Saturday, March 4, 2017

మా ద్వారకా యాత్ర - రెండవ భాగము

మా ద్వారకా యాత్ర - రెండవ భాగము

అందమైన అర్థము నిచ్చు పదములు అలంకారం రచనకి
మందమైన నడక నిచ్చు పదములు అలంకారం తరుణ రమణికి
డెందమును ఊయలలూపు పదములు అవసరం కవితకి
నంద గోపబాలుడు గోవిందుని పదములు అవసరం మనశ్శాంతికి

అవగాహన లేని జ్ఞాన సముపార్జనము
ఆచరణ లేని సదాచార శ్రవణము
ఉపాసన కాని విద్యాభ్యాసము
మూఢత నిండిన‌ గోవింద తత్త్వావలోకనము
పృథివిని నేడు ఆవరించి అలుముకున్నవి
గోవిందా! కలినేమి నీ ఈ వింత వింతలు జనార్దనా!

ద్వారకాధీశుని దివ్య దర్శనము‌ అయ్యాక కశ్యప్ మమ్మల్ని అమ్మవార్ల, శ్రీకృష్ణుని‌ రాణుల దేవాలయాల సందర్శనం చేయించాడు. ముందుగా‌ జాంబవతీ ఆలయం, పిదప రాధికా‌దేవి ఆలయం చూపించాడు. నాకు రాధ పదము కన్న రాధికా పదము మీద మోజు కొంచెం ఎక్కువ.

శ్రీలక్ష్మ్యార్ధనారాయణ దర్శనం

మనందరము‌ శివపార్వతుల అర్ధనారీశ్వర తత్త్వానికి, రూపానికి బాగా‌ అలవాటు పడ్డవాళ్ళము. ద్వారకలో లక్ష్మీదేవి‌ అర్ధ భాగమై ఉండగా‌ ఒకే‌ విగ్రహములో లక్ష్మీనారాయణులను చెక్కిన శిల్పానికి ఆలయం ఉంది. ఇది‌ వింతగాను, సరదాగాను, అర్ధనారీశ్వర తత్త్వాన్ని లక్ష్మీ నారాయణులకు అనువదించిన తీరు ముచ్చట గొలిపింది. ఆపై‌ రాధా‌మాధవుల గుడి, ద్వారకాధీశుని ప్రతిరూపమైన మరొక విగ్రహం కల ఆలయాన్ని‌, సత్యభామ ‌ఆలయాన్ని‌, సరస్వతీ దేవి ఆలయాన్ని చూశాము. బలరాముని, దేవకీ మాతల ఆలయాలను దర్శించాము.

ద్వారకా శంకర మఠ పీఠాధిపతి‌ ఆవాసము ఈ‌ ద్వారకాధీశుని ఆలయ ప్రాంగణం లోనే‌ ఉంది. ముందుగా, శారదాంబా విగ్రహము, ఆపై ద్వారకాపీఠ శంకరాచార్యుల వారు శ్రీ స్వరూపానందుల పటము, ఆది శంకరాచార్యుల విగ్రహము వరుసగా ఉన్నాయి. శంకరాచార్యులు శ్రీ స్వరూపానంద్ జీ మహరాజ్ పర్యటనలో ఉన్నారు.

ఆపై ఒక ఎత్తైన ప్రదేశంలో‌ శంకరాచార్యుల వారు పూజించే‌ చంద్రమౌళీశ్వర స్వామి, నవగ్రహముల రజత విగ్రహముల బొమ్మల కొలువు ఉంది. వారికి, వాటికి నమస్కరించి, గుడి బయటకు‌ మరొక వైపు నుంచి వచ్చాము.
మాతో సందర్శన చేయిస్తున్న క్షణం నుంచీ‌ కశ్యప్ ద్వారకను శ్రీకృష్ణుని కర్మభూమిగా పరిచయం చేస్తూ, కృష్ణభగవానుడు తన పాతికో ఏట ఇక్కడకు వచ్చి వంద సంవత్సరములు ద్వారకను పాలించి తన నూట పాతికో ఏట నిర్యాణం చెందాడని చెబుతూ వచ్చాడు. కృష్ణ పరమాత్మ పాతిక అడుగుల ఎత్తు ‌ఉండేవాడనీ‌, అ నీడలు (ఛాయలు) ఆలయ నిర్మాణంలో ప్రతిబింబిస్తున్నాయని, ఏవేవో పోలికలు చెప్పాడు. ఆలయానికి ఏడు‌ అంతస్తులు ఉన్నాయి. వాటికీ ఏదో చెప్పాడు.

కృష్ణుని లీలలు నంద వ్రజము, బృందావనం, మధురల లోనివి మనకు చాలా పరిచయము.‌ అంతకు‌ మించి ఎన్నో సంవత్సరాలు ద్వారకలో పాలన చేశాడు‌ కృష్ణుడు. యదువంశంలో ముసలం పుట్టి వారు‌ తమ వంశాన్ని నిర్మూలనం చేసికుంటున్నప్పుడు‌ శ్రీకృష్ణుడు, బలరాముడు ‌సోమవాథ్ పక్కన‌గల‌ ప్రభాస తీర్థం పరిసరాల అరణ్యము లోనికి వచ్చారు. అక్కడ బోయవాని బాణానికి కృష్ణుడు‌ నిర్యాణం చెందడానికి ముందుగా బలరాముడు‌ నిర్యాణం చెందాడు.

కృష్ణుడు‌ ఆ రోజులలో ఆహారం తీసికునే (భోజన) సమయానికి పూరీ జగన్నాథానికి వెళ్ళేవాడని (ద్వారకలో పంటలు పండవు, మంచి నీళ్ళు దొరకవు అని దూర్వాసుని శాపం ఉంది కదా) ఐతిహ్యాన్ని కశ్యప్ ఉటంకించాడు. అతని మాటల్లో చార్ ధామ్‌ అనే పదం చాలాసార్లు వచ్చింది.

ఆ నాలుగు ధామ్ లు - రామేశ్వరం, పూరీ జగన్నాథం, బదరి, ద్వారక. ఇందులో రామేశ్వరం జ్ఞానభూమి అనీ, జగన్నాథ పూరీ ఆహార భూమి అనీ, బదరి మోక్షభూమి అనీ, ద్వారక కర్మభూమి అనీ;
ద్వారకా దర్శనంతో‌ మనిషి ఇహలోక జీవితానికి పరిపక్వత వచ్చి, రాలిపోయే ముందు భగవద్దర్శనం చేసికొని పరమాత్మలో ఆనందరూపంలో కలిసిపోతాడని భగవంతుడు ‌మాతో అన్నట్టు‌ నాకు‌ అనిపించింది. నేను, మా ఆవిడ సంసార బాధ్యతలను శ్రద్ధగా వహిస్తూ, సంసార తాపత్రయాలను ‌నెమ్మదిగా‌ తగ్గించుకుంటూ వానప్రస్థాశ్రమం లోనికి బుడి బుడి‌ అడుగులు వేస్తున్నాం. ద్వారక తీర్థయాత్ర మాకు ‌ఆ అనుభవాన్ని, అవగాహనను రుచి చూపించింది.

ఎత్తులు పల్లములు సహజము రమణికి
మెత్తని పల్లవములు సహజము తరువునకు
తీయని జలములు సహజము నల్లని మబ్బుకు
హాయిని కలిగించుట సహజము నల్లనయ్య గోవిందునకు

ద్వారకను మరుభూమి‌ అని కూడా అన్నాడు‌ కశ్యప్. యాదవులందరూ మడిసిన భూమి కదా అది. మరుభూమిలో శరీరం తన ఆకృతిని భస్మం చేసి కుంటుంది. ఇక్కడ ద్వారకలో కూడా‌ మన శరీర స్పృహ, అహంకార మమకార స్మృతి భస్మీపటలం చెంది‌ మిగల కుండా, వాటి జనన ప్రదేశంలో‌ఉనికిని కోల్పోవడంగా ద్వారకాధీశుని సందర్శన ఫలంగానూ‌ చెప్పుకోవచ్చు.

మానసిక కార్యకలాపములు తమ జనన ప్రదేశమైన‌ బ్రహ్మములో లీనమవడంగా కూడా‌ ఈ ద్వారకాధీశ ‌దర్శనాన్ని‌ అన్వయించుకోవచ్చు.

