Monday, June 27, 2016

ప్రజా ప్రతినిధులా? - ప్రజల పాలిటి గుదిబండలా?

ప్రజా ప్రతినిధులా? - ప్రజల పాలిటి గుదిబండలా?

 
ప్రజలెన్నుకొనుచున్నారు ప్రతినిధులను పంచాయితీలకు,
మండల, జిల్లా పరిషత్ లకు, రాష్ట్ర శాసన సభకు, పార్లమెంటుకు; మునిసిపాలిటీలకు మరల వేరే
ఇందరు వంటవాళ్ళు కలిసితగలేస్తున్న వంట భారత
దేశ పరిపాలన, ప్రజాస్వామ్య అనుసరణ, పరిరక్షణ


బాధ్యతాయుత వర్తనతో ప్రజలకు ప్రతినిధులై, అహర్నిశము వారి సుఖ శాంతులకై పనిచేయ వలసిన
నాయకులు; ప్రజల పాలిటి నియంతలై అధికార దర్పము
నెత్తికెక్కించుకొని ప్రజలకు పాలకుమని అనుకొనుచు
తాము ఎన్నికైన ప్రాంతము తమ జాగీరనుకొనుచు

పిల్ల జమీందార్ల వలె విర్రవీగుచు తమలో తాము
తమ ప్రాంత హక్కుదారులు గా అనుకొనుచు తమకు
విన్నవింపక, తమకు తెలుపక, అనుమతి పొందక మరే
ప్రతినిధీ, తమ ప్రాంతమున ప్రజోపయోగ పనుల చేపట్టరాదు, చేయరాదనుచు తమ అధికార, అహంభావ

ప్రదర్శనమున చిన్నపిల్లల వలె కొట్లాడుకొను చందము‌
ప్రజలకు ఈ నాయకులను గుదిబండలుగా చేయుచున్నది
తాము ప్రజాప్రతినిధులము ప్రజా పాలకులము కాదను
స్పృహ ఈ చిన్ని బుర్రలకు, అహంకారమదము నిండిన

వినాయకులకు తట్టడం లేదు; దానికి తోడు తమ ప్రాంత
వసూళ్ళు ఠంచనుగా మెక్కు ఈ ప్రతినిధులు పికజలకేమి
ఒరగబెట్టగలరు? తమ తమ గీరలను అధికార
మదాంధతను చూపించుట తప్ప; తప్పలు వీరి

ప్రజ్ఞలు; అంధము వీరి దృష్టి; సంకుచితమూను
ప్రజా ప్రతినిధులు పౌరుల పట్ల నియంతలై అయిన కాడికి
అక్రమ ఆస్తులను, ధన దస్కములను వెనకేసికొనుట
ప్రతినిధిత్వమను నూతన నిర్వచనము ప్రజాస్వామ్యము

నకు అందించిన ఈ కునాయకులు ప్రాతః నిందనీయులు
ప్రతినిధులుగా ఎన్నకొనబడిన వీధి రౌడీలీ గుదిబండలు

శ్రీ మావుళ్ళమ్మ వచనములు -2



Image result for IMAGES OF MAVULLAMMA



శ్రీ మావుళ్ళమ్మ వచనములు - 2

మావుళ్ళమ్మ తల్లి భీమవరపట్టణపు గ్రామదేవత. మహామహిమాన్విత. భక్తుల కోర్కెలను ఈడేర్చడంలో సిద్ధహస్త. కనువిందైన భారీ విగ్రహము. కళైన ముఖము. పేద్ద పేద్ద కళ్ళతో ప్రసన్నముగా చూస్తూంటుంది. సర్వమంగళ.


శ్రీ మావుళ్ళమ్మ తల్లి గాయత్రి.:


ఆత్మానుసంధాన కర్త్రై విద్మహే భక్తేష్టార్ధ దాత్రై ధీమహి తన్నో విశాలాక్షీ ప్రచోదయాత్!

ఓం శ్రీ మావుళ్ళమ్మ దేవ్యై నమ:




12.

మార్జాల కిశోర న్యాయమున పాలించి, నను ఒడి చేర్చుకొని
సకల భాషా శాస్త్ర కళా వేదాంత క్షీరములను నీ దయా స్తన్యముల
గ్రోలించి తృప్తుడను చేసితివి; అసంతృప్తిని ఇక నా దరిదాపులకు
రానీకమ్మా నగరాజకుమారీ! నాట్య విశారదా! గజరాజ జననీ!
అమ్మా! పరమేశ్వరీ! మావుళ్ళమ్మ తల్లీ! కరుణా తరంగిణీ!
మాయా విలాసిని! మాతా! భీమవరపుర నివాసినీ! కామాక్షీ!

13.

అన్ని ఉపాసనలకు ప్రేరణ నీవు అన్ని ఉపాసనలకు గమ్యము నీవు
అన్ని ఉపాసనలను ఫలింప చేతువు శ్రీవిద్యోపాసనను నా ఊపిరిగా మార్చి
ప్రాణ గమన నిర్దేశనమున మదికి నెమ్మదినిమ్ము అమ్మా! పరమేశ్వరీ!
మావుళ్ళమ్మ తల్లీ! మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ! భవానీ!

14.
కారుణ్య వర్షము కురిపించి హర్షపు మొలకలు మొలిపించి
ఆనంద సస్యము నిచ్చు ధరిత్రివి; అన్నదాత్రివి, అన్నపూర్ణవు;
మనమును సదా నిర్మలముగ పచ్చగనుంచుము చామాలమ్మా!
అమ్మా! పరమేశ్వరీ! మావుళ్ళమ్మ తల్లీ! మహాలక్ష్మీ! శారదా!
మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ! పర్వతవర్ధినీ! మాతా!

