Showing posts with label అద్వైతము. Show all posts
Showing posts with label అద్వైతము. Show all posts

Sunday, October 12, 2014

శ్రీ రమణ మహర్షి







శ్రీ రమణ మహర్షి (1879-1950 ) పరమగురువులు. "సత్" గురువులు. "సత్" తనంతట తాను ఆయనకు సాక్షాత్కరించి, అవగతమై ఆయనను ఆత్మజ్ఞాన సంపన్నులను చేసింది; బ్రహ్మవిదులుగాను, బ్రహ్మకోవిదులుగానూ చేసింది.


"బ్రహ్మ విత్ బ్రహ్మ ఏవ భవతి" - బ్రహ్మమును తెలిసికున్నవారు తామే బ్రహ్మము అవుతారు- - అనేది ప్రసిద్ధమైన పలుకు. శ్రీ రమణ మహర్షి ఈ నానుడికి సాక్షాత్ ప్రతీక. బ్రహ్మమే ఆయన; ఆయనే బ్రహ్మము. ఆత్మారామము, రామబ్రహ్మము కూడా ఆయనే.

బ్రహ్మవిదులకు - దయా సర్వ భూతేషు - అన్ని జీవులయందు దయ; క్షాంతి - ఓర్పు , అనసూయ  - అసూయ లేకపోవడము, శౌచం - మానసిక, శారీరక శుభ్రత, అనాయాసః  - శరీరాన్ని, మనసును క్లేశపరచకుండా తపస్వులుగా ఉండడం , మంగళం - అన్ని శుభములను కలిగించే ప్రశస్తమైన లక్ష్మీ వైభవాన్ని చిందించే భావములను కలిగి ఉండడము, కళ్యాణదాయకమైన కర్మలను ఆచరించడము - అకార్పణ్యం - లోభ గుణం లేకపోవడం, అస్పృహ - దేనియందు కోరిక, ఆశ లేక  వ్యక్తికీ, వ్యక్తిత్వానికి సంబంధించిన భావములు నిండుకొని ఉండడం (నిస్పృహస్య తృణం జగత్ - అంతర-, బహి- ప్రపంచములు దృష్టి యందు లేకపోవడం, ఒక వేళ ఉన్నా వాటికి ఏవిధమైన విలువ ఇవ్వబడకపోవడం - అనే ఈ ఎనిమిది  సహజ లక్షణములు. ఇవన్నీ శ్రీ రమణ మహర్షి యందు మూర్తీభవించాయి

"వైరాగ్యమేవ అభయం" అనేది ఆయన జీవనశైలి. జీవన సారాంశం; జీవిత ఉపదేశం.
 

ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే

వ్యోమవత్ వ్యాప్య దేశాయ (దేహాయ)

శ్రీ దక్షిణామూర్తయే నమః

-అనే ప్రసిద్ధమైన వాక్యం ఆయనను స్తుతించడానికి, నిర్వచించడానికి, వివరించడానికి సరియైన ప్రకటనము.

శ్రీ రమణ మహర్షి దక్షిణామూర్తి స్వరూపులు. సాక్షాత్ శివులు (జ్ఞాన స్వరూపులు). తమిళ నాట ప్రసిద్ధ శివభక్తులైన నాయనమారులలో విశేషులైన తిరుజ్ఞానసంబధరులు శ్రీ రమణులుగా పుట్టారా అనిపిస్తుంది. పదిహేడవ ఏట మరణానుభవరూప జ్ఞానానుభవం కలిగే వరకు వెంకటరామన్ గా  నున్న శ్రీ రమణ మహర్షి శివుని పితృసమానంగా  భావించి కొలిచిన వారు. మదురై శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఎదుట భక్తిభావ జనిత అశ్రువులు రాలుస్తూ ఈశ్వరుని చెంత ఎంతో సమయం గడుపుతూండేవారు.

విరాగియైన పిదప అరుణాచలం(తిరువణ్ణామలై ) లో శ్రీ అరుణాచలేశ్వరుని మొదటి సారి సందర్శించినప్పుడు  "అప్పా! నీ దగ్గరకు వచ్చేసాను" అన్నారు. ఆ తర్వాత తిరువణ్ణామలై లోనే జీవితాంతం ఉన్నా, ఆయన మళ్లీ అరుణాచలేశ్వరుని గుడిలో  సందర్శించక పోయినా, శివునిపై ఆయన పితృ భావం అలానే ఉండిపోయింది. అందుకే అయన సమకాలికులు, ఆయనకు రమణ మహర్షి అని పేరు పెట్టినవారు, ఆయనను గురువుగా భావించి తరించినవారు, "నాయన" అని మహర్షి చే పిలువబడిన వారు అయిన కావ్యకంఠ శ్రీ వాశిష్ఠ గణపతి ముని శ్రీ రమణ మహర్షిని స్కందుని (సుబ్రహ్మణ్యే శ్వరుని) అవతారంగా భావించేవారు.
 

