Showing posts with label చదువులు. Show all posts
Showing posts with label చదువులు. Show all posts

Monday, April 16, 2018

తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు; నా నృషిః కురుతే కావ్యమ్!; పిల్లలు - పెట్స్; ; అంతా మిథ్య తలంచి చూచిన; చదువులు ; అంతర్జాలంలో ఘోష

తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు

మంత్రాలకు చింతకాయలు రాలవు
నిరసనలు తెలిపినంత మాత్రమున
దారుణములు ఘోరములు ఆగవు
సిరియాలో ప్రపంచం లో ఎన్నో చోట్ల

మనిషి నాగరీకం నేర్చినప్పటి నుంచీ
ఘోరాలు, దారుణాలు జరుగుతూనే
ఉన్నాయి; బలాత్కారాలు, హత్యలు,
దోపిడులు, మోసాలు, కిరాతకాలు

జరగని దేశం లేదు, సంఘం లేదు
ఇది గ్రహించాలి ముందు; నిర్భయ
తరువాత అంత, అంతకంటె ఘోరాలు
ఎన్నో జరిగాయి; అప్పటినుంచీ రోజూ

జరుగుతూనే ఉన్నాయి; నిరసనలు
కొవ్వొత్తుల ప్రదర్శనలు, అంతర్జాలమున
హడావుడి, ఏదీ జరగలేదు; ఇప్పుడెందుకు
ఇంత హడావుడి? ఏమో? ఖాళీగా ఇళ్ళల్లో

కూర్చుని, లేదా పనీ పాటా లేక అంతర్జాల మాధ్యమాల్లో 
ఆపసోపాలు పడి, గొంతులు చించుకున్న మాత్రాన ఏదీ ఆగదు; మనకు
ఆయాసం తప్ప; మనకు రోడ్లు లేవు; మురుగునీటి పారుదల సౌకర్యం లేదు; 
తాగడానికి మంచినీరు దొరకదు; ఆమ్యామ్యా లేకుండా పని జరగదు

సరియైన పాలన లేదు; మనమే కులాలు, మతాలు,
ప్రాంతాలుగా విడి, ఉపజాతీయతకు ఊపిరులు
పోస్తూ, ఎంతో ఛిద్రం చేస్తున్నాము; విద్యాలయాల్లో,
వైద్యశాలల్లో దోపిడీ నోరుమూసుకుని భరిస్తున్నాము

అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు, చీకటి
ధనార్జన ఎంతో కులాసాగా మన బహిః ప్రాణం
అయ్యాయి; కులగజ్జి ఉంది; వీటి వేటిపైనా ఏ
పోరూ మనం సలపటం లేదు; మనకు నచ్చి

వీటన్నింటినీ పోషిస్తున్నాము; మనోళ్లు అనుకుని
ఎన్నో ఘోరాలను తప్పులను క్షమించేస్తున్నాము
ఇప్పుడెందుకింత రాద్ధాంతం? అంతా ఒక ప్రహసనం
అయ్యి మన సుఖశాంతులను హరించి వేస్తోంది

రోజూ ఒక మానభంగం, కొన్ని హత్యలు, అవినీతి
కుళ్ళు, రాజకీయ నాయకుల కుల, ప్రాంతీయ గజ్జులు
అభ్యంతరం లేకుండా మననిస్తున్నాం! ఈ విషయంలో 
ఇప్పుడు ఎందుకింత రగడ చేస్తున్నాం?

ప్రకృతి ఆకర్షణను పట్టించుకోక,, నియమాలను
ఉల్లంఘించి, పాపపుణ్యాల గురించి మన పిల్లలకు
చెప్పక, వారిని సరిగా తయారుచేయక, తప్పు చేసిన
వాడికి వెంటనే శిక్ష వేయక, మనోడంటే ఒకలాగ,

ఇంకోడంటే ఇంకోలాగ మాట్లాడే, ప్రవర్తించే మనం
ఏం చేయగలం? ఊరికే హడావుడి చేయడం తప్ప;
హత్యలు, మోసాలు, అవినీతి, కుల, ప్రాంత, ఉప
జాతీయతలు మగవారిని, ఆడువారిని సమానంగా

