Showing posts with label ఇ-ప్రచురణలు. Show all posts
Showing posts with label ఇ-ప్రచురణలు. Show all posts

Thursday, March 24, 2016

మానవ జిజ్ఞాస - సృష్టి



మానవ జిజ్ఞాస - సృష్టి

సార్వజనీనత - విశ్వ శ్రేయస్సు

సాహితీ సృష్టి - విమర్శ - ఇ-ప్రచురణలు - విశాల విశ్వ దృష్టి

పాఠకులు, విమర్శకుల ద్వారా సాహితీ స్రష్టలు ప్రాచుర్యం పొందుతారు. వారి కవితలలోని గుణగణములను, ఇతర సాహితీ ప్రమాణములను పరిశీలించి, విశ్లేషించి, విమర్శకులు కవులను, వారి శ్రేష్ఠతను, కవన సృష్టిని, ఇతర పాటవములను వర్గీకరిస్తారు, పొగడుతారు, తెగడుతారు. ఈ విమర్శ స్వ ఇష్టాయిష్టములకు అతీతంగా చేయాలి.

కాని నేటి తెలుగు సాహితీ జగత్తును పరిశీలిస్తే ఒక వింత విషయం బయటపడుతుంది. సాహితీ స్రష్టలు - ముఖ్యంగా కవులు, వాదములపై ప్రీతితో వర్గములుగా విడిపోయారు. తమ వర్గ సాహిత్యమే ప్రపంచ సాహిత్యమనే భ్రమలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇతర వర్గములను, తత్సంబంధ సాహిత్యాన్ని తప్పుపడుతున్నారు. నిందిస్తున్నారు కూడా. విమర్శకులూ అలానే వర్గములుగా విడిపోయారు. సిద్ధాంత రాద్ధాంతములకిచ్చే ప్రాముఖ్యత విషయ పరిశీలనకు, విశ్లేషణకు, అవగాహనకు ఈయక, తమ వర్గపు సాహితీ వేత్తలను, కవులను ఆకాశానికి ఎత్తేసి, ఇతర సాహితీకారులను పాతాళానికి దించేస్తున్నారు. కువిమర్శకులవుతున్నారు. లేత అరిటాకు వంటి కవుల మనసులను చీల్చేస్తున్నారు. వారి కుసుమ హృదయాలను నలిపేస్తున్నారు.
 
ఇలాంటి వర్గ సాహితీకారులు, విమర్శకులు గుంపులుగా ఏర్పడి పరస్పర కుచమర్దనములు చేసుకుంటున్నారు. ఇటువంటి స్థితిలో తెలుగు సాహిత్యం ప్రపంచ వ్యాప్తం ఎలా అవుతుంది

దీనితోపాటు కవుల సంఖ్యా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. చేతి చమురు భాగోతంలా కవితా సంకలనాలు వెలువరిస్తున్నారు.
 
అచ్చువేసిన పుస్తకాలు మాత్రమే పురస్కారములకు పనికివస్తాయనే నియమం ఎందరో కవులను తమ కవితలను అచ్చు వేయించుకునేలా చేస్తున్నాయి. అందుకై ఆర్ధికంగా, ఇతరత్రా ఎంతో వ్యయప్రయాసలకు లోనవుతున్నారు, కవులు, ఇతర సాహితీ స్రష్టలు.
 
అచ్చు రాక ముందు తాటాకులపై గ్రంథాలు రాసేవారు. అచ్చు వచ్చాక, పుస్తకములు ప్రచురింపబడడం మొదలయ్యాక జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, సాహిత్యాన్ని, ఇతర అంశములను నిక్షిప్తపరచండం, పంచడం సులువైంది. అలా మాత్రమే మానవుని మేధ, లలితకళాసృష్టి నలుగురికీ చేరడం సాంప్రదాయమైంది.

ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానము ఎంతో పెరిగి, అంతర్జాల మాధ్యమం వచ్చాక మానవుని, జ్ఞాన, విజ్ఞాన కళాదృష్టులను, సృష్టులను అందించడం ఎంతో సులువు, వేగవంతం, చవక అయిపోయింది. ఇ-సృష్టి, ఇ-రికార్డింగ్, ఇ-ప్రచురణ విప్లవాత్మకంగా, సౌకర్యంగా మారి మానవునికి జ్ఞాన, విజ్ఞాన, కళా సముపార్జనం బాగా తేలిక, వేగవంతం, చవక అయ్యాయి.

ఇటువంటి సాంకేతికతా విప్లవం వచ్చాక కూడా, అచ్చు పుస్తకాలను మాత్రమే పురస్కారాలకు పరిశీలిస్తామనడం కూపస్థ మండూక మనస్తత్త్వం. మార్పుని అంగీకరించలేని,అందిపుచ్చుకోలేని ఛాందసం. కాలం చెల్లిన సాంప్రదాయం. ఇ - ప్రచురణలను అచ్చు పుస్తకములతో సమానముగా పురస్కారములకు పరిశీలించవలసిన  సమయము ఆసన్నమైనది.
 
ఇలా సాహితీ సృష్టి, విమర్శ, ప్రచురణ కాలం చెల్లిన ఛాందసాన్ని, అజ్ఞానాన్ని, పసితనాన్నివీడలేకుంటే, తెలుగు వారి మేధా సంపత్తి, సాహితీ కళాసృష్టులు ప్రపంచాన్ని ఎలా చేరతాయి? నలుగురూ తెలుగు వారి సృష్టుల గురించి ఏమి చర్చంచుకుంటారు?  

అలాగే తమ రచనలను తగు భాషలలోనికి అనువదించకుండా ప్రాచుర్యం రాదని అన్ని రంగములలోని స్రష్టలు గ్రహించాలి. ప్రపంచం విశాలమైనది. సంకుచిత్వానికి అందనిది. వాదప్రతివాదములకు లొంగనిది. మన మనసు ఎంత విశాలంగా ఉంటే మనకు ఆదరణ అంత పెరుగుతుంది. ప్రాచుర్యం, గుర్తింపూ భిస్తాయి

మనం వర్గ పౌరులం కాక విశ్వ పౌరులం అవుదాము.

సార్వజనీనత లేని, విశ్వ శ్రేయస్సును కాంక్షించని సృష్టులు నిరర్ధకములు.