Showing posts with label ప్రజాస్వామ్య నిర్వాకము. Show all posts
Showing posts with label ప్రజాస్వామ్య నిర్వాకము. Show all posts

Saturday, May 28, 2016

ప్రజాస్వామ్య నిర్వాకము

ప్రజాస్వామ్య నిర్వాకము

మాటలు తప్ప ప్రజోపకరమైన చేతలు చేయలేని,
చేయాలని లేని నాయకులు పాలకులు; తాము,
తమ కులపోళ్ళు గుట్టలు, గుట్టలుగ డబ్బులు
పోగేసుకొనుటకై పాఠశాలలు, వైద్యశాలల నుంచి

ప్రభుత్వ విశేషణము పీకేసి, అందరినీ ప్రభుత్వేతర
సంస్థలకు తోలు నాయకులునయవంచకులు;
ఈ ఆర్ధికభారము జనులు మోయలేరు; ఇప్పటికే
ఆకాశాన్నంటిన పనికిరాని చదువుల స్కూలు ఫీజులు

మరింత ఊర్ధ్వగమనమున పౌరుల నడ్డి విరచును
ప్రైవేటు వైద్యశాలల దోపిడియు మిన్నంటి ప్రజల
కుదేలు చేయును; ప్రజాస్వామ్యమున పనికిరాని వారు,
చేతకానివారు, రాక్షస సదృశ స్వార్ధపరులు, పౌరుల

తాయిలాలతో ప్రలోభ పెట్టగల మోసగాళ్ళు ఎన్నికగుదురు;
ప్రజలును, గొఱ్ఱె కసాయిని నమ్మినట్టు, తాయిలాలకై
వీరికే ఓటు వేయుదురు; భారతదేశపు ప్రజాస్వామ్యమున
విచక్షణ లేదు; ఆవేశము, అజ్ఞానము, దురభిమానము

పెచ్చరిల్లి, అవగాహన, దేశ పురోభివృద్ధి కోరుకునే
పౌరుల జీవితములు ఈ జ్ఞాన, విచక్షణా రహిత,
తాయిలాలకై ఆశించే జనుల మూర్ఖపు ఒరవడిలో
కొట్టుకుపోవుచున్నది; శిథిలములు, చీకటులగుచున్నవి

భారతదేశమున మూర్ఖత్వము రాజ్యమేలుచున్నది
అన్ని రకముల మూఢత్వములు జోడై, తోడై; హుందా,
లేక, తెలివైనవారు అక్కరలేక, మేధ, సునిశిత బుద్ధి,
సౌమ్యత, అందరి పట్ల సమాదరము కలవారు దూరముగా
నెట్టబడి, దేశాభివృద్ధిని, పురోగతిని కాంక్షించేవారి సాయమును,
నిపుణతను త్రోసిరాజని, అథ:పతనము పొందుచున్నది

అంతయు ప్రజాస్వామ్య తప్పుడు ఆచరణ;
దేశ జవసత్త్వములను తినివేయుచున్నది