బాధిస్తున్నాయి; వాటికి వ్యతిరేకంగా మనం గళం
విప్పమేమి? అంతా ఒక సరదా అయింది; పండుగలా
జరుపుకుంటున్నారు నెటిజన్లు ప్రతి ఘోరాన్ని; 
ఇదేమి సంస్కృతి? ప్రభుత్వాలను, పోలీసులను,

న్యాయ వ్యవస్థను పనిచేయనీయండి! మన 
అంతర్జాల అదిలింపులకు ఏమీ జరగదు, ఏదీ
ఆగదు; భావి భారత పౌరులని శ్రద్ధగా పెంచండి
ఆడ, మగ, ఉన్నత, నిమ్న, ఉత్తరాది, దక్షిణాది

అంటూ దేశ, సంఘం వ్యతిరేక కేకలు ఆపి, 
అన్ని ఛిద్రాలపై దృష్టి పెడదాం; కర్ణుని చావుకి 
సవాలక్ష కారణాలు ఉన్నట్లు మన దౌర్భాగ్యానికి 
మనతో పాటు ఎన్నో కారణాలు; వాటిని గుర్తించి పరిష్కారాలు 
కనిపెట్టడం మన విధి; తిడుతూ కూర్చోవడం ఒక వ్యాపకం మాత్రమే;

గిరులు గీచికొని విభజనలలో ఊయలలూగుతూ
అక్కర్లేని దానికి గొడవ చేస్తూ, కావాల్సిన వాటిని
నిర్లక్ష్యం చేసి, ఒక వర్గం కొమ్మే కాస్తామంటే అయ్యే
పనికాదు; మనలో మేధావులు లేరు; అరిచేవారు తప్ప
********
నా నృషిః కురుతే కావ్యమ్!

కథలు రాయడానికి, కవితా సృష్టి చేయడానికి, సాహితీ వ్యవసాయం చేయడానికి వ్యక్తి ఎంతో అనుభవం, పరిపక్వత, పరిణితి కలవాడై ఉండాలి. 

సాహితీ రచన తపస్సు వంటిది. భాషా పాటవం కలిగి ఉండడం తప్పనిసరి. భావుకుడై ఉండాలి. హృదయం సున్నితమై స్పందించగలగాలి. విశ్వశ్రేయస్సుని వాంఛిస్తూ అందుకోసమై రచనలు చేయాలి.

నా నృషిః కురుతే కావ్యమ్!

ఒక రచన పాఠకులను ప్రభావితం చేయాలన్నా, వారికి ఉపయోగించాలన్నా రచయితకు నిబద్ధత ముఖ్యం. కరుణ నిండిన మనసుతో కావ్యరచన చేయాలి. తామరతంపరగా రచనలు చేయడం వేరు, తన్మయత్వాన్ని కలిగించే సాహితీ సృష్టి చేయడం వేరు.
భాషను సరిగా నేర్వక రచనా వ్యాసంగం మొదలు పెట్టడం తన శక్తిని, సమయాన్ని వృథా చేసుకోవడం.
పాఠకుల సమయాన్ని వృథా చేయడంతో పాటు వాళ్ళ నిరసనకు, ఆగ్రహానికి గురవుతారు పండితులు కాని రచయితలు.
సాహితీ సృష్టి చేయడం ఒక సువర్ణావకాశం. ఒక బాధ్యత. అది నగ వలె మెరవాలి. మట్టి ముద్దలా పడి ఉండరాదు. ఏదో రాయడం వేరు, సాహితీ విలువలతో రాయడం వేరు. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అయినట్టుగా రచయితలు ఎక్కువైతే సాహితీ సృష్టి పేలవమవుతుంది. రచయిత అనిపించుకోవడం
వేరు, రచయిత అవడం వేరు.
రమణీయార్థ ప్రతిపాదకః శబ్దః కావ్యః!
వాక్యమ్ రసాత్మకం కావ్యమ్!
విశ్వశ్రేయః కావ్యపరమార్థః!
వసుధైవకుటుంబకమ్!
ఇవి రచయితలకు మార్గదర్శకం కావాలి.
********
ఒక్కో పత్రిక ఒక్కో వార్తా మాధ్యమం ఒక్కో పార్టీ కొమ్ము కాయును 
ఆంగ్ల వార్తా మాధ్యమం మోడీని దుమ్మెత్తి పోయును; 
అనవసరంగా రగడచేయును, ఆందోళనల రగుల్చును