శ్రీ ఋభుగీతలో వర్ణించిన ఆత్మజ్ఞాన ప్రాప్తి సహజంగా, మార్జాల కిశోర న్యాయంగా (తల్లి పిల్లి, పిల్లి పిల్లలను ఎంత జాగ్రత్తగా సాకుతుందో అలా భగవంతుడు కొందరు భక్తులను సాకే విధం) శ్రీ రమణ మహర్షి కి కలిగింది.

ఆయన ప్రమేయం, ప్రయత్నం అణుమాత్రమైనా లేకుండా జ్ఞానులయ్యారు. పరమేశ్వరుని అద్భుత అనుగ్రహఝరి. స్నానమాడి తరించినవాడు వెంకటరామన్. ఆ ఈశ్వర లీల  రమణ మహర్షిని మనకి అందించింది.

ఉపనిషత్తులు మనకు ప్రసాదించిన దశ మహా విద్యలలో "దహరా" విద్య ఒకటి. (ఆత్మజ్ఞాన ప్రాప్తి మార్గాన్ని, ధ్యాన పద్ధతిని ఉపనిషత్ పరిభాషలో విద్య అంటారు). శ్రీ రమణ మహర్షి ఉపదేశం ఈ విద్య కోవకు చెందినది.

ఈ పద్ధతిలో "నేను ఎవరు?" అని మనలను మనం ప్రశ్నించుకుంటాము. శరీరం, మనస్తత్వమునకు అన్వయించుకునే "అబద్ధపు నేను" స్పృహ, తదనుగుణ జీవ భావం పుట్టే చోటు; "అసలు నేను" - ఎవరు? ఏమిటి? - అని అలా ప్రశ్నించుకోవడంలోనే; పదే పదే ప్రశ్నించుకోవడంతోనే - మనం "జీవ సంబంధమైన నేను" భావాన్ని అధిగమించి, "నేను" కు అసలు తాత్పర్యమైన తత్పరతను పొందుతాము.

ఈ "అసలు నేను", "అహం బ్రహ్మాస్మి" వాక్యానుసారం, ఆత్మ అని మనకందరకూ తెలిసిన విషయమే. సత-చిత్-ఆనందం; నిత్య-శుద్ధ-బుద్ధ-ముక్తం; అస్తి-భాతి-ప్రియం; అయిన ఆత్మలో లీనమై, జీవభావ విముక్తులమై, ఆత్మ స్వరూపంగా బ్రహ్మమై వెలుగొందుతాము. "నేను" కు సరియైన అన్వయాన్ని తెలుసుకొని, తపించి, పొంది అ "అసలు నేను" గా విరాజిల్లుతాము.

ఇంతటి జ్ఞానాన్ని మనకి అందించిన రమణులు కర్మయోగి కూడా. శ్రీ శంకర భగవత్పాదుల వలె తల్లిని ఆదరించినవారు. ఆశ్రమంలో కూరలు తరగడం చేసేవారు. జ్ఞానమార్గావలంబులు కర్మ పరిత్యాగం చెయ్యాలనే అజ్ఞానపూరిత భావాన్ని, డంబాన్ని, భ్రమను, భ్రాంతిని పటాపంచలు చేసే విధంగా తను జీవించి మనకు ఉదాహరణగా నిలిచారు. మనందరమూ సంసారములో ఉంటూనే, సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే, నిర్వహించుకుంటూనే ఆత్మజ్ఞానం  పొందే ప్రయత్నాలు చేస్తూ వాటిని ఫలింప చేసుకోవాలని ఆయన ఉపదేశం. ఉపనిషత్ స్రష్టల జీవితములూ ఈ  ఉపదేశ భూయిష్ఠములే కదా.

