Tuesday, August 29, 2017

మా ఖాట్మండూ యాత్ర 5, 6, 7



మా ఖాట్మండూ యాత్ర 5

16, 17-8-2017

ఎదురుచూడని ప్రయాణానుభవాలు 2

అలా అంచెలంచెలుగా దారిలో ఎంతో హడావుడి ఉన్నా జాగ్రత్తగా రాక్సల్ చేరాము. రాక్సల్ లో నేపాల్ సరిహద్దు అరకిలోమీటరు దూరం. అక్కడినుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం వెడితే ఇమైగ్రేషన్ వస్తుంది. పాస్ పోర్ట్ అవసరం లేదు. ఆధార్ కార్డు పనికిరాదు. డ్రైవింగ్ లైసెన్స్, పేన్ కార్డు, ఓటరు ఐడెంటిటీ కార్డు పనికివస్తాయి. మనకి, నేపాల్ కి సరిహద్దుగా ఒక నది ఉంది. దాటగానే నేపాల్ వైపు వీర్ గంజ్ వస్తుంది. బెంగాలీ ప్రభావం వల్ల బీర్ గంజ్ అనికూడా అంటారు.
 
ఈ ప్రయాణం గుఱ్ఱపు బగ్గీమీద చెయ్యాలి. బోర్డరు దగ్గర ఒక వంతెన దాటాలి. ఆ వంతెన చాలా చిన్నది. ఇరుకైనది. ఇటూ అటూ అన్ని వాహనాలు ఆ ఇరుకు వంతెన మీంచే వెళ్ళాలి. ఎంతో స్లో గా ట్రాఫిక్ నడుస్తుంది. ట్రాఫిక్ జామ్ కండిషన్లో సదా అలాగే ఉంటుంది. మా గుఱ్ఱపు బగ్గీమీద ఆ ట్రాఫిక్ జామ్ లో 5 కిలోమీటర్లు వెళ్ళడానికి 2 గంటలు పట్టింది. 5 గంటలకు వీర్ గంజ్ ఊరిమధ్యకు చేరాము.
 
3 గంటలకు ఆ చోటుకి వచ్చిఉంటే సుమో గాని, బలేరొ కాని దొరికేది. షేర్ టాక్సీలవి. 4-30 గంటల్లో ఖాట్మండు తీసుకు పోతాయి. కాని సరిహద్దు దాటడంలో జరిగిన ఈ ఆలస్యానికి మేము లేట్ అయ్యాము. ఇంక బస్ లోనే ఖాట్మండు వెళ్ళాలి. బస్ కి 7 గంటలు పడుతుంది.

మేము గుఱ్ఱపు బగ్గీ దిగగానే అక్కడ మూగిన బస్ వాళ్ళతో మహిందర్ సింగ్ మాట్లాడి ఒక బస్ లో మాకు ఖాట్మండు కి టికెట్ లు బుక్ చేశాడు. టికెట్ ఖరీదు నేపాలీ రూపాయల్లో 600. మన రూపాయల్లో 325. ఇలా తేడా ఉన్నా టీ, మంచినీళ్ల బాటిల్ మన కరెన్సీ లో రేట్లు ఇండియా లో లానే తేలతాయి.

బస్ రాత్రి 9 కి బయలుదేరి, పొద్దున్న 5 గంటలకి ఖాట్మండు చేరుతుంది. మా బస్సూ బయలుదేరింది. అది 16 వ తారీఖు రాత్రి. మేము భీమవరంలో 14వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాము. మా ప్రయాణంలో మరొక పదనిస.

తెల్లవారుజామున రెండు గంటలకు మా బస్ ఆగిపోయి ఉంది. ఏమిటి అంటే, అది ఘాట్ రోడ్. వర్షానికి కొండ చరియలు విరిగి రోడ్ మీద పడి ట్రాఫిక్ ని ఆపేశాయి. 5 గంటలకు క్లియర్ చేశారు. ఇక్కడ మా ఇద్దరికీ సహనం
కొద్దిగా సడలింది. కాని సర్దుకున్నాము.
 
మొత్తానికి 6-30 ప్రాంతంలో ఒక చోట ఆపారు. అక్కడకి ఖాట్మండు ఇంకా 110 కిలో మీటర్లు ఉంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం వల్ల బయటి ప్రపంచంతో మా సంబంధం తెగిపోయింది. మేమున్న చోట భౌతిక ప్రపంచం తో మాత్రమే మా సంబంధం.

