Showing posts with label మనకేల వెఱపు. Show all posts
Showing posts with label మనకేల వెఱపు. Show all posts

Tuesday, June 20, 2017

శ్రద్ధాంజలులు ; మనకేల వెఱపు ; మోక్షాపేక్ష - అపోహలు, అపార్థాలు ; ప్రేమ


శ్రద్ధాంజలులు

చనిపోయిన వారికి శ్రద్ధాంజలులెన్నో
బ్రతికున్న వారిని పట్టించుకునే నాథుడే
లేడు; మరణం కారాదు పొగడ్తకు కారణం
చనిపోవడం జీవికి సహజం; అందరం దీనికి
కాదు అతీతం; ముసలితనం కారాదు గౌరవించడానికి
ఆధారం; చావు, జాలి, దుఃఖం చేయలేవు మనిషిని ఘనం

***********

మనకేల వెఱపు

తల్లి వాహనము సింహము తండ్రిది వృషభము
తల్లి పద్మ వాసిని తండ్రి క్షీరాబ్ధిశయనుడు
తల్లి లలితకళా రాజ్ఞి తండ్రి చతుర్వేదవేత్త; ఇందరు
మనల కాచుచుండ మనకేల వెఱపు వగచుటలు

***********

మోక్షాపేక్ష - అపోహలు, అపార్థాలు

మోక్షం పొందాలని సగటు భారతీయ ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు ​కోరుకుంటారు. వీరిలో నూటికి తొంభై శాతం మంది మోక్షం అంటే ఏమిటో తెలియకుండానే మోక్షం పొందాలని ఉవ్విళ్లూరుతూంటారు. అసలు మోక్షం అంటే ఏమిటో తెలిస్తే వీరిలో చాలామంది మోక్షం అక్కర్లేదు అనుకుంటారు.

నిజానికి జ్ఞాన లోపం వల్ల ఎందరో మోక్షం అంటే భగవంతుడు కనిపించడం అనుకుంటారు. వరాలు కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటారు. లేదా పునర్జన్మ లేకపోవడం అనుకుంటారు. చిల్లర ఆధ్యాత్మిక వేత్తలు కోకొల్లలుగా తయారై మోక్ష నిర్వచనాన్నే మార్చేశారు.

మోక్షం గురించి కొద్దిగా అవగాహన రావడానికి రమణ మహర్షి సన్నిధిలో రమణాశ్రమంలో జరిగిన ఒక సంఘటన అవలోకిద్దాం. ఈ విషయం ప్రాతః స్మరణీయురాలు, శ్రీమతి సూరి నాగమ్మగారు తమ రమణాశ్రమ లేఖలు గ్రంథంలో లిఖించారు.

" ఒక సారి శ్రీ రమణ సందర్శనార్ధిని అయిన ఒక ముముక్షువు రమణ సన్నిధిలో కొంతసేపు కూర్చుని, సమయం దొరికినప్పుడు, రమణులని మోక్షం ప్రసాదించమని అర్ధించింది.

రమణులు ఉదాసీనంగా "ఓహో! అట్లాగా!" అని అన్నారు.

ఆమె మరల ధైర్యం పుంజుకుని "అవును స్వామీ! మరేమీ అక్కర్లేదు, మోక్షం ఒక్కటీ ఇస్తే చాలును" అంది.

రమణులు పొంగి వచ్చే నవ్వును ఆపుకొని, "సరి సరి, మంచిదే" అన్నారు.

"ఎప్పుడో ఇస్తానంటే కాదు స్వామీ, ఇప్పుడే ఇవ్వాలి" అందామె.

"సరిపోయింది" అన్నారు స్వామి.

"ఇస్తారా? పోయివస్తా" నన్నది.

ఆమె గడప దాటి వెళ్ళగానే త్రుళ్ళిపడి నవ్వుతూ, మోక్షం ఒక్కటీ ఇస్తే చాలునుట, మరేమీ అక్కర్లేదుట." అన్నారు భగవాన్.

అక్కడే ప్రక్కనున్న సుబ్బలక్ష్మి గారు అందుకుని మాట్లాడుతూ, "మేమూ అందుకే వచ్చి ఉన్నాము, ఇంకేమీ వద్దు మోక్షమిస్తే చాలు" నంది.

"ఓహో! అట్లాగా! ఏమీ వద్దని అన్నింటినీ విడిచిపెడితే ఉండేది మోక్షమేనే! ఒకరిచ్చేదేమి? అది ఉండేదే కదా" అన్నారు మహర్షి.

"అదంతా మాకు తెలియదు. భగవానే మాకు మోక్షం ఇవ్వాలని" అని వెళ్ళిపోయింది.

భగవాన్ పక్కనున్న సేవకులతో " ఏమోయ్! వాళ్ళకి మోక్షం ఇవ్వాలట. అదేమైనా మూటా, ముల్లా, కట్టి ఇచ్చేందుకు?

ఇంక ఏమీ కోరరటోయ్. ఒక్క మోక్షం ఇస్తే చాలునుట. మోక్షం కావాలనుకోవడం కోరిక కాదా ఏమిటి?
ఉన్నవన్నీ పోగొట్టుకుంటే మిగిలేది మోక్షమే. అవి పోగొట్టుకునేందుకు సాధన చేయాలి.

మహావాక్య రత్నమాలలో ఇదే భావం చెప్పారు చూడు.

"వాసనా తానవం బ్రహ్మ మోక్ష ఇత్యభిధీయతే"

తాత్పర్యము:

పూర్తిగా వాసనలు ( సుఖదుఃఖానుభవములు) జారిపోవుటయే బ్రహ్మమనీ, మోక్షమనీ చెప్పబడుచున్నది".

ఇప్పుడు చెప్పండి, ఎంత మంది మోక్షం ప్రసాదించమని అడుగుతారు?

అపోహ, అపార్థం ఇచ్చిన సుఖం నిజం ఈయలేదు.

నిజం కావాల్సిన వారు చాలా తక్కువ.

శాంతి కుదురుటయే మోక్షం.
*********
 ప్రేమ

ప్రేమ అహేతుక భక్తి;

పరమాత్మ యందైనా, మనుషులపట్ల అయినా.

ప్రేమ, భక్తి పరమమైనవి. బదులు ఏమీ ఆశించని‌ వ్యక్తిత్వ విస్పృహ, అభిమానము, ఆప్యాయత, ఆత్మీయతలే ప్రేమము.