పత్రికాధిపతులకు పత్రికా రచయితలకు విలువలు లేవు
వారి వారి ప్రయోజనములు కాపాడుకొనుటకే వార్తా
పత్రికలు వెలయును; ప్రజలకు నిష్పక్షపాతంగా వార్తలు 
అందవు; అందరూ రంగుటద్దములలో చూపేవారే; 
వాస్తవము, నిజము ఎన్నడు చెప్పరు, అంతయు గారడీ
********

పిల్లలను పెట్స్ గా భావించిన
శ్రద్ధగా పెంచెదరేమో ఆధునికులు;
తల్లిదండ్రుల అనాథలుగ భావించిన
వారానికొకసారైనా పండ్లు, పాలు వృద్ధాశ్రమముల
పంచెదరేమో నవ్య తనయాతనయులు;
అయినవారిని ఇడుముల పాల్జేసి ఇతరులకై,
సంఘ సేవకై ఉరుకు, "ఉన్నత శ్రేణి" వారి
సభ్యతలు, నాగరీకములు అర్థం కావు కదా!

*******

అంతా మిథ్య తలంచి చూచిన

బంద్ లు చేశారు విభజననను ఆపలేకపోయారు
అరవై రోజుల అష్ట దిగ్బంధనం బూడిదలో పోసిన 
పన్నీరైంది; మళ్ళీ ప్రత్యేక హోదా సాధనకు బంద్ లు
అంటున్నారు; దిగ్బంధనం చేస్తున్నారు; మళ్ళీ

మామూలే; వీరు సాధించగలిగినది సున్నా; రోజూ ఇతరులను బాధ్యులను చేసి ప్రజలను రెచ్చగొట్టి 
వారి నమ్మకాన్ని, అమాయకత్వాన్ని, నిస్సహాయత, దురభిమానాన్ని వాడుకుని చివరకు చేతులు ఎత్తేస్తారు

అంతా ప్రజాస్వామ్య మర్మం
ప్రజల దుర్యోగం, నాయకుల
కుష్టు రోగం; నాగరీకంగా నయవంచన;
అంతా మిథ్య తలంచి చూచిన
********
చదువులు సరిగా చదువుకోవాలి