అప్పుడు కశ్యప్ మమ్మల్ని ఒక శాల లోనికి తీసికొని వెళ్ళాడు. అక్కడ‌ ధాన్యములు, పంచదార, పప్పులు, నేయి లతో తులాభారం, అన్నదానం లకు ధన సమర్పణ వ్యవస్థలు కల ప్రదేశం. ద్వారకలో ఏ పంటలూ పండవు గనక (ఇప్పుడూ ద్వారక చుట్టు పక్కల అంతా‌ ఎరిడ్ (arid) గా‌ ఉంది. చవుడు నేల. చవిటి పర్ర. ఉప్పు నీరు. ఏ పంటలూ అస్సలు పండవు. సస్యశ్యామలతే లేదు. క్షార భూమి.

అందుకని పూర్వకాలంలో యాత్రీకులనుంచి ఈ ‌వస్తు సంగ్రహం చేయడానికి ఈ ‌వ్యవస్థ పెట్టారని నాకు అనిపించింది. ఇప్పుడు పరిస్థితులు మారినా ఈ పద్ధతి ఇంకా‌ పా టిస్తున్నారని నాకు అవిపించింది. ద్వారకాధీశుని ఆలయాన్ని పురోహితుల సంఘం నిర్వహిస్తుంది. వారి మనుగడకై ఆ రోజులలో ఈ ఏర్పాటు చేయబడింది. తమిళనాడు లోని చిదంబర ఆలయ నిర్వహణ కూడా గురుకులులు చేస్తారు.

మేము 45 రోజులకు అన్నదాన నిర్వహణ ఖర్చు నిమిత్తం ధన సమర్పణ చేశాము. ఈ ‌కార్యక్రమము‌ మనకు ఇష్టం కాని, నమ్మకం కాని లేని పక్షాన చేయనవసరం‌ లేదని నాకు అనిపించింది.

అటు పిమ్మట ఆలయ ఆ ద్వారం గుండా బయటకి‌ వచ్చి మెట్లు దిగితే గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం వస్తుంది. సాగర నదీజల వయ్యారపు సంగమం అక్కడనుంచి‌ కనిపించే‌ సుందర దృశ్యం. గోమతీ నది‌ లక్నో నగరం పక్కనుంచి ప్రవహిస్తుంది. ఈ గోమతి, ఆ గోమతి వేరు. గోమతీ నదీ జలంతో‌ ప్రోక్షణం చేసికొని, ద్వారక సందర్శన లోని స్నాన్ కార్యక్రమము పూర్తి చేసికొని,‌దాన్‌ ముందే‌ ఇచ్చి;

ఇప్పుడు జ్ఞాన్ ;

గోమతి నది ఘాట్ నుంచి ఆలయానికి‌ 56 మెట్లు ఎక్కుతూ ఓం‌ నమో భగవతే‌ వాసుదేవాయ అని స్మరించుకుంటూ, 56 వికారములను పోగొట్టమని నేను - 56 సంఖ్య కశ్యప్ చెప్పినది - (మా ఆవిడ మాత్రం ఏ వికారమూ కలగకూడదంటూ) కృష్ణపరమాత్మను వేడుకుంటూ జ్ఞాన సిద్ధికై ప్రార్ధిస్తూ యాత్రా సాఫల్యాన్ని కూర్చమనీ అచ్యుతుని అర్ధిస్తూ, స్వర్గ ద్వారమైన ఆ‌వైపు నుంచి మరల ఆలయ ప్రవేశం చేసి కృష్ణ‌పరమాత్మను మరొక సారి తనివితీరా దర్శించి కృతార్ధులమైనాము.

ఇంతటి దివ్యానుభవాన్ని పూర్తిగా తన గైడెన్స్ ద్వారా నే అని కాకుండా, తన మాటలతో‌ మా ఊహలకు రెక్కలనిచ్చి, మా అంతట మాకు అవగాహనకు వీలు కల్పించిన, మా యాత్రను అందగింపజేసిన ‌కశ్యప్ కు మనసారా దక్షిణ ‌అనుకున్నట్టు సమర్పించి, నమస్కరించి అతని నుంచి శలవు తీసికున్నాము.

వాదములు ప్రసంగములు వేదాంతములు
శుష్కాయాసములు; చూపించలేవు పరంధాముని;
నిరంతర గోవింద నామ స్మరణమున
శుద్ధమైన మనసు చూచును విశ్వాత్ముని

మా ద్వారకా యాత్ర - మూడవ భాగము

మా ద్వారకా యాత్ర - మూడవ భాగము

ద్వారకాధీశ దర్శన సుధాంబుధిలో మునకలు వేసి రసప్లావిత మనస్కులమై ఆలయ ప్రాంగణంలోనే చాలా సేపు కూర్చున్నాము. బయటకి వచ్చి భోజనం చేసి ద్వారక చుట్టుపక్కల దర్శనీయ స్థలములను చూడ్డానికి 5 గంటలు సమయం పట్టే ప్రైవేట్ టూరిష్ట్‌ మినీ బస్ లో సీట్లు రిజర్వు చేసికొని ఆ మధ్యాహ్నం 2-7 p.m. కి మినీ టూర్ కి బయలుదేరి వెళ్ళాము. ఆ టూర్ చూపించే చోట్లు: రుక్మిణీ దేవి ఆలయం, ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, గోపీ తలాబ్, బెట్ ద్వారక.

ఇవన్నీ ద్వారకకు 30 కి.మీ‌ పరిధిలో ఉన్నాయి.

ముందుగా రుక్మిణీ‌దేవి‌ మందిర దర్శనము. దూర్వాస మౌని శాపము వలన రుక్మణీ కృష్ణులకు 12 ఏళ్ళ ఎడబాటు ప్రాప్తించింది కదా. అందుకని రుక్మిణీ ఆలయం 12 కి. మీ. దూరంలో వసించింది. అక్కడ ఒక ఆలయం కట్టారు. చిన్నది. ఇక్కడ దూర్వాస ముని శాప కథ చెప్పి జలదానానికి చందా‌ అడిగారు. ఎక్కువ మంది స్పందించ లేదు. ఆ కార్యక్రమము జన సమ్మర్దం వల్ల 20 నిమిషాలు పట్టింది. సంసార పక్షముగా ఉంది.

పిట్ట పాటలో ఏటి నీటిలో
వీచు గాలిలో పూచిన పూవులో
నాతి ప్రేమలో నీతి నడతలో
కల గోవిందుడు కలడంతట

శ్రీరమణీ కుచదుర్గ విహారివి నీవు
శ్రీ రాధా తనులతానందనా రసికుడ వీవు
శృంగారరస సామ్రాట్టువు; రసికా వతంసుడవు
రసపట్టులో తర్కం, మెట్ట వేదాంతం ఆపమని
ఈ స్వయంభూ కుహనా సన్యాసులకు బుర్రకెక్కు
నట్టు చెప్పి; మా రత్యానందములకు పానకంలో
పుడకలు కావద్దని దంండించుము ఈ ఆధ్యాత్మిక
గురువుల రసావతారా! నందనందనా! గోవిందా!

వర్షము పడనున్నప్పటి చల్లని గాలి కలిగించును హర్షము
శరత్తున పున్నమి వెన్నెలలిచ్చును సుఖము; వేసంగిని
గుబాళించి హాయి నిచ్చును మల్లియలు; గోవిందుని స్మరించిన
కలుగును అట్టి హర్షము సుఖము హాయి ఎల్లవేళల యందు

Buy one, get one free - నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం

ఈ ప్రకటన మనం అన్ని ఆధునిక అంగళ్ళలోనూ చూస్తాము. దానికి లోనై కొంటూంటాము కూడా. సోమనాథ్ యాత్ర మొదటి వ్యాసములో జ్యోతిర్లింగ దర్శనం; ముందు తెలిసి అనుకొని చేసిన యాత్ర. తర్వాత ద్వారక సందర్శించుకొని, చుట్టు పక్కల చిన్నా చితక దర్శనీయ క్షేత్రాలను, స్థలాలను చూసుకుని‌ మార్చ్‌ 3 న బొంబాయికి‌ సౌరాష్ట్ర మెయిల్ లోనే తిరుగు ప్రయాణానికి బుక్ చేసికున్నాము.

(సౌరాష్ట్ర మెయిల్‌ బొంబాయిలో ఒక రైలుగా బయలుదేరి, రాజ్ కోట జంక్షన్ వద్ద రెండు భాగములుగ విడుతుంది. ఒక భాగము వేరావల్ (సోమనాథ్), రెండవ భాగము ఓఖా (ద్వారక) వెళతాయి. తిరుగు ప్రయాణంలో ఓఖా, వేరావల్ ల నుంచి విడి విడిగా బయలుదేరి, రాజ్‌కోటలో కలసి ఒక రైలుగా బొంబాయి చేరతాయి).

