Showing posts with label Somnath. Show all posts
Showing posts with label Somnath. Show all posts

Saturday, March 4, 2017

మా సోమనాథ్ యాత్ర - మొదటి, రెండవ భాగములు

మా సోమనాథ్ యాత్ర - మొదటి భాగము

నేను, మా ఆవిడ సోమనాథ్ సందర్శించడానికి ఫిబ్రవరి 25న బొంబాయిలో సౌరాష్ట్ర మెయిల్ లో బయలుదేరాము. నాకు బొంబాయి అనే వస్తుంది. ముంబయి అనే పదం మా మస్తిష్కంలో సరిగా చోటు చేసికోలేదు.
అలాగే మద్రాసు మాకు చెన్నై కాదు. కలకత్తా కోల్ కత్తా కాదు. కొచ్చిన్ కోచి కాదు. క్విలన్ కొల్లం కాదు. ట్రివేండ్రమ్ తిరువనంతపురం కాదు. బెల్గాం బెలగవి కాదు. గుల్బర్గా కులుబెరిగి కాదు. బెంగుళూరు బంగలూరు కాదు. రాజమండ్రి రాజమహేంద్రి కాదు. ప్రాంతీయ అభిమానాలో ఏమిటో ఈ నగరాల పేర్లు మార్చబడ్డాయి. అంత చలాకీగా, నిజాయితీగా ఈ రాష్ట్రాల ప్రజల స్థితిగతులు ఏమీ మారలేదు. నగరాల పేర్లు మార్చనపుడు ఎలా ఉన్నాయో ఇపుడూ అలానే ఉన్నాయి; ముక్కుతూ, మూలుగుతూ.

ప్రాంతీయ సంస్కృతులు, నాగరికతలు పేరుతో భారతీయులను వెఱ్ఱి వెంగళప్పల కింద జమ కట్టి మోసం చేయడం మన రాజకీయ నాయకులకే చెల్లింది. మన దురభిమానాలు, బలహీనతలు కూడా వేణ్ణీలకు చన్నీళ్ళలా దోహదం చేశాయి. ఫలితం మనం భారతీయులమని ఎప్పుడూ అనుకోకుండా ఈ విభేదాలు మనలని విడదీసి రాజకీయ నాయకులకు బలి పశువులను చేస్తున్నాయి. మన స్థితి గతులను ఏమాత్రమూ మార్చనవసరము లేకుండా మన ఆర్ధిక, సాంఘిక, సామాజిక జీవితములను అల్లాగే అధ్వాన్నంగా ఉంచుతూ మన ఓట్లను మాత్రం పట్టేసి పదవులు పట్టేసే సులువు రాజకీయ నాయకులకు మనం అప్పనంగా ఇచ్చేశాము. అది రాజకీయ నాయకుల అదృష్టము.
ఇంతకీ మేము సౌరాష్ట్ర మెయిల్ లో సోమనాథ్ కి బయలుదేరాము. చాలా మందికి మల్లే నా జీవితంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు చూసితీరాలని సోమనాథ్ కి బయలుదేరలేదు. నాకు ప్రయాణాలు చేయడం, ప్రదేశాలు చూడడం ఇష్టం. ఇప్పటికి భారతదేశంలో కొన్ని ప్రదేశాలు చూశాము. ఇది మరొక యాత్ర అంతే.

పుణ్యము, పురుషార్ధము కలిసివచ్చేలా యాత్రలుంటే అభ్యంతరం లేదు. నాకు భగవంతుడు ఉన్నాడో లేదో ఖచ్చితంగా తెలియదు. భగంతుడని ఒకాయన ఉండి మన బాగోగులు చూస్తున్నాడు, చూస్తాడు అంటే అదో ఉపశమనం. ప్రశాంతత. మేము స్మార్తులము. మాకు శివ కేశవ అభేదము. అందరు దేవుళ్ళూ దేవతలూ సమానమే; ఇష్టమే. పూజలు, పునస్కారాలు, అభిషేకాలు చేయడం ఇష్టమే. కాని క్షేత్రదర్శనాలకు వెళ్ళినప్పుడు మాత్రము ఈ బాదరబందీ ఏదీ పెట్టుకోకుండా భగవద్దర్శనము మీదే దృష్టి పెట్టకోవడం ఇష్టం. దర్శించే‌ దైవ నామ స్మరణ చేసికుంటూ, క్షేత్ర, ఆలయ దర్శనములు చేస్తాను. నా భార్య అన్ని విషయాలో లాగానే నాకు సహకరిస్తూ అనుసరిస్తుంది.

