Showing posts with label ఆధ్యాత్మిక లఘువు. Show all posts
Showing posts with label ఆధ్యాత్మిక లఘువు. Show all posts

Friday, July 22, 2016

భగవంతుడు; మర్త్యుడు-మృత్యుంజయుడు : అబద్ధపు "గురువు" - ఆధ్యాత్మిక లఘువు;


 భగవంతుడు

చాలా మంది, భగవంతుడు లేడు, భగవంతుడు మనిషి సృష్టే, అంటారు. మంచిది. మన నాగరికత, సంస్కృతి, భాషలు, విజ్ఞానశాస్త్రములు, అన్ని జ్ఞానములు, కళలు, సిద్ధాంతములు, సాంకేతికత, ఇలా అన్నీ మనిషి సృష్టే. ఇవన్నీ మనిషి సృష్టే కాబట్టి మనం వాటిని నిరసించడంలేదే!? పైపెచ్చు ఆనందంగా ఉపయోగించుకుంటున్నాం. అలాగే మన‌ సృష్టే అయిన భగవంతుని ఉనికి‌ని ఉపయోగించుకోవడానికి ఎందుకు అభ్యంతరం? గొడవ, గోల? రాద్దాంతము? తర్కము పదునైనది. ఎటువైపునుంచి అయినా ఉపయోగించవచ్చు. ఆస్తికులు, నాస్తికులు తమ వాదనలను నమ్మకము మీద ఆధారపడే చేస్తారు. ఈ విషయము ఆస్తికులు ఒప్పుకుంటారు. నాస్తికులు ఒప్పుకోరు. మళ్ళీ తర్కం అంటారు. 

తర్కం మన తెలివితేటలనూ, వాదనా పటిమనూ చూపిస్తుంది తప్ప మనలను సత్యం దగ్గరకు తీసికెళ్ళదు. వట్టి తర్కంతో ఏదీ అందదు. ఏదీ తేలదు. ఆయాసం మిగులుతుంది అంతే.

సత్యాన్ని అవగాహన చేసికొనేందుకు ఒక్క తర్కం మాత్రమే సరిపోదు. పూర్తి‌ సత్య దర్శనానికి తర్కం ఉపయోగపడదు. అన్ని తర్కములూ ఆగిన పిమ్మటనే తనంత తానుగా సత్య దర్శనము కలుగుతుంది. అడ్డుకట్ట తొలగించిన వెంటనే బోదిలోని నీరు పొలం లోనికి ప్రవహించినట్టు.

అన్ని తర్కములు, వాదనలు, కారణాన్వేషణలూ వృథా ప్రయాస. నమ్మకమే అందరినీ నడిపించింది. నడిపిస్తోంది. నడిపిస్తుంది.
 ******************

మర్త్యుడు-మృత్యుంజయుడు

 ఎంత గొప్పవారమైన ఎంత అధికారమున్న
ఎంత సంపాదించిన యముని ముందు
తల వంచక తప్పదు; మర్త్యులము మనము
కాము మృత్యుంజయులము; మానవత్వము
చూపుచు మనీషులమై జీవించిన అగుదుము
మృత్యుంజయులము; కాలుడు అంటలేడు మనల
*************

అబద్ధపు "గురువు"- ఆధ్యాత్మిక లఘువు

ముండనము చేయించుకుని నామము మార్చుకుని
వేషభాషల క్రొంగొత్తవి ధరించి పేరు కొత్తది పెట్టుకున్న
మాత్రమున సన్యాసి కాడు, స్వాములవారు కాడు
బ్రహ్మజ్ఞాన ధురీణుడు కాడు: పొట్టకూటికై కోటి విద్యలు


అహంభావమును అహంకారమును వ్యక్తినుంచి
సాములోరుగా మార్చుకొని కొత్తసంసారము ఏర్పరచుకున్న
సామాన్యుడు ఆచార్యుడు కాడు, విషయ విషయాను
భవములు అంటని నిర్మల మానసము వానికి ఉండదు

నాలుగు మాటలు చెప్పుచు ప్రవచనములిచ్చుచు
వాటిని అనుగ్రహ భాషణములనుకొను వింతసంసారి
నేటి సన్యాసి; వాసనలు కరిగిఉండవు, లాలసలు
మెండుగా ఉండును కామినీజన పరివృతుడై ధన, కనక

వస్తు సంచయముచేయు ఆధునిక పరివ్రాజకుడు నొసట
విభూతి అలముకున్నను దండిగా కుంకుమ బొట్టు
పెట్టుకున్నను‌ విషయవాంఛల గెలువలేని అర్భకుడు
డబ్బకై ఆశ్రమములు పెట్టుకున్న దొంగవాడు, పొట్ట

చించిననూ అక్షరము ముక్కైనా కనుపింపని నిరక్షరాస్యుడు,
అవగాహన, ఆత్మజ్ఞానము ఇసుమంతైనా అంటని అజ్ఞాన
ధురంధరుడు అమాయక ప్రజల వంచించు వేషగాడు
అబద్ధపు "గురువు"; ఆధ్యాత్మిక లఘువు

***************