మనం షాపులలో buy one get one free అనుభవాన్ని మనకు మనం కలిగించుకుంటాము. అంతటి అనుభవాన్ని‌ సాక్షాత్తూ లయ కారకుడు పరమేశ్వరుడే మనకు కలిగిస్తే కలిగే ఆనందానికి అవధులుండవు కదా.

ప్రణమామి శంకరమ్
భక్తజన కింకరమ్
భవతిమిర భాస్కరమ్
పార్వతీ సహచరమ్

అని శివుని తలచుకుంటూ ఉంటాను. అట్టి భక్త జన కింకరుడు, భక్త సులభుడు, భోళా శంకరుడు తనంత తాను మాకు‌ మరొక జ్యోతిర్లింగ దర్శనం ప్రసాదించాడు. ద్వారకలో ఈ మినీ‌బస్ ఎక్కేవరకు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన దారుకావన స్థిత నాగేశ్వరుడు మేము దర్శించబోయే నాగేశ్వరుడు‌ ఒకరేనని నాకు తెలియదు. బీహర్ లోనో ఎక్కడో ఉందనుకున్నాను. ఇదే అది అని తలిసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. పరమేశ్వరుడిచ్చిన‌ వరంగా ఈ ‌దర్శనాన్ని‌ మేము గణించుకున్నాము. ద్వారకకు‌ ఇంత సమీపమని తెలియదు. ఈ పర్యటనలో భోలానాథ్, మహదేవ్ అని ఈ ‌ప్రాంతంలో కొలవబడే సదాశివుడు మాకిచ్చిన బోనస్ ఈ దర్శనము.

నాగేశ్వరుని ఆలయం, జ్యోతిర్లింగము‌ కనుల విందుగా‌ ఉన్నాయి. అమ్మవారు పార్వతి. సోమనాథ్ దేవాలయం వలె ఇక్కడ కూడా‌ అమ్మవారు అయ్యవారి లింగం వెనుక ప్రతిష్ఠితయై ఉన్నారు. పరమశివుని కరుణకు పొంగిపోతూ
దారుకావన స్థిత నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని, అమ్మవారిని తనివి తీరా‌ దర్శించాము. ప్రార్ధించాము. మవసారా కొలిచాము. మవసు శాంతానందమయమైంది. హృదయమున ప్రశాంతత వెల్లి విరిసింది.

ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులను నాగుడు-నాగిని లుగా తలచి నాగ దంపతీ పూజ చేస్తారు. టిక్కెట్టు ‌ఖరీదు
ఎక్కువే. చాలామంది చేసుకుంటున్నారు. గర్భగుడిలో జంటలు కూర్చుని పూజలు చేసుకుంటున్నాయి. పూజా ద్రవ్యములు అక్కడే దండిగా ‌లభిస్తున్నాయి. చాలా హడావుడిగా ఉంది. మేము వెళ్ళినపుడు సాయంకాలం నాలుగు అయింది. ఆ వేళ బుధవారం. 1-3-2017 తేదీన.

మేము మామూలుగానే శివపంచాక్షరి జపిస్తూ‌ మా దర్శనం కానిచ్చుకున్నాము. పరమేశ్వరునికి వెండి తొడుగు తొడిగారు. పార్వతీ దేవి అలంకార భూషితయై అలరారుతోంది.

రమణ మహర్షుల శిష్యులు ఒకరు ఒక కావ్యం రాస్తూ, ఆ కావ్యంలో సందర్భ వశంగా దారుకావన తాపసులకు ఆత్మజ్ఞానము బోధించే ఘట్టాన్ని రమణులను రాయమని, తాను రాయలేనని చేతులెత్తేశాడు. ముందు కాదు కాదన్నా భక్తజన వత్సలురైన రమణులు ఆ ఆత్మజ్ఞాన బోధనా ఘట్టాన్ని తమిళంలో రాసారు.
దానిని, సంస్కృతంలోకి, ద్విపదల రూపంలో తెలుగులోకి, పాట రూపంలో మళయాళం లోకి కూడా‌ రమణులే అనువదించారు. తెలుగులోను, సంస్కృతంలోను ఆ చిన్ని రచన పేరు ఉపదేశసారము. అలతి అలతి పదములతో రెండు భాషలలోను రమణుల ఉపదేశసారము‌ సులభ గ్రాహ్యము. ముముక్షువులు పఠించి ఆనందిస్తారు.

దారుకావనం లోని నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనము చేసికుంటూంటే ఇదంతా మవసులో మెదిలింది. మహాదేవుని కరుణకు, తన దర్శన భాగ్యాన్ని కలిగించిన తీరుకి‌ అబ్బురపడుతూ, విభ్రమము లేని సంభ్రమము మనసును ముప్పిరిగొన వినయ, భక్తి ప్రపత్తులతో శరణాగతినొంది నిటలాక్షుని, ఆయన దేవేరిని స్మరిస్తూ, వారి భక్తపాలన కళా సంరంభమునకు వినతులిడుతూ, నుతిస్తూ తదుపరి దర్శన స్థలానికి బయలు దేరాము.

వర్షము పడనున్నప్పటి చల్లని గాలి కలిగించును హర్షము
శరత్తున పున్నమి వెన్నెలలిచ్చును సుఖము; వేసంగిని
గుబాళించి హాయి నిచ్చును మల్లియలు; గోవిందుని స్మరించిన
కలుగును అట్టి హర్షము సుఖము హాయి ఎల్లవేళల యందు

వెనుకకు ప్రవాహింపవు సముద్రుని కలిసిన నదుల నీళ్ళు
మరలి రావు గడచిపోయిన ఏళ్ళు వయసు పరవళ్ళు
కొండల గుట్టల తిరిగి ఎక్కవు పొంగుచు దూకిన సెలయేళ్ళు
ఎన్నడు క్రుంగవు వీడి రావు ఇంపార గోవిందుని కలసిన మనసులు

కైలాసమన్ననేమి? వైకుంఠమన్ననేమి?
కాశి అన్ననేమి పూర్ణ ప్రకాశమన్ననేమి?
"కాశ్యాన్తు మరణం నామ" అన్ననూ; ఇన్నియూ
నీయందు నా వ్యక్తిత్వము లీనమగుట కాదె శంకరా?

వశిష్ఠ వామదేవ గౌతమాది విశిష్ఠ మహర్షి సంఘములు
భక్త వేదాంతులు శంకర ప్రభృతులు; భక్త శిరోమణులు
నాయనమారులు బసవవేశ్వరాది జంగమదేవులు;
కాళిదాస నన్నెచోడ సోమనాథ శ్రీనాథ ధూర్జటీ
కవి సార్వభౌములు ఈశ్వరార్చనాకళాశీలురై
ధన్యత నొందిరి మనమున మిమ్ము నిలిపి;
నిర్మల హృదయులైరి శివ పంచాక్షరి జపించి;
నాకును శివ మంత్రమును ఉపదేశింపుడు;
తపించి నేనును మిమ్ము కాంతును శంకరా!

శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః!
శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః!
శ్రీ పార్వతీపరమేశ్వరాభ్యాం నమః!

మా ద్వారకా యాత్ర - నాలుగవ భాగము

మా ద్వారకా యాత్ర - నాలుగవ భాగము
 
లిపి తెలియక భాష చదవలేనటుల; పరిచయము లేక
నారీ హృదయము తెలియలేనటుల; ప్రాథమిక శిక్షణ లేక
విజ్ఞాన శాస్త్రములు, తత్త్వము అర్థము కానటుల; మీ పై
భక్తి, మీ కరుణ లేక మిమ్ము తెలియ లేము శంకరా!

భ్రమియించు భూమిపై భ్రమల సుడిగుండాల
చిక్కుకొని సంభ్రమము పొంది విభ్రమము మిగిలి
జీవితము భ్రాంతిగా తోచు మాకు భ్రమ విభ్రమములు
అంటని సంభ్రమము సంబరము నిండు శంకరా!

శ్రావ్యము కాని పాట విశ్వ శ్రేయము కాంక్షించని
కావ్యము, కన్నులకింపు గాని నృత్యము, ప్రజల బాధ
ల వ్యథల బాపి సేమము చూడని నాయకత్వము గోవిందుని
దివ్య నామము స్మరింపని హృదయము పృథివిని వృథా! వృథా!

