Tuesday, August 29, 2017

మా ఖాట్మండూ యాత్ర 3



మా ఖాట్మండూ యాత్ర 3

15-8-2017

కలకత్తా కాళికా మాత దర్శనం

కలకత్తా కాళిక మనందరికీ ఇష్టమైన దేవత. కలకత్తాలో ఆగే సావకాశం లభించింది కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మెయిల్ లో 15 తారీఖు తెల్లవారుజామున 4-10 నిమిషాలకు చేరాము. వెయిటింగ్ హాల్ ఎక్కడుందో కనుక్కొని అక్కడకు చేరాము. అది ఏసి వెయిటింగ్ హాల్. మాకు రాక్సల్ కి ఏసి 2 టైర్ రిజర్వేషన్ ఉంది కాబట్టి అందులో ప్రవేశం లభించింది.
 
అక్కడ రిఫ్రెష్ అయి సేదదీరాము. ఏడు గంటల ప్రాంతంలో బయలుదేరి లగేజి క్లోక్ రూమ్లో పెట్టి హౌరా స్టేషన్ బయటికి వచ్చాము. హౌరా స్టేషన్ హుగ్లీనది ఇవతల ఒడ్డున ఉంటుంది. అవతలి ఒడ్డున కలకత్తా. హుగ్లీ నదిపై హౌరా బ్రిడ్జి రెండింటినీ కలుపుతుంది.

హుగ్లీనదిని గంగానది పాయ అంటారు.

నేను ఇదివరకు వచ్చాను కనుక హౌరా స్టేషన్ దగ్గరలో ఒక మెట్రో స్టేషన్ ఉన్నట్లు జ్ఞాపకం. హౌరా బ్రిడ్జి పై నడుస్తూ ఫొటోలు తీసుకుంటూ కలకత్తాలో ప్రవేశించాము. అక్కడ కనుక్కొని సిటీ బస్ లో ఆ స్టేషన్ చేరాము. అది మహాత్మా గాంధీ రోడ్ స్టేషన్. అక్కడ నుంచి కాళికాదేవి ఆలయం పక్కనే ఉన్న కాళీఘాట్ మెట్రో స్టేషన్ దాకా మెట్రోలో వెళ్ళాము.
 
నేను మొదటి సారి కలకత్తా వచ్చినప్పుడు (1995) పార్క్ స్ట్రీట్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్న మా మామగారి ఆఫీస్ గెస్ట్ హౌస్ లో ఉన్నాను. అది కలకత్తా కి మంచి సెంటర్. ఆ గెస్ట్ హౌస్ దగ్గరలో ఒక ఆంధ్రా హోటల్ కూడా ఉంది. అందులో మన భోజనం బాగానే ఉంది. అప్పుడు నేను మెట్రో, ట్రామ్ కార్లలో కొంత కలకత్తా ప్రాంతాన్ని చూశాను. అప్పుడు కలకత్తా కాళిని, హుగ్లీ నది ఒడ్డున కల రామకృష్ణ పరమహంస పూజారిగా పనిచేసిన రాణీ రాస్మణీ దేవి నిర్మించిన కాళికాదేవి ఆలయ సముదాయాన్ని చూచాను. ఈ సముదాయం ఎదురుగా హుగ్లీ నది అవతల ఒడ్డున బేలూరు మఠం ఉంటుంది.

మేము చూడడానికి వెళ్లిన కాళికాదేవి ఆలయం ఇది కాదు. కలకత్తా ఊరి మధ్యలో ఉన్న కాళికాలయం. కాళిఘాట్ మెట్రో స్టేషన్ నుంచి ఒక కిలోమీటరు లోపల ఉంటుంది. నడిచి వెళ్ళవచ్చు. మాకు మెట్రో టికెట్ పది రూపాయలు.
మేము ఆలయం దగ్గరకు వెళ్ళేసరికి పాదరక్షలు తమ షాపులో ఉచితంగా పెట్టుకోవచ్చంటూ ఒక షాపతను ఆఫర్ చేశాడు. కాదు, కాదు అనుకొని అతని దగ్గరే పెట్టి పూజాద్రవ్యాలు అతని దగ్గర 100 రూపాయలవి కొన్నాము. నాకు పుణ్యక్షేత్రాలకి, పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయించడం మీద ఆసక్తి లేదు. మనసంతా భగవంతునిపై ఉంచి నామం స్మరణం చేసికుంటూ దర్శనం పూర్తి చేయాలని నా ఉద్దేశం. కోరిక. కాని కామేశ్వరికి ఆసక్తి. నా కోసం ఎన్నో చోట్ల ఊరుకున్న

