Showing posts with label జ్ఞానబోధ మీమాంసా దృష్టి. Show all posts
Showing posts with label జ్ఞానబోధ మీమాంసా దృష్టి. Show all posts

Thursday, June 30, 2016

పంచభూత స్వభావ నిర్ణయము - జ్ఞానబోధ మీమాంసా దృష్టి

పంచభూత స్వభావ నిర్ణయము - జ్ఞానబోధ మీమాంసా దృష్టి


పృధివ్యాపఃతేజోవాయురాకాశాత్ - ఇవి పంచభూతములు. అవి పృధివి, ఆపః, తేజస్సు, వాయువు, ఆకాశము.
వీటిని భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము అని ఎందరో వ్యాఖ్యాతలు సులువుగా అనువదించేస్తారు.
భూమి మట్టి అని, నీరు మన జీవనాధారమైన నీరు అని, అగ్ని నిప్పు అని, గాలి మన చుట్టూ ఉండే గాలి అనీ, ఆకాశము ఖః అర్థములో మనపైనున్న ఆకాశమనీ ఇంకాస్త వివరణ ‌ఇస్తారు.

మన శరీరము పంచభూతాత్మికము, అంటే‌ పైన చెప్పిన ఐదు వస్తువులతో తయారైందని మరింతగా మనకు "అవగాహన" కలిగించే ప్రయత్నము చేస్తారు.

కాని పంచభూతములను ఉపనిషత్తులు, బ్రహ్మజ్ఞానము,‌ భారతీయతత్త్వ శాస్త్రము, షడ్ దర్శనములు ఉదహరించిన, వాడిన అర్థములు, వాటి అవగాహన వేరు.

పంచ భూతముల గురించి సరియైన అవగాహన ఏర్పడాలంటే ముందుగా మనము ఆత్మజ్ఞానముతో‌ మొదలు పెట్టాలి. ఆత్మ, ఊపిరి తీయడం వల్ల మనలో ఏర్పడుతోంది.

శ్రేష్ఠప్రాణః ఆత్మనః తను - అనీ

యస్య గమనమ్ సతతమ్ తత్ ఆత్మా -

అనీ పెద్దలు చెప్పారు

అలా ఆత్మ మూలము, మన జీవనాధారమైన ప్రాణము, దాని గమనము, మన ఊపిరులై, వాటి గమనములో, గమనముతో ఆత్మా, ఆత్మ శక్తి ఉద్భవిస్తాయి.

ప్రాణ శక్తి విభూతియే ఆత్మ శక్తి. మనం ఊపిరి తీసి, వదలడం వల్ల మనలో ఆత్మ శక్తి జనిస్తుంది. ఆత్మ శక్తిని చిత్ శక్తి అంటారు.

ఆత్మ సత్-చిత్-ఆనందము.

ఆత్మ శుద్ధ గమనికా ప్రవాహము. అహమ్-అహమ్ స్ఫురణా ప్రవాహము. ఇప్పుడు ఉండేది ఆత్మ దృష్టి. దీనినే విశ్రాంత దృష్టి అంటారు. ఇది అద్వైత స్థితి. ఇది ఆత్మ దశ.

సత్:
వ్యక్తిత్వ, ప్రపంచ స్పృహ, గమనిక:
సత్ గా మన ఉనికిని, ప్రపంచపుటునికిని మనకి తెలియజేస్తుంది. అలా జీవ (వ్యక్తిత్వ) స్పృహలను మనకు కలిగిస్తుంది. వాటి విరమణనూ తెలుపుతుంది. తెలియజేస్తుంది.

చిత్:

జ్ఞాన‌ సముపార్జన:

చిత్ గా మనకు లౌకిక, పారలౌకిక, భాషాజ్ఞానములను కలిగించి, వినియోగించుకునేలా చేస్తుంది. సకల మానసిక కార్యకలాపములను వీక్షిస్తుంది. పర్యవేక్షిస్తుంది. ప్రపంచము, జగత్ లను ఏర్పరచి, మనకు దృష్టిలోకి వచ్చేలా, ఉండేలా చేస్తుంది.