నాగేశ్వర జ్యోతిర్లంగ దర్శనము కలిగించిన ఆహ్లాదాన్ని అనుభవిస్తూ, పార్వతీపరమేశ్వరుల ఆశీర్వచనమునకు సంతసపడుతూ, తరువాతి దర్శనయ స్థలానికి బయలు దేరాము. అది గోపీ తలాబ్ యదువంశ నిర్మూలనం మొదలయ్యే ముందు బృందావన గోపికలను రక్షణగా అర్జునుడు‌ ఉండి నంద వ్రజానికి తీసికెళుతున్నప్పుడు, అంతకు ముందు‌ ఈ తటాకానికి సంబంధించిన పురాణ కథ ఏదో చెప్పాడు బస్ లోని గైడ్. నాకేమీ‌ అర్థము కాలేదు. దానికి తగ్గట్టే ఆ గ్రామస్తులు ఆ తటాకాన్ని చూడడానికి 100 రూపాయలు ప్రవేశ రుసుము అన్నారు. మేము అంత ఆసక్తి చూపించ లేదు. తరువాతి చోటు బెట్ ద్వారక. గుజరాతీలో బెట్‌ అంటే‌ ద్వీపం.

గోమతి ద్వారక - బెట్ ద్వారక

ద్వారకాధీశుని ఆలయం ఉన్న ప్రదేశాన్ని‌ గోమతి ద్వారక అంటారు. అక్కడికి 30 కిలోమీటర్లలో ఓఖా ‌అనే ఊరు ఉంది. కృష్ణుడు రాజ్యపాలనం, రాజ్య సంబంధ విషయాలు గోమతి ద్వారకలో, పట్టపు రాణులతో ఆయన
నివాసము బెట్ ద్వారకలో ఉండేది. ఈ బెట్ ద్వారక చాలా భాగం తరువాత సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు కొద్దిగా భూ ప్రదేశం మిగిలి ఉంది. అక్కడి విశేషాలు, శేషాలు చూడడానికి బెట్ ద్వారకకు బయలుదేరాం.
ఓఖా నుంచి బోట్ లో సముద్రం మీద అరగంట ప్రయాణించి బెట్ ద్వారక చేరుకోవాలి. బస్ వాడు‌ మమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళి రమ్మన్నాడు. అప్పుడు ‌సాయంకాలం నాలుగున్నర అయింది. ఆరున్నరకు ఠంచన్ గా బస్ ద్వారకకు బయలుదేరి వెళ్ళిపోతుందని‌ఆ లోపులో మేం వెనక్కి వచ్చెయ్యాలని పదే పదే హెచ్చరించాడు. మా బస్ బుకింగ్ టిక్కెట్లను ఇమ్మని‌ తీసేసుకున్నాడు.

దిగి బోట్ వైపు నడిచాము. జనం ఉన్నారు. ఒక్కో‌ బోట్‌ వస్తోంది, జనాలను ఎక్కించుకొని వెళ్ళిపోతోంది. బోట్ లోనే డబ్బులు తీసికుంటారు. ఆ బోట్ లో‌ 50 మందిని మాత్రమే ఎక్కించుకోమని, ప్రయాణీకుల వద్ద ఒక వైపుకి
పాతిక రూపాయలు ‌తీసికోమనీ గవర్నమెంట్‌వారి‌ ఆర్డరు.

కానీ బోట్ వాళ్ళు మాత్రం పది రూపాయలు తీసికొని 100-150 మధ్య ఎక్కించుకుంటారు. కొండొకచో ‌200 ల
మందిని కూడా ఎక్కించుకుంటూంటారుట. మనదేశంలో అన్ని విషయాలలోను ఇంతే. రూలు ఒకటి, ఆచరణ ఒకటి. రూలుకి పూర్తిగా వ్యతిరేకమైనా అంతే. ఓట్ బాంక్ లు, రాజకీయ‌ నాయకులు, వారి కుహనా ‌అనుచరులు,
పాలకులు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళకులపోళ్ళయిన మనోళ్ళు, డబ్బున్న వాళ్ళకి రూల్స్ ఏమీ లేవు. దేశ దుస్థితికి ఇందంతా ‌కారణమే.

మేము బోట్ ఎక్కడానికి వెళుతూంటే మరమరాలు, అటువంటివి కల పొట్లాలు అమ్ముతున్నారు. ఎందుకో‌ నాకు‌ అర్థము కాలేదు. దేవుడికి ఇచ్చి ప్రసాదంగా తెచ్చుకోవడానికా‌ అనుకున్నాను.
బోట్ ఎక్కాక తెలిసింది పావురాలకు వెయ్యడానికి అని. ఓఖా నుంచి బెట్ ద్వారకకు వెళ్ళే ప్రయాణ ‌సమయంలో
జనాలు కొన్న ఈ పొట్లాలలోనివి పావురాలకు వేశారు. బోట్‌ వెంబడి వచ్చే డజన్ల కొద్దీ పావురాలు సముద్రంలో‌ పడ్డ ఆ ఆహార పదార్ధాలను లాఘవంగా నోటికి కరుచుకొని పావురాలు తింటున్నాయి.

బోట్ లో ఓఖాలో కోస్ట్ గార్డ్ లో పనిచేస్తున్న ఒకాయన‌ పరచయమయ్యారు. అక్కడి విశేషాలు చెబుతూ‌ మాకు ఆనందం ‌కలిగించే ఒక మాట చెప్పారు. గోమతి ద్వారక, బెట్ ద్వారక ఒకే రోజు దర్శించుకుంటే భగవత్ ప్రసన్నత లభించినట్టే అని, ద్వారకకు మళ్ళీ దర్శనార్ధము ‌రానవసరము లేదని; అలా కాక వేరు వేరు రోజులలో దర్శనము చేసికుంటే మరల తప్పక ద్వారకా‌ యాత్ర చేయయవలసిన అవసరం ఉంటుందని. అప్పటికే‌ ప్రొద్దుట
గోమతీ ద్వారకలో పరమాత్మ దర్శనము చేసేసుకున్నాము, అదే‌ రోజు బెట్‌ద్వారకాధీశుని దర్శనం కూడా ‌అవుతున్వందుకు కృష్ణపరమాత్మ ప్రసన్నతకు, ప్రసాద దృష్టికి‌ మేము అర్హులమయ్యామని సంతృప్తి, సంతోషం కలిగాయి

ఆయన‌ విశాఖపట్టణంలో‌ రెండేళ్ళు పనిచేసారట. భార్యా భర్తలిద్దరికీ విశాఖపట్టణం, ఆ పరిసరాలు ఎంతో నచ్చాయట. బెట్ ద్వారక మీద 1971 యుద్ధంలో పాకిస్తాన్ నేవీ‌ శతఘ్నులను కురిపించిందిట. అప్పుడు మవ వాళ్ళు కరాచీ హార్బర్ పై దాడి చేసి ధ్వంసం చేశారట. అక్కడికి‌ పాకిస్తాన్ సముద్ర సరిహద్దు 140 కి. మీ. ఉందిట.
బెట్‌ ద్వారక లో 9000 మంది ముస్లిములు, 1000 మంది‌ హిందువులు నివసిస్తూంటారట. ద్వారక ప్రాంతం కలిసి ఈ ప్రాంతం‌అంతా‌ దేవభూమి ద్వారక జిల్లాగా ఉంది. బోట్‌ మీద ఆ సాయంకాలం సముద్రప్రయాణం ఎంతో హాయిని‌ గొలిపింది. సముద్రపు గాలి ఎంతో చల్లనిది. ‌సేద తీరుస్తుంది.

బోట్ దిగి ఒక 300 మీటర్లు నడిస్తే అక్కడి ద్వారకాధీశుని దర్శించాము. గుడి బాగానే ఉంది. సంసార పక్షంగా‌ఉంది. లోపల లక్ష్మీదేవి పటం, జాంబవతి, రుక్మిణి, సత్యభామల, శ్రీలక్ష్మ్యార్ధనారాయణ‌ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ, గోమతీ ద్వారకలోనూ సందర్శనానికి ఎందరో గ్రామీణులు వస్తున్నారు. వారి అమాయకపు భక్తి ఎంతో ముచ్చట గొలిపింది.
మరల వచ్చి బోట్ ఎక్కాము. మా బోట్ పై డజన్లకొద్దీ‌ పావురాలు మరల ఎగరడం మెదలు పెట్టాయి‌. మొదటి సారిలా ప్రయాణీకులు మరమరాలు అవీ‌ ఎక్కువగా వెయ్యలేదు. పాపం ఆ అరగంట‌ సేపూ ఆ పావురాలు ఆహారంపై ఆశతో ఎగురుతూ ఇటువైపు దాకా‌ వస్తూనే ఉన్నాయి. వాటికి రెక్కలు, కాళ్ళు బాగా‌ లాగి నెప్పెట్టేశాయేమో‌ అనిపించి బాధ కలిగింది నాకు. పాపం మూగజీవులు. ఏ ఆశ పెడితే ఆ‌ ఆశ.