15.
రాణివి నీవు సమస్త లోక ధారిణివి నీవు
సకలాధినేతల శిరస్సులు ప్రణమిల్లును నీకు
సకల రాజన్య పూజితా! రాజ రాజేశ్వరీ!
అమ్మా! దయచూడుము మావుళ్ళమ్మ తల్లీ!
మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ!

16.
మన్నించుటలు మర్యాద చూపుటలు తెలిసి, తెలియక,
గర్వముతో స్వోత్కర్షతో ఇతరుల మంచిని; లేని గొప్పతో
తేలికగజూచు భేషజపరుల, అనాగరికుల సావాసము గాక
స్నేహము, గౌరవము, హుందా, వాత్సల్యము కల, పంచగల
నాగరికుల, సంస్కృతీపరుల సహవాసమ్ము నిమ్ము
అమ్మా! పరమేశ్వరీ! మావుళ్ళమ్మతల్లీ! జగన్మాతా! గౌరీ!
మాయావిలాసినీ! భీమవరపుర నివాసినీ! మహిషాసుర మర్దినీ!

17.
అన్ని ప్రేమలు అభిమానములు బంధుత్వములు మిత్రత్వములు
మనసుల నిండి మనుషులు మాత్సర్యరహితులుగ జీవించునటుల
అమ్మా! దయచూడుము డెందముల హృద్యము చేయుము మావుళ్ళమ్మ తల్లీ!
మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ! సరస హృదయ సామ్రాజ్ఞీ! సతీ!

18.
భయములు ఆందోళనలు వేదనలు వ్యథలు బాధల పోగొట్టి
నా మనసెన్నడు నీ శుభనామ స్మరణమున తేలియాడునట్లు
చేయుము; ఆర్తిని తీర్చుము ఆనందమగ్నగ మనసును మలచుము
భవబంధ మోచనీ! భగవతీ! భవానీ! భావజభంజనుని ముద్దుల సఖీ!
అమ్మా! పరమేశ్వరీ! మావుళ్ళమ్మ తల్లీ! అపర్ణా! ఉమా! పార్వతీ!
మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ! దాక్షాయణీ! కన్నతల్లీ!

19.
క్రోధములు ద్వేషములు కలిగించు చెడ్డ తలపుల మూలములను
ఛేదించి; సకుశలముగ స్థిమితముగ మనసును చేయుము; అందరను
సంతోషపెట్టునట్టు నన్ను మలచుము; అమ్మా! మావుళ్ళమ్మ తల్లీ!
మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ! తల్లీ! మాణిక్యాంబా!

20.
తెల తెల వారుచుండ తెల్లని మందారపూలతో అర్చించుచు
అందరకు తెల్లమగు తేటతెనుగు మాటలతో నిను నుతించు
భాగ్యము నిచ్చి నా మనసును తల్లనిదానిగ చేయుము మల్లియ వలె
అమ్మా! పరమేశ్వరీ! మావుళ్ళమ్మ తల్లీ! మల్లికార్జున ప్రేయసీ!
మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ! భ్రమరాంబాదేవీ! శ్రీశైల వాసినీ!

21.
కాలము నీవు కాల ప్రవాహము నీవు
కాలాతీతవు కాల గమన నిర్దేశవు
భూత భవిష్యత్ వర్తమానముల
కల్పించి సాక్షివై గమనించు దేవీ!
కాల సుడిగుండమున మనసు చిక్కుకొని
సుడులు తిరుగకుండా కాపాడి రక్షించు పార్వతీ!
అమ్మా! పరమేశ్వరీ! మావుళ్ళమ్మ తల్లీ!
మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ!


22. పండినది మనసు; ఉడుగుచున్నవి
జవసత్త్వములు తనువుకు; మనిషి
జీవితమున ఒకటి లభించిన ఒకటి
కనుమరుగగు; అంతయు జీవపరిణామ


ఫలము; విధి బద్ధము; మగవారైన
ఆడువారైనను, పసి, బాల్య, కౌమార, యవ్వన,
వార్ధక్యదశల అనుభవించుచు చనవలె;
జరా మరణములు జీవులకు తథ్యము


అట్టి మేము ఒకరికొకరము సాయము కాము
హక్కులంచు బాధ్యతల స్వీకరించము; అందరు
పల్లకినెక్కువారే మోయువారెవరూ లేరు; అంతయు
అస్తవ్యస్తము గందరగోళముగ నున్నది మనిషి బ్రతుకు


ఇది ఏమి తల్లీ! అమ్మా! మావుళ్ళమ్మ తల్లీ!
మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ!


23.
తల్లివి నీవు సమస్తలోక కల్యాణివి నీవు
రాగమయివి నీవు సరాగఝరివి రక్తి స్వరూపిణివి
రసరాజ్ఞివి రమ్యభావనా పూజితవు రంజనివి రామవు
వెన్నెల వంటి మనసుతో ఆపన్నుని కావుము
అమ్మా! పరమేశ్వరీ! మావుళ్ళమ్మ తల్లీ!
మాయా విలాసినీ! భీమవరపుర నివాసినీ!


24.
శక్తివి నీవు శక్తి పరిణామవు నీవు కాల ప్రవాహమవు కాలాతీతవు
సమస్త చర్యల ప్రతి చర్యల అధ్యక్షవు అధ్యయన అధ్యాపనల కారకవు
సంవిన్మాత్రవు తన్మాత్రల అధినేత్రివి అంత:కరణ రూపివి విద్యావిద్యా
స్వరూపిణివి; అమ్మా! కారుణ్యమున కావుము మావుళ్ళమ్మ తల్లీ!
మాయా విలసినీ! మంజుల భాషిణీ! జగన్మాతా! భీమవరపుర నివాసినీ!