Showing posts with label జడలో పూలు. Show all posts
Showing posts with label జడలో పూలు. Show all posts

Tuesday, June 19, 2018

అంతర్జాల మాధ్యమాల్లో ఆపసోపాలు; ఊపిరి; గుదిబండ; పని - ఫలము; జడలో పూలు;

అంతర్జాల మాధ్యమాల్లో ఆపసోపాలు

మన తల్లితండ్రులు మనకి గొప్పే, ప్రపంచానికి కాదు కదా!? 
మన సంతానం కాకి పిల్ల చందంబున మనకి ముద్దే, 
కాని జనాలకి కాదు కదా!? మన ఉద్యోగం 
మన తిండి, గుడ్డల కోసం ప్రపంచోద్ధరణకు కాదు కదా!?

స్త్రీలైనా, పురుషులైనా తమ కోసం 
తాము బ్రతుకుతారు, జగత్సౌభాగ్యానికి కాదు కదా!?
మన గురించి డప్పు కొట్టుకోవడం ఎందుకు?
ఎవరి గొప్పలు వారివి; ఎంత చెట్టుకు అంత గాలి

అంతర్జాల మాధ్యమాల్లో ఆపసోపాలు పడుతూ
మన కీర్తి ప్రతిష్టలు పెంచుకోగలమా? ఎందుకనో 
ఎంత చెప్పినా మన నైపుణ్యాలు, కళాభినివేశాలు, 
పురస్కార ప్రదానాలు ఇతరులకు కావు ప్రధానాలు

స్త్రీలమైనా, పురుషులమైనా ఉద్యోగం చేయడం 
మన కోసం; జీవించేది మనకోసం; ఇతరులకిందులో శ్రద్ధా,
ఆసక్తి ఉండవు; మన వాళ్ళపై ఈ తాపత్రయం పడితే
పుణ్యము పురుషార్ధము; మిగతాదంతా శుష్కం శూన్యం
*********
ఊపిరి తీయడానికి ఉపకరణం

జీవించడానికే ఓపిక లేదు ఊపిరి తీయడానికి కూడా
ఉపకరణం కావాలేమో అన్నట్లు జీవిస్తున్నాం నీరసంతో
నాజూకు పెరిగిన మనుషులమై ఇంటి పనులే 
చేసుకోలేక పోతున్నాం పనిమనుషులూ మనంత 

నాజూగ్గా ఉండి సగం పనులు మనమే చేసుకునేలా చేస్తున్నారు; 
వంటకి గేస్, బట్టలకి వాషింగ్ మెషిన్, ప్రయాణానికి కారు
ఇంకా ఎన్నో ఉపకరణాలు మనకు అందుబాటులో
ఉన్నా అలిసిపోతున్నాం; ఉద్యోగంలో అలిసి ఇంటికి

చేరుకునే మనకి ఒక్కోసారి పీజాలు, బర్గర్లు, స్ట్రీట్
ఫుడ్ శరణ్యమౌతున్నాయి; ఇంట్లోనే ఉన్నా చేసికునే
ఆసక్తి, ఓపిక తగ్గిపోతున్నాయి; ఇది వరకు ఇళ్ళల్లో 
చేసుకునేవన్నీ ఇప్పుడు బజార్లో కొనుక్కుంటున్నాం;

అయినా ఏం చెయ్యాలన్నా శ్రమ పడలేక పోతున్నాం
మనిషికి ఎందుకో జీవించడానికే ఓపిక ఉండటం లేదు

అలసట మనసుదా? శరీరానిదా?
మనం ఓపికమంతులం ఇంక కాదా?
*********
గుదిబండ
ఆత్మహత్యలు చేసికొను ఆధ్యాత్మిక గురువులు
చెలియలతో కులుకు బాబాలు, సన్యాసులు, 
స్వాములు; పరిపాలన గాలికొదిలి సమ్మెలు, 
ధర్నాలు, దీక్షలు చేయు ముఖ్యమంత్రులు

కులాధారిత రిజర్వేషన్ల రద్దు వద్దను కులనిర్మూలన 
సంఘం నాయకులు; మత ప్రసక్తి లేని రాజ్యాంగము 
అనుచు మతాధార రిజర్వేషన్లు, మైనారిటీ స్టేటస్లు
కలిగించు రాజకీయ నాయకులు; అంతా స్వార్థ