అంతఃకరణముల ద్వారా బహిర్ ప్రపంచము (విషయముల సమూహము), ఆంతర ప్రపంచము (విషయముల ఆంతర ముద్రలు), ఆంతర జగత్ (భావముల వరుస, సమాహారము), గ్రహింప బడడానికి, మనలో సృష్టింప బడడానికి, తిరిగి మానసిక దృష్టిలోనికి తేవడానికి, రావడానికి చిద్రూపంలో మనకు దోహద పడుతుంది.
వివిధ మానసిక దశలను, స్థితులను కలిగించి‌ మానసిక కార్యకలాపములను చేయిస్తుంది.

మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము లైన అంతఃకరణములు చిత్ శక్తి ఆభాసయైన మాయా నిర్మితములు. (మాయ మానసిక శక్తికి మరియొక పేరు).

ప్రపంచము (ఆంతర) - జగత్ (ఆంతర) మాయా నిర్మితములే. చిత్ ఆభాస ( చిత్ ప్రతిఫలనము - మేధలో) అయిన మాయా పరిణామములే.

ప్రపంచము / జగత్:

అస్తి భాతి ప్రియం నామం రూపమ్ ఇతి
అంశ పంచకమ్ ఆద్య త్రయమ్ బ్రహ్మ
రూపమ్ తతో ద్వయమ్ జగద్రూపమ్

భావము:

ప్రపంచము, అస్తి (సత్), భాతి (చిత్), ప్రియమ్ (ఆనందమ్) అనే పంచకము (ఐదింటితో) తయారైంది. మెదటి మూడూ బ్రహ్మ రూపము.‌ చివరి రెండూ - నామము, రూపము- జగత్ రూపము - జగద్రూపమ్)
ఇలా ప్రపంచము, భావముల రూపములలోనున్న జగత్ చిత్ శక్తి విభూతియైన మాయచే నిర్మింపబడ్డాయి.
మాయామయమ్ ఇదమ్ జగత్ అంటే ఇదే.

ఇదమ్ అంటే సకల మానసిక కార్యకలాపములు జరిగే, విరమింపబడే సమయ సముచ్చయము. ఇది ద్వైత స్థితి.
ఇలా మాట్లాడిన ప్రపంచము, జగత్ బయటి విషయ సమాహారమైన భౌతిక ప్రపంచము, జగత్తు కాదు. మన మస్తిష్కంలో ఆ భౌతిక ప్రపంచపు విషయ గ్రహణముల ఆంతర ముద్రలు.

అహమ్-అహమ్ స్ఫురణా లహరియైన ఆత్మ స్థితి, అహమ్-ఇదమ్ అనే మానసిక స్థితులుగా మారుతుంది.

విషయములు మనసు మాధ్యమములో జ్ఞావేంద్రియముల ద్వారా గ్రహింపబడతాయి. లోపల మనసు ద్వారా ఈ విషయ ప్రపంచము, విషయానుభవ ముద్రలు ఏర్పడతాయి. విషయానుభవ జనిత‌ సుఖదుఃఖములనే
వాసనలు అంటారు.

ఆనందం:

అనుభవములు:

ఆనందం రూపంలో సకలానుభవములను కలిగించి వాటిని వాసనలుగా (జ్ఞాపకములుగా, జ్ఞప్తిగా) చిత్తము సాయముతో భద్రపరచి, సమయానుకూలముగా ప్రేరేపిస్తుంది కూడాను.

ఈ సమయంలో దృష్టిని మానసిక దృష్టి  అంటారు. మెళకువ (జాగ్రత్) కల (స్వప్న) మానసిక దశల సమయమిది. జాగ్రత్ దశలో మనసు దృష్టిని బహిర్ముఖ దృష్టి అంటారు. స్వప్న దశలో మనసు దృష్టిని అంతర్ముఖ దృష్టి అంటారు.

పంచభూత నిర్ణయము, అవగాహన:

పంచభూతములు ఆత్మ విభూతులు.

చిత్ శక్తి చిదాభాస అవుతుంది. ఈ చిదాభాస మాయ ఒకటే. మాయ దివ్యశక్తిగానూ, స్వరశక్తిగానూ విడుతుంది.
దివ్యశక్తి అంతఃకరణములుగా మారి తద్వారా జ్ఞానేంద్రియములను ప్రచలితము చేస్తుంది.

స్వరశక్తి పంచప్రాణములుగా మారి తద్వారా పంచ కర్మేంద్రియములను ప్రచలితము చేస్తుంది.
ఆత్మ (గమనిక మరియు మానసిక కార్యకలాపముల నిర్వహణకు ముడిశక్తి - చిత్ శక్తినీ ఇస్తుంది.)