కామేశ్వరి ఇక్కడ అర్చన చేయిద్దాం అంది. బుద్ధి మంతుడైన మగనిలా ఒప్పుకున్నాను.
ఆ షాపతను మిమ్మల్ని ఒకతనికి అప్పగించాడు దర్శనం చేయించి రమ్మని. లోపలికి వెళ్ళాక చాలా పెద్ద పెద్ద క్యూలు చూపించి ఈ వరుసలో వెళ్ళాలంటే 5 గంటలు పడుతుంది అని మనిషికి 250 ఇస్తే డైరెక్ట్ గా గర్భగుడి లోకి వెళ్ళచ్చని చెప్పాడు. అతనిని నమ్మక క్యూలో వాళ్ళని కనుక్కుంటే వారు విసుక్కుంటూ అమ్మదర్శనానికి ఎంత టైమ్ పడుతుంది అని అడగడం ఏమిటి? ఎంతసేపైతే అంతసేపూ వరుసలో నుంచుని కాళీ మాత దర్శనం చేసుకోవాలిగాని అన్నారు.
 
నేను అంటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఒకతను చూసి మనిషికి 50 ఇస్తే దర్శనం చేయిస్తానని ఒక పండాని తగిలించి అతను పూజకూడా చేయిస్తాడని చెప్పి పంపించాడు. డబ్బులు ముందే తీసేసుకున్నాడు. తీరా మమ్మల్ని పంపించింది ఎక్కడకంటే ఓ దొమ్మీలోకి తోసి వదిలేశాడు. కొట్టుకొని, కొట్టుకొని ముందుకు వెళితే అది అమ్మవారి ఆలయ ద్వారానికి ముందున్న ఒక మండపం లాంటి చోటు. దాని ఎదురుగా పూజారులు, భక్తులు అడ్డుగా ఉంటూనే ఉన్నారు. అమ్మవారి దర్శనం కాలేదు. నాకు సకృత్తుగా అయింది. కామేశ్వరికి దర్శనం అస్సలు కాలేదు.
 
ఆ పండా మమ్మల్ని బయటకు లాగి "పూజ" చేయించాడు. చేశాడు. అతని దక్షిణ ఇచ్చేశాను. అసంతృప్తి మా మనసుల నిండా నిండింది. నేను ఇదివరకు వరకు వచ్చినపుడు తిన్నగా వెళ్లి అమ్మవారిని పలుమార్లు అప్పుడే గర్భగుడిలో దర్శించుకున్నాను.

ఆ అనుభవం మనసులో ఉండి ఈ జన సమ్మర్దాన్ని, మాకు ఇప్పుడు జరిగిన దర్శనానుభవాన్ని సంయమనంతో తీసికోలేకపోయాము. గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారిని దర్శింకోవాలని నిశ్చయించుకున్నాం.

మళ్ళీ ఇదివరకు వెళ్ళిన షాపతని దగ్గరకు వెళ్ళాం. అతను వ్యంగ్యంగా నవ్వి ఇదివరకటి మనిషినిచ్చి పంపించాడు. వెళుతున్న దారిలో బలి ఇవ్వబోతున్న మేకపోతులను చూసి మనసు ద్రవించింది.
20 నిమిషాలలో అమ్మవారి గర్భగుడిలో ఉన్నాము. తల్లిని తనివితీరా దర్శించుకున్నాము. లోపల తూతూ మంత్రం పూజ చేశాడు లోపలి పూజారి. అమ్మవారి దగ్గర పూజారి అడిగిన డబ్బులను హుండీలో వేశాము. మనసులు ఆహ్లాదంతో నిండాయి.
 