ఇంతటి జ్ఞానాన్ని మనకి అందించిన రమణులు కర్మయోగి కూడా. శ్రీ శంకర భగవత్పాదుల వలె తల్లిని ఆదరించినవారు. ఆశ్రమంలో కూరలు తరగడం చేసేవారు. జ్ఞానమార్గావలంబులు కర్మ పరిత్యాగం చెయ్యాలనే అజ్ఞానపూరిత భావాన్ని, డంబాన్ని, భ్రమను, భ్రాంతిని పటాపంచలు చేసే విధంగా తను జీవించి మనకు ఉదాహరణగా నిలిచారు. మనందరమూ సంసారములో ఉంటూనే, సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే, నిర్వహించుకుంటూనే ఆత్మజ్ఞానం  పొందే ప్రయత్నాలు చేస్తూ వాటిని ఫలింప చేసుకోవాలని ఆయన ఉపదేశం. ఉపనిషత్ స్రష్టల జీవితములూ

ఆత్మజ్ఞాన ప్రాప్తి విధం, పథం, సంసార జీవనం పడుగు పేకల్లాగ అల్లుకుని, పాలూ నీళ్ళలా కలిసిపోయి, తేనె - మధురిమల లాగ ఒకటై తీయగా సాగాలని రమణుల ఆదేశం. సందేశం. ఇవి "ఒకటిని విడచి ఒకటి లేవు" అని మనం గమనిచాలని ఆయన ఉపదేశం.
 

శ్రీ రమణులు మనందరి హృదయాలను రమణీయం చేసి బ్రహ్మజ్ఞానాధ్యనానురక్తులను చేయుదురుగాక!

శుభం భూయాత్!

Friday, October 3, 2014

పరమాత్మ స్థితి - జీవ స్థితి

Image result for photographs of Adi Shankaracharya

పరమాత్మ స్థితి - జీవ స్థితి 


డా. వారణాసి రామబ్రహ్మం 
నేను - అద్వైతము - మాయ - ద్వైతము  

"నేను" అనుకోగానే ఏవిధమైన భావములు కలగకపోతే అప్పుడు మనము అసలు నేను అన్నమాట. "నేను" అనుకోగానే ఎన్నో తలపులు జోరీగల్లగా మనస్సుని చుట్టుముడితే మనము జీవ స్థితిలో ఉన్నట్టు లెక్క. ఈ స్థితిని ద్వైత స్థితి అంటారు. భావములు ఏమీ కలగని స్థితిని అద్వైత స్థితి అంటారు. ఆత్మయే అసలు నేను. అనుభవములు, తలపులు, ఉచ్చారణలు దృష్టిలో లేని విశ్రాంత దృష్టి అయిన వట్టి గమనిక మాత్రమే ఆత్మ. అలా వట్టి గమనిక మాత్రమే అసలు నేను.
ద్వైతస్థితి లోని "అబద్ధపు నేను" అసలు నేను పైని ఆనింపు. ఇది మిథ్య. అంటే ఒకసారి ఉంటుంది మరుక్షణం మాయ మౌతుంది; మాయ అవుతుంది. అలాగే ఈ అబద్ధపు నేను స్పృహ కలగడానికి కారణమైన, మేధలో  ఆత్మ (చిత్) శక్తి యొక్క ప్రతిఫలనము అయినది  మాయ (- చిదాభాస - చిత్ శక్తి మిథ్యా ప్రతిఫలనము); (యా మా సా మాయా - ఏది లేనిదో లేక మిథ్య అయినదో అది మాయ).