ఇద్దరం కలిసి ఆ మరునాడు సాయంకాలానికి వేరావెల్ చేరాము. ఇది చిన్ని పట్టణము. ఇక్కడినుంచి సోమనాథ్ 8 కి.మీ. వేరావల్ లో మా అబ్బాయి హేటల్ గ్రాండ్ దక్ష్‌లో రెండురోజులకి రూమ్ బుక్ చేసి ఉంచాడు.

టూరిస్టులమైన మనకు కష్టాలు రైలు దిగిన వెంటనే కూలీలు, ఆటోవాళ్ళు, టేక్సీ వాళ్ళ రూపంలో మొదలౌతాయి కదా. లాగుడు పెట్టెల వల్ల కూలీల బాధ తప్పించుకున్నాము. కాని ఆటో, టేక్సీ ల వల్ల తప్పదు కదా. మెట్రో నగరాలలో ఊబర్, ఓలా ల వల్ల కొంత వెసులుబాటు కలిగించుకున్నాము. చిన్న పట్టణాలలో ఈ సదుపాయం ఉండదు కదా. మనలని చూడగానే ఈ ఆటోవాళ్ళకి, టేక్సీ వాళ్ళకి పులికి లేడి చిక్కినట్టుంటుంది అనుకుంటాను.
మొత్తానికి వాడు అడిగిన దానికి సగం ఇస్తానని గట్టిగా‌ నిలబడేసరికి వచ్చాడు హోటల్ కి చేర్చాడు. వాడి కార్డు ఇచ్చి వాడి ఆటో సౌకర్యము ఉపయోగించుకోవచ్చని చెప్పాడు. ఆ చెప్పడంలో ఒక ఉపకారం చేశాడు. హోటల్ నుంచి సోమనాథ్ గుడికి రాను పోను 300 అవుతుందన్నాడు. అలాగేనని బుర్ర ఊపి హోటల్ గదిలో ప్రవేశించాము. హోటల్ గది, వాతావరణము, బాగున్నాయి. వేరావల్ జునాగఢ్ హైవే‌ మీద ఉంది ఆ హోటల్. సాయంకాలం ఐదు అయింది. ఒకసారి దర్శనము చేసుకుని వద్దామనుకున్నాము.

నేను మధ్య తరగతి వాడిని రూపాయితో అయిపోయే చోట వందలు, ఏభైలు ఖర్చుపెట్టలేను. దూరం పది కిమీ. మూడు వందలు ఖర్చుపెట్టడం ఇష్టంలేక పోయింది. మాకు హోటల్ వాచ్ మన్ రూపంలో రక్షకుడు దొరికాడు. అతని సలహా ప్రకారం చెరో పది రూపాయలతో‌ షేర్ ఆటోలో వేరావల్ సెంటరు చేరి, మరో షేర్ ఆటోలో అదే ఖర్చుతో సోమనాథ్ దేవాలయానికి చేరాము. అక్కడి సంగతులు రెండవ భాగంలో
మా సోమనాథ్ యాత్ర - రెండవ భాగము

అలా షేర్ ఆటోలో చీకటి పడుతూండగా సోమనాథ్ చేరాము. దారిలో రోడ్డు ఎంతో గతుకులతో ఉంది. షేర్ ఆటోలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. బస్సుల జాడే లేదు. ఆంధ్రప్రదేశ్ లాగానే తక్కువ దూరాలకు ట్రాన్స్ పోర్ట్ షేర్ ఆటో కుర్రాళ్ళకి, దూరాలు పైవేట్ ఆపరేటర్లకి వదిలేసి ప్రభుత్వ రవాణా సంస్థలు మూతపడేసే కార్యక్రమం ఇక్కడ కూడా అమలవుతోంది.