మేము ఠంచన్‌ గా‌ 6-30 కి‌ బస్‌ దగ్గరకు వచ్చేశాము. లేకపోతే బస్‌ వెళ్ళిపోయేది. ఇంకో‌ బస్ ఎక్కిరావచ్చు. కాని మవిషికి టిక్కట్టు‌ 30 రూపాయలు. మా మొత్తం ట్రిప్ మనుషికి కి‌ 80 రూపాయలు.

ఆ రాత్రికి పూర్తి విశ్రాంతి తీసికున్నాము. మరునాడు కృష్ణుని మరొక సారి‌ దర్శించుకున్నాము. సాయంకాలం గుడి పక్కనే ఉన్న సుధామ సేతు - గోమతీ నదిపై ఉంది - అవతలికి వెళ్ళాము. అది కూడా‌ ఒక చిన్ని దీవి. ఇసక పర్ర. ఒక చిన్న లక్ష్మీనారాయణుల గుడి‌ ఉంది. ఐదుగురు‌ ఋషుల‌ పేర ఐదు నూతులు ఉన్నాయి. ‌నీళ్ళు మెట్ట ప్రాంతంలో నీటి వలె‌ చప్పగా ఉన్నాయి. చుట్టూ సముద్రం మధ్యలో ఈ నూతులు. అదీ ప్రత్యేకత. ఆ దీవిపై ఆ హాయినిచ్చే గాలిని అనుభవిస్తూ చాలాసేపు కూర్చున్నాము.

గోమతీ నది‌ జన్మస్థానము ఉప్పునీటి‌ కయ్యలాంటిది. నీళ్ళు సముద్రపు నీళ్ళ రుచిలో ఉంటాయి, దాని‌ జనన ప్రదేశం నుంచీ! గోమతి వెడల్పు చాలా తక్కువ. విజయవాడ కృష్ణా కాలువ కన్న తక్కువ. ద్వారక ఊరు కూడా చాలా చిన్నది. మన ‌కొవ్వూరు కన్న చాలా చిన్నది.

రాత్రి 8 గంటలకు ద్వారకాధీశుని హారతి సమయంలో తనివి తీరా దర్శించుకొని హోటల్ కి చేరాము. గుజరాతీ ధోక్లా తప్పక రుచి చూడమని మా కోడలు చెప్పింది. తనకి రకరకాల ప్రాంతాలలో ఏ యే ఆహార పదార్ధాలు తింటారు, ఏవి బాగుంటాయి అనే విషయంలో మంచి జ్ఞానము ఉంది. తను రకరకాల పదార్ధాలు బొంబాయిలో రుచి చూస్తూంటుంది. బొంబాయి మినీ ఇండియా కదా. అన్నిరకాలవి దొరుకుతాయి. ఏ ఊరు వెళ్ళినా అక్కడి స్పెషల్స మా ఆవిడ కోడలు నుంచి తెలుసుకుంటుంది. మేము రుచి చస్తాము. ఆ‌ ధోక్లా రుచి చూశాము. బాగుంది. కచౌరి అని మరొక ఆహార పదార్ధాన్ని ఆ షాపతను రికమెండు చేశాడు. తిన్నాము చాలా బాగుంది. మావాళ్ళకి బొంబాయి తెచ్చాము. అందరికీ ‌ఆ ద్వారక గుజరాతీ కచౌరి బాగా‌నచ్చింది. స్వీట్‌ అంతగా ఇష్టపడని. నేనూ‌ దానిని‌ ఇష్టంగా తిన్నాను.

అక్కడ ప్రసాద్ ఘర్ అని ఒక ధర్మశాలలో భోజన సదుపాయం ఉంది. ఇరవై రూపాయలు. ఒక హాట్- కారప్పూస లాంటిది, స్వీట్ బూందీ తో సహా‌ అన్నము, చపాతీలు అన్ లిమిటెడ్, సబ్జీ; పెరుగు, మజ్జిగ ఉండవు. అవి బైట కొనుక్కొని తీసికెళ్ళ వచ్చు. మేము మూడు పూటలు అక్కడ తిన్నాము. రాత్రిళ్ళు అదనంగా‌ ఇచ్చే స్వీట్ హాట్ ఉండవు. చాలా ‌భోజన శాలలు ,హోటళ్ళు ఉన్నాయి, ఎవరి స్థాయిని బట్టి వారు తినవచ్చు. మేము రెండు మధ్యాహ్నములు గుజరాతీ భోజనం మరొక హోటల్ లో చేశాము. బాగుంది.

ఆఖరున, 3-3-2017 ప్రొద్దున్న ఆటో ఎన్ గేజ్ చేసికొని ద్వారక లోకల ప్రదేశాలు చూశాము. అందులో సముద్రపు ఒడ్డున ఉన్నవే అన్నీ. గీతా మందిరం - మామూలు కట్టడము, ప్రత్యేకత ఏమీ‌లేదు- , భడకేశ్వర మహాదేవ్ మందిరము, గాయత్రీ‌ శక్తిపీఠ్, సిద్ధేశ్వర మహాదేవ్ మందిరము చూశాము. భడకేశ్వర్ మహాదేవ్ ఆలయం చాలా చిన్నది, ఒక ద్వీపకల్పము. మామూలుగానే శివలింగం వెనుక పార్వతీదేవి విగ్రహము. సిద్ధేశ్వర్ మహా‌దేవ్ ఆలయంలోనూ‌ అలాగే పార్వతీ‌దేవి శివలింగం వెనుక ఉంది. సోమనాథ్ నుంచీ‌ గర్భగుడిలో ఇలాగే సాంప్రదాయము. నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలోను ఇంతే. ఇది సౌరాష్ట్ర దేశ‌ సంప్రదాయమేమో.

భడకేశ్వర్ ఆలయం వద్ద సముద్రం సీనరీ చాలా బాగుంది. అక్కడ అరేబియా సముద్రం అందాలు డెందానికి పసందులు. గాయత్రీ శక్తిపీఠ్ లో విశేషమేమీ లేదు. సావిత్రీదేవి, గాయత్రీదేవి, కుండలినీదేవి ల చిన్న విగ్రహాలు ఒక వేదికపై ఉన్నాయి. సిద్ధేశ్వర్ మహాదేవ్ ఆలయంలో లింగము తెల్లగా ఉండి ముందువైపుకి బొడిప ఉంది. అక్కడ నీళ్ళు ఉంటాయి మనం కావలిస్తే లింగంపై నీరుపోసి అభిషేకం చేసికోవచ్చు. మళ్ళీ ద్వారకాధీశుని ఆలయం దగ్గర వదిలాడు ఆటోవాడు.

మేము దర్శనానికి వెళ్ళేసరికి మరల స్వామికి, రసావతారునికి‌ శృంగార హారతి సమయం. హారతి సనయంలో జనం ఎక్కువ ఉంటారు. పరమాత్మయైన రుక్మిణీ సత్యభామా వల్లభుని కనులార వీక్షించి తరించాము. భగవంతుని ఎన్ని సారులు చూచినా విగ్రహరూపము అచ్చుగుద్దినట్టు మనోఫలకము పై పడదు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి దర్శనానికి వెళ్ళినపుడు రెండుమూడు సారులు భగవంతుని శిలా రూపాన్ని చూశాము. బయటకు రాగానే వెంటనే‌ ఫలకంపైనుంచి ఆ మూర్తిని మరచిపోతాం. ఎన్ని సారులు దర్శనం చేసికున్నా ఇంతే. అందుకే భగవద్గీతాచార్యుడిని ఒకటి వేడుకున్నా. ద్వారకాధీశుని దర్శనానికి రకరకాల భక్తి తెగల వారు, వీరిలో గ్రామీణులెక్కువ, పాటలు పాడుకుంటూ, నాట్యము చేస్తూ అలా ఆడుతూ పాడుతూ గుంపులు గుంపులుగా ద్వారకాధీశుని దర్శనానికి వస్తారు. వారందరినీ చూడడం ఒక వేడుకగా‌ఉంటుంది. వారి భక్తి ప్రపత్తులు మనలను తాకుతాయి. స్వామికి హారతి ఇచ్చినపిపడల్లా గపడిపైన ధ్వజాన్ని మారుస్తారు. హారతి చూసి దానిని చూడడానికి జనాలు వేచి ఉంటారు.

