Friday, March 18, 2016

జగన్నాథుని రాసలీలలు

జగన్నాథుని రాసలీలలు

మా పెరటిలోనున్న అరటిపిలక వేసె మారాకు
ఆహ్లాదమందె నామది; ఊగె పైరగాలికి అయ్యి చిగురుటాకు

సరసమై స్పందనగల హృదయము
ప్రకృతినానందించును హృద్యంగా

మొక్కల పచ్చదనము; నీటిజాలుల
జరజరల జలజలలు; నీలిసంద్రపు
అందములు అల్లన ఆ దూరముల
ఆకసమునంటును; కలియు నింగిని
అందమున శ్యామల వర్ణమున
అనంత వైశాల్యమున గాంభీర్యమున
గరుడధ్వజుని మేని చాయ ప్రకాశమై

రమణుల రంజనములు; వినువీధిని
అందాల తారకలు వాటి విభుడు చల్లనిరాజు
సమముగ నిత్తురు హాయిని; ముదమును;
యువతీ శృంగార రూపములె యౌవ్వన నిధులే

అంతయు ప్రకృతీ విలాసములు
రమణీయ కలాపములు; రసహృదయ
రంజనములు; సుమధుర శ్రావ్య స్వనములు
రాగ రంజిత మానస ఆనంద హేలలు; నర్తనలు

ప్రకృతిని నిండి ఉన్నవి ప్రశాంతత నిచ్చు
స్థిమితము కలిగంచు దృశ్యములు ధ్వనులు;
స్పందించి మురియగల మనసుకు నిత్య
విందులు; షడ్రసోపేత భోజనములు; తృప్తినిచ్చు

రసమయ ఉనికిలు; జగన్నాథుని రాసలీలలు
కనులు చెవులున్న మనసే బృందావనం
మానినీహృదయచోరుని రసనిలయం
రమ్య సన్నివేశ భరిత జగతీ రామణీయకతలు

Sunday, March 13, 2016

పెళ్ళి - ఒంటరి జీవితం


 పెళ్ళి - ఒంటరి జీవితం



పెళ్ళి చేసుకున్నా, ఒంటరిగా బ్రతికినా మనుషులకు కష్టసుఖాలు తప్పవు. అవి ఎటువంటివి అనే తేడా‌ ఉంటుంద అంతేి. నూటికి 80 మంది పైన పెళ్ళి చేసికుని వచ్చే కష్టసుఖాలను కలిసి పంచుకుంటున్నారు. ఒకరిని ఒకరు కష్టపెట్టుకుంటారూనూ.

ఒంటరి వారు జీవితాంతం కష్టసుఖములను ఒంటరిగానే ఎదుర్కోవాలి.

పెళ్ళి సుఖమా? ఒంటరితనం సుఖమా?

ఎవరూ చెప్పలేరు.

కాని ఎక్కువ మంది పాశ్చాత్యులు, ఇప్పుడు మన దేశంలో ఎందరో మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారో అర్థము కాదు. సుఖాలకోసం లాటరీ వేసుకుంటున్నారా?

స్త్రీలకు, పురుషులకు యవ్వనం కొద్ది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. తీవ్రవేగంతో వచ్చే నదీ ప్రవాహం ఒడ్లని కోసేసినట్టు కాలగమనం యవ్వనాన్ని హరించేస్తుంది. అంతటితో ఆగదు. శరీరాన్ని రోగభూయిష్ఠం చేస్తుంది. శిథిలం చేస్తుంది. ముసలితనం అనే మహారోగం అంటుకుని ఎన్నో అవస్థలకు గురిచేస్తుంది. మనం పెళ్ళైనవారమా, ఒంటరులమా దానికి అనవసరం. ఈ విషయాలు మనకి తెలుసా, తెలియదా అనేది దానికి పట్టదు.

