Showing posts with label Telugu language and culture. Show all posts
Showing posts with label Telugu language and culture. Show all posts

Monday, January 18, 2016

ఎవరూ చెప్పలేరు

ఎవరూ చెప్పలేరు

అంతరించి పోతున్న భాషల్లో తెలుగు భాష కూడా ఒకటి. మన పిల్లలు ఎక్కువమందికి ఎవరికీ మనం మాట్లాడే తెలుగు కూడా అర్ధము కాదు అంత అంతస్థులో ఉన్నారు. ఏమిటో వాళ్ళు ఏ భాషాకూడా సరిగ్గా నేర్చుకోవడం లేదు. ఉపయోగించడం లేదు.వారికి కలిగే భావాలకి పొట్టి పొట్టి పదాలు, వ్యాకరణ రహిత ధ్వనులు సరి పోతున్నాయి. వర్ణక్రమము వారికిపట్టనే పట్టదు. నానార్ధములు, శ్లేషలు, వారి శబ్ద రత్నాకరములలొ లేవు.

ఎందుకు భాష గురించి, సంస్కృతి గురించి తాపత్రయ పడడం? తరువాతి తరములు పట్టించుకోనిది ఏదీ నిలవదు. భాష నదీప్రవాహము వంటిది. ప్రతి క్షణము మారుతూ ఉంటుంది. అవును. కాని ప్రస్తుత తరంలో అసలు నదులలో నీళ్ళే ఉండటము లేదు. అన్నీ వేసవి కాలపు సెలయేళ్ల వలే ఇసుక పర్రలు, రాళ్ళ మయము మాత్రమే గా ఉన్నాయి.

సాహిత్యమూ అదే ధోరణిలో నడుస్తూంది. కవులు, రచయితలు, "మేధావులు" కుల, మత, ప్రాంత, వర్గ, సిద్ధాంత, లింగ భేదములతో విడిపోయి ఎవరి వేరు కుంపటి వాళ్ళదిలా చరిస్తున్న ఈవేళ ఏది భాష? ఏది సాహిత్యము? ఏభైలు, అరవైలలో, ఆపైన వయసున్నవారు ఏదో తాపత్రయముగా, పాత జ్ఞాపకముల నెమరువేతగా సాహితీ చర్చ, పఠనము చేస్తున్నారు తప్ప, ఇప్పటి తరానికి ఇవేమీ పట్టవు

నన్నయ, తిక్కన, ఎర్రాప్రగ్గడ, శ్రీనాథుడు, పోతన, పెద్దన మొదలైన వారందరూ వారి ప్రకృతికి అనుగుణముగా కావ్యాలను వెలయించారు. అవి విద్యాలయములలో పాఠ్య వస్తువులుగా ఉండేవి.

ఇప్పటి అవసరాలు, చదువుకొనే విధానము భాషా, సాహిత్యాధ్యయనానికి, పటిమకు, పెద్దపేట వేయడం కాదు కదా అసలు వాటిపై దృష్టి యే నిలపడం లేదు.

విద్యాభ్యాసము ఉద్యోగమునకు ముందటి వ్యాయామముగా మారిపోయింది. భాషలను, జ్ఞానాన్ని నేర్చుకోవడం తల్లిదండ్రుల లేదా విద్యార్థుల రాడార్ లో లేవు.

భాష నేర్వక, చదివిన శాస్త్ర జ్ఞానము నిలుపుకోక, ఉద్యోగము తెచ్చుకొనుట మాత్రమె పరమార్ధము అయిన ఈవేళ చదువుకొనడం ఆగి పోయింది.

చదువు ప్రయోజనమే హరించుకు పోయింది. దీనికి ఎవరు బాధ్యులు అని తలలు బ్రద్దలు కొట్టుకున్నా, తలలు పట్టుకున్నా ఏమీ లాభం లేదు.

మిగతా విషయాలలో సర్డుకున్నట్టే ఇందులోనూ సర్దుకొని సమాజం సాగి పోవాలి.
ముందుకో, వెనుకకో ఎవరూ చెప్ప లేరు.