Showing posts with label 9. Show all posts
Showing posts with label 9. Show all posts

Tuesday, August 29, 2017

మా కాష్ఠ మండప్ - ఖాట్మండు యాత్ర 8, 9,10



 మా ఖాట్మండూ యాత్ర 8

20-8-2017

ఖాట్మండు చుట్టుపక్కల ప్రదేశాలు 1

చాంగు నారాయణ్ ఆలయం , పశుపతినాథ్ దేవాలయం, జల నారాయణ్ ఆలయం
భక్తాపూర్ ప్రాంతంలో ఉన్న చాంగు నారాయణ్ ఆలయం పురాతనత్వం, ప్రాముఖ్యత, మహిమ కలది. రినొవేషన్ లో ఉంది. ఆలయాన్ని కలప, రాతి తో కట్టారు. చాలా ఎత్తులో ఒక కొండ మీద ఉంది.
 
కిలేశ్వర్ మహరాజ్ శివుడి ఆలయం కూడా పక్కనే ఉంది. చాంగు నారాయణ్ ఆలయంలో గౌరీ నారాయణుడు, చాంగు నారాయణుడు, లక్ష్మీ, సరస్వతుల తో ఉన్న చిన్ని విగ్రహం ఉంది. బుద్ధిష్ట్ ఠంకా (థంకా) పెయింటింగ్స్ ఇక్కడ ప్రసిద్ధి.
 
పశుపతినాథ్ ఆలయం

బాగ్ మతి నది ఒడ్డున పశుపతినాథ్ ఆలయం; వాసుకి నాగరాజ్. శివుడు పంచముఖుడు. నాలుగువైపులా నాలుగు, మొత్తమంతా కలిపి ఒక లింగాకారంలో ఉంటాడు పశుపతినాథుడు.
పశుపతినాథునికి భంగ్, తాంబూలం, పూజాద్రవ్యములు. ఇక్కడ ఇదివరకు రాక్షసార్చన.ఉండేది. వామాచారము, తాంత్రికాచారము ఇక్కడ ప్రబలము.

ఇప్పుడు శృంగేరి మఠం ఆధ్వర్యంలో ఈ దేవాలయ పూజాదికాలు నిర్వహింపబడుతున్నాయి. ఆలయ తత్త్వము వారిచే నిర్వహించబడుతోంది.

Worship culture was వామాచార, and తాంత్రిక in nature. Very initial culture rituals were prevalent and predominant in Nepal.


ఉన్మత్త భైరవ; హనుమంత; దేవీ ‌ఆలయాలు ఉన్నాయి. శృంగేరి మఠం అనుయాయంగా ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన పేరు సదాశివాశ్రమ.

గుహ్యేశ్వరి అమ్మవారి ఆలయం పశుపతినాథ్ ఆలయం కి వెనుకగా ఉంది. పశుపతినాథ్ ఆలయం వెనుక బాగమతి నది ప్రవహిస్తుంది. దాని మీది చిన్ని వంతెన దాటి వెళ్తే గుహ్యేశ్వరీ దేవి ఆలయానికి వెళ్ళవచ్చు.
జల నారాయణ్ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం పడుకుని ఉంటుంది. బోధ్ నీలకంఠ్ అని కూడా అంటారు. శంఖం, చక్ర, గదా, పద్మ యుతుడైన నీటిలో - నీటిపై పడుకున్న విష్ణుమూర్తి యొక్క చాలా పెద్ద శిల్పము.
ఇవన్నీ దర్శించి మళ్ళీ బసకు చేరుకున్నాము.

ఖాట్మండూ లో ఉగ్ర చండీ గాస్ కంపెనీ కుకింగ్ గాస్ సప్లై చేస్తుంది.
 
 మా ఖాట్మండూ యాత్ర 9

21-8-2017

ఖాట్మండు చుట్టుపక్కల ప్రదేశాలు 2

నగర్ కోట్, భక్తపూర్ దర్శనం

నేపాల్ అందమైన దేశం. పర్వతాలపై, లోయలలో నివాసాలు ఉన్న ప్రదేశం. పర్వతాలు లోయలు గుండా ప్రయాణించాము. ఆపై నగర్ కోట్ చేరాము. ఖాట్మండు హిమాలయ పర్వతాలకు దూరంగా ఉంది. కొండ చరియలుపై వ్యవసాయం. మొక్కజొన్న, చెఱకు తోటలు, వరి చేలు కనిపించాయి.