చిత్ శక్తి నుంచి ముందు ఆకాశము, వాయువు భూతములుగా పుడతాయి. మిగతా మూడు - పృథివి, అప్, తేజస్సు - భూతములు ఆకాశ భూతము యొక్క వ్యక్తీకరణములు. జ్ఞాన సముపార్జనా, వ్యక్తీకరణల వాహకములు.

ఆకాశము:

చిత్ శక్తిగా ఆత్మ గమనికనిస్తుంది. గమనిక తెలివి నిస్తుంది. ఈ గమనికయే, తెలివియే, తెలియడమే ఆకాశ తత్త్వము. సత్వగుణమన్నా ఇదే. ఆకాశభూత ప్రయోజనమిది.

ఆకాశము మూడు విధములు:
అవి
చిదాకాశము - ఆత్మ దృష్టిలో, దృష్టిగా ఉంటుంది.
చిత్తాకాశము- అంతఃకరణములు దృష్టి గా ఉంటాయి.
భూతాకాశము - విషయ, విషయానుభవ యుతమైన దృష్టి.

మన అంతఃకరణములైన మనోబుద్ధ్యహంకారచిత్తాతీతము చిదాకాశము.

ఈ అంతఃకరణములు పనిచేసే సమయము చిత్తాకాశము. రజోగుణ సమయమిదే.

ఈ అంతఃకరణములు విషయ, విషయానుభవ యుతమైతే ఇది భూతాకాశము. ఇది తమో‌గుణ సమయము.

తమో గుణ సమయంలో జ్ఞాత-జ్ఞానము-జ్ఞేయము అనే త్రిపుటి ఏర్పడుతుంది. ఈ త్రిపుటి ద్వారానే అన్ని జ్ఞానములు కలుగుతాయి. అన్ని అధ్యయనములు, అధ్యాపనములు జరుగుతాయి.
అధ్యయనానికి‌ అంతఃకరణ మాధ్యమ/చాలిత ‌పంచ జ్ఞానేంద్రియముల పని అవసరము.
అధ్యాపనమునకు పంచ ప్రాణ మాధ్యమ/చాలిత కర్మేంద్రియముల పని అవసరము.

(ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు పంచ ప్రాణములు. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు కర్మేంద్రియములు.)

ఈ తమో గుణ సమయంలో ఈ జ్ఞాన సముపార్జన/వితరణ జరుగుతున్వపుడు‌ తేజస్సు, అప్, అన్నమ్‌ కూడిక జరుగుతుంది. ఇందులో తేజస్సు చిత్ శక్తి‌ విభూతిగా గ్రహణము/వ్యక్తీకరణలు తెలియడానికి అవసరమైన స్పృహనిస్తుంది.

అప్‌ రసాత్మకమై రసానుభవములన్నీ ఇస్తుంది. రజోగుణ స్థితి.

అన్నమ్‌ విషయ, విషయానుభవ యుతమైన గ్రహణము, వ్యక్తీకరణము.

తేజస్సు ని అగ్ని అని మన సామాన్య అగ్నితోటి,
అప్ ని నీరు అని మన సామాన్య నీటితోటి,
అన్నమ్ ని భూమి అని మట్టి తోటి సవరించి,
ఆకాశానికి గగనము, ఖః, శూన్యము, ఖాళీ, ఇలా‌ రకరకాల అర్థములను కలిగించారు.

ఆకాశము జ్ఞానశక్తికి, గమనికకు సంకేతము.

స్వరశక్తి విభూతియైన వాయువును గాలిగానూ వక్రీకరించి, బయటి భౌతిక ప్రపంచపు సృష్టి వీటితో జరిగిందని తరువాతి వ్యాఖ్యాతలు, వారి "శిష్యగణమూ " నిర్ణయించి పారేశారు). ఇది లోకంలో ఎంతో ప్రాచుర్యము పొందింది. అసలు అవగాహన, వ్యాఖ్యానము మరుగునపడ్డాయి.