దారి పొడుగునా చేపల కంపు ఉపద్రవంగా అనిపించింది. అక్కడ ఎన్నో చేపలు పట్టే నావలు, చేపల హడావుడి కనిపించింది. ఆ వాసనలు దాటుకొని ఒక మంచి రోడ్డులోకి ప్రవేశించాము. ఒక కిలోమీటరు తరువాత గుడి వద్దకు చేరాము. గుడి, పరిసరాలు ముగ్ధ మోహనముగా ఉన్నాయి. మేము వెళ్ళేసరికి హారతి టైమ్.

అరేబియా. సముద్రం ఒడ్డున 1950లో కె. ఎమ్. మున్షీ గారి చొరవతో శిథిలాలలో నున్న సోమనాథ్ దేవాలయాన్ని పునరుద్ధరించారు. దానిని అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. అలా రాష్ట్రపతి ఒక హిందూ దేవాలయ కార్యక్రమంలో పాల్గొనడం అప్పటి సెక్యులర్ ప్రధాని నెహ్రూకి అభ్యంతరకరమైంది. రాష్ట్రపతి పట్టించుకోలేదు. ఈ విషయమే కాదు ఎన్నో విషయాలలో విభేదించి రాష్ట్రపతి, ప్రధాని ఎంతో కరస్పాండెన్స్ చేసుకున్నారు.

ఏమిటో భారతదేశపు జాతకం. సెక్యులరిస్టులందరికీ అప్పటినుంచీ హిందూమతమే లోకువ. సెక్యులరిష్టులు ఇతర మతముల జోలికి పోరు. వాటిలో లోపములే కనుపించవు వీరికి. కనిపించినా పిత్తిన ముత్తైదువ లా మౌనంగా, కిక్కురుమనకుండా ఉంటారు. వారి అంతరంగం సరసులకి ఎప్పటికీ బోధపడదు. భయమో, భక్తో, ద్వేషమో, విద్వేషమో, ఏది వారి హృదయాలను ఏలుతోందో తెలియదు.

మా హేండ్ బేగ్ లను మొబైళ్ళు, బెల్ట్ లతో సహా దేవస్థానం వారి కష్టడీకి అప్పగించి దేవాలయంలోకి ప్రవేశించాము. క్యూ‌ వరసగా కదులుతూనే ఉంటుంది. ఎదురుగా భోలానాథ్, హర్ హర్ మహాదేవ ధ్వనులతో అట్టహాసంగా, అందంగా, ఆనందంగా పరమేశ్వర దర్శనం చేసికున్నాము. స్త్రీ, పురుషులు విడిగా దర్శనము చేసికోవాాలి. అప్పుడే హారతి ఇవ్వడం జరిగింది. హారతి విశేషాలు తరువాయి భాగంలో.

మా సోమనాథ్ యాత్ర -మూడవ, నాలుగవ భాగములు

మా సోమనాథ్ యాత్ర - నాలుగవ భాగము

ఫిబ్రవరి 27 ప్రొద్దున్న అలా ఏడు గంటలకి సోమనాథుని సోమవాగ దర్శనానికి బయలుదేరాము. ఇంకా ‌తెలవారలేదు. చలిగా లేదు గాని, చల్లగా‌ ఉంది. మామూలుగానే షేర్ ఆటోల ద్వారా‌ సోమనాథ్‌ చేరాము.
కొంత మందికి షేర్ ఆటోలు ఎక్కడం మానసిక, మరియు శారీరిక ఇబ్బంది. మరికొందరికి నామోషీ, దర్జా‌ లోపం. మాకు ఆ శషభిషలు ఏమీ లేవు. లగేజీ‌ లేనపుడు ఇబ్బంది అంత ఉండదు. సోమనాథ్ లో గుడి చుట్టుపక్కల హోటళ్ళు, ధర్మశాలలు ఉన్నాయి. వేరావల్ నుంచి వెళ్ళి రానవసరం లేదు.