జర, అనారోగ్యము చుట్టుముట్టే లోపల, యవ్వనం‌ కరిగిపోతున్న వర్తమానంలో, అన్ని అవస్థలలోనూ వీలైనంతగా సుఖశాంతులతో బ్రతకగలిగే ప్రణాళికలు మనం వేసుకోవాలి, పెళ్ళిచేసుకున్నా, ఒంటరిగా మిగిలిపోదామనుకున్నా.
తెలివైనవారు వారికి కుదిరిన జాగ్రత్తలు తీసికుంటారు. మనుషుల సుఖదుఃఖములు అనివార్యములు. చదువులోనో, ఉద్యోగము ద్వారానో పరిచయమైన వారు మన కష్టసుఖములలో నాబొందో అనుకుంటూ కలగచేసికొనలేరు. సాయాలు చేయలేరు. ఆదుకోలేరు. వారి బాధ్యతలు వారికి ఉంటాయి. వారి పరిధులు వారికి ఉంటాయి. అసలు మన కష్టసుఖాలు మనం పట్టించుకోనప్పుడు ఇతరులెలా పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకోవాలి?

పెళ్ళి చేసికొని ఇంకొకరితో కలిసి సుఖదుఃఖములను పంచుకోవడమా? ఒంటరిగా భరించడమా?
ఎంతో మంది ఒక వయసు దాటిన తరువాత జీవితం పెట్టే పరీక్షలకు తట్టుకోలేక, తెచ్చే దారుణ స్థితులకు లొంగిపోయి తోడు కావాలనుకుంటారు. ఎందరినో చూస్తున్నాం అలా. అది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కదా?
పెళ్ళి అనే పంజరంలో ఇమడలేక బయటపడదామనుకుంటున్న వాళ్ళూ ఉన్నారు.

ఎవరైనా సరే, ప్రేమాభిమానాలు ఇచ్చి పుచ్చుకోగలిగిన వాళ్ళు ఓ మాదిరిగా సుఖశాంతులతో బ్రతకగలరు.
ముఖ్యంగా మన జీవితం సుఖమయం కావడానికి మన పాత్ర మనం చిత్తశుద్ధితో నిర్వహించాలి. ఆపై వచ్చే వాస్తవాలను ధైర్యంగా ఎదుర్కోవాలి; పెళ్ళి చేసుకున్నా, ఒంటరిగా జీవిద్దామనుకున్నా.

జీవితంలో ఎంత తక్కువ కష్టపడేలా ప్రణాళిక వేసికుంటే అంత తక్కువగా సుఖశాంతులు కోల్పోతాము.
ఎవరి జీవితమూ వడ్డించిన విస్తరి కాదు. కష్టపడాలి. జాగ్రత్త వహించాలి. కనిపించిన వాణ్ణి, కనిపించని వాణ్ణి, మన జీవితంలో వచ్చే, మనం తెచ్చుకునే, వడిదుడుకులకు నిందించక, మనం జాగ్రత్తగా మసిలి జీవితాన్ని వీలైనంత సఫలంగా జీవించాలి. రాజకీయనాయకులలా "ప్రతిపక్షాన్ని" నిందిస్తూ నిర్వ్యాపారంగా, స్వార్ధంతో, దుర్మార్గంగా జీవించరాదు. ఇహాన్ని చేసుకున్నది ఇహాన్నే అనుభవించి వెళ్ళిపోతాము.

తస్మాత్ జాగ్రత! జాగ్రత!

Friday, March 11, 2016

ఆధ్యాత్మిక గురువులు - అహంభావ ప్రదర్శనలు


భారత దేశంలో ఆధునిక ఆధ్యాత్మికత రాజ్యం ఏలుతోంది. రామకృష్ణుల పేరు మీదైనా, సత్యసాయిబాబా పేరు మీదైనా, ఇప్పడు శ్రీ శ్రీ పేరు మీదైనా ఆ "గురువు" ఎవరైనా, ఇంకా చిన్నా, చితకా కిళ్ళీకొట్టువాళ్ళు, అందరూ వేద పఠనం, ఉపనిషత్తులు, ఇతర భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాసు విరివిగా వాడుకుంటారు. కాని తాము హిందూ మతస్థులము అనుకోరు. తమది ప్రత్యేక మతము అంటారు. హిందూ మతానికీ తమ "మతానికీ" ఎంతో భేదం ఉంది అంటారు. వీరందరూ సర్వతంత్ర స్వతంత్ర స్వ మత స్థాపకులు, తత్ నిర్వాహకులు మాత్రమే. వారు వాడుకునే తత్త్వ శాస్త్ర గ్రంథాల స్ఫూర్తి‌ వారి మనసులలోకాని, చేతలలోగాని లేదు 
.
తమని తాము విశ్వగురువులుగా ప్రకటించుకుంటారు. ప్రతి తరానికి ఒక ఆధ్యాత్మిక గురువు-హిందూ గ్రంథములను వాడుకుంటూ, హిందూ సంస్కృతిని వాడుకుంటూ, హిందూ మతానికి సంబంధించిన యజ్ఞ యాగాదుల జరిపిస్తూ, హిందూ‌మతానికీ మాకూ ఏమీ సంబంధం లేదని విశ్వ ఆధ్యాత్మిక సామ్రాజ్యాలను నిర్మించుకుంటారు. ట్రస్ట్ ల పేరుతో వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తారు. ఆశ్రమాలు స్థాపించుకుంటారు. తమ అహంభావములను మాత్రము వదలలేరు. రాజకీయనాయకులతో రాసుకు పూసుకు తిరుగుతారు.
 