పంచభూతములలో చిత్ విభూతులైన, ఆకాశము దివ్యశక్తిగా, జ్ఞాన సముపార్జనా/ వ్యక్తీకరణము, గమనిక నిచ్చేదిగానూ, ఉండి అధ్యయన/అధ్యాపనములను;

వాయువు స్వరశక్తిగా పంచప్రాణముల ద్వారా ప్రచలితములైన కర్మేంద్రియములద్వారా యాంత్రిక శక్తిగా‌ క్రియలను, కర్మలను చేయిస్తూ, జ్ఞాన సముపార్జనా, వ్యక్తీకరణముల సమయములో ఇతోధికంగా సహకరిస్త్తుంది. సాయపడుతుంది.

జ్ఞానము కలుగుతున్నప్పుడు, వ్యక్తీకరిస్తున్నప్రుడు తేజస్సు, అప్, అన్నములుగా విడి గ్రహణలు, కర్మేెంద్రియముల ద్వారా వ్యక్తీకరణలు జరుపుతాయి దివ్య, స్వర శక్తులు ఆకాశ వాయువులకు మూల, ముడి శక్తులు.

ఈ విధముగా ఆకాశము గమనికకూ, స్పృహ కలిగించుటకు, అనుభవ, భావ, వ్యక్తీకరణలు కలిగి, జరుగుటకూ వాయువు (యాంత్రిక స్వరశక్తీ విభూతి), జ్ఞాన సముపార్జన/వ్యక్తీకరణల సమయంలో ఏర్పడే త్రిపుటిలో
జ్ఞాన, జ్ఞాత, జ్ఞేయములుగా‌ తేజోపన్నములుగా కనిపించి, అనిపించి అవి జరిగేలా చేయడం - ఈ పంచభూతముల స్వరూపము, విధి, పని. తేజస్సు, అప్, పృథివి (అన్నమ్) ఆకాశ భూతము యెక్క వ్యక్త భూతములు.

అలా ఆకాశము ఖాళీగాని, శూన్యముగాని, ప్రదేశముగాని, కాదు. వాయువు గాలి కాదు. తేజస్సు అగ్ని, నిప్పు కాదు. అప్ నీరు కాదు. పృథివి, అన్నమ్ భూమిగాని, మట్టిగానీ కావు.

చిత్ శక్తి విభూతులైన ఈ పంచభూతములతో ఆంతర ప్రపంచం/జగత్తు/జగత్ ఏర్పడింది తప్ప, బాహ్య భౌతిక ప్రపంచము ఏర్పడలేదు.

ఉపనిషత్తులూ, ఆత్మజ్ఞానము, బౌద్ధజైనతత్త్వములు, షడ్ దర్శనములూ, తరువాతి తత్త్వబోధలు, జ్ఞానబోధ మీమాంస చేశాయి తప్ప, భౌతిక ప్రపంచపు సృష్టి, స్థితి, లయములు, తత్సంబంధ విషయముల గురించి మాట్లాడలేదు.

ఇది జ్ఞానబోధ మీమాంస దృష్ట్యా పంచభూత స్వభావ, కార్య నిర్ణయము.

శ్రీరస్తు! శుభమస్తు! సమస ్తసన్మంగళాని భవంతు!

Monday, June 20, 2016

గుణ త్రయ విభాగము - జ్ఞానబోధ మీమాంసా దృష్టి

గుణ త్రయ విభాగము - జ్ఞానబోధ మీమాంసా దృష్టి


భారతదేశంలో తత్త్వ శాస్త్రానికి రకరకాల వ్యాఖ్యానములు అందుబాటులోనున్నాయి. ఉపనిషత్తులు భారతదేశ తత్త్వశాస్త్రానికి మూలములు.

ఉపనిషత్తులలో బ్రహ్మజ్ఞానము / ఆత్మజ్ఞానము ప్రతిపాదింపబడి వివరించబడ్డాయి. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, శాక్తాద్వైత, వంటి దృష్టులతో ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు - ప్రస్థాన త్రయము - వ్యాఖ్యానింపబడ్డాయి.