 మా ఖాట్మండూ యాత్ర 6

17-8-2017

నేపాల్ ప్రకృతీ రమణి సుందర ఆత్మీయ స్వాగతం

అప్పుడు టీ తాగి 6-45 ప్రాంతంలో అక్కడ నుంచి బయలు దేరాము. నేపాల్ సుందర ప్రకృతి దృశ్యాలు మమ్మల్ని ఎంతో అలరించాయి. మాకు కుడి పక్కన ఆకు పచ్చని వస్త్రం కప్పుకున్న ఎత్తైన పర్వతాలు. ఎడమ పక్క లోతైన లోయ. దానిలో వంకర టింకరలుగ వయ్యారి భామ లా వగలు పోతూ రమణీయంగా వయ్యారంగా ప్రవహిస్తున్న త్రశూలి నది ఆప్యాయంగా పలకరించింది. హృదయ పూర్వకంగా స్వాగతం పలికింది. ఆత్మీయంగా ఇంచుమించు ఖాట్మండు వరకు ప్రియబాంధవిలా తోడొచ్చింది.
 
పర్వతాలు, వాటిపై వృక్ష సముదాయం, పర్వత సానువులపై వ్యవసాయం, లోయలు, లోయలో నదీ ప్రవాహం మాకు ఎంతో ఆహ్లాదం కలిగించాయి. అంత వరకు పడిన శ్రమ పూర్తిగా మర్చిపోయాం. మనసు ఆహ్లాదభరితం అయింది. నేపాల్ ప్రకృతీ రమణి మమ్మల్ని ఎంతో స్నేహంగా అక్కున చేర్చుకుంది.
త్రిశూలి నదీ లోయ తప్పక చూచి ఆనందించవలసిన ప్రకృతి దృశ్యం. అంత అలసి ప్రయాణం చేసిన మాకు ఈ ప్రకృతి దృశ్యాలు శ్రాంతతను పోగొట్టాయి.
 
తల్లి నవమాసాలు మోసి, కన్న పసిపాపని చూసి అప్పటి దాక పడిన శ్రమ మర్చిపోయినట్టు మా ప్రయాణ శ్రమని ఈ ప్రకృతి సౌందర్యం వీక్షించడంతో మర్చిపోయాం.

ప్రొద్దున్న 10-30 కి ఖాట్మండు చేరాము. మహిందర్ సింగ్ మా హోటల్ కి మాకు టాక్సీ మాటాడిపెట్టి మమ్మల్ని అందులో కూర్చోబెట్టి తన నివాసానికి వెళ్లి పోయాడు. అనిల్, మహిందర్ సింగ్ లు మాకు చేసిన ఉపకారం మరువలేనిది. కొత్త ప్రదేశం లో, విపత్కర పరిస్థితుల్లో మా పక్కన నిలచి మా ప్రయాణం ఎంతో సాఫీగా జరిగేలా చేసిన వారిద్దరూ మాకు చిర స్మరణీయులు. జీవితంలో వారికి ఎంతో మేలు జరగాలని మా ప్రార్థన. మనుషుల లోని ఈ ఉపకార గుణమే మానవవాళికి శ్రీరామరక్ష.

మేము ఎక్కిన మారుతి, దాని నేపాల్ చోదకుడు పురాతనులు. ముసలివారు. అప్పుడు ఖాట్మండులో మనవైపులానే ఎండ, వేడి ఎక్కువగా ఉంది. ఖాట్మండు ఊరు మన వారణాసి లాగా, కాన్పూర్ లాగా ఉండి ఎంతో పరిచయమైన ప్రదేశం లా అనిపించింది. అప్పుడు మేం ఒక చిరునది వంతెన పై వెళుతుంటే ఆ నది విష్ణువతి నది అని మా డ్రైవర్ చెప్పాడు. నేపాల్లో కుక్కలు బొద్దుగా ఉన్నాయి. వాతావరణ‌ ప్రభావం ఏమో! ఖాట్మండు లో బోర్డులన్నీ ఇంగ్లీష్, దేవనాగరి లిపిలో ఉన్నాయి.

పది నిమిషాల లో మా భావి నివాసమైన మార్వాడీ సేవా సమితికి చేర్చాడు. డబ్బులు ఎక్కువ ఇమ్మని నసిగాడు. ఇవ్వకపోతే విసుక్కుంటూ దింపాడు. నేపాల్లో మన కరెన్సీ చెల్లుతుంది. అందరికీ హిందీ వచ్చు.

