Showing posts with label వర్గస్వామ్య నియంతృత్వం. Show all posts
Showing posts with label వర్గస్వామ్య నియంతృత్వం. Show all posts

Monday, August 22, 2016

వర్గస్వామ్య నియంతృత్వం

వర్గస్వామ్య నియంతృత్వం

వృద్ధ బ్రహ్మచారి, కండల వీరుడు ఎప్పుడు ఓ ఇంటి వాడగునో
లేదో అని ఆసక్తి లేదు; అయితే, మీడియా ఊదర కొట్టుడు
ఆగునేమోనని ఆశ; పాలనను అటక ఎక్కించి,
కోతికి కొబ్బరికాయ కాయ దొరికినట్టు ఒలింపిక్ విజేత

చుట్టూ తిరిగి రాజకీయం చేస్తున్న తెలుగు రాష్ట్రాల
అధినేతలు, వారి అనుయాయులు మామూలు స్థితికి
ఎప్పుడు వస్తారో? హమ్మయ్య! ఇవాళ్టితో పుష్కరాలు
అయిపోతాయి; ఘాట్ ల చుట్టూ, సంగమముల వద్ద

వేసుకున్న తిరిగే డ్యూటీ అయిపోతుంది; మళ్ళీ
సింగపూర్ మలేసియా, జపాన్, దావోస్, రష్యా, ఢిల్లీ
భూభ్రమణములు మెదలగునేమో? అమరావతి, ఐ.టి.,
జలయజ్ఞంల హడావుడి ఎప్పుడూ ఉండేదే, 2050 వరకు

ఇంతలో చిన్నదొరలు అక్కడా, ఇక్కడా పార్టీ పగ్గాలు
పట్టి పాలనకొస్తారు; ప్రజలు వారికి స్వాగతం పలకడానికి
తమ సంతానాన్ని సిద్ధం చేయాలి; కార్పొరేట్ చదువులు
ఇంటింటికీ వై, ఫై లు, డిజిటల్ డేటా, కులాభివృద్ధి

కార్పొరేషన్ లు, ప్రతి వర్గానికీ రిజర్వేషన్ లు; అంతా
యధావిధిగా "పాలన" సాగుతుంది; ఇంతలో ఎన్నికలు;
సరియైన ప్రత్యర్థి లేకపోవడం వల్ల వృక్షము లేనిచోట
ఆముదపు చెట్టే మహా వృక్షము చందమున ఎన్నికవడం;

పాడిన పాటే పాడరా పాచి పళ్ళ దాసరిలా పాలనా
వ్యవహారము; చర్వితచర్వణమీ ఓటర్ల కడగండ్లు;
పాలితులు, పాలకులు సమానముగా కుల, ప్రాంతీయ భావ 
గజ్జికి, మత పిచ్చికి దోహదం చేస్తూ ప్రజాస్వామ్యం
నడుపుతారు; వివేకము, విచక్షణ, సమత్వభావనలు కల
పౌరులూ గతి లేక ఈ కలుషిత, కశ్మల ప్రవాహంలోనే 
కొట్టుకుపోతూ కొట్టమిట్టాడుతూ బతుకులీడుస్తారు
దేశంలో వర్గస్వామ్య నియంతృత్వం వేళ్ళూనుకొనును.