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలకు మన్ని కాకుండా ఇతరులెవరినో బాధ్యులను చేసి తిట్టిపొయ్యడం రివాజు అయింది. ఆ ఇతరులు ఎవరు?
ఎవరి మట్టుకు వాళ్ళం మంచివాళ్ళమే. మరి ఇన్ని దారుణాలు ఇంత విపరీతంగా ఎలా జరుగుతున్నాయి? మంచివాళ్ళమైన మనమే ఒక అనువైన క్షణంలో ఇలా చేస్తున్నాము.
మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను గురించి బల్ల గుద్ది మాట్లాడే మనం మన బాధ్యతల గురించి, మంచి ప్రవర్తన గురించి మాట్లాడము. ఇతరులలోని రాక్షసత్వాన్ని ఏకి పారేసే మనం మనలోని రాక్షసుణ్ణి గురించి మాట్లాడము.
ప్రభుత్వాలు, రక్షక భటులు తమ విధుల్లో అలసత చూపిస్తున్నారని నిందించే మనం మన రక్షణకి ఏ జాగ్రత్తలు, బాధ్యతా తీసికోము. మన స్వేచ్ఛ మనది, ఎవరో మనని రక్షిస్తూ, కాపాడుతూ ఉండాలి. మనం మాత్రం ఇష్టారాజ్యంగా ఉంటాము.
మనుషులు; దుష్టులు, దుర్మార్గులు కాకుండా ఉండాలంటే సమాజం ఎంతో బాధ్యత వహించాలి.
విద్యాలయాల్లో కాగితాల చదువుతో పాటు జీవితానికి,, జీవనానికీ ఉపయోగించే చదువు కూడా నేర్పాలి.
ఈ సందర్భంలో ఘనమైన నిర్లక్ష్యం చూపి రోబోట్లను,మృగాలను తయారుచేసి, యథేచ్ఛగా సంచరింపచేస్తూ, వాళ్ళు దుర్మార్గాలు చేస్తూంటే, మగవాళ్ళని ఆడాళ్ళు తిట్టుకుంటూ కూర్చోకుండా, తిడుతూ సమయ యాపనం చేయకుండా ఈ దారుణాలకు మూలం ఏదో వెతికి గుర్తించాలి. రోగం తెలుసుకొని వైద్యం చేయాలి.
మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను నియమించు కోవాలి. కట్టడి చేసుకోవాలి. మన రక్షణ అంతా ప్రభుత్వానికి, పోలీసులకు అప్పగించి మనం బలాదూర్ తిరిగితే పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి.
పాపపుణ్యాల గురించి పిల్లలకు చెప్పాలి. పాపాలు చెయ్యకూడదు, పుణ్యాలు చెయ్యాలి అని ప్రోత్సాహించాలి. మనుషులలో పాపభీతి కలిగించాలి. పరాయి స్త్రీ తల్లి వంటిది వంటి సూక్తులు వల్లె వేయించాలి. అవి పాత చింతకాయ పచ్చడులు కాదు. మనిషి ప్రతీది అనుకరించి నేర్చుకుంటాడు. నడత, ప్రవర్తన కూడా ఇందులో ఉన్నాయి..
అన్ని రకాల నేరాలకు సత్వర శిక్ష వేయాలి. నాయకులకి, డబ్బున్న వారికి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండరాదు.
ఇవేమీ లేకుండా మగవాడు మాత్రమే ఆడదాని అన్ని కష్టాలకు కారకుడు అనే దుష్ప్రచారం ఆపాలి. మంచి, చెడ్డ; లింగం, కుల, మత, ప్రాంత, ఉప జాతీయతలపై మాత్రమే ఆధారపడి ఉండవు. మనుషుల తత్త్వం మీద కూడా ఆధారపడి ఉంటాయి.
ఇది విస్మరించి మగవారిని మృగాలుగా చిత్రీకరించి కవితలు, వ్యాసాలు రాసి, వార్తా సమీక్షలు చేసి లాభం లేదు. మన విద్యా వ్యవస్థ బాగు పడక సంఘం బాగుపడదు. ఇక్కడ విద్య అంటే భాషలు, లెక్కలు, జ్ఞాన విజ్ఞాన శాస్త్రాలు భట్టీయం వేయడం మాత్రమే, మాత్రం, కాదు. మనిషికి అవసరమైన సదాచరణను తెలిపే, ప్రోత్సాహించే, పెంచే చదువులు కూడా చదవాలి.
సాధారణంగా మతం, జ్ఞానం ఈ విషయంలో సాయం చేయాలి. దురదృష్టవశాత్తు ఆ సాయం అందటం
లేదు. పైపెచ్చు కొందరి చేతుల్లో చిక్కుకొని, మత, కుల, ప్రాంతీయ, ఉప జాతీయతలు ఎన్నో ఘోరాలు చేయిస్తున్నాయి.
ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ప్రకృతి పరంగా ఉన్న ఆకర్షణను దృష్టిలో పెట్టుకొని స్త్రీ పురుషులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను గురించి మాట్లాడాలి.
అందరూ సమానం అనేది అమాయకపు మాట.
********
అంతర్జాలంలో ఘోష
అంతర్జాలంలో ఘోష ఎక్కువై పోయింది. ఏ సంఘటన అయినా, ఏ విషయమైనా నెటిజన్లు చేత రుబ్బైయ్య బడుతోంది.
ఏమిటో అర్థమవదు; సంఘటన జరిగినట్లు మీడియాలో రాగానే వీళ్ళందరూ అక్కడ ఉండి చూసినట్టే సంఘటనను వర్ణించడం, దానిపై వారి కోపతాపాలను ప్రకటించడం, ఆవేశకావేషాలను ప్రదర్శించడం, ఇల్లు పీకి పందిరి వెయ్యడం, అందర్నీ దునుమానడం. తాము ఎంతటి మానవత్వం కలవారో చెబుతూ ఊగిపోవడం. మిగతా వాళ్ళని ఊపెయ్యడం.
ఎందుకింత హడావుడి? ఎందుకింత గందరగోళ పడడం? సృష్టి లో ఈ రోజే దుర్మార్గాలు జరగడం లేదు. మనమే న్యాయమూర్తులమై అందరికీ శిక్షలు వేసెయ్యడం. పూర్వకాలంలో ఎందుకు నియమాలు, నిషిద్ధాలు పెట్టారో, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఎన్ని ఘోరాలు చేయిస్తుంది అనేది అస్సలు ఏమీ తెలియకుండా, సమానత్వాలు, ఆదర్శాలు వల్లిస్తే ఘోరాలు జరగడం ఆగదు.
తమ తమ ప్రకృతికి అనుగుణంగా స్త్రీ పురుషులు వ్యవహరిస్తారు తప్ప మన ఆదర్శాలను, వాదఘోషలను బట్టి ప్రవర్తించరు. ప్రభుత్వాలు, నెటిజన్లు, ఎన్.జి.వోలు ఏ సూత్రాలు చెబుతాయో దానికి అనుగుణంగా సంఘంలో చేతలు ఉండవు.
పాపుణ్యాలు, స్వర్గం నరకం లేవని పాపభీతి చెరిపేసి, అందరూ ఆదర్శంగా ఉండాలి, ప్రవర్తించాలి, జీవించాలి అనడం పసితనం, హాస్యాస్పదం. టెర్రరిస్టులు, నేరస్థులు, దుష్టులు, దుర్మార్గులు అరణ్యంలోని క్రూరమృగాలలా సంచరిస్తూ ప్రవర్తిస్తున్న వేళ, నీతి వాక్యాలు వల్లించి అందరూ ఆదర్శంగా ప్రవర్తించాలి అని సందేశాలు పెట్టడం, గోల చెయ్యడం వృథా ప్రయాస.
విద్యాలయాల్లో నీతి పాఠాలు చెప్పాలి. గౌరవ, మర్యాదలు, సత్ప్రవర్తన నేర్పాలి. అదేమీ చేయకుండా అందరూ యోగి పుంగవుల్లా జీవించి స్త్రీలకి, నిమ్న వర్గాలకి మాత్రమే ఏమీ చేయకూడదని అనడం, వారికి మాత్రమే రక్షణ కావాలనడం అయోమయం నిండిన మనుషులను సూచిస్తుంది.
అందరి యోగక్షేమాలు కావాలనడం విజ్ఞత, యోగ్యత. మరేదైనా బడాయి కబుర్లు మాత్రమే. అందరి సుఖశాంతులు, అందరి సుఖసంతోషాలను కోరుకుందాం. మన కారుణ్యాన్ని ఒక లింగానికో, వర్గానికో మాత్రమే పరిమితం చేయవద్దు. మానవాళి అంతా దుఃఖరహితంగా ఉండేలా ప్రార్థిద్దాం, ప్రవర్తిద్దాం. మన జాగ్రత్తలో మనం ఉందాం. మన యోగక్షేమాలను మనం కూడా చూసుకుందాం. అనవసర రాద్ధాంతం, శుష్క గందరగోళం, కాకి గోల చెయ్యకుండా ప్రభుత్వాలను, రక్షక భట యంత్రాంగాన్ని వాళ్ళ పనులని వాళ్ళని చేసుకోనిద్దాం. మన దుఃఖ ప్రకటనలతో, ఆవేశకావేషాలతో రచ్చ చేసి ఇబ్బంది పడకుందాం. ఇబ్బంది పెట్టకుందాం
సర్వే జనాః సుఖినోభవంతు!
ఆ నోsభద్రాః క్రతవోయంతు విశ్వతః!
సమస్త సన్మంగలాని భవంతు!
********
Wi-fi is all pervading, invisible, untouchable, can not be sensed through sense organs and action organs cannot do anything to it, mind-blowing, mind-glowing like God