ఊటీలో కొండలెక్కుతున్న అనుభవంలా ఉంటుంది. కొండల పైకి రోడ్లు బాగా లేవు. చాలా ప్రిమిటివ్ గా ఉన్నాయి. నగర్ కోట్ కొండ‌పై ఎంతో చల్లగా, ఆహ్లాదంగా ఉంది. ఎక్కుతూ ఉంటే పైన్ చెట్ల వరసలు ఎంతో అందంగా కనిపించాయి. ఈ రమణీయ, రమ్య ప్రకృతి దృశ్యాలు చూస్తూంటే మనిషి జన్మ ఎత్తినందుకు ధన్యత లభించింది అనిపించింది.

Club Himalaya Resort : నగర్ కోట్

ఇందులో Bluearth Nepal: ఒక మ్యూజియం లాంటిది. ఆభరణాలు, రాళ్ళు, సిల్వర్, చెక్క కార్వింగ్స్, పెయింటింగ్స్, ఎంబ్రాయిడరీ వర్క్ చాలా అందంగా అమర్చబడ్డాయి. స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్ ఉన్నాయి. క్లబ్ హిమాలయ రిసార్ట్. గిఫ్ట్ షాప్ లో చిన్న కొనుగోలు చేసాము. అక్కడ ఒక సూర్య యంత్ర్ ఉంది. నాలుగు వైపులా బుద్దుని బొమ్మలు, స్తంభంపై సూర్యుని చిత్రము.
 
నగర్ కోట్ ఒక వేసవి విడిది. ఎంతో చల్లగా ఆహ్లాదంగా ఉండి మంచిగా సేదదీర్చింది. ఊటీలా బాగుంది. అక్కడ కూర్చుని మునుల వలె మౌనాన్ని భక్షించాము.
 
నిశ్శబ్దాన్ని విన్నాము. మబ్బులతో ఆడుకున్నాము కూడా. మబ్బులు విడితే ఎండ బాగానే కొట్టింది. వర్షానికి ఆ చల్లదనం అని తెలిసింది. చాలా ఎత్తులో ఉంది. అందువల్ల వేసవిలో చల్లదనానికి లోటుండదు.
యాత్రలన్నీ మనిషికి ఆధ్యాత్మిక శిక్షణలు. ఆ పర్వతాలో పార్వతీ దేవిని దర్శించుకున్నాము. ఇటువంటి ప్రాకృతిక రమణీయ ప్రదేశాల్లో మనసు తనంతట తానే ప్రశాంతత నొందుతుంది.

Listening to the silence.

మౌనాన్ని వినడం ఇటువంటి చోటే జరుగుతుంది.
Écoute ce silence. (సిలావ్ న్స్)

ఈ ధ్యానం అయ్యాక ISKCON వారు తెచ్చిన భోజనం చేశాము. ఈ ట్రిప్ ని డబ్బులు తీసుకుని ISKCON వారే అరేంజ్ చేశారు.
 
సాంగా పట్టణం వద్ద శివుని పేద్ద విగ్రహం కొండపై ఉంది. కైలాస నాథ్ మహాదేవ్ అంటారు.
150 అడుగులు. Tallest Siva Statue. కాంక్రీట్ తో చేసినది. రాగి రంగు వేశారు. ఎంతో అందంగా ఉంది. నంది, పార్వతీ దేవి, వినాయక, సుబ్రహ్మణ్య విగ్రహాలు కూడా పక్కన కిందుగా ఉన్నాయి.
 
నేపాల్లో గోదావరి ఉంది. ఒక చోట చెలమలా ఊరుతుంది. ఆ నీరు చాలా తియ్యగా ఉంటుందిట.
పాటన్ కృష్ణాలయం.

లలిత్ పూర్, ఖాట్మండు, భక్తపూర్ మూడూ ఖాట్మండు లోయలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలు. లలిత్ పూర్ లో ఒక పేట శాటిన్. లలిత్ పూర్ దాటి పాటన్ కృష్ణాలయం కి వెళ్లాలి.

2015 లో ఖాట్మండులో చుట్టుపక్కల గొప్ప భూకంపం వచ్చింది. అప్పుడు పశుపతినాథ్ దేవాలయం ప్రాంగణంలోని చాలా ఆలయాలు; పాటన్ కృష్ణాలయం ప్రాంగణంలోని ఆలయాలు కూలిపోయాయి. పశుపతినాథ్ ఆలయం, పాటన్ కృష్ణాలయం మాత్రం చెక్కుచెదరలేదు. పశుపతినాథ్ ఆలయం, పాటన్ కృష్ణాలయం బహు పురాతన ‌ఆలయాలు.
 