"తండ్రీ! నారాయణా‌ మనసుయొక్క ఈ బలహీనత నుంచి నన్ను విముక్తుణ్ణి చెయ్యవయ్యా‌ అని. నారాయణ నామస్మరణాన్ని సతతము చేసేలా దాన్ని అనుగ్రహించవయ్యా" అని కృష్ణపరమాత్మను పదే పదే వేడుకున్నాను. వయసు మీద పడుతోంది కదా, చూపూ నెమ్మది నెమ్మదిగా మందగిస్తుంది. రూపము మీద మాత్రమే దృష్టి ఉంటే ఎలా?!

అలా నందనందనుని, యశోదా డింభకుని, గోవర్ధనగిరిధారిని, గోపికా వస్త్రాపహారిని, రాధికాప్రియుని, రుక్మిణీ, జాంబవతీ సత్యభామాపతిని కనులార వీక్షించి, మనసార దర్శించి బొంబాయుకి సౌరాష్ట్రా‌ మెయిల్ లో బయలుదేరాము. జాగ్రత్తగా ‌ఇంటికి చేరాము కూడా.

చేయుము నా మనసు స్వచ్ఛమైన
స్ఫటికముగ; ప్రతిఫలించనీయవోయి
నీ వాత్సల్య కరుణా ప్రకాశములు
విశ్వమంత కాంతులు నిండ గోవిందా!

ఉన్నతమైన ఆలోచనలు వాటికి తూగు
ఉత్తమమైన మాటలు, వాటికి సరిపడు
సదాచరణము; త్రికరణములు శుద్ధమై
సయోధ్యగ నుండు సౌభాగ్యము నిమ్ము గోవిందా!

వాడును తనువు; వసివాడదు
నిన్నెరిగిన బుద్ధి; జీవితాంతము
గుబాళించును నీపై భక్తి రక్తి
మనమున నీవు నిండిన గోవిందా!

స్మృతి తప్పనీయకుము నారాయణా!
మరణమాసన్నమైనపుడు; నీ నామ స్మరణము
చేయుచు, నీ చరణకమలముల దృష్టి నిలిపి
తుది శ్వాస వీడు భాగ్యమ్మునిమ్ము గోవిందా!

కాయము పలుకు మనసు ఇంద్రియములు బుద్ధి
ఆత్మ ప్రకృతి స్వభావము నీవెయై భాసింప గోవిందా!
కలవరములు కలతలు కష్టములు క్లేశములు లేవు నాకు
నీవే నేనను ఉపనిషద్వాక్యము మరల ఋజువైయ్యెన్

భావము మల్లె భక్తి సంపంగి
గురు భావము మందార స్నేహము విరజాజి
అనురాగము మరువము భక్తి సూత్రమున
నీకై కూర్చిన రాగమాలను స్వీకరించు గోవిందా!

సమస్త సన్మంగలాని భవంతు!
భగవత్ ప్రీతిరస్తు!
సర్వే జనాః సుఖినో భవంతు!
ఏతత్ సర్వమ్ శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు!

Cricket; The fashion of Today: Non-local, భవుడు-భావములు; మానవ సేవ - మాధవ సేవ

The success of Australian spin duo in destroying Indian top order and tail batting is both surprising and interesting. Indians are adept and are famous in playing spin bowling. Why it is happening like this is not believable.

The reckless and negligent batting in first test made them lose first test. That seems to have transformed into inability in second test. Unless the Indian batsmen come out of this mental block, it is sure that India may lose this test
series to Australia.

Wish Indian batsmen all the best.

***********

The Fashion of Today

The fashion of today is: know about everything but cannot and do not do anything. Blame others for every ill. Relax in bars and pubs. Respond to every incident and event through social networking medium passionately, conduct awareness walk or marathon, light candles; spend time on apps. Occasionally know about culture, religion and spirituality.

Can the "image" of an university be revived by just an accused and non-patriotic student leader? Height of arrogance or ignorance? In India people rate themselves superior by merely shouting slogans.
*************

When people from coastal Andhrapradesh are dubbed as "not local and are foreigners" and "thrown" away from Hyderabad, whom and why Indians are asking "Do we belong here?"; in the USA.
When same Indians are foreigners in their own country just in a different place, how we can ask for "local" tag in America? What right we have in a foreign country which we do not have in our own country,India?
How innocent it is?

***********

Having a soft, tender and sensitive heart is disadvantageous these days. Having an aesthetic heart is quite rare.

సున్నితమైన హృదయం కలిగి ఉండడం ఈ రోజులలో ఎంతో ఇబ్బంది‌ కూడా. కళాహృదయం ఉండడం ఎంతో‌ అరుదు.
 ************
భవుడు-భావములు

నిర్గుణుడైన భవుని నుంచి ప్రభవించును భావములు
భవానీమయములు భాసుర దీప్తులు భవాబ్ధి రూపములు;

మౌని నుంచి వికసించును భాషలు కదంబకుసుమ
న్యాయమున; పరిఢవిల్లును మాటలు వ్యక్తార్థములై;
భావరాగలయాది‌ సమన్వితమైన సంగీతము సదాశివ
మయము; తాళయుక్తమైన నటరాజ నర్తనములే
నాట్యములు, శివకామసుందరీ నూపుర ఝణఝణలు
లలితకళల లావణ్యములు, లాస్యములు, అలరింపులు

మానసవర సంచారము నిలిపి ధ్యానించిన నిర్గుణము
మానసవర సంచారము సలిపి ధ్యానించిన సగుణము
జ్ఞానము, భక్తి లై మనల ముందుకు తీసికొని వెళ్ళు
తత్త్వయుతములు, నిర్వాణపదమధిష్ఠింపజేయు‌ దారులు

పరాపశ్యంతీమధ్యమావైఖరీ గతులనొందు తత్పర
తాత్పర్య నిధులు భక్తిజ్ఞానకర్మమార్గములు; తారకములు
భవబంధవిమోచనములు; భవాబ్ధిని దాటించు‌ నావలు
మోక్షసామ్రాజ్యమునకు చక్రవర్తులచేయు బ్రహ్మవిదులు

అఘములనుండి మరల్చి పద్మాసనుడైన శాంతమూర్తి
కరుణకు మనల పాత్రుల చేయు ప్రమథగణములు;
నందిని, బసవని‌ చేసి మనల శశిధరమకుటునికి
దాసులను చేయు‌ జంగమదేవర కటాక్షములు
చరాచర ప్రపంచమున కన్ను మిన్ను గానక అలమటించు

మనల శివసాయుజ్యము పొందించు పొందికలు; ధ్యాత
ధ్యేయముల ధ్యానములో లీనముజేసి నిరంతర ధ్యానమై
మనము ధన్యతనొంది ముక్తిగా జీవితమును చేయు‌ సిరి
శివ పంచాక్షరిని జపించుచు శివ నామమును స్మరించుచు
హృదయము సదా శివమయమై మనము రమించు
భాగ్యమునిచ్చు భోళాశంకరుడు‌ భక్తజన కింకరుడు
పార్వతీ సహచరుడైన పరమశివుడు మనల గాచుగాక!

*********

మానవ సేవ - మాధవ సేవ

మానవ సేవయే మాధవ సేవ. ఆ మానవులలో అమ్మ, నాన్న, భర్త/భార్య, అబ్బాయి, అమ్మాయి, మనుమలు/మనుమరాండ్రు, అత్త, మామ, తాత/అవ్వ‌ కూడా‌ ఉంటే ఎవరూ వేరేగా మానవ సేవ చెయ్యవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే తమ వాళ్ళు చూడక వీధిని పడే వాళ్ళే ఉండరు. ఎవరి వారు వారికి ఉంటారు. వీరు కాని మానవులకు వేరుగా సేవ చేసే "భాగ్యము" నకు సంసారులమైన మనము నోచుకోము. మన జీవితము జీవించి, మన వారికి తోడు నీడైతే ఇంక ఇతరుల సేవ అవసరం ఏముంది?

ఇలా మన వాళ్ళకు మనం సేవ చేసుకోక, వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలి ఎవరికో మానవ సేవ అంటూ రోడ్డున పడితే; ఇలా అయిన వారి నిర్లక్ష్యానికి గురై, అనాథలైన జీవులకు ఎందరు బైట వాళ్ళు, పరాయి వాళ్ళు సేవకు ముందుకు వచ్చినా వారి సంఖ్య అనాథలైన అందరినీ అక్కున చేర్చుకోవడానికి సరిపోదు.
ఈ ఇంగితం వంటబడితే ఏ ఇల్లూ అనాథ కాదు. ఇళ్ళలో అనాథలూ ఉండరు.

