Saturday, September 26, 2015

అద్వైతము - ద్వైతము


 అద్వైతము - ద్వైతము


తత్త్వమును గాలికి వదలి వైచి వ్యక్తుల పట్టుకు
వేలాడుట భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయము కాదు;
తత్త్వము, గురువు సమానము; జీవితాంతము
ఒకనికి శిష్యపరమాణువుగ బ్రతుకు గడుపుట

ఉపనిత్ సంప్రదాయము కాదు; సర్వతంత్ర స్వతంత్రత
తత్త్వశాస్త్ర అవగాహనా పరమార్ధము; అన్ని బంధముల
నుంచి విడుదల; అన్ని కామితముల నుంచి ముక్తి; అహం
భావ మమకారములనుంచి మోక్షము; వ్యక్తిత్వ స్పృహనుంచి

బయటపడి పరమాత్మ స్పృహయే ఊపిరి కాగ
వేదాంత వాక్యార్థములందు సదా రమించుచు
శోకవిహీనులై, నిర్మల మానసమున శాంతానందమౌనములు
ప్రతిఫలింప భక్తి స్థితియందు తత్పరుడై పరాత్ పరుడగుట తత్త్వానుభవము

ఉపనిషత్ స్రష్టల దివ్యానుభవము; అందరు ఆచార్యుల నిర్గుణ స్థితి
అదియే లఘువు గురువునందు ఐక్యమగుట; నిర్వాణ స్థితి; పరబ్రహ్మానుభవము

ద్వైత భావము పోనిదే అద్వైతానుభవము అవదు
వ్యక్తిత్వము ఖాళీ చేయు ప్రదేశమే పరమాత్మ వెలుగు చోటు




ద్వైతము భావము మాత్రమే. అద్వైతము అనుభవము. ద్వైతము వాక్యము. అద్వైతము తాత్పర్యము. తత్ పరము. ద్వైతము విభక్తి. అద్వైతము భక్తి. ద్వైతము వ్యక్తిత్వము. అద్వైతము బ్రహ్మము. ద్వైతము సగుణము అద్వైతము నిర్గుణము.

Wednesday, September 23, 2015

నవీనకవులు; భగవంతునికి కృతజ్ఞత




శబ్దకోశము ప్రక్కన లేకుండ అర్థము కారు
నన్నయ తిక్కన పాల్కురికి సోమన పోతన
శ్రీనాథుడు ఎఱ్ఱాప్రగ్గడ నాచన సోమన మొల్ల విశ్వనాథ
శబ్దకోశము ప్రక్కనున్నను అర్థము కారు నవీనకవులు

నవీనకవులు, వారి అనుభవములు భావములు వాక్కులు సంకీర్ణములు:
కవితలు సంక్లిష్ట భావ మయములు; రస హీనములు, అనుభవ
శూన్యములు, పొడి పొడి మాటలు; పదములు సరళమైతే చాలదు
అనుభవ, భావ ప్రకటనము సరళము కావలె; సిద్దాంత

రాద్దాంతములు‌ ఆవేశ కావేషములు ద్వేషములు
అసూయలు ఈర్ష్యలు కావ్యసృష్టిని, ఆస్వాదనను
చెరుపును; కారు వంది మాగధులు పనికొచ్చు విమర్శకులు
భట్రాజులై పరస్పర ముఖస్తుతుల చేసెదరు కాలయాపనము

కవి తన కవితలో ప్రతిఫలించును; కమనీయ
భావముల కలిగించి మన స్మృతిలో వెలుగును;

కవి నిరంకుశుడు; రవి కాంచనిచో
తాను కాంచును; రమణీయార్థప్రతి
పాదిక శబ్దములతో కావ్యము కూర్చును;
విశ్వశ్రేయము కావ్య పరమార్ధమని
ఎఱిగిన జిజ్ఞాసువు; భావుకుడు, ఋషి;
"వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్"; కవి ఉవాచ