తరువాత మమ్మల్ని ఒక పండా దగ్గరికి తీసికెళ్ళాడు మా గైడ్ లాంటి పండా. 51 రూపాయలివ్వండి అమ్మవారి ప్రసాదం ఇస్తాడు అన్నాడు. అతను నాకు తెలిసిన రెండుమూడు శ్లోకాలు చదివి ఒక అమ్మవారి రూపు లాంటిది తీసి మాకు ఇచ్చాడు. 1100 రూపాయలు ఇమ్మన్నాడు. నాకు ఎంతో కోపం వచ్చింది. ఈ వ్యవహారం ఏమీ నచ్చలేదు. ప్రసాదం అవసరం లేదని రూపు అతనికి ఇచ్చేసి మాతో ఉన్నతని మీద కోప్పడి, అతనికి ఇవ్వవలసినది ఇచ్చేసి నెమ్మదిగా ఆలయం బయటకు వచ్చాము.
 
ఈ అనుభవానికి మనసు ఎంతో కలత చెందింది. మన సెంటిమెంట్ లతో ఇతరులు ఆడుకునే అవకాశం మనం ఇవ్వకుండా జాగ్రత్తపడడం చాలా అవసరం అనిపించింది. ఇటువంటి స్థితిలో మనసు ఎంతో దృఢంగా ఉండి తీరాలి. కలత కాసేపు బాధించింది. అలా చాలాసేపు మనసు చిన్నబోయింది. నా విచక్షణ నాకు ఎంతో దృఢత్వాన్ని అందించింది.
 
ఇటువంటివి చాలా సున్నితమైన విషయాలు. భగవంతుడు, దేవతలు, దైవములు మనమీద ఎప్పుడూ కోపగించరు. ఇది జరిగిందా, అది జరిగిందా అని వారు అస్సలు చూడరు. మన నుంచి ఈ పూజ, అర్చన వారు ఆశించరు. ఇది మనం తప్పక గుర్తించు కోవలసిన విషయం.
 
వారు కరుణాంతరంగులు. మన్ని సంతానంలా సాకుతారు. మన మానసిక నైర్మల్యాన్ని మాత్రమే వారు చూస్తారు. మళ్ళీ మెట్రో, బస్సుల్లో వచ్చినదారినే వెనక్కి వచ్చి హౌరా స్టేషన్ చేరాము.

నేను ఇంతగా ఈ సంఘటన గురించి తర్కిస్తున్నానో విజ్ఞత కలవారు గ్రహిస్తారు. నేను ఇలా నా అనుభవాలను, కష్టసుఖాలను ఈ వ్యాస పరంపర ద్వారా పంచుకోపడంలోని ముఖ్యోద్దేశం వాస్తవాలను నా దృష్టితో, జ్ఞానము, విజ్ఞానము, జ్ఞాన అనుభవముల పునాది తో చర్చించడం మాత్రమే. వివిధరకాల, వివిధములైన సంఘటనలను, ఘటనలను నాదైన ముద్రతో చెప్పడం మాత్రమే.

మా ఖాట్మండూ ప్రయాణం 1, 2



మా ఖాట్మండూ ప్రయాణం 1

ISKCON వారి ఆధ్వర్యంలో ఖాట్మండులో ఆగస్టు 18, 19 తేదీల్లో జరిగే Science and Scientist సదస్సులో పాల్గొనేందుకు నేను, మా ఆవిడ భీమవరం నుంచి నేపాల్ బయలుదేరాము. నేను ఆ సదస్సులో Consciousness Studies and Quantum Mechanics అనే శీర్షికతో ఆ సదస్సులో నా పరిశోధనా పత్రం సమర్పించడానికి ఎన్నిక అయింది.
 
ప్రస్తుతం ప్రపంచంలో conscioudness మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అన్ని దేశాల్లో ఎందరో శాస్త్రవేత్తలు, తత్త్వవేత్తలు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు, కంప్యూటర్ నిపుణులు ఇలా ఎన్నో రంగాలనుంచి consciousness గురించి అవగాహన కలిగించుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు. వీరిలో కొందరు ఖాట్మండూ సదస్సుకి వచ్చి తమ తమ పరిశోధనల గురించి ఉపన్యసిస్తారు. అందులో నేను ఒకడిని.
 