పశుపతినాథ్ ఆలయం కొంత కలపతో చేయబడింది. పాటన్ కృష్ణాలయం మాత్రం పూర్తి రాతి కట్టడం. కృష్ణాలయంలో కృష్ణ భగవానుడు రుక్మిణీ సత్యభామా సహితుడై వెలసియున్నాడు. ఈ ఆలయం ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది. దశావతారాలు ఆలయం గోడలపై చెక్కి ఉన్నాయి. బుద్ధుని అవతారం వినూత్నంగా చెక్కబడింది. నుంచుని ఉన్న ఆ తథాగతుడు ఎంతో అందంగా ఉన్నాడు. ఇతర అవతార శిల్పాలూ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

విశ్వేశ్వరాలయము., యోగ్ నరేంద్ర మల్ల స్టేట్యూ. హరిశంకర ఆలయం రినొవేషన్ లో ఉన్న ఆలయాలు. ఇవి, లలిత్ పూర్ మహారాజు ప్రాసాదము పాటన్ కృష్ణాలయం ప్రాంగణంలో ఉన్నాయి. మహారాజు ప్రాసాదము అక్కడే ఉండడం ఆయన భక్తి ప్రపత్తులను సూచిస్తుంది. ఇప్పుడు నేపాల్లో రాచరికం, రాజులు లేరు.
పశుపతినాథ్ ఆలయం, పాటన్ కృష్ణాలయం వాటి పురాతనత్వానికి చూసి తీరాలి. రెండుచోట్ల మనసు శాంతిని అనుభవించి ఆనందపడింది.
 
 మా కాష్ఠ మండప్ ఖాట్మండు యాత్ర 10

22-8-2017

మేము ఉన్న మార్వాడీ సేవాసమితి ప్రాంతంలో అక్కడికి కూతవేటు దూరంలో భవానీ దేవి ఆలయం, కొత్త పశుపతినాథ్ ఆలయం, కుమారీ మందిర్, కాలభైరవాలయం ఉన్నాయి. కాలభైరవుడు చాలా భయంకరంగా, ఆహ్లాదంగా ఆశీస్సులిస్తూ ఉన్నాడు. కుమారీదేవి ఆలయంలో రజస్వల ఇంకా కాని అమ్మాయిలు రజస్వల కావడానికి ప్రార్థనలు, పూజలు చేస్తారు. భవానీదేవి ఆలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే దసరా రోజుల్లో తెరుస్తారు.
 
ఇక్కడే ఉన్న ఒక మ్యూజియం లోకి విదేశీయులని టికెట్ తో మాత్రమే వెళ్ళనిస్తారు. లోపలికి వెళ్ళడానికి ముందు ఒక నరసింహ స్వామి విగ్రహం ఉంది. అక్కడ నేను బిగ్గరగా పైకి నరసింహ గాయత్రి చదివాను. గార్డు పిలిచి ఎంక్వైరీ చేసాడు. విదేశాల్లో మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది.
 
ఈ ప్రాంగణంలో 20 ఆలయాల పైన ఉన్నాయి. భూకంపానికి ఇక్కడ ఎన్నో గుడులు కూలిపోయాయి. ఇళ్ళూ ఎన్నో కూలిపోయాయి. 10 వేల మంది పైనే చనిపోయారు.

ఆకాశభైరవుడి మందిరము, మచ్ఛీంద్రనాథ్ గుడి, ఒక శివాలయమూ పక్క పక్కనే ఉన్నాయి. గోరఖ్ నాథ్ సాంప్రదాయం ఇక్కడ బలీయంగా ఉండేది. మచ్ఛీంద్రనాథ్ గోరఖ్ నాథ్ గురువు. విగ్రహం ఎంతో కళగా, ఆకర్షణీయంగా, అందంగా ఉంది. ఇక్కడ ఆకాశ భైరవ్, మచ్ఛీంద్రనాథ్ దేవాలయాలలో‌ స్త్రీ పూజారులు న్నారు. ఆకాశభైరవుడి విగ్రహం అందంగా ఉంది.

