Showing posts with label Radhamaadhavam. Show all posts
Showing posts with label Radhamaadhavam. Show all posts

Tuesday, March 17, 2015

మన్మథుడు మథన పడుచుండె!

 
 
 
మన్మథుడు మథన పడుచుండె!

పలుకు మూలము మొదలు తుది
చదువుల గమ్యము విద్యల జ్ఞానముల గని
శ్రీమన్నారాయణ స్వరూపము నల్లనయ్య
శాంతరస పూరితము ఆనందభరితము
శృంగార అనుభూతి అయిన మౌనమూలము
ప్రణవస్వరూపుడైన మాధవుడు
సౌందర్య లహరి లావణ్య గరిమ తారుణ్య సీమ
నిజ సఖి సకల కళా భాషా శాస్త్ర రూపిణి
శ్రీ రాధా ముగ్ధ మోహన రూపమున
తీయని పలుకుల మరులుగొన్న మనసు
ప్రకృతీపురుషుల ఆకర్షణా ధర్మమున
తన రస హృదయ క్షేత్రమున
ప్రణయ బీజముల నాట
రంజనమొందిన నిరంజనుడు
ఆ ప్రేమాంకురముల పెంచి పెద్ద చేసి
కవితాప్రసూనములతో రస కవితా మాలలల్లి
శృంగారజ్ఞాన రస ప్రసూన రాధనలంకరించి
ముదమునిచ్చు విధము ఆ కవిరాజమౌళి
కావ్యాలాప వినోదినిల రససాహితీ దాంపత్యము
రమణి రసేశ్వరుని పురుషాయతనమున
రమించిన భంగి కౌముదీ సదృశ కాంతి
ఉల్లముల రంజింప చేయుచు వారి ఎదల
ప్రసరించి వెలుగుచు వెలిగించన్ వారి కౌతుకముల
అటుల రాధామాధవులు పరస్పరానురాగ బద్ధులై
ఒకరిలోనొకరు ఇమిడిపోయి తను మన ఆత్మాశ్లేషముల
సదా రసానుభవమును నవనవానుభవముగ కాలాతీతులై
విరామము లేక ఆస్వాదించుచు ఆనందభరితులై రసకేళినునున్న వేళ
వారి మనమున దూర సందు లేక
వారిపై కుసుమాస్త్రముల సంధింప వీలుకాక
వీలు లేక మన్మథుడు మథన పడుచుండె