క్వాంటమ్ మెకానిక్స్ consciousness studies లో ఉపయోగిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు అంటూంటారు. కాని క్వాంటమ్ మెకానిక్స్ అందుకు సరిపోదని నా అవగాహన. ఉపనిషత్తులలో కల consciousness studies elements మీద నేను చాలా ‌పరిశోధనా పత్రాలు సమర్పించాను. వీటి గురించి, ఈ విషయంలో క్వాంటమ్ మెకానిక్స్ పరిధుల గురించి మాట్లాడతాను.
 
నేను మా ఆవిడ ఈ సదస్సులో పాల్గొనేందుకు మా ఊరు భీమవరం నుంచి బయలుదేరాము. నేను అమాయకపు చాదస్తుణ్ణి. ప్రయాణానికి మంచి చెడ్డలు చూసుకుంటో ఉంటాను. అస్తమానూ చూసుకోకుండా అంతా వింత. ఇలా ప్రయాణానికి మంచి చెడ్డలు చూసుకోవడం మా నాన్నగారి నుంచి వచ్చిన సంప్రదాయం. మా పిల్లలని ఇందులోకి రానివ్వలేదు. ఈ రోజుల్లో అది వీలు పండని పని. వాళ్ళని ఈ విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఇలా మంచి చెడ్డలు చూసుకోవడం అలవాటు వద్దు అని చెప్పాను. నేనే పట్టించుకోలేక వదల్లేక తంటాలు పడుతూంటాను. ఈ సారి ఈ తాపత్రయలో పడ్డాను. 4-30 లోపులో ఇంటి నుంచి బయలుదేరాలి.
 
మా భీమవరం నుంచి రాజమండ్రి కి పొద్దున్న మూడు ఎక్స్ప్రెస్ లు ఉన్నాయి. శేషాద్రి, సర్కారు, LTT- Visakhapatnam express. శేషాద్రి 3-30 కి. సర్కారు 5-20 కి. LTT- 6-30 కి. LTT- కి వెళ్దామని అనుకున్నాం.
ఈ రోజుల్లో రైళ్ళలో ఇచ్చే ఫుడ్ ఎంత చండాలంగా ఉంటుందో మనందరికీ అనుభవమే. ఆ విషయం భారత దేశపు అగ్ర ఆడిటర్ గారు తమ రిపోర్ట్ లో ఉటంకించారు కూడా. అందుకని మా ఆవిడ నాకిష్టమైన, ఉండే, పులిహార, దద్ధ్యోజనం చేయడానికి 2-30 కి లేచింది. 4 గంటలకు ఇద్దరు తయారైపోయాం. అంతే పొద్దున్నే ఆటో దొరకటం ఇబ్బంది. కానీ మొత్తానికి ఆటో దొరికి 4-30 లోపులో ఇంటి నుంచి బయలుదేరాము.
 
మేము స్టేషన్ కి వచ్చేసరికి 5 అయింది. శేషాద్రి ఆలస్యం అయ్యి దొరికింది. 6-30 కి రాజమండ్రి చేరాము. 9-15 కి హౌరా మెయిల్. వచ్చింది, ఎక్కాం. ఏసి రిజర్వేషన్ దొరకలేదు. S-12 లో‌ దొరికింది. ఈ మధ్య స్లీపర్ క్లాస్ ప్రయాణం మా చిన్నప్పటి జనరల్ బోగీ ప్రయాణంలా తయారైంది. 72 బెర్త్ లకి 120 మంది ప్రయాణికులు ఉన్నారు. మా బెర్త్ లు ఆక్రమించబడి ఉన్నాయి. అంతా‌ ఇరుకు. ఎలాగో సర్దుకుని కూర్చున్నాము. కాలు కదపడానికి చోటు లేదు.
మనందరం ఎంత సర్దుకొని జీవించాల్సి వస్తోందో. ఒక్కటీ రూలు ప్రకారం ఉండదు. జరగదు. అంతా అస్తవ్యస్తం.
అయినా తప్పదు బతికెయ్యాలి. బోగీ టిటిఇ చేతులు ఎత్తేశాడు.
 