తమను తాము పురుషోత్తములుగా భావించుకుంటూ తమ సంస్కృతీ సంస్కార లేములను వారికి తెలిసీ తెలియక బహిర్గంతం చేస్తూంటారు; తమ మాటలతో. చేతలతో. ప్రవర్తనలతో. ఇలాంటి ఎందరో ఆధ్యాత్మిక గురువులను భారత దేశం, ఇన్ని వేల సంవత్సరాలలో చూసింది. చూస్తోంది. చూస్తుంది. చూస్తూనే ఉంటుంది.
 
ఋతువులు మారినట్టు ఈ గురువులు వస్తారు, పోతారు. విర్రవీగుతారు. యమపురికి పోతారు. వేలకోట్లు ఖర్చుపెట్టి ఉత్సవాలు చేసుకుంటారు. పర్యావరణాన్ని వాళ్ళ బాబు సొమ్ములా ధ్వంసం చేస్తారు. ఫైన్ వేస్తే కట్టం అంటారు. మాది సాంస్కృతిక సంస్థ మా దగ్గర అంత డబ్బు లేదంటారు. మరి ఇన్ని వందల కోట్లు ఖర్చు ఖర్చుపెట్టి ఉత్సవాలు ఎలా చేసుకోగలుగుతున్నారు డబ్బు లేని ఈ "పేదలు"?. అంతా మాయ. నాటకం. తమని తాము ఎంతో అధికులమనుకునే మదాంధత.
 
భారత దేశంలో పారిశ్రామికవేత్తలు, ఇతరత్రా క్రమ, అక్రమ మార్గములో ధనవంతులైన వారు తాము భారత దేశ చట్టపరిధికి లోబడనవసరంలేని ప్రత్యేక పౌరులం అనుకుంటారు. రాజకీయనాయకులూ తమ మాటలతో, చేతలతో, చేయవలసిన చేతలు చేయకుండా, లోపాయికారీగా ఈ అహంభావుల కొమ్ము కాస్తూంటారు.
 
అంతా ధన, అధికార, ప్రాచుర్య దుర్వినియోగము. వీళ్ళకున్న కాపీనాల ముందు మనకున్న కాపీనాలు వెల వెల బోతాయి. ధనం చెడ్డదని మనకు చెబుతారు. వారు మాత్రం ట్రస్ట్ ల పేరుతో విరివిగా ధనసంచయం చేస్తారు. దాని మీద అధికారమంతా తమ చేతులోనే ఉంచుకుంటారు. అలా ఉంచుకుని ఉంచుకుని ఎప్పడో పోతారు. కూడా ఏమీ తీసికెళ్ళరు. వాళ్ళ మరణం తరవాత ఆ ఆస్తులన్నీ వారి అనుయాయుల పాలవుతాయి. వారికీ వారికీ కుదరకపోతే కోర్టు కేసులూ అవుతాయి.
 