మేం వెళ్ళేసరికి భానుడు తన బంగరు కిరణములను సోమనాథ‌ దేవాలయంపై, చుట్టుపక్కల ప్రసరిస్తూ ఆహ్లాదమయం చేశాడు. దేవాలయంలో భక్తులు ఎక్కువగా లేరు. కాని క్యూ ఉంది. క్యూలో మన దర్శనం అయిపోగానే వెంటనే వెళ్ళిపోవాలి. కావలిస్తే జనం లేనప్పుడు మళ్ళీ క్యూలో నుంచుని దర్శనం చేసుకోవచ్చు. 15 సెకనులు మించి నుంచోనివ్వరు.

లింగ స్వరూపంలో సోమనాథుడు కనువిందు చేశాడు. రాత్రి అలంకారంలో చూశాము. ఇప్పుడు‌ లింగాకారాన్ని చూస్తున్నాము. ఆ లింగం 1950 లో పునర్నిర్మాణం సమయంలో ప్రతిష్ఠించిన లింగం. అసలు ప్రతిష్ఠించబడిన లింగం దండయాత్రలలో, విధ్వంసాలలో ఎన్నో మారులు ముక్కలు ముక్కలు అయిపోయిఉంటుంది. కాశీలోనూ అంతేకదా. వెనుక ఉన్న పార్వతీ దేవి మందహాసం చిందించుతూ ఆశీర్వదించింది.

సంతృప్తిగా సోమవారం ఉదయం సోమనాథ దర్శనం చేసికొని, అయ్యవారి ఇరుగడలా ఉన్న అంబాదేవి, త్రిపుర సుందరులకు మ్రొక్కి, ఖాళీగా ఒక వేదికగా ఉన్న పార్వతీ దేవి పాత ఆలయభాగం చూసి, వినాయకుని, హనుమంతుని, వెనుక వైపున్న అరేబియా సముద్రాన్ని మరల చూసి, బయట పాత సోమనాథ దేవాలయం దర్శనం చేశాము. ఆవేళ సోమవారం కాబట్టి ఈ పాత దేవాలయంలో పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి.
నమస్కరించి, బయటకు వచ్చి వేరావల్ హోటల్ కి చేరాము. హోటల్ వారి కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ భారీగా చేసి విశ్రమించాము.

అది నిద్రగా మారి మధ్యాహ్నం 3 గంటలకు లేచాము. వెంటనే తెమిలి చుట్టుపక్కల ప్రదేశాల సందర్శనానికి బయలుదేరాము. మాకు ముందుగానే విజిటింగ్ కార్డు ఇచ్చిన ఆటోవాని కార్డులో సందర్శనీయ స్థలాలను గుర్తిమచాము. నిజానికి ఈ సందర్శనపై నాకు అంత ఆసక్తి లేదు. అరుదుగా తన మాట నెగ్గేలా వర్తించే మా ఆవిడ ఈ. సందర్శన జరిగితీరాలని పట్టుబట్టింది. ఆమె మాట విని ఒక మంచి సందర్శన చేయగలిగాను. భర్తలు భార్యల మాటలు అరుదుగా అయినా వినాలి. ఎంతో మంచి జరుగుతుంది.