ఇంకో దేశం వెళ్లినట్టే అనిపించలేదు. యూపి, బీహార్లో ఒక నగరానికి వచ్చినట్లు ఉంది. మార్వాడి సేవా సమితిలో సౌకర్యాలు బాగున్నాయి. ISKCON వారే అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు.
 
అప్పటి కి పూర్తిగా అలిసిపోయిన మేము స్నానపానాదులు, భోజనం చేసి మంచాలపై వాలిపోయాము. సాయంకాలం 6 గంటలకు లేచాము. భోజనం చేసి పూర్తి యైన విశ్రాంతి తీసుకొన్నాము. మరునాడు కాన్ఫరెన్స్ మొదలవుతుంది.
 
మా ఖాట్మండూ యాత్ర 7

18, 19-8-2017

అనుకున్న ప్రకారం 18 తారీఖు ఉదయం 9 గంటలకు కాన్ఫరెన్స్ మొదలైంది. ప్రముఖులంతా వేదికపై ఆసీనులయ్యారు. ఖాట్మండు విశ్వవిద్యాలయం, తిభువన్ యూనివర్సిటీ, నేపాల్ అకాడమీల ని లోని
విద్యావేత్తలు, ISKCON స్వాములు, పిలువబడిన భారత శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ప్రసంగించారు.
ఖాట్మండు లోని విశ్వవిద్యాలయాల, కాలేజీల, స్కూళ్ల విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. ఇనాగరేషన్ బాగా జరిగింది. నేపాల్ ప్రథమ, మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ బరన్ యాదవ్ కూడా హాజరయ్యారు. అధ్యక్ష ప్రసంగం చేశారు.
ISKCON వారు అన్ని వసతులు బాగా కల్పించారు. భోజనాలు బాగున్నాయి. నేపాలీ వంటకాలు, మన ఐటమ్స్ చేశారు. రుచిగా ఉన్నాయి.
 
నా ప్రసంగం 19 వ తారీఖు ‌మధ్యాహ్నం 3 గంటలకు నిర్ణయించబడింది. నా ప్రసంగం బాగా జరిగింది. క్లాసులో పాఠం చెప్పినంత మామూలుగా జనరంజకంగా మాట్లాడాను. నా పరిశోధనా పత్రం శీర్షిక:
 
Consciousness Studies and Quantum Mechanics.

నాకు సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉండడంవల్ల ఆధికారికంగా ప్రసంగించాను. మా ఆవిడ వీడియో తీసింది. అది ఇక్కడ పంచుకుంటాను. ఎక్కువ మంది నా ప్రసంగాన్ని, పరిశోధనలను అభినందించారు. ఎక్కువ మందికి నా ప్రసంగం, నా insight బాగా నచ్చినట్లు ప్రసంగిస్తోంటే, ప్రసంగించిన తరువాత నాకు అర్ధం అయ్యింది. నాకు సంతోషం కలిగింది.

ISKCONకి చెందిన భరత్ సాయం మరువరానిది. అతను మంచి స్నేహశీలి. మేము బెంగుళూరులో జరిగిన ISKCON వారి 2016 కాన్ఫరెన్స్ లో కలిశాం. మా అబ్బాయిలకి మా క్షేమసమాచారాలు అతని ద్వారా ఇ-మెయిల్ చేశాను. అతను మన విజయవాడ వాడు. నవ్వు మొహం. ఉపకారస్థుడు. మేము మంచి స్నేహితులం అయిపోయాం. తరువాత జరిగిన టూర్ లో మాకు అతని సెల్ తో, కెమెరాతో చాలా ఫొటోలు తీసాడు. వాట్సాప్ లో పంపుతాడు.

