Showing posts with label తత్త్వము. Show all posts
Showing posts with label తత్త్వము. Show all posts

Saturday, October 17, 2015

పరబ్రహ్మ దృష్టి, ఆత్మతృప్తికై సృజన, మనసు ఆగడములు, పనికిరాని పరిశోధనలు, తత్త్వము, కావ్యాధ్యయనము,

 పరబ్రహ్మ దృష్టి

ఆకాశమున దిక్కులు లేవు, ఎల్లలు లేవు
నడి సంద్రమున చుట్టు పక్కలు లేవు, రేవులు లేవు
ప్రజ్ఞానస్థితిని ప్రపంచము లేదు, ఇంద్రియసంచలనము లేదు
దృష్టి పరబ్రహ్మమైనపుడు జీవుడు లేడు, సుఖదుఃఖములు లేవు
******

 ఆత్మతృప్తికై సృజన


లోకులు పలువురు వారి రుచులు చూడ జాడ వేరు;
విచక్షణలు సిద్దాంత ప్రీతులు పలు రకములు; జనుల
మెప్పించుటకై సాహితీ సృష్టి చేయుట అవివేకము, కంచి
గరుడ సేవ; ఆత్మ తృప్తికై రచనలు చేయుట, కవితలల్లుట
వివేకము, మానసిక శాంతి; నిర్మల హృదయమున హృద్యంగా
మరిన్ని కవనములు వెలయు; సాహితీ ప్రియులు తమంత తామే
చదివెదరు, మురిసెదరు నచ్చిన; మెచ్చెదరు మనస్ఫూర్తిగ; తెలిపెదరు
ఆత్మీయముగా; ఆత్మతృప్తికై సృజియించిన నిలచును కలకాలము
 *******

 మనసు ఆగడములు

జీవులు పరిణమించెనో లేక భగవంతుడు సృష్టించెనో
మనుషుల గాథలు బాధలు వేదనలు హాయిలు
ఎక్కువగా స్వయంకృతములో విధి చెక్కడములొ
ఏది ఏమయిననూ సుఖ దుఃఖములు మనసు నిర్మితములు
********


పనికిరాని పరిశోధనలు


కుజగ్రహంపై నీరుంటేనేమి
చంద్రునిపై మంచుంటేనేమి
జీవము జీవులు ఈ అనంత
విశ్వంలో మరొక చోట ఉంటే
మనకేమి ఒరిగింది; మన కష్ట
సుఖముల పట్టించుకొనుట
ముఖ్యము ఎవరైనా ఎప్పుడైనా;
విజ్ఞానశాస్త్ర ప్రగతులు వారి విశేషములు
మానవ పరిజ్ఞాన వృద్ధికి; అవి
సాంకేతికతగా మారు లోపల
మన జీవితములు గట్టెక్కుటెప్పుడు
ఉగ్రవాదులు, స్వార్ధ నాయకులు
సంఘవిద్రోహ శక్తులు విజృంభించకుండ
ఎవరాపగలరో ఎప్పుడాపగలరో ఆ రోజు
మనకు పండగ; మనకు సుఖశాంతులు
లేనపుడు ఈ పరిశోధనలు శుద్ధ దండగ
********

తత్త్వము 


తత్త్వమును గాలికి వదలి వైచి వ్యక్తుల పట్టుకు
వేలాడుట భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయము కాదు;
తత్త్వము, గురువు సమానము; జీవితాంతము
ఒకనికి శిష్యపరమాణువుగ బ్రతుకు గడుపుట
ఉపనిత్ సంప్రదాయము కాదు; సర్వతంత్ర స్వతంత్రత
తత్త్వశాస్త్ర అవగాహనా పరమార్ధము; అన్ని బంధముల
నుంచి విడుదల; అన్ని కామితముల నుంచి ముక్తి; అహం
భావ మమకారములనుంచి మోక్షము; వ్యక్తిత్వ స్పృహనుంచి
బయటపడి పరమాత్మ స్పృహయే ఊపిరి కాగ
వేదాంత వాక్యార్థములందు సదా రమించుచు
శోకవిహీనులై, నిర్మల మానసమున శాంతానందమౌనములు
ప్రతిఫలింప భక్తి స్థితియందు తత్పరుడై పరాత్ పరుడగుట తత్త్వానుభవము
ఉపనిషత్ స్రష్టల దివ్యానుభవము; అందరు ఆచార్యుల నిర్గుణ స్థితి
అదియే లఘువు గురువునందు ఐక్యమగుట; నిర్వాణ స్థితి; పరబ్రహ్మానుభవము
ద్వైత భావము పోనిదే అద్వైతానుభవము అవదు
వ్యక్తిత్వము ఖాళీ చేయు ప్రదేశమే పరమాత్మ వెలుగు చోటు