అప్పడు ప్రతి ఇంటికీ ఒక మదర్ థెరిసా "మదర్ (అమ్మ, నాన్న‌ రూపాలలో) ఆదుకోవడానికి, ఆదరణకు, ఆత్మయత చూపించడానికి ఉంటారు. నిజమైన అనాథలకి ఛారిటీ సంస్థలు, ప్రభుత్వ సంస్థల సేవలు సరిపోతాయి.
మానవ సేవ ఒక సాంఘిక ఫేషన్ గా తయారవవలసిన గతి లేదు. అయినవాళ్ళని వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేసి మానవ సేవ అంటూ వీధిన పడితే సృష్టి కర్త, భర్త, సంహర్త సంతోషించరు. దానిని మాధవ సేవ అనలేము.

Sunday, February 19, 2017

తెలుగు సంస్కృతి, జాతి సంస్కృతీ సాంప్రదాయములు

తెలుగు సంస్కృతి, జాతి సంస్కృతీ సాంప్రదాయములు

తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా అమరావతిని తీర్చిదిద్దుతారట. ఒక సంఘాన్ని నియమించారు. దానికి ఒక బ్రిటిష్ ఆయన సంచాలకుడు.

ఆంధ్రప్రదేశ్ ఒక ఉప ముఖ్యమంత్రి గారు శ్రీకృష్ణదేవరాయలు మహోత్సవంలో మనం మన సంస్కృతీ సంప్రదాయములను సంరక్షించుకొని భావి తరాలకు అందించాలని వాక్రుచ్చారు. పిలుపునిచ్చారు.
ఏది తెలుగు సంస్కృతి, ఏవి మన సంస్కృతీ సంప్రదాయములు?

ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ కి (తెలుగు సంస్కృతికి ఘనంగా సేవ చేసిన, వివిధ కళా, శాస్త్ర, విజ్ఞాన, జ్ఞాన రూపాలలో అందించిన) తెలంగాణా ఈ పరిధిలోకి రాదు కదా) చెందిన తెలుగు వారిలో ఏకాభిప్రాయం ఉన్నట్టు కనిపించదు. ఎందరు మేధావులో అన్ని సంస్కృతులు.

మరి ఏర్పాటు చేసిన సంఘం వారికి అందిన సూచనలు, వారికి తెలిసినది, తెలుగు సంస్కృతి, సంస్కృతీ సంప్రదాయముల రూపంలో ప్రతిబింబింప చేస్తారేమో? వాటినే పరిరక్షించి భావి తరాలకు అందిస్తారేమో?
తెలుగు ప్రాంతంలోని మేధావులు ఏది తెలుగు సంస్కృతి అనే దాని మీద భేదాభిప్రాయములు కలిగి ఉన్నారు. విశ్వవిద్యాలయ ఆచార్యులు, తామే మేధావులమనుకునే మేధావులు, ఇన్ని వేల ఏళ్ళ సంస్కృతీ సాంప్రదాయముల, తెలుగు సంస్కృతి యెక్క ఉనికిని ఈసడించుకొనే తామూ మేధావులమనుకునే మేధావులు, ఇది కాక ఏవేవో ఇజములు మాత్రమే సంస్కృతి అనే విద్యావేత్తలు, ఆలోచనాపరులు, ఈ సంస్కృతీ ప్రతిబింబాన్ని, పరిరక్షణను వేరు వేరు దిక్కులకి లాగే ప్రయత్నంలో ఏ తెలుగు సంస్కృతి ప్రతిబింబింపబడుతుంది, ఏ సంస్కృతీ సంప్రదాయములు పరిరక్షింపబడతాయి?

ఈ నాటికి నిర్దుష్టమైన తెలుగు భాషను రూపొందించుకోలేదు. నిజానికి తెలుగు భాషలో వివిధ ప్రకృతి శాస్త్రములలో, సాంఘిక శాస్త్రములలో, భాషా శాస్త్రములలో, మరి వివిధ జ్ఞాన పరంపరలలో ఏవిధమైన కృషీ జరగని ఈ రోజున ఏది తెలుగు సంస్కృతి? ఏవి సంస్కృతీ సాంప్రదాయములు? తెలుగుభాషలో విద్యాభ్యాసమని అదో గోల.

భౌతిక, రసాయన, జీవ, గణిత, ఇతర శాస్త్ర, సాంకేతిక విషయాలలో జ్ఞానానికి ఏమీ అందించని తెలుగువారు, తెలుగు భాషలో ఆయా శాస్త్రములలో ఏమీ గ్రంథాలు, కనీసం వ్యాసాలు ఇప్పటి అభివృద్ధికి అనుగుణంగా రూపొందించలేని, రాయలేని తెలుగువారు, తమ మాతృభాషనే సరిగా నేర్వని తెలుగువారు, కులముల, ప్రాంతముల, మతముల, ఇజముల కీచులాటలో శక్తి, యుక్తులు, సమయము వృథా చేసికునే తెలుగువారు, ఖండాంతరములకు కూడా తమ కుల గజ్జి, ప్రాంతీయ దురభిమానము పట్టుకెళ్ళే తెలుగువారు, ఏమీ తెలియని, ఏమీ చేతకాని, ఏ శాస్ర్రావగాహన, సంస్కృతీ, సాంప్రదాయముల, తత్త్వముల ఆకళింపు లేని రాజకీయ నాయకులకు సమస్తమును ధారాదత్తము చేసి, ఆ నాయకుల అజ్ఞానము, అహంకారము, ఆధారముగా ‌అన్ని సంస్కృతుల, నాగరీకముల, శాస్త్రముల ప్రాచుర్యము చేయవలసిన, చేస్తున్న తెలుగువారు ఏ సంస్కృతిని ప్రతిబింబిస్తారు? ఏ సంస్కృతీ సాంప్రదాయములను పరిరక్షించుకొని భావి తరాలకు అందించుకుంటారు?

ఈ విషయమై స్పష్టమైన నిర్వచనము, అవగాహన, ఉదాత్తత, ఊహ లేక ఇజముల కొట్లాటలే సంస్కృతిగా చెల్లుబాటవుతున్న నేడు ఏ తెలుగు సంస్కృతిని ప్రతిబింబించుకుంటాం? ఏ సంస్కృతీ సంప్రదాయములను పరిరక్షించుకొని భావి తరాలకు అందించుకుంటాం?

ఎందరో పెద్దలు జీవితాలు వెచ్చించి రూపొందించిన తెలుగు సంస్కృతి రాష్ట్రం విడిపోయినట్టు ముక్కలు, చెక్కలుగా అవుతుందా? అలా ఉంటుందా? ఏ సంస్కృతి సంరక్షింపబడుతుంది. తమిళుల లాగ మనం సంస్కృతిని పరిరక్షించుకోవడం లేదే అని తరచు నీరసపడే, అనుకరణకు పీట వేసే జనులకు వారిది ఏ నంస్కృతి?
రాజకీయనాయకుల ఎన్నికల వాగ్దానాలు వేరు; తెలుగు సంస్కృతి ప్రతిబింబించబడడం, సంస్కృతీ సాంప్రదాయములను పరిరక్షించుకోవడం, భావి తరాలకు అందించుకోవడం వేరు. తాము చేసిన ఎన్నికల వాగ్దానాలను రాజకీయ నాయకులు పట్టించుకోవలసిన, అమలుపరచవలసిన అవసరం లేదు.

కాని సంస్కృతీ సాంప్రదాయముల నిర్వచనము, అవగాహన, ఆకళింపు అమలుపరచాలంటే పండితుల, కళాకారుల, శాస్త్రజ్ఞుల, మేధావుల, తత్త్వజ్ఞుల కలయిక అవసరం ఉంది. సంస్కృతి, సంప్రదాయములు రాజకీయము కాదు. ఎందరిదో సమిష్టి కృషి.