ఆ తర్వాత 19న వెలెడక్టరీ ఫంక్షన్ జరిగింది. దానికి నేపాల్ లోని భారత రాయబారి మంజీత్ సింగ్ అధ్యక్షత వహించారు. మాకు సర్టిఫికెట్ లు పంచారు. నాకు 30 ఏళ్ళుగా పరిచయం ఉన్న హైదరాబాద్ సిసిఎమ్బి ముఖ్య శాస్త్రవేత్త,, అద్వైతంలో మంచి పట్టు ఉన్న డా. M.V. Jagannadham కూడా ఈ కాన్ఫరెన్స్ కి వచ్చారు. మంచి ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. ఆయన 2016 లో బెంగుళూరులో జరిగిన ISKCON వారి కాన్ఫరెన్స్ కీ వచ్చారు. తరువాత జరిగిన టూర్ లో కలిసి తిరిగి మన కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపాము.
20 - 22 లలో మూడు రోజులు ISKCON organizers డబ్బులు తీసుకుని tour ఏర్పాటు చేశారు. ఆ విశేషాలు తరువాయి భాగాలలో.

సూచన:
 
ఇక్కడికి వచ్చాక లోకల్ సిమ్ తీసి కోవడం శ్రేయస్కరం. ఉత్తమం. అవసరం. లోకల్ సిమ్ లేక మనం ఇంటర్నెట్ ని సైబర్ కేఫ్ లలో ఇ-మెయిల్ వాడడానికి ఉపయోగించలేము. తీసికోవాలి కూడా. మన వాళ్ళతో కమ్యూనికేషన్ చాలా ఈజీ అవుతుంది. లేకపోతే నాలా ఇబ్బంది పడాలి. ఇక్కడ సిమ్ తీసి కోవాలంటే పాస్ పోర్ట్, ఫొటో అవసరం. ఏది లేకపోయినా సిమ్ ఇవ్వరు.

మా ఖాట్మండూ యాత్ర 4



మా ఖాట్మండూ యాత్ర 4

16-8-2017

ఎదురుచూడని ప్రయాణానుభవాలు 1

కాళికా మాత దర్శనం చేసికొని హౌరా స్టేషన్ కి వచ్చాక కాసేపు విశ్రాంతి తీసుకొని మా రైలు, హౌరా-రాక్సల్ ఎక్స్ప్రెస్ ఏసి 2 టైర్ కోచ్ లో ఎక్కాము.
 
ప్రొద్దున్న హౌరా స్టేషన్ చేరినప్పటి నుంచి తీవ్ర వరదల వల్ల ఉత్తర బెంగాల్, ఉత్తర బీహార్ వైపు వెళ్లే ఎన్నో రైళ్ళను రద్దు చేస్తున్నట్లు ప్రకటనలు లౌడ్ స్పీకర్ లలో ఘోష పెడుతున్నాయి. మా రైలు కూడా రద్దు చేయ బడిందేమో అన్న ఆదుర్దాతో విచారణా కేంద్రానికి వెళ్ళి కనుక్కున్నాను. మా రైలు రద్దు చేయ బడలేదు.
 
మా పెద్ద కోడలు మేము ఖాట్మండులో ఏ ఏ నేపాలీ వంటకాలు రుచి చూడాలో రెండు లిస్టులు పంపించింది. వీలైనన్ని రుచి చూడాలి. తనకి అన్ని దేశాల ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకోవడం, వీలైనంతగా రిసెర్చ్ చేయడం ఇష్టం.

అలా రద్దు చేయ బడని మా రైలు ఎక్కాము. ఈ ప్రయాణంలో అంతా మాములుగానే అనిపించింది.
రాత్రి పదిగంటల ప్రాంతంలో మా రైలు రాక్సల్ దాకా వెళ్ళదేమో అనే మాట వినిపించింది. పట్టించుకోకుండా
పడుకున్నాము. తెల్లారిలేచే సరికి మారైలు ముజఫర్ పూర్ దాటి గంట ఆలస్యంగా నడుస్తోందని తెలిసింది.
వరదల మూలంగా మా రైలు రాక్సల్ వెళ్ళదని కన్ఫర్మ్ అయింది. మోతిహార్ వరకే వెళుతుంది. అక్కడినుంచి ఇంకా రాక్సల్ 100 కి.మీ. దూరం ఉంది. రైల్లోని వారు పర్వాలేదు ఎలాగో లాగా రాక్సల్ చేరచ్చన్నారు. అలా అన్నవారిలో రాక్సల్ దాకా వస్తున్న ఖాట్మండు వాసి అనిల్ ఒకడు. అప్పటినుండి అనిల్ మాకు చేసిన సహాయం ఎంతో విలువైనది.
 
