముల జోడింపు తీయని ఫలముగ
శక్తి మేర నారాయణ నామ స్మరణము తోయముగ స
ద్భక్తి మయమైన హృదయము పుష్పముగ
అర్పించి అర్చించితిని అచ్యుతుని
నేర్పుగ ఉల్లాసము కలిగించు కం
దర్ప జనకుని నీలమేఘ శ్యాముని దుష్ట
దర్ప వినాశకుని శ్రీ రమణీ మనోనాయకున్
ఓడలు నిమిరె కన్నుల తడి తుడిచి వైచె
అనునయించె స్వామి ప్రేయసి వోలె
చేరదీసి బుజ్జగించె అమ్మ వోలె
ఆనందము నిండ ఒదిగితిని ఒకింత
స్వామి ఒడిని పసిబిడ్డడి వలె
శ్రీమన్నారాయణ కర స్పర్శమున
పులకిత గాత్రుడనై పొందితి
దివ్య ఆనందానుభూతి దేముని చెంతన్
పలుకులు పలికించి అక్షరముల దిద్దించి శబ్దార్ధమయమైన భా
షల నేర్పించి కావ్యముల వెలయింపచేసి అందములు నింపి విం
దులు సేయు నిన్ను ఏ పదక్రమమున నుతింపను శౌరీ!
శ్రీలక్ష్మీరమణా! రంజిల్ల హృదయము సంతసము కలుగ నీకున్!
రాగములు సృజియించి శ్రావ్య నాదముల
ప్రకృతిని పులకింప చేయు మురళీగానలోలా!
ఏ రాగమున ఆలాపింపను నీ నామమును
అనురాగమున దక్క నా మానస వీణ పై
తపములు సేయలేదు జపముల ధ్యాస లేదు
మంత్రతంత్రములు ముందే తెలియవు
సతతము నీ నామ స్మరణము చేయమని
బుద్ధి అనుచున్నను బద్ధకించు నేను
చేయదగు చేయదగని కృత్యముల
విచక్షణా రాహిత్యమున వైకల్యము
నొందిన మనమున నిను నిల్పలేకున్నాను
కావుమయ్య కృష్ణ! కరిరాజ వరద!
జీవితమున ఎత్తులు పల్లములు
ఎక్కి దిగి ఎదురు దెబ్బలు తిని
శక్తి క్షీణించి మనసుకు లొంగి
మానస వర సంచారము నిలిపి
నీ మూర్తిని పొడగన లేకున్నాను
ముకుందా! నిర్వహించ వలసిన
ఒకటి రెండు బాధ్యతలు స్వీకరించి
ఆపై మనసు చెయ్ అల్లరికి అలసి
అవకతవకగ వర్తించు నన్ను
అర్జునుని వలె ఉద్భవుని వలె
చేరదీసి బ్రోవుము శ్రీకృష్ణా!
చీకులు చింతలు బాపుము శ్రీధరా!
కరుణను నాకు మరియొక మారు
భక్తి జ్ఞాన కర్మ మార్గములను
మనసుకు హత్తుకొనునట్లు
మధురముగ ఉపదేశించు మధుసూదనా!
టలు