కాని మాయ మనకి ఏంతో ఉపయోగించే మానసిక శక్తి. మన  అహంకార, మమకారయుత వ్యక్తిత్వ స్థితికి, తద్వారా కలిగే తదితర అనుభవములకు, వాటి సేకరణ, జ్ఞాపకములుగా భద్రపరచుటకు, తిరిగి దృష్టి లోకి తేవడానికి (ప్రేరేపించడానికి) కారణమైనది కూడా మాయే. మాయ అనగానే ఏదో ఇంద్రజాలము మన దృష్టి కి వస్స్తుంది. కాని కాదు. "యయా అసన్తమ్ పశ్యన్తి సా మాయా" -- దేని ద్వారా ఈ బయటి ప్రపంచాన్ని, దాని మెదడులో ప్రతిరూపమైన ప్రపంచాన్ని సృష్టించడానికి, తిరిగి భావములుగా (జగత్ - కదిలేది) తేవడానికి మాయ ఉపయోగ పడుతుంది.
మాయ అనగానే మానసిక శక్తి అని మనకు బదులు రావాలి. దృష్టి కలగాలి. మాయారూపమైన మానసిక శక్తి యొక్క [అంతఃకరణములు - మనసు, బుద్ధి, అహంకారము (వ్యక్తిత్వ బావనలు), చిత్తము - ఇవి మాయా విభూతులు; అన్ని మానసిక కార్యక్రమములను నిర్వహిస్తాయి.] పరిణామములే మన అన్ని మానసిక కార్యకలాపములు.
అందుకనే "మాయామయమ్ ఇదం జగత్" అన్నారు. ఈ జగత్తు (అంతర ప్రపంచం) అంతా మాయచే నిర్మింపబడినది - అంటే మన లోని ప్రపంచం, అన్ని భావనలు, అనుభవములు, గ్రహణలు, క్రియలు, ప్రతిక్రియలు (జానేంద్రియ, కర్మేన్ద్రియముల సాయముతో) - ఇవన్నీ మాయా వివాఅర్తనములే. (పురోధాన తిరోధాన యుత వర్తనం వివర్తనమ్ - ముందుకు-తిరిగి వెనుకకు కదిలే వర్తనము వివర్తనము. ఉదాహరణ: బంగారము అలాగే ఉండి నగగా మార్పు చెందుతుంది. నగ మళ్ళీ బంగారమౌతుంది. బంగారముగాఉన్నప్పుదు, నగ అయినప్పుడు ఆవస్తువు బంగారమే. బంగారముతో నిర్మించబడినదే. నగగా ఉన్నా, బంగారముగాఉన్నా అందులోని బంగారాన్నే  చూస్తాడు కంసాలి.
అలాగే జ్ఞాని -  దృశ్య, శబ్ద, పరిమళ (వాసన), రుచి, స్పర్శ - యుతమైన మాయామయమైన (చిత్ ఆభాస - ఆత్మ శక్తి నిర్మితమైన) జగత్తుని చూస్తున్నప్పుడు కూడా ఆత్మనే చూస్తాడు. నామరూపాత్మకమైన జగత్తులో నామరూపములచే ప్రలోభపడక, ప్రభావితుడు కాక, ఆ జగత్తు నిర్మాణముకు కారణము, జగత్తుమయమైన, జగన్మూలమైన పరమాత్మనే చూస్తాడు. జ్ఞాని ఎల్లప్పడూ అసలు నేను స్థితిలో ఉంటాడు. అబద్ధపు నేను జ్ఞానికి ఉండదు.
ఈ జగత్తు, వ్యక్తిత్వము ఆత్మ స్థితి పైని ఆచ్ఛాదనలు. ఈ ఆచ్ఛాదనలు తొలగించుకోవడమే మనము చేయవలసినది. ఎల్లప్పుడూ సిద్ధమై ఉన్న ఆత్మ / బ్రహ్మము నేను-నేను అని వెలుగుతుంది. మనలను వెలిగిస్తుంది.
మనకు తెలిసీ తెలియక మెలకువ (బహిర్ముఖ దృష్టి -బయటి ప్రపంచము జ్ఞానేంద్రియముల ద్వారా దృష్టిలో ఉంటుంది), కల (అంతర్ముఖ దృష్టి-అంతఃకరణముల ద్వారా - అనుభవములు, భావనలు, ), గాఢ నిద్ర (విశ్రాంత దృష్టి - మానసిక కార్యకలాపములు విరమింప బడిన స్థితి) మన నిజ స్థితి అయిన జాగ్రత్ సుషుప్తి పైన కలిగి పోతూ ఉంటాయి. విశ్రాంత దృష్టి అయిన మెలకువతో కూడిన నిద్ర మన అసలు స్థితి. ఇది జ్ఞానుల స్థితి. మనందరి సహజ స్థితి కూడా.
మెలకువ రాగానే తలపులు విజృమ్భించి ఈ సహజ స్థితి ని మరుగు పరుస్తాయి. తలపుల స్థితియే మన "అసలు" స్థితిగా మారుస్తాయి. అనిపిస్తాయి. ఈ "అబద్ధపు స్థితి" లో కొట్టుమిట్టాడుచూ కాల, దేశములకు లొంగి శరీరము, మనస్తత్వము, సాంఘిక సస్థితి గతులు నేను, నావిగా భావించి కలవరపడతాము. కష్ట పడతాము. మన వారిని కష్ట పెడతాము.
ఇలా అసలు నేను జీవితాంతము మరుగున పరచు కొని సుఖ దు:ఖములను  అనుభవిస్తూ, శాంతి లేక ప్రశాంతతకోసము అలమతిస్తూంటాము.
మన నిజ స్వరూపమును తెలిసికొంటే మన విధ్యుక్త  ధర్మములను
నిపుణతతో, సంయనముతో, శాంతముగా నిర్వర్తిస్తూ ఆనదమయమైమైన జీవితమును గడుపుతాము. అన్ని అనుభవములను, తలపులను తట్టుకుంటూ, మానసిక ధైర్యముతో అన్నీ భరించి, సాధించి, సుఖపడతాము. మనవారిని సుఖపెడతాము.