మోతిహార్ స్టేషన్లో రైలు ఆగిపోయింది. ఇంక ముందుకు వెళ్ళదని రైల్వే వారు ప్రకటించేశారు. అనిల్ ఆపద్బాంధవుడిలా మాతోనే ఉండి, ఆటో మాట్లాడి మమ్మల్ని మోతిహార్ బస్ స్టాండ్ కి చేర్చాడు. మాతోనే ఉన్నాడు. అది బస్ స్టాండ్ కాదు. రోడ్డు మీదే బస్సులు ఆగే చోటు. బస్సులు రాక్సల్ వెళ్ళడం లేదు. ఆ రోజునుంచి, లేదా జస్ట్ అప్పటినుండి జీప్ లు వెళుతున్నాయి. మాకు లగేజి ఎక్కువగా ఉంది. మూడు సూట్ కేసులు. ఒక జీప్ లో మా ముగ్గురికి ఐదు సీట్లకి మాట్లాడి ఆ రణగొణ ధ్వని, పోటీలో ( రాక్సల్ వెళ్ళవలసిన వాళ్ళతో అక్కడ ఎంతో హడావుడిగా, గడబిడగా, తొక్కిసలాట, తోపులాటలతో ఎలా ఉండాలో అలా ఉంది.) మమ్మల్ని మా సామానుతో సహా జీప్లో సౌకర్యంగా కూర్చో బెట్టాడు.
 
మా జీప్ కదులుతూ ఉంటే వరద భీభత్సం అంతా మాకు కనిపించింది. గ్రామాలకు గ్రామాలు ముంపునకు గురై ఉన్నాయి. స్త్రీ పురుషులు, పిల్లా, పెద్దా, గొడ్డూ, గోదా అందరూ, అన్ని రోడ్డు మీదే నివాసమున్నారు. రోడ్డుకి అటూ, ఇటూ కనుచూపు మేర జల మయమే. నీటి సంద్రం.
 
పూర్వీ గండక్ నది వరదల భీభత్సం ఇది. నేపాల్లో కురిసి వర్షాలవల్ల ఈ నది పొంగుతుంది. గండక్ నేపాల్ లోని ముఖ్యమైన నది. సాలగ్రామాలు దొరికేది ఈ నదిలోనే. ఇది గంగానదికి ఉపనది. బీహార్లో గంగని కలుస్తుంది. మనం ఈ నదిని గండకి అంటాము.

ఇవన్నీ చూస్తుంటే ఎంతో బాధ అనిపించింది. సహాయ కార్యక్రమాలు ఏమీ కనిపించలేదు. మన వైపులా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయినట్టు, కదిలినట్లు, సహాయక చర్యలు చేపట్టినట్లు ఎక్కడా కనిపించలేదు. వాసన కూడా వేయలేదు. ప్రజలు ఎవరి ఖర్మ వారనుభవిస్తున్నట్టు, వాళ్ళ సహాయాలు వాళ్ళే చేసుకుంటున్నట్లు అనిపించింది.

ఆశ్చర్యపోతూ జీప్ లో ప్రయాణించాము. ఒక చోట వంతెన కొట్టుకుపోయి, తాత్కాలిక ఏర్పాటు చేశారు. మా డ్రైవర్ హాయిగా నడిపేశాడు. వెంటనే రోడ్ మీద ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. రోడ్డు ఏమీ కనిపించడం లేదు. మళ్ళీ మా డ్రైవర్ ముగ్గురిని దింపి, ధైర్యంగా, మేమూ ధైర్యంగా కూర్చుని ఉండగా చాలా చాకచక్యంగా ఆ ఉధృత నీటి ప్రవాహాన్ని దాటాడు. మేమందరం ఇంప్రెస్స్ అయ్య మెచ్చుకోలుగా చప్పట్లు కొట్టాము. మాతో ఒక విదేశీయురాలు, ఆమె కూతురు ఉన్నారు. వాళ్ళూ కంగారు పడకుండా ఆ ప్రయాణాన్ని ఆనందించారు.

రాక్సల్ 20 కి.మీ. ఉందనగా మా జీప్ ని ముందుకెళ్ళదని ఆపేశారు. 100 మీటర్ల దూరంలో ఒక వంతెనపై నీరు ఉధృతంగా ప్రవహిస్తూండడం దానికి కారణం. మా ప్రయాణీకులందరూ రాక్సల్ చేరలేదు కాబట్టి కొంత డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతను ఒప్పుకొని అలాగే చేశాడు.
 