కావ్యాధ్యయనము


శబ్దకోశము ప్రక్కన లేకుండ అర్థము కారు
నన్నయ తిక్కన పాల్కురికి సోమన పోతన
శ్రీనాథుడు ఎఱ్ఱాప్రగ్గడ నాచన సోమన మొల్ల విశ్వనాథ
శబ్దకోశము ప్రక్కనున్నను అర్థము కారు నవీనకవులు
నవీనకవులు, వారి అనుభవములు భావములు వాక్కులు సంకీర్ణములు:
కవితలు సంక్లిష్ట భావ మయములు; రస హీనములు అనుభవ శూన్యములు,
పొడి మాటలు; పదములు సరళమైతే చాలదు
అనుభవ, భావ ప్రకటనము సరళము కావలె; సిద్దాంత
రాద్దాంతములు‌ ఆవేశ కావేషములు ద్వేషములు
అసూయలు ఈర్ష్యలు కావ్యసృష్టిని, ఆస్వాదనను
చెరుపును; కారు వంది మాగధులు పనికొచ్చు విమర్శకులు
భట్రాజులై పరస్పర ముఖస్తుతుల చేసెదరు కాలయాపనము
కవి తన కవితలో ప్రతిఫలించును; కమనీయ
భావముల కలిగించి మన స్మృతిలో వెలుగును;
కవినిరంకుశుడు; రవి కాంచనిచో
తాను కాంచును; రమణీయార్థప్రతి
పాదక శబ్దములతో కావ్యము కూర్చును;
విశ్వశ్రేయము కావ్య పరమార్ధమని
ఎఱిగిన జిజ్ఞాసువు; భావుకుడు, ఋషి;
"వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్"; అతని ఉవాచ
 

Thursday, August 20, 2015

తత్త్వము - మతము

తత్త్వము - మతము

తత్త్వము, మతము ఒకటి కావు. తత్త్వము మతాన్ని ప్రభావితము చేస్తుంది. మతము తత్త్వాన్ని ప్రభావితము చేయలేదు. భారతీయ తత్త్వశాస్త్రము, భారతదేశములో ఆచరింపబడుతున్న మతములు ఒకే రాటకు కట్టరానివి.

ఉపనిషత్తులలో ప్రారంభింపబడి, బౌద్ధము, జైనము, షడ్దర్శనములు, భగవద్గీత, ఇతర తత్త్వశాస్త్ర గ్రంథముల మీదుగా పయనించి, తరువాతి వ్యాఖ్యాతల, జ్ఞానుల మనసులలో సరిదిద్దుకొని, సరిదిద్దబడి, ఇప్పుడు మనకు లభించుచున్న, తత్త్వము మతము కాదు.

భారతీయ తత్త్వ శాస్త్రము మతము నుండి స్వతంత్రమైనది. ఉపనిషత్తులతో మొదలై ఇప్పుడు బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము, బౌద్ధము, జైనము, స్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస (వేదాంతము), శబ్దబ్రహ్మసిద్ధాంతము (స్ఫోట వాదము - వ్యాకరణ సిద్ధాంతము) పేర్లతో పిలబడే తత్త్వము నిరంకుశమైనది. ఇది మతములతో సంబధములేకుండా, వాటికి సమాంతరముగా ఎదుగుతూ, మతములను, మతాచార్యులను ప్రభావితము చేస్తూ, వారికే అతీతమై, ఒక ప్రత్యక అవగాహనగా నేటికీ వెలుగుతూ మన మనస్సులను వెలిగిస్తోంది.