ఇందులో ఆచార్యులు తమ మేధాశక్తి, స్ఫురణ, భాషా పటిమ, శాస్త్ర, తత్వ పరిజ్ఞానములు, దృక్పథములు, బుద్ధి నైశిత్యములతో తమ తమ దృష్టులతో పకడ్బందీగా వివరణలు ఇచ్చారు. అవి ఎంత పకడ్బందీగా ఉన్నాయంటే, వారి వారి అనుయాయులిప్పటికీ తమ తమ మతములను ఎంతో నమ్మకముతో అవి మాత్రమే శ్రేష్ఠమైనవి అని వాదులాడుకుంటూంటారు. ఒకరినొకరు ఎంతో తీవ్రపదజాలంతో ఖండించుకుంటారు. ఉపనిషత్తుల ఈ అనుయాయులు ఎవ్వరూ సమ్యక్ దృష్టితో పఠించరు. తమ స్ఫురణ, స్ఫూర్తిలను అసలు ఉపయోగించకుండా ఆచార్యుల మాటలే తమ మాటలుగా ఆచార్య సిద్ధాంతములను ప్రచారము చేయడానికి ఉపయోగించు కుంటారు. ఒక్కొక్కసారి కవిగారి కవిత్వం కొంత మన పైత్యంగా ఈ ప్రచారములు జరుగుతాయి.

ఉపనిషత్తులు మనసు యొక్క పుట్టు పూర్వోత్తరములు, మానసిక దశలు, మానసిక కార్యకలాపములు జరుగు వైనము, మనకు లౌకిక, పారలౌకిక జ్ఞానములు కలిగే విధములు విశదముగా చెప్పాయి. ఆత్మను, బ్రహ్మమును, తత్సంబంధ పారిభాషిక పదములను; భగవంతుని ఉనికిని ప్రస్తావించకుండా, భగవత్ సంబంధము లేకుండా ఉపనిషత్తులను, తదనంతర తత్త్వ సాహిత్యాన్ని వ్యాఖ్యానించ వచ్చు. దీనిని జ్ఞానబోధ మీమాంసా దృష్టితో అన్వయించవచ్చు.

పతంజలి, భర్తృహరి, ఆదిశంకరులు మొదలైన వారు అద్వైత-ద్వైత దృష్టుల మేలు కలయికతో ఎంతో తత్త్వాన్ని బోధించారు. ప్రబోధించారు.

పతంజలి శబ్దబ్రహ్మ సిద్ధాంతమును ప్రతిపాదించి బ్రహ్మజ్ఞానాన్నించి భాషాశాస్త్ర సర్వస్వమును పితికి మనకి అందించారు. భర్తృహరి తదనంతర స్ఫోట వాదులు భాషాశాస్త్ర దృష్టితో మనము భాషలు నేర్చుకునే, మాట్లాడే విధానాన్ని వివరించారు. భాషల అవస్థా భేదములను చెప్పారు.

వేదాంతుల మాయ, తత్త్వజ్ఞుల చిదాభాస, మునుల ప్రణవము, శబ్ద బ్రహ్మ సిద్ధాంతీకుల స్ఫోటము అన్నీ ఒకే మానసిక శక్తికి వివిధ నామములు.

ఉపనిషత్తులు, బౌద్ధజైనతత్త్వముల, షడ్దర్శనములు ఈ ఉపనిషత్ ప్రతిపాదనలను స్వీకరించి, నిరాకరించి, సవరించి, తమ స్ఫూర్తితో విషయాలను జోడిస్తూ ‌భారతీయ తత్త్వశాస్త్రాన్ని వటవృక్ష ప్రాయము చేశారు.

ఆత్మ, బ్రహ్మము, మాయ, జగత్, ప్రపంచము, మానసిక దశలు, స్థితులు, గుణములు, నిర్గుణము, సగుణము ఇలా ఎంతో తత్త్వశాస్త్ర పరిభాష ఉంది. ఇందులో గుణ‌ శబ్దానికి అర్థ, తాత్పర్యములను జ్ఞానబోధ మీమాంసా దృష్టితో చర్చించాను. గుణత్రయవిభాగము భగవద్గీతలో పరమాత్మ సద్రవ్యచాడు. ఆయన చెప్పిన సారాంశం కలిగి ఉండి మరొక దృష్టితో నేను ప్రస్తుతిస్తాను.

గుణము అంటే మనకు సత్త్వ-రజస్-తమో గుణములు దృష్టిలోనికి వస్తాయి. గుణ శబ్ద ప్రతిపాదనను వైశేషికము చేసింది. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ, అభావములను సప్త పదార్థములుగా ప్రతిపాదించింది. పదార్థమును వేదాంతం నామ-రూప-భావ-వాసనా రహిత వస్తుః పదార్థః అంటుంది. వ్యాకరణము నాలుగు పదార్థములు అంటుంది. సాంఖ్యయోగములు ప్రకృతిని పదార్థము అంటారు.