ఇంక 400 మీటర్లున్న ఆ ప్రాంతం మా సామాన్లతో దాటడం ఎలా? మాకు ఆలోచించవలసిన అవసరం లేకుండా కొందరు మమ్మల్ని, మా సామానుని క్షేమంగా దాటిస్తామని, కొంత డబ్బు అడిగారు. ఒప్పుకొని వాళ్ళ సాయం తీసుకున్నాము. ఆ సాయం అవసరం. సామాన్లు లేకపోవడం వల్ల అనిల్ వేగంగా దాటేశాడు. మేమూ దాటాక అక్కడి వ్యవహారం చూశాక; జనం, తొక్కిసలాట, తోపులాటలు గమనిస్తూ కిం కర్తవ్యతా విమూఢులమై నుంచుని ఉన్నాము. మా ఆవిడ అనిల్ కో‌సం చూడమంది. నేనెందుకో అతను వెళ్ళిపోయాడు అనుకున్నాను. ముందుకు వెళ్ళి చూశాను. జీప్ ల దగ్గర రామ రావణ యుద్ధాలు జరుగుతున్నాయి.
 
ఏంచేయాలి అని ఆలోచిస్తూ వెనక్కి వచ్చాను. మా కోసం ఎదురుచూస్తున్న అనిల్ మా ఆవిడను గమనించాడు. సుమో మాట్లాడేను, రండి అని తీసికొని వెళ్ళడానికి వచ్చాడు. ఇంతలో నేనూ వచ్చాను. అందరం కలిసి సుమో దగ్గరకు చేరి, మేమూ, సామాన్లు, సర్దుకున్నాము.
 
అక్కడ ప్రయాణీకులలో మహిందర్ సింగ్ ని పరిచయం చేశాడు. అతను శిఖ్. మహిందర్ కూడా ఖాట్మండు వస్తున్నాడు. ఖాట్మండు నివాసి. రాక్సల్ చేరిన తర్వాత మమ్మల్ని ఖాట్మండు చేర్చే బాధ్యత అనిల్ నుంచి అతను తీసికున్నాడు. పొద్దున్న 9 గంటలకు రాక్సల్ చేరవలసిన వాళ్ళం ఇలా ప్రయాణించి సాయంత్రం 3 గంటలకు నెమ్మదిగా రాక్సల్ చేరాము.

ఇక్కడ ఒక మాట చెప్పాలి. రైలు మోతిహార్ లో ఆగిపోవడం వల్ల రాక్సల్ చేరడానికి మాకు ఎక్కువ అయిన ఖర్చు అక్షరాలా పదకొండు వందల రూపాయలు.
 
నేను కాళికాలయంలో 11వందల రూపాయలకు ఇస్తామన్న అమ్మవారి ప్రసాదం నిరాకరించినపుడు మా ఆవిడ అనుకుందిట: అమ్మవారి ప్రసాదం ఈయన ఎందుకు వద్దన్నారో, పోనీ, తల్లి అంత మొత్తాన్నీ ఏదో విధంగా less privileged కి ఇప్పిస్తే బాగుండును అని. అమ్మవారు ఆమె కోర్కె ఇలా తీర్చినట్టుంది. అనిల్ ని, మహిందర్ సింగ్ నీ మాకు పరిచయం చేసి మాకు ప్రయాణం సాఫీగా జరిగేలా చేసింది అనిపించింది. తల్లికి మనసులోనే కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించాను.
 
మన మనసు ఎంత తుంటరో మనందరికీ తెలుసు. మేము మొదట గోరఖ్ పూర్ మీదుగా నేపాల్ వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించుకున్నాము. ఆర్గనైజర్ల సలహాతో రాక్సల్ మీదుగా వస్తే వీలుగా ఉంటుంది అన్నారు. అలా టికెట్లు మార్చుకున్నాము. ఇలా రైలు ఆగిపోయి హడావుడిగా ప్రయాణం చేస్తోంటే గోరఖ్ పూర్ మీదుగా వెళితే ఈ హడావుడి తప్పేది కదా అని ఒకటే నస. మనం నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో తేడా వస్తే మనసు పెట్టే నస, సణుగుడు అంతా ఇంతా కాదు. పెళ్లి, ఉద్యోగం, ఇంకా ఇటువంటి విషయాల్లో తర్వాత తేడా వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ సతాయింపు చిరాకు పుట్టిస్తుంది. మనసుని నెమ్మదిగా బుజ్జగించు కోవాలి.