సంకుచిత ఆగడములు; రాజ్యాంగం తెలియని
శాసనకర్తలు, ప్రభుత్వం బాధ్యతలు తెలియని
మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రతినిధులు;
నిధులు తీసుకుని వార్తలు వక్రించి వ్రాయు

పత్రికా రచయితలు, వారి కొమ్ముకాయు 
సంపాదకులు, యజమానులు; అందరూ
తమ తమ స్థానములందుండుటకు అనర్హులు;
భారతీయులు ప్రజాస్వామ్య పాలనమునకు అనర్హులు? 

మత దుర్వినియోగమునకు చిరునామాలు? 
తత్త్వం తెలియని నిరక్షర కుక్షులు;
పాలన తెలియని ప్రభుత్వాధినేతలు; అంతయు
శుష్కము, శూన్యము; అసమర్ధులు, అవినీతి 

పరులు, బాధ్యత తెలియని రౌడీ మూకలు
ప్రజాస్వామ్యం భారతదేశమునకు గుదిబండ
**********
ప్రజల సంక్షేమం ఎవరికీ అక్కర్లేదు. ఆ వంకతో తాము అందలాలు ఎక్కాలనే అందరి తపన, కోరికా!
********
మనం ఎంత చదువుకున్నా, రసజ్ఞత కొంచెమైనా అలవడపడకపోతే ఆ చదువంతా వ్యర్థం, నిరర్థకము అని పెద్దలు చెబుతారు.
***********
పని - ఫలము 

చదువుతో చనువు పెరగవలె జ్ఞానముతో;
సాధనతో సరిగమలు, రాగములు పట్టుబడవలె 
సంగీతాభ్యాసమున; మానినితో మనసు పొందు, 
యుతి కలుగవలె ప్రణయమున; శిక్షతో సిగ్గు 

కలుగవలె పెద్దమనిషికి; భక్షణము రుచితో మన
మనము గెలువ వలె; తక్షణమే భక్తి కలుగవలె
గోవింద నామ శ్రవణమున, మోక్షం, ముక్తి కలుగవలె
పంకజాక్షుని దివ్యనామ స్మరణమున ముముక్షువులకు
***********
జడలో పూలు లేవు జడయే లేదు;
స్త్రీ యన్న పురుషుని వలె కనుపింప 
వలెనని ధరించు దుస్తులు పురుషులవి వలే;
మాటలు, చేతలు మగతనము ఉట్టిపడునవియే

ప్రపంచమంతా పురుష ప్రవర్తన నిండిన
స్త్రీ ప్రత్యేకత ఏమి? పురుషుని అనుకరించుటయా?

ఒకరికి లేనివి ఒకరు కలిగి ప్రత్యుత్పత్తి చేయవలసిన
ఆడ, మగ, ప్రకృతి విడిచి ఇరువురొకే విధమైన పనిని
చేసిన, సంఘమున పసికందులు కలుగుటెట్లు? 
వారు ఆలనా పాలనా పొందుటెట్లు; 

ఎంత నాగరికత మార్చినా, 
చేయు పనులు, వహించు బాధ్యతలు 
సమమైన తరువాతి తరము తయారగుటెట్లు?
**********
ప్రేమ అంటే పరవశము ; పర వశము!. స్వ వశము కోల్పోకుండా "ప్రేమిస్తే" దానిని ఇంకో పదముతో సూచించాలి. వక్తిత్వ విస్మరణమే ప్రేమ, భక్తి, అనురాగము, ప్రణయము మొదలైనవి. ప్రేమలో పడ్డం గుడ్డిగా జరుగుతుంది. దానికి తర్కం ఉండదు. తెలివితేటలు ఉయోగించి ప్రేమిస్తే అది తెలివి తప్ప ప్రేమ కాదు. ప్రణయము అనే పదము ప్రాణము లోంచి వచ్చింది. ప్రాణ ప్రదమైన వాడు ప్రియుడు, ప్రేయసి. పంచ ప్రాణాలు ప్రియుడే, ప్రేయసియే.