ఆ వాతావరణంలో హౌరాదాక ప్రయాణించాము. హౌరా నుంచి రాక్సల్ మీదుగా నేపాల్లో ప్రవేశించాలి. హౌరా రాక్సల్ ప్రయాణం తరువాతి భాగంలో. ఆ రైల్లో ఏసి 2 టైర్ లో రిజర్వేషన్ దొరికింది.
 
మా ఖాట్మండూ యాత్ర 2

కలకత్తాలో అగుట (ఆ)

ఇప్పుడు ఈ నగరాన్ని కోల్కతా అంటున్నారు. నేను వేరొక వ్యాసంలో అన్నట్టు, ఈ రాజకీయ నాయకులకు పరిపాలించడం చేతకాక, అందరి సంక్షేమానికి కృషి చేయడం రాక, చేతకాక, పరిపాలన అంటే ఏమిటో తెలియక, ఊళ్ళ పేర్లు మార్చి తమ ప్రాంతీయ ‌సంస్కృతికి ఏదో ఊడపీకేసేమని పేరు తెచ్చుకోవడానికి ఎన్నుకున్న సులభమార్గమిది. అల్లా మీద రుద్దినవే చెన్నెయ్, ముంబై, కోల్కతా, కొల్లమ్, కోచి, బెంగాలి, కులబరుగి, రాజమహేంద్రవరం, బంగళూరు మొదలైనవి.‌ ప్రజలకి రోడ్లు బాగుండాలి. ధరలు పెరగకుండా ఉండాలి, విద్యా, ఆరోగ్య సౌకర్యాలు బాగుండాలి, శాంతి భద్రతలు ఉండాలి అని ఉంటుంది కాని ఊర్ల పేర్లు ఏముంటే వారికి ఏం ఒరుగుతుంది. ఇది నేతలకు తెలుసు. కాని వారికి ఇంత కన్నా పరిపాలించడం చేతకాదు. అందుకే ఈ ఊళ్ళ పేర్ల మార్పులు.
నేను కలకత్తా ఇది వరకు రెండు సార్లు వచ్చాను. రెండు సార్లు కాన్ఫరెన్స్ లకే. ఒకటి రామకృష్ణా మిషన్ వాళ్ళు, రెండవది ఈ ISKCON వాళ్ళే.
 
మొదటిది Knowledge systems in Indian philosophy మీద, రెండవది Synthesis of Science and Religion మీద. ఆ రెండు సార్లు మా మామగారి సౌజన్యంతో వారి ఆఫీస్ గెస్ట్ హౌస్ లో ఒక సారి, మా మామగారి సహోద్యోగి ఇంటో రెండవ సారి ఉన్నాను. మొదటి సారి వచ్చి నపుడు రెండు కాళీ ఆలయాలు, రామకృష్ణా మిషన్ బేలూర్ హెడ్ క్వార్టర్స్, కలకత్తా ఊరు చూశాను. కలకత్తాకు 150 కిమీ దూరంలో గంగానది ఒడ్డున ఉన్న మాయాపూర్ లో కల ISKCON head quarters చూశాను. గంగా జలం శిర‌సున జల్లుకుంటోంటే ఒకాయన ఏ ఊరు అని అడిగాడు. ఆంధ్రప్రదేశ్ అన్నాను. ఇదంతా 1995 వి‌షయం. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడతీతకు 20 ఏళ్ల ముందు.
ఆ రెండు సార్లు నేను ఒక్కడినే వచ్చాను. మాయాపూర్ లోని గంగ బంగ్లాదేశ్ లో ప్రవేశించగానే పద్మానది అవుతుంది. టిబెట్ లోని యా త్సు నది మన బ్రహ్మపుత్ర అయినట్టు. పేర్లతోటి మన అనుబంధం విడదీయలేనిది.