 భగవంతునికి కృతజ్ఞత

భాషలు రాని మూగ జీవులు జంతువులు
మాటలాడలేని, భావముల వ్యక్తపరచలేని
విధి నిధానములు దాట లేని సమూహములు
స్థావరములు; జడములు పలుకుట యందు

మాట్లాడుట వచ్చీ వాక్కును భూషణము
చేసికోలేని అనాగరికులు కొందరు మానవులు;

మాట కలిగించును సంతోషము; మాట కలిగించును
స్థిమితము; మాట ఇచ్చును ఉత్సాహము; మాట
ఉపశమనము; మాట శాంతి; కాఠిన్యము నిండిన
మాట బాణము; చీల్చును గుండెను; విరచును మనసును

సౌమ్యముగా సౌమనస్కముగా మాట్లాడుట సంస్కారము
మాట ఇచ్చినందుకు భగవంతునికి పురస్కారము మన  
మృదు మధుర వాక్కులు; అవి ఆయనకు కృతజ్ఞతాభరిత నుతులు

Monday, September 21, 2015

శ్రీ మహా లక్ష్మీ తత్త్వము






శ్రీ మహా  లక్ష్మీ తత్త్వము

శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుని మనోల్లాసిని. మనకు సకల శుభములు కలిగించి సకల సంపదలను ఇచ్చే తల్లి. ధనము, ధాన్యము, విద్య, ధైర్యము, సంతానము, జ్ఞానము, వైరాగ్యము,ఆరోగ్యము, వీరత్వము  మొదలైన సిరులనిచ్చి మన బాగోగులను చూస్తూ మన్ని ఐశ్వర్యవంతులను చేసి బ్రోచే విష్ణు వల్లభ. తన తోబుట్టువులైన చంద్రుడు, అమృతము ల వలె చల్లదనము, అమృతత్వము మనకి పంచి మనని దివ్యులను చేసే దేవి.శ్రీ పీఠమునలంకరించి సురలచేత పూజించబడే దివ్య.
శ్రీ మహాలక్ష్మి మంత్రమూర్తి. ఎల్లప్పుడూ జ్ఞానముతో వెలుగుతూ ఉంటుంది. ఆమె మాహా మాయ కూడాను. ఇక్కడ మాయ అంటే మనచ్ఛక్తి  వైష్ణవీ రూపంలో సకల జనులను, చరాచర ప్రపంచమును స్థావరజంగమములను కాచే విష్ణు యువతి మహాలక్ష్మి. మన పాపములన్నిటిని హరించే కరుణా సాంద్ర. ఆమె సర్వజ్ఞురాలు. వరములనిచ్చేది. దుష్టనాశనము చేసి మన దు:ఖములను పోగొడుతుంది. ఆమె సిద్ధి, బుద్ధులను, భక్తి, ముక్తులను ప్రసాదించే తల్లి.
శ్రీ మహాలక్ష్మి ఆది అంతములు లేని శాశ్వత. ఆమె మూలశక్తి. ఆమె యోగజ్ఞ. యోగమునకు గమ్యము. యోగ జనిత ప్రసాదము. స్థూల సూక్ష్మముల ధారిణి. మాయా భయంకరురాలు. రుద్రరూపిణి.
ఎల్లప్పుడూ పద్మాసనయై అభీష్టములను నెరవేర్చే దేవి. శ్రీ పీఠ. జగత్తును రక్షించే మాత. ఆమె యందు జగత్తు స్థితిని స్థిమితాన్ని పొందుతుంది. నల్లని విష్ణునికి తెల్లని దేవి.