ఉపనిషత్తులు బౌద్ధ, జైన తత్త్వములను ప్రభావితము చేసాయి. ఇవి మూడూ షడ్దర్శనముల పుట్టుకకూ, వాటి ఎదుగుదలకూ కారణమయ్యాయి. ఆపై ఉపనిషత్తులూ, బ్రహ్మసూత్రములు, భగవద్గిత లతో కూడిన ప్రస్థానత్రయము శంకరులను, రామానుజులను, మధ్వాచార్యులను అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము లుగా వ్యాఖ్యానింపజేసాయి. ఇవి భక్తి, జ్ఞాన, కర్మ మార్గములుగా మనకి అందాయి. ఆయా మతములూ జనించాయి. వీటితో పాటు మరికొన్ని చిన్ని, చిన్ని, చిల్లర మల్లర మతములూ పుట్టాయి.

ఉపనిషత్తులు, బౌద్ధము, జైనము, శబ్దబ్రహ్మ సిద్ధాంతము, షడ్దర్శనములు, చార్వాకము, ఇప్పటి ప్రాచ్య, పాశ్చాత్య వాదములు, సిద్ధాన్తములు, (ఉదా: rationalism, communism, atheism, various social justice isms, and similar isms and theories) తత్త్వ శాస్త్రము క్రింద వస్తాయి.

ముఖ్యముగా ఉపనిషత్తులు, జైనబౌద్ధములు, షడ్ దర్శనములు తరువాతి వ్యాఖ్యాతలు, జ్ఞానులు మనసు స్వరూప స్వభావముల గురించి, మనస్తత్త్వాన్ని గురించి, చదివి, చర్చించి, ఆలోచించి, జ్ఞానమును అనుభవించి తమ తమ సిద్దాంతములను ప్రకటించారు.

Indian philosophical and spiritual systems have uniquely and thoroughly presented their experiences, observations, studies, feelings, intuition, understanding, insight, ideas, discussions, agreements. opposition, in relation to both software and hardware of human consciousness, mind and their functions in their own way. In addition to this, Sabdabrahma Siddhaanta (Sphotavaada) presented the theory of language acquisition and communication.

అలా భారతీయ తత్త్వ శాస్త్రము, మతములు వేరు. మతము ఆచరణకు, ఆచారములకు సంబందింఛినది. తత్త్వము consciousness and mind (ఆత్మా/బ్రహ్మము, మనోబుద్ధ్యహంకారచిత్తములకు (అంతః కరణములు), జ్ఞాన, కర్మేన్ద్రియములకు వాటి చర్యలకు సంబంధించినది. శబ్దబ్రహ్మ సిద్ధాంతము, స్ఫోట వాదములలో - భాష స్వరూపము, దాని అవస్థా భేదములు, అందులోని విజ్ఞాన, జ్ఞాన అంశములు విశదముగా, వివరముగా చర్చించబడ్డాయి. ఇవ్వబడ్డాయి. వీటికి మతముతో సంబంధము లేదు. ఈ అవగాహన మానవలోకము అంతటికి సంబంధించినది. జాతి, మత, కుల, ప్రాంత, భాషా, సిద్ధాంత, దేశ, ఖండములకు అతీతముగా మానవులందరికీ సంబంధించినది. ఉపయోగ పడేది.

భారతీయ తత్వశాస్త్రము, భారత దేశములో అనుసరించబడే మతములు, నాస్తికత, ఇతర సిద్ధాంత, రాద్ధాంతములు  సమాంతరములు.

భారతీయ తత్త్వ శాస్త్రము జీవనది. ఎవరైనా అందులో తానమాడవచ్చు

తత్త్వము అందరికీ. మతము వారి వారికి.

సత్యం జ్ఞానం అనంతం  బ్రహ్మా!