ఇది సనాతన ఆధ్యాత్మిక సాంప్రదాయం కాదు. కొత్తగా వచ్చిన‌ అహంభావపు కొమ్ములు. ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్న వ్యక్తి పూజ. ఆధ్యాత్మికతా దుర్వ్యాఖ్యానము. ఆధ్యాత్మికత ఇలా దిగజారిపోవడం ఋషుల, తపస్వుల, యోగుల, మునుల సంస్మృతికి పట్టిన చీడ.
 వ్యాఖ్యలు:
ఇందులో క్రైస్తవ సంఘాలకీ, వారి పనులకీ, హిందువుల ఆధ్యాత్మికత చర్చకు సంబంధం లేదు శర్మగారు. నేను హిందువును కాబట్టి, సనాతన ధర్మాన్ని గౌరవించే వాడిని కాబట్టి హిందూ మతం పేరుతో, హిందువులం కామంటూ, హిందూమత ఆధ్యాత్మికత ను వాడుకునే వారన్నా, భ్రష్టు పట్టించే వారన్నా, వక్ర భాష్యాలు చెప్పేవారన్నా నాకు చాలా చిరాకు శర్మగారు. మీరు ఇది గమనించాలి. మీరన్నట్టు నేను ఇటువంటి గురువులను లెక్కచేయను. వీరిని హిందూ మత సంరక్షకులుగా పరిగణంచను. మీకు తెలుసో, లేదో, ఎందరో హిందువులు ఇటువంటి కార్పొరేట్ గురువులను హందూ మతోద్ధారకులు అనుకుంటున్నారు. హందూమతాన్ని ఉద్ధరించేవారు అనుకుంటున్నారు. అందుకని నా ఈ సమీక్ష. దీనితో మీరెవరూ ఏకీభవనించనరసరము లేదు. నేను ఆశించను కూడా. లోకో భిన్న‌ రుచిః- అని నాకూ తెలుసు. ఎవరెవరికి వారి ఆధ్యాత్మిక గురువులుంటారనీ తెలుసు. ఆధ్యాత్మికత, సంఘసేవ వేరు. రెంటికీ ఏ సంబంధం లేదు. ఎందరో ప్రాచ్యులు, పాశ్చత్యులు కూడా మత, ఆధ్యాత్మికత, సంస్కృతీ సంబంధం లేకుండా ఎంతో ధనాన్ని మానవసేవకోసం ఖర్చుచేస్తూంటారు. వారిని ఆధ్యాత్మిక గురువులనీ ఎవరూ కొలవరు. కొలవాలనీ ఈ దాతలు అనుకోరు. మనదేశంలోనే ఈ మధ్య వచ్చిన ఆధునిక సంస్కృతి ఇది. ఈ సంస్కృతి ఎన్నదగినదీ, ముదావహమైనదీ కాదు. ఆధ్యాత్మికత అసలు కాదు. నాకు ఆధ్యాత్మికతతోనే సంబంధం. ఆధ్యాత్మికత పవిత్రమైనది. ధన, అహంభావ, అధికార మదాంధతలకు అతీతమైనది


కృష్ణవాసంతికా! శ్రీ శ్రీ లు ఇతర ఆధునిక ఆధ్యాత్మికత గురువులు హిందూమత సంరక్షకులు గాని, ఉద్ధారకులు గాని కాదు. వారి వారి ఉద్ధారకులు వారు. ఒక రాజ్యాంగ బద్ధ సంస్థ ఒక తీర్పునిచ్చినపుడు శిరసావహంచవలసిన బాధ్యత అందరు పౌరులకూ ఉంది. ఫైన్ కట్టము జైలుకు వెళతాము అనే ప్రకటన అహంభావాన్ని, తనేదో అతీతుడను అనే సందేశం ఇస్తుంది. చాలామంది ఆధునిక ఆధ్యాత్మిక గురువులు సనాతన ధర్మానికి ప్రతీకలు గాని, వారసులుగాని కారు. నా అభ్యంతరం విశ్వగురువుల బహిరంగ అహంభావ ప్రదర్శనానికి, తామేదో పత్యేకం, గొప్పవాళ్ళం అనుకొని, భారత రాజ్యాంగం, తత్ నిబద్ధ సంస్థల పట్ల చూపిన నిర్లక్ష్యం, అసహనాల మీద. మరొక్క మారు చెబుతున్నాను: ఈ ఆధునిక ఆధ్యాత్మిక గురువులలో ఎందరో సనాతన భారతీయ తత్త్వ శాస్త్ర నిబద్దులు గాని, సాంప్రదాయ‌ పరిరక్షకులుగాని కాదు. వీరెవరూ ఆదిశంకరుల, రామానుజుల, మధ్వాచార్యుల పరంపర వారు కాదు. తమ తమ మతముల నిర్వహణ, తమ ఆశ్రమ ఆస్తుల పెంచుకోవడం మాత్రమే వీరికి తెలిసిన ఆధ్యాత్మికత. వీరికీ హిందూమతానికి, భారతీయ తత్త్వానికి ఏమీ సంబంధం లేదు.