ఈ ప్రదేశముల సందర్శనకు ఆటోకు ఎంత ఇవ్వచ్చో‌ రైల్లో కలిసిన ఒకాయన సలహా మేరకు ఒక ఆటోవాణ్ణి సంప్రదించాము. వాడు 400 అన్నాడు. మా ఇన్ఫర్మేషన్ ప్రకారము 250 రూపాయలు అన్నాము. ఒప్పుకున్నాడు.
మొదట తీసికొని వెళ్ళినది బాలికాతీర్థ్. ఇక్కడ ప్రస్తుతము ఏ కొలను లేదు. ఒక గుడి కడుతున్నారు. లేదా పునర్నిర్మిస్తున్నారు. ఎవరి గుడి అంటే లోపలికి వెళ్ళి చూడండి అన్నాడు అక్కడి స్వీపరు. లోపలికి వెళ్ళిచూస్తే
కృష్ణపరమాత్మ పడుకొని కాలికి బోయవాని బాణం గుచ్చుకొని ఉన్న శిల్పము. శ్రీకృష్ణుని నిర్యాణము జరిగిన ప్రదేశమది. ఇదే ముఖ్యము అక్కడ. తరవాత సముద్రపుటొడ్డున ఉన్న రెండు శివలింగాలు, ప్రక్కనే ఉన్న శివాలయం చూపించాడు. ఒక మాదిరిగా ఉన్నాయి. తరవాత సోమనాథ దేవాలయం సమీపంలోని మరొక పాత సోమనాథాలయానికి తీసికొని వెళ్ళాడు. చాలా‌ పాతకట్టడము. చాలా చిన్నిది. పురావస్తు శాఖ వారి ప్రకటన
బోర్డు ఉంది. తరవాత తీసికొని. వెళ్ళినది త్రివేణీ‌ సంగమానికి.

ప్రభాస తీర్థం

అక్కడ హిరణ్య, కపిల నదులు కలుస్తున్నాయి. మామూలుగానే సరస్వతి అంతర్వాహిని. అక్కడ ఉన్న ఒకాయన్ని అడిగే వరకు నేను ఏ ప్రదేశాన్ని చూస్తున్నానో‌నాకు తెలియదు. అది ప్రభాస తీర్థం. కృష్ణ నిర్యాణం జరిగిన తీర్థం. కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయలతో సమానమైన ప్రభ, ప్రతిభ కలిగిన తీర్థం. పై క్షేత్రముల వలెనే తీర్థ విధులు పెట్టడానికి అంత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.

సోమనాథ దేవాలయంలో శిథిలముల ఫొటోలు చూస్తున్నప్పుడు ఈ ప్రాంతాన్ని పూర్వకాలంలో ప్రభాస్‌ అనే
వారని చదివాను. అది ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఈ సంగమం ఒడ్డున ఎన్నో ఘాట్ లు కట్టారు. ఇక్కడకు ఒక కిలో మీటరు లోపు అరేబియా సముద్రం ఉంది. రెండు నదులు సముద్రంలో కలవ్వు. సముద్రపు ఒడ్డున ఒక పెద్ద డామ్ కట్టారు. నదుల నీరు సముద్రంలో కలవదు, సముద్రం నీరు నదులలో కలవదు. ఈ ప్రదేశం బాగుంది. నాకు నదులని, పర్వతాలని, సముద్రాన్ని, పచ్చదనాన్ని, సెలయేళ్ళని చూడడం ఇష్టం.

ఆ తరవాత హిరణ్య నది ఒడ్డున ఉన్న 5 పాత, క్రొత్త దేవాలయాలను చూశాము. బలరాముడు ‌నిర్యాణం చెందినదీ ఈ ప్రదేశమే. బలరామునికి సర్పరూపంలో ఒక భూగృహ ఆలయం ఉంది. తరువాత పాండవుల గుహ, సూర్యుని ఆలయం, ఒక దేవి ఆలయం చూశాము. దేవి ఆలయం కూడా భూ గృహంలో ఉంది. చాలా సన్నని, ఒకరు మాత్రమే పట్టే గుహద్వారము గుండా క్రిందకు దిగాలి. అమ్నవారి విగ్రహం ప్రత్యేకత కలదిగా లేదు. క్రిందికి వెళ్ళి పైకి రావడం ఒక పెద్ద వ్యాయామము.