వీటన్నటిలోి పదార్థాన్ని మనసు, ఇతర అంతఃకరణముల, జగత్, ప్రపంచముల ముడి పదార్థము/శక్తి అనే అర్థములో
వాడారు. ఈ మీమాంస మరొక సారి చేద్దాము.

సత్త్వరజస్తమోగుణములు:

మాయా/చిదాభాస/ప్రణవము/స్ఫోట ల పరిణామములైన అంతఃకరణములు సమస్త మానసిక కార్యకలాపములను నిర్వహిస్తాయి. ఇక్కడ మానసిక శక్తీ పరిణామము వక్తలో పురోధాన (ముందుకు) / శ్రోతలో తిరోధాన (వెనుకకు) జరుగుతుంది.

విషయయుత బహిర్ ప్రపంచముతో అనుసంధానము మనసు జ్ఞానేంద్రియముల ద్వారా కలిగిస్తుంది. ఇది మెళకువ (జాగ్రత్) మానసిక దశలో జరుగుతుంది. ఇప్పుడు మానసిక దృష్టిని బహిర్ముఖ దృష్టి అంటారు.

(కంటికి దృశ్యములు, రూపములు; చెవికి ధ్వనులు, మాటలు; ముక్కుకు వాసనలు; నాలుకకు రుచులు, చర్మమునకు స్పర్శలు, వేడి, చల్లదనాలు విషయములు. వీటన్నిటినీ కలిపి జ్ఞానేంద్రియములు అంటారు.

వాక్-పాణి-పాద-పాయువు-ఉపస్థలు కర్మేంద్రియములు అంటారు.

ఇవి మాట, చేతి కదలికలు, కాలు కదలికలు, ప్రేవుల కదలికలు, జననేంద్రియ కదలికలు. ఇవన్నీ యాంత్రికశక్తీ చలితములు. మాయ దివ్యమై జ్ఞాన శక్తిగా మనసు ద్వారా జ్ఞానేంద్రియములను ప్రచలితము చేసి గ్రహణలు చేస్తుంది. ఇతర అంతఃకరణముల ద్వారా తత్సంబంధ జ్ఞాన సముపార్జన, జ్ఞాన నిధానము, జ్ఞాన ప్రేరణ చేస్తుంది. స్వర శక్తియై కర్మేంద్రియములద్వారా జ్ఞాన వ్యక్తీకరణలు, ప్రతిక్రియలు చేస్తుంది.

మనసు జ్ఞానకర్మేంద్రియముల ద్వారా అన్ని పనులు చేస్తుంది. ఇతర అంతఃకరణములు తోడ్పడతాయి.)
మిగతా అంతఃకరణములైన బుద్ది, అహంకారము, చిత్తము మనసు గ్రహించిన విషయాన్ని తర్క, వ్యక్తి సంబంధ, విషయములుగా విడదీసి అంతర ప్రపంచంగా మస్తిష్కములో భద్రపరుస్తాయు; మనసు మరల ఈ అంతర ప్రపంచం నుంచి విషయగ్రహణము చేస్తే అది భావము లేక తలపు అవుతుంది; చిత్తము ద్వారా వాసనలు (విషయ సంబంధ అనుభవనులు, అర్థములు, స్ఫురణలు,) ఏర్పడడం, ప్రేరేపింపబడడం జరుగుతాయి. ఇప్పుడు దీనిని కల (స్వప్న) మానసిక దశ అంటారు. ఇప్పటి దృష్టిని అంతర్ముఖ దృష్టి అంటారు.

ఇందులో ఏ విషయము కాని విషయానుభవము గాని గ్రహింపబడక మనసు నిర్మలంగా ఉంటే దాన్ని సత్త్వ గుణము అంటారు. ఇది శుద్ధ గమనిక స్థితి. భగవత్ సంబంధమైన విషయ, విషయానుభవ గ్రహణము సత్త్వ గుణము అని ఆస్తికులు అంటారు.

గమనికలో అంతఃకరణములుంటే అది రజోగుణము. అంతఃకరణములు విషయయుతమైతే అది తమో గుణము. గమనుకలో ఏ విషయము, విషయానుభవము ఉండక పోవడం నిర్గుణము.

గుణము అంటే సంస్కృత భాషలో ముడి అనీ అర్థము ఉంది. ఈ అర్థములోనే గుణ శబ్దము వాడబడింది.