మోక్ష ప్రదాత మహావిష్ణువును మనం  పూజించాలనే సంకల్పము మనకి కలిగించి తాను మనలని సమస్త ఐశ్వర్యములతోనూ కూడా తులతూగేలా అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి సౌభాగ్యదాత్రి. స్త్రీలకు ఐదవతనము నిచ్చే పెద్ద ముత్తైదువ. బాలికలు, కన్యలు, వివాహితలైన స్త్రీలు జలజాతవాసిని అయిన శ్రీదేవికి భాగ్య,సౌభాగ్యముల కొరకు; సుఖసంతోషముల కొరకు, దీర్ఘసుమంగళీత్వము కొరకు పూజిస్తారు. శ్రావణ మాసంలో పున్నమి ముందరి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరించి కోరుకున్న కోరికలను ఈడేర్చుకుంటారు. అష్టలక్ష్మీ రూపిణి.

శ్రీమహావిష్ణువు శిష్టరక్షణ, దుష్ట శిక్షణలు చేయుటకు భూమిపై అవతరించినపుడు ఆయనను అనుగమించి ధన్యయై మనల ధన్యుల చేస్తుంది. మనసునకు ఉత్సాహము, ఆహ్లాదము కలిగించే సంతోష లక్ష్మి.  శాంతము, మౌనముల మనమున నింపి మనం సదా ఆనందంగా ఉండే స్థితిని ఇస్తుంది. మంగళదాయిని, భాగ్యసౌభాగ్యదాత అయిన ఇందిర అష్టైశ్వర్యములను ఇస్తూ మనం జ్ఞానమార్గము నుంచి దృష్టి మరల్చకుండా చూసి విష్ణు పదాన్ని, విష్ణు సాయుజ్యాన్ని పొందేలా చేసి మోక్షసామ్రాజ్యాభిషిక్తులను చేస్తుంది.

అడిగెదనని కడువడి జను
నడిగిన తను మగుడ నుడుగడని నడ యుడుగున్
వెడ వెడ సిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడునెడలన్
ఇలా పోతన్నగారిచే అందముగా డెందముల ఊయలలూపుచు వర్ణించబడిన శ్రీ మహాలక్ష్మి మనల
అన్నవస్త్రములకు లోటు లేకుండా కరుణిస్తూ, మనకు యశము, సుఖము, భాగ్యము కలుగ చేయుగాక.
మాధవి మాధవుని అనుంగు చెలి. మధురాస్య, మధుర భాషిణి అయిన లక్ష్మీ దేవి మనలను బ్రోచుగాక!

శ్రీర్భూయాత్!

Thursday, September 10, 2015

దైవ దర్శనము





దైవ దర్శనము


పంచారామక్షేత్ర విఖ్యాత కుమారారామందు దర్శించితిని
తెల్లని పాలరాయి నిర్మిత ఉత్తుంగ లింగరూపుని పాపఱేనిని
భీమేశ్వరుని బాలాత్రిపురసుందరీ సమేతుని భావారిని భవుని
ఆహ్లాదకర ప్రశాంత పరిసర పరమేశ్వరుని పాపహరిని పశుపతిని
వికసించిన కమలములు నిండిన సరసీ సమీపుని విమలుని తెల్లని
వానిని జ్ఞానిని అద్వైతమూర్తిని నిర్మల తాపసుని నిరాడంబరుని




భావాతీతుని భావనారాయణుని గోదా రాజ్యలక్ష్మీ విభుని
సర్పవరక్షేత్రమందు పంచభావనారాయణులలో ఒకనిని విష్ణుని

పరవశించి వీక్షించితిని బాలాత్రిపురసుందరిని
రామలింగేశ్వరప్రణయినిని అమ్మను అంబను
తటాకతట రాజ్ఞిని తత్త్వస్వరూపిణిని తటిల్లతా
సమరుచిని తాటంకవిభూషితను సర్వేశ్వరిని

అంతయు శివకేశవుల వాత్సల్యము వారి కరుణా
కటాక్షము; వారి దేవేరుల భక్తపాలనాకళాదీక్ష దక్షత
 https://upload.wikimedia.org/wikipedia/commons/0/02/Kumararama_Bhimesvara_temple%2Cfirst_floor%2Cgopuram%2Csamalkota.jpg