గుడులు గొప్పగా లేవు. అలాగే ఉన్నాయి‌ ఆఖరి దేవాలయం కామనాథుని పరిసర గుళ్ళు. ఇక్కడ కూడా ఒక భూగృహ ప్రదేశం ఉంది. అక్కడ శంకరాచార్యులు తపస్సు చేశారని అన్నారు.
తరవాత ఆటో అతనికి బై‌ చెప్పేసి, అతను చెప్పిన షాపులో మంచి టీ తాగి మరల సోమనాథ దర్శనార్థము ఆలయం వైపు అడుగులు వేశాము. ఈ ప్రదేశాలన్నీ సోమనాథ్ కి రెండు, మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. మేము మళ్ళీ ఆలయం చేరేసరికి సాయంకాలం హారతి సమయం. ఇవాళ హారతిని పూర్తిగా చూద్దామని నిశ్చయించుకొని దర్శనం అయ్యాక ఆలయంలోనే కూర్చున్నాము. హారతి కార్యక్రమము ఎంతో హుందాగా, ‌అందంగా, భక్తి ప్రపత్తులతో జరిగింది.

హారతి కార్యక్రమము ఉత్తరాదికి ప్రత్యేకత. దక్షిణాదిని ఈ సాంప్రదాయం ఇంతలా లేదు. గంగా‌హారతి అలా ఉత్తరాదిని హారతులు ఇవ్వడం ఓ ముచ్చట. గోదావరి హారతి, కృష్ణ హారతి అని అనుకరణ ప్రారంభించారు మనవైపు. సాంప్రదాయాలు ఆ ప్రదేశంలో జరిగినప్పుడు అందగిస్తాయి. అరువు తెచ్చుకుంటే అరువు తెచ్చుకున్నట్టే
ఉంటుంది. ఏ ప్రదేశానికి ఆ ప్రదేశం తమ తమ ప్రత్యేకతలను నిలుపుకుంటే బాగుంటుంది. శ్రద్ధాభక్తులతో జరుగుతాయి. సోమనాథ హారతి‌ కడు రమ్యంగా‌ ఉంది.

అరగంట సేపుంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూండగా ధూపము, హారతి స్వామికి, అమ్మవార్లకి, నదీశ్వరునికి ఇవ్వబడతాయి. మధ్యలో రెండుసార్లు దర్శనం క్యూ ఆపేస్తారు. అప్పుడు స్వామి దర్శనం ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అలంకారం మరింత అందగిస్తుంది. నిన్నటి హారతిలో శివ స్మరణం జరిగింది.
ఒక రమ్యలోకంలో అరగంట గడిపిన తరవాత వెనుక వైపున్న అరేబియా సముద్రం పక్కన కూచున్నాము. ఆ సముద్రపు గాలి మరొక సారి పరమేశ్వర దర్శనం చేయించింది. ఆ ఆహ్లాదము మరువరానిది. మరొక అరగంట ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదించి వేరావల్ హోటల్ కి చేరి రాత్రికి విశ్రమించాము. రేపు సోమనాథ్-ఓఖా రైలులో ద్వారకకు ప్రయాణం. ఆ యాత్రా విశేషాలనూ పంచుకునే ప్రయత్నం చేస్తాను.

శుభం భూయాత్!

మా సోమనాథ్ యాత్ర - మూడవ భాగము

మహమ్మదు గజనీ, మహమ్మదు ఘోరీ, వాళ్ళ సామంతులు సోమనాథ దేవాలయాన్ని ఎన్నోసారులు విధ్వంసం సృష్టించి ధ్వంసం చేశారు. అన్నిసార్లు నెమ్మదిగా సోమనాథ దేవాలయం పునర్నిర్మాణం జరిగింది.
"సౌరాష్ట్రే సోమనాథం చ‌" అని ద్వాదశ జ్యోతిర్లింగముల జాబితా సోమనాథ్ దేవాలయంతో మొదలవుతుంది. మనవైపు వారెవరూ ఇన్ని శతాబ్దాలలో ఇక్కడికి రావడం చాలా‌ అరుదు అయిఉంటుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాక మనలాంటి వాళ్ళం రావడం సులువు‌ అయింది. ఇక్కడికే కాదు అన్ని క్షేత్రాలకు, పర్యాటక కేంద్రాలకు సులువుగా వెళ్ళి రావడం వీలుగా ఉంది. భక్తి మాట ఎలా ఉన్నా అందరం అన్ని దర్శనాలు చేసికునే ప్రయత్నాలు, ఏర్పాట్లు చేసికుంటున్నాము. 