ఏ ఒక్కదానిలోనూ ఏకీభవించని మేధావులు, పండితులు, శాస్త్రజ్ఞులు, తత్త్వవేత్తలు ఏ తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ప్రయత్నము చేస్తారు? ఏ సంస్కృతి, సాంప్రదాయములను పరిరక్షించి భావితరములకు అందిస్తారు?
అమరావతీ నగర నిర్మాణంలా రాజకీయ నాయకుల కనుసన్నలలో తెలుగు సంస్కృతి ప్రతిబిబంబింపబడదు.
దానికోసం ఎందరో పండితులు, ఆచార్యులు, మేధావులు, శాస్త్రజ్ఞులు, తత్త్వవేత్తలు తమ తమ భేదాభిప్రాయములను మరచి, విడచి ఏకతాటి పైకి వచ్చి సమిష్టిగా కృషిచేస్తే తెలుగు సంస్కృతి అంటే ఏమిటో నిర్వచింపబడుతుంది. ప్రతిబింబించడం, పరిరక్షించడం, భావి తరాలకు అందించడం, ఒక్కొక్కటీ అంతంత పని.

పిల్లి మెడలో ఎవరు గంట, ఎలా కడతారో చూద్దాం.

మంచి జరుగాక అని ఆశిద్దాం

Disposable Writings ; Drunken driving - Pastime of the elite

Disposable Writings

We find many writings daily
Including ours; but how many
Are read? Fed up, many readers
Not even glance through most;


Disposable Writings are they giving
Pleasure only to the creator; neither fellow
Writers nor critics care for these creations;
Still why so many works get poured and

Writers, poets, fiction-writers, novelists
Continue creating? Is it a compulsive "disorder",
 That engulfs the literary creators? May be
Order and disorder continue following each

Other for Eternity; meanwhile languages are
Learnt, hearts and minds get inspired and
Express; without expecting any reward,
recognition or return; human nature is

Above money-making; transcends all
Appreciations, indifference or insinuations;
Writers are Divine in making and creation
So only writings pour in, disposable or distinct

**********

Drunken driving - Pastime of the elite

Drunk driving is fashion of the day
For the elite, the rich, the celebrities
But the price is paid by unsuspecting
Road users and pavement sleepers


Drinking had been a vice in good olden days;
It is a status symbol now for the men and women;
 the poor continue to drink but never kill;
only they kill themselves; no religion,
No preacher, no teacher can do anything
About the cultural habit of drinking; it seems

Only the poor spoil their health through drinking
But the haves evolve themselves as a nuisance
To the society with their elite partying and then
Taking to roads becoming non-hired killers with

Impunity; governments became helpless and
Legal system follows snail in pace in punishing
The drunken drivers; the lives of road users
Are at the mercy of elite and celebrity drunkards
Who take to roads fully drunk; there is no
 gender discrimination here; women too do it
 

Thursday, February 16, 2017

మనసు కలాప, విరమణ, రమణ స్థితులు; ఆల్ కౌంట్ పేక; కోరిక

మనసు కలాప, విరమణ, రమణ స్థితులు

వాస్తవము వేరు; మనసు మనకు చూపించే విధము వేరు. మనం మనసు చూపించిన దాన్ని బట్టి ఘర్షణ, సంఘర్షణ అనుభవిస్తాము. ఉత్సాహపడతాము. నిరుత్సాహ పడతాము. ధైర్యం తెచ్చుకుంటాము. భీరువులము అవుతాము. సంతోషపడతాము. వేదన, వ్యథ అనుభవిస్తాము.
అలా ఎన్నో సార్లు వాస్తవాన్ని సరిగా గమనించకుండానే, అంచనా వేయకుండానే దుఃఖపడతాము. ఖేదిస్తాము. మోదం తెందుతాము.

కాస్త నిదానిస్తే అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో తెలుస్తుంది. కాని మనసు రంగుటద్దములలో చూపినదానికి అనుగుణంగా మాత్రమే మన చర్యలు, ప్రతిచర్యలు ఉంటాయి. సుఖదుఃఖములు, ఖేద మోదములు ఉంటాయి.

అలా మనం ఎన్నోసార్లు వాస్తవంలో లేకపోయినా, జరగకపోయినా, అసలు నిజం గమనించకుండా మనసు తన స్వభావము కొద్దీ, పరిమితుల కొద్దీ చూపే అబద్ధాలలో చిక్కుకొని అలమటిస్తాము.

తలపుల, ఆలోచనల, భావముల రూపు మాత్రమే అయిన మనసు లేక మన మనుగడ లేదు. కానీ మన మనుగడ ఒక్క తలపులు, ఆలోచనల మీదే ఆధారపడి లేదు. మనకు విచక్షణ, ఊహాశక్తి, యుక్తి, సూక్ష్మబుద్ధి కూడా ఉన్నాయి. వీటిని ఉపయోగించి మనసు పెట్టే ఆరళ్ళ నుంచి తప్పించుకోవచ్చు. వాస్తవ విరుద్ధంగా మనసు పెట్టే కంగారును తట్టుకోవచ్చు. కాస్త నిదానించాలి అంతే.

మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే అనే వేదాంతం లోకి వెళ్ళిపోకూడదు. మనసు మనకు గ్రహణకు, గ్రహింపుకూ ఉపయోగిస్తుంది. మానసిక కార్యకలాపములు లేక మనము లేము. నిజానికి మానసిక కార్యకలాపములే మనము.
కాని మానసిక కార్యకలాపములకు ఇవతల, అవతల కూడా మనమున్నాము. ముందూ, వెనుక కూడా మనకు ఉనికి ఉంది. రోజూ గాఢనిద్రలో మనసు ఉనికి లేదు. కాని గమనిక రూపంలో మనం ఉన్నాము.

మన అసలు ఉనికి గమనికగా. గమనికలోనికి మానసిక కార్యకలాపములు వచ్చి పోతూంటాయి. అనుభవములు కలిగి, కరిగి పోతూంటాయి. మానసిక కార్యకలాపములు శాశ్వతము కాదు. మానసిక కార్యకలాపములు సర్వకాల సర్వావస్థల యందు ఉండవు. మెళకువ, కల మానసిక దశలలో కలిగి, గాఢనిద్ర, జాగ్రత్ సుషుప్తిలలో మాయమవుతూంటాయి. మాయ అవుతూంటాయి. మానసిక శక్తి యొక్క మరయొక పేరే మాయ. మాయ చిత్ శక్తి. చిదాభాస. ప్రణవము. స్ఫోట.

మనసు, బుద్ధి, చిత్తము, అహంకారముల రూపైన అంతఃకరణములు మాయా విభూతులే. మాయా పరిణామములే. మాయ పురోధాన (ముందుకు) పరిణామం చెందితే అంతఃకరణములు ఏర్పడి మెళకువ, కల మానసిక దశలు ఏర్పడి మానసిక కార్యకలాపములు జరిగి విషయ, వషయానుభవ రూపములైన అంతర్, బాహ్య జగత్తులు దృష్టిలోకి వస్తాయి.

మాయ తిరోధాన (వెనుకకు) పరిణామం చెందితే మనసు, ఇతర అంతఃకరణములు మాయగా మారి మానసిక దశ గాఢనిద్ర (సుషుప్తి) గాని, జాగ్రత్ సుషుప్తి (తురీయము) గాని అయ్యి మనసు, ఇతర అంతఃకరణములు విరమణ పొంది విరామం చెందుతాయి. మానసిక కార్య కలాపములు విరమింపబడతాయి. అంతర్, బాహ్య జగత్తులు దృష్టిలో ఉండవు. కరిగిపోతాయి. అదృశ్యమవుతాయి. అంతర్ముఖ, బహిర్ముఖ దృష్టులు అంతమవుతాయి. విషయ, విషయానుభవ గ్రహణలు, గ్రహింపులు ఉండవు.

అప్పుడు మనలో శాంతి, ఆనందము, మౌనము వెల్లివిరుస్తాయి. మనము, మనము నిండుకొని మనము గమనికగా వెలుగుతాము. దృష్టి విశ్రాంతమవుతుంది.

మానసిక కార్యకలాపముల విరమణమే రమణము. రమణునితో సమము. రమణునితో, రమణునిలో ఐక్యము. మానసిక కార్యకలాపముల విరమణ స్థితియే రమణ స్థితి.

************

ఆకలి లేక అన్నం అవసరం లేదు; పంచభక్ష్య
పరమాన్నముల ఊసు లేదు; దప్పిక లేక మంచినీటి మాట రాదు;
నపుంసకునకు వాంఛ లేదు సంగమ దృష్టి లేదు;
ఇచ్ఛ ఉంటేనే అవసరం; లేకపోతే ఏదైనా అనవసరం
 ***********

చదువుచున్నాము కొరగాని చదువులు
ఉద్యోగము తేవు జ్ఞానమును అబ్బదు
మరెందుకో వేలకివేలుపోసి కొనుచున్నాము
లాటరీ టిక్కెట్టు చదువులు; ఆల్ కౌంట్ పేక ఆడుచున్నాము