నిర్గుణము:

ఏ విషయ, విషయానుభవముతో ముడి వడి ఉండక పోవడం నిర్గుణము. ఇది శుద్ధ గమనిక. ఆత్మ అంటే శుద్దాహం. ఇదే శుద్ధ గమనిక. అహం అన్నా గమనిక అనే అర్థము. అయమ్ ఆత్మా బ్రహ్మా - ఆత్మ, బ్రహ్మము ఒకటే అంటుంది.
అలా "అహం బ్రహ్మాస్మి" అంటే "నేను శుద్ధ గమనిక" అని తాత్పర్యము. ఈ స్థితి నిర్గుణ స్థితి. నిర్మల మానసిక స్థితి.
దీనినే అద్వైత (రెండు కాని-రెండు లేని-రెండుగా లేని) స్థితి అంటారు. ఇప్పుడు దృష్టిలో విషయ, విషయానుభవములు ఏమీ ఉండవు. దీనిని విశ్రాంత దృష్టి అంటారు. అహం-అహం అనే శుద్ధ గమనికా స్ఫురణ నిరంతరంగా సాగుతూంటుంది. దృష్టిలో అహం-ఇదమ్ అనే విభాగము ఉండదు.

ఇదమ్ - మానసిక కార్యకలాపములు జరగడానికి, గ్రహణలకు, విరమింప బడడానికి చిహ్నము. దృష్టి అహం ఇదమ్ లుగా విడి అంతఃకరణములకు కనబడితే అది ద్వైత (రెండు ఉన్న- రెండు - అహం-ఇదమ్-గా కనబడుతున్న) స్థితి. ద్వైత స్థితిలో దృష్టిలో త్రిపుటి విభాగము జరుగుతుంది. జ్ఞాత-జ్ఞాన-జ్ఞేయములుగా విడడం-మూడూ విడిగా తెలియడం త్రిపుటి ఏర్పడడానికి చిహ్నము.

ఈశావాస్యమ్ ఇదమ్ సర్వమ్, సర్వమ్ ఖలు ఇదమ్ బ్రహ్మా ల లోని ఇదమ్ ఇదే.

ఈ విభాగమే వైయాకరుణుల కర్త-క్రియ-కర్మ విభాగము.

ధ్యానపరుల ధ్యాత-ధ్యానము-ధ్యేయము విభాగము.

ఈ విభాగము గుణత్రయ విభాగము. సత్త్వ- రజ: - తమో - గుణములు గా మనసు పని చేసే సమయము.
త్రిపుటి ఏర్పడక, మనసు, ఇతర అంతఃకరణములు పనిచేయక నిర్వాపారముగా ఆత్మలో లీనమై ఉండడం
నిర్గుణ స్థితి. శాంతము, మౌనము, ఆనందము, మోక్షము, తురీయము, భగవత్ స్థితి, పరమాత్మ స్థితి అని దీనికే పేర్లు.

గుణ త్రయ విభాగము జరిగితే మానసిక కార్య కలాపములు జరుగుతున్నట్టు. అనుగుణ వ్యక్తిత్వ స్పృహ జాగరితమై మనము జీవ స్థితినొంది తత్సంబంధ విషయ, విషయానుభవము లకు లోనై వర్తిస్తాము.

గుణత్రయవిభాగము జరగకపోతే వ్యక్తిత్వ స్పృహ కలుగదు. మన సహజ స్థితియైన పరమాత్మ స్థితి చెదరదు. మనము జీవ స్పృహ కోల్పోయి పరమాత్మాను సంధానమును పొంది నిర్గుణులమై నిరాకులంగా ఉంటాము. జీవిస్తాము.

సత్త్వరజస్తమోగుణములు కలిగి బహిర్ అంతర జగత్తులతో అనుసంధానం ఏర్పడడం, విషయ, విషయానుభవములతో మవసు, ఇతర అంతఃతరణములు ముడివడడం జీవ స్థితి.

సత్త్వరజస్తమోగుణములు కలుగక నిర్గుణముగా - విషయ, విషయానుభవములతో అంతఃకరణముల ద్వారా ముడివడక - ముడి వీడి - ఉండడం పరమాత్మ స్థితి.

ఇవి త్రిగుణములు, నిర్గుణము.

శ్రీరస్తు! శుభమస్తు! సమస్త సన్మంగళాని భవంతు!