మేము దేవాలయంలో ప్రవేశించేసరికి హారత కార్యక్రమము ఆఖరుకు వచ్చేసింది. సోమనాథ జ్యోతిర్లింగాన్ని కనులారా, మనసారా చూశాము. ఓం నమశ్శివాయ అనుకుంటూ ఎంతో అందముగా అలంకరింపబడిన ప్రదోష శివుని ఆనందంతో దర్శించుకున్నాము.

సోమనాథ దేవాలయంలో ఒక క్రొత్త విషయం ఉంది. అమ్మవారు పార్వతి. గర్భగుడిలోనే అమ్మవారు అయ్యవారికి వెనుక భాగంలో సర్వాలంకారయుతయై‌ భాసిస్తూ ఉంటుంది. గుడి బయట పార్వతీ దేవి పురాతన దేవాలయం యొక్క శిథిల ప్రదేశం ఉంది. ఒక ఎత్తైన చప్టా‌ మీద అలా ఖాళీగా ‌ఉంది. ఎందరు తురుష్క ముష్కరుల చేతిలో ధ్వంసం అయిపోయిందో కదా. పార్వతీ దేవికి గుడి కడతారేమో.

ఆలయ ప్రాంగణంలోనే ద్వాదశ జ్యోతిర్లింగముల విశేషములతో కూడిన శిల్ప ప్రదర్శన‌శాల ఉంది. వినాయకుడు, ఆంజనేయ స్వామివారలకు ప్రాంగణంలో ఆలయములు ఉన్నాయి. ప్రాంగణాన్ని ఎంతో శ్రద్ధగా, అందంగా ఉంచుతున్నారు. గుడి వెనుక వైపు అరేబియా సముద్రం. గుడి సరిహద్దుని ఆనుకొని ఒక పెద్ద గోడ కట్టారు. సముద్రం ఆటులో నున్నట్టుంది. అమావాస్య కదా. సాయంత్రం.అక్కడ కూర్చుని ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది. గంట సేపు కూర్చుని పక్క సరిహద్దులో ఉన్న సోమానాథుని పాతదేవాలయము అనబడే దానిని చూశాము. ఇది భూ గృహంలో ఉంటుంది. శివలింగం బాగుంది. మునపటి లాగానే అమ్మవారు శివుని వెనుక ఆహ్లాదంగా‌ ఉంది.
ఇక్కడ శివలింగముల ఆకృతి, పరిమాణము ఒకలాగానే ఉన్నాయి.

ఇంక తొమ్మిది కావస్తూంది. షేర్ ఆటోల ద్వారా హోటల్ కి చేరి భుజించి నిదురించాము. మరునాడు సోమవారం. శివునికి ప్రీతియైన రోజని, ఆవేళ సోమనాథుని మళ్ళీ‌ దర్శించు కుంటున్నామని మనసు పొంగిపోతూ‌ఉంది. ఎంతయినా మనసు చంద్రుని వలె కళలు పోతుంది కదా. కొంతసేపు పొంగు, కొంతసేపు కుంగు; సోముని శుక్లవక్ష, కృష్ణపక్ష కళల పెరుగుట, తరుగుట వలె.

మనసు పొంగినా, క్రుంగినా తట్టుకోలేము. నిజానికి, ఆధ్యాత్మికతే అయినా మనసు చెప్పినట్టల్లా ఆడకూడదు. అవును ఆధ్యాత్మికతలో కూడా. బాగుందని ఏదో పూజలోనో , పునస్కారంలోనో, స్వామిజీ, బాబా, అమ్నల సేవలోనో పడేసి తత్త్వానికి దూరంచేసి ఆధ్యాత్మిక జీవన ఫలితాన్ని మనలని పొందనీయదు.