ఖాట్మండు అసలు పేరు కాష్ఠ మండప్. ఊరి మధ్యలో గోరఖ్ నాథుని పేద్ద కాష్ఠ దేవాలయం ఉండేదిట. ఒక భూకంపానికి పూర్తిగా కూలిపోయింది. నేపాల్ లో పూర్వకాలపు ఇళ్ళు, దేవాలయాలు కాష్ఠనిర్మితాలు. ఈ కాష్ఠ శిల్ప కళా సౌందర్యం చూచి తీరాలి.

టూర్ లో చాలా మంది కీర్తనలు, భజన్ లు పాడారు. కామేశ్వరి "మరుగేలరా ఓ రాఘవా" త్యాగరాజ కీర్తన పాడింది. అందరికీ నచ్చింది.
 
తరువాత ఒక Buddhist Monastery. స్వయంభూ మహాచైత్య బౌద్ధారామం చూడడానికి వెళ్లాము. ఇది World Heritage Monument. Swaysmbhu Area. ఇక్కడ వజ్రక్ యంత్రము స్థాపించారు. ఇది ఎంతో శక్తిమయము. ఈ చైత్య కట్టడాన్ని పిడుగు నుంచి రక్షించేందుకు అమర్చిన యంత్రం. ప్రాంగణంలో ఎన్నో బౌద్ధాలయాలున్నాయి. బసుందర మా. సికాలా మా ఆలయాలు బాగున్నాయి. కళైన ముఖాలు కల విగ్రహాలతో ఎన్నో గుడులున్నాయి.
ఈ పర్వతం పై నుంచి చూస్తే ఖాట్మండు మహానగరం దర్శనం కలుగుతుంది. చుట్టూ పర్వతాలతో శోభిల్లే ఖాట్మండు లోయ అందంగా కనిపిస్తుంది. పచ్చని ఎత్తైన పర్వతాలు కనువిందుగా ఉన్నాయి.
 
ఇక్కడ నేవారీ భాష కూడా ఉంది. నేపాలీ భాష ఇదీ వేరు వేరు. ఇందులో ఎన్నో భక్తిగీతాలు ఉన్నాయి. మేము దర్శించిన ఆలయాల్లో నేపారీ భాషలో కీర్తనలు ఆలపిస్తూ భక్త బృందాలు కనిపించాయి.
 
తరువాత కీర్తి పూర్ వెళ్ళాం. అక్కడ ఎంతో పురాతనమైన ఉమామహేశ్వర ఆలయం, శారదాదేవి గుడి, వ్యాఘ్రేశ్వర్ భైరవ్ ఆలయాలు ఉన్నాయి. ఖాట్మండు చుట్టుపక్కల, నేపాల్ లో భైరవారాధన ఎక్కువ. ఎన్నో భైరవాలయాలున్నాయి. ఉన్మత్త భైరవ, ఆకాశ భైరవ, ఇక్కడ వ్యాఘ్రేశ్వర్ భైరవ. ఆలయ సముదాయం చాలా పురాతనమైనది. పూజారులు నేపాలీలే ఉంటారు. ఈ గుళ్ళలో బ్రాహ్మణ సంప్రదాయం కనిపించలేదు. పశుపతినాథ్ ఆలయం మాత్రం శృంగేరి శారదా పీఠం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది.

తరువాత డోలేశ్వర్ వెళ్ళాము. డోలేశ్వరాలయం ఉంది. డోలేశ్వరాలయం ద్వాపరయుగం నాటిది. లింగము ఒక పెద్ద రాయి. భూకంపానికి పాత కాష్ఠ ఆలయం కూలి పోయింది. మళ్ళీ కాంక్రీట్ తో కడుతున్నారు.
 
అక్కడి భక్తుల శ్రద్ధ ఎంతో ముచ్చటేసింది. అందరమూ గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. నీళ్ళు అందిస్తారు. అభిషేకము చేసికో వచ్చు. మేము వెళ్ళినప్పుడు రష్ గా ఉంది. కాని కొందరు చొప్పున లోపలికి పంపుతున్నారు. లోపలా అంత జనం లోను ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్న భక్తులు ఎంతో ముచ్చటగొలిపారు. భోళానాథుని దర్శించుకున్నాము.
ప్రకృతి సౌందర్యం తో అలరారుతున్న పర్వతముల మధ్యలో ఉన్న ఈ గుడి ఎంతో బాగుంటుంది. మేము వెళ్ళిన రోజు నేపాలీలకు పర్వదినము. ఒక సంగీత విభావరి కూడా నడుస్తోంది.

అక్కడ నుంచి బయలు దేరి బసకు రాత్రి 7 